నెల్లూరు

ఎస్కార్ట్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి జీవితంలాంటిదే రైలు ప్రయాణం కూడ. బతుకుబండి నడవాలంటే ఎన్ని స్థాయిలు మారాలో ఈ రైలుబండిలోనూ అన్ని స్థాయిలున్నాయి. ఏ.సి. నుంచి జనరల్ దాక.
ఈ యాభై ఏళ్ల జీవితంలో ఏనాడూ జనరల్ బోగీలో ప్రయాణించింది లేదు ఏ.సి.లోనో, స్లీపర్‌లోనో తప్ప. చుట్టుముట్టిన సమస్యల పరిష్కారానికి ప్రయాణం చెయ్యబోతే రిజర్వేషన్ దొరికింది కాదు. ఈ రైలు ఎక్కలేకపోతే తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకోలేను. అబ్బా! ప్లాట్‌ఫామ్ పట్టనంత జనం. వీరంతా జనరల్ బోగికే ఎక్కుతారేమో కదా! మోకాళ్ల నొప్పులతో తల్లడిల్లే నేను రాత్రంతా నిలబడి ప్రయాణించగలనా? అదిగో ఎనౌన్స్‌మెంట్ వస్తోంది. రైలొచ్చేసింది. జనం ప్రభంజనంలా పరిగెత్తి ఎక్కుతున్నారు. జనరల్ బోగీలో కూర్చోవడం కాదుకదా కాలు కూడా పెట్టలేను. ఇప్పుడేమిటి దారి? అనుకుంటూ కదులుతున్న రైలు ఎక్కేశాను.
ఏంటి ఇతగాడు నన్ను కింద నుంచి పైకి ఎగాదిగా చూస్తున్నారు. దొంగనని అనుకుంటున్నాడా! యేం!. అతని చూపుల నుంచి తప్పించుకొని ఖాళీ వెతుక్కొని కూర్చుంటుండగా ‘‘నువ్వు వికలాంగుడివా?’’ అడిగాడతడు. ‘‘్ఛ నేను వికలాంగుడనేంటి అన్ని అంగాలు నిక్షేపంగా ఉంటేను’’ అందామనుకొని తలతిప్పి చూసేసరికి ఇద్దరు అంధులు, ముగ్గురు అంగవికలురు కూర్చొని ఉన్నారు.
‘‘ఇదీ వికలాంగుల బోగి, సకలాంగులు ఎక్కకూడదు’’ అన్నాడింకొకవ్యక్తి. ఆహా! ఆఖరికి ఈ స్థాయికి వచ్చానన్నమాట. ‘‘అయితే అతడికి ఏ లోపం కనిపించటం లేదే’’ అడిగాను. ‘‘నేను మా అబ్బాయికి ఎస్కార్ట్‌ని రెండుకాళ్లు లేని నా బిడ్డను నేనేగా కాపాడుకోవాలి’’ చేతి కర్రలు సీటు క్రిందకు నెడుతూ అన్నాడావ్యక్తి. ‘‘వారెవరనుకున్నారూ! ఒక డివిజన్‌కే ఎస్కార్ట్ ద గ్రేట్ రెవెన్యూ ఆఫీసర్ గంగాధర్‌గార్’’ ఆ మాటలు చెవిన పడడంతో ననె్నరిగిన వారెవరిక్కడ అనుకుంటూ ఆవైపు చూశాను. చూపులేని ఓ యువకుడు ‘‘నినె్నక్కడో చూసినట్లుందబ్బాయ్!’’ అన్నాను. ‘‘నాలాంటి వాళ్లని చాలామందిని చూసుంటార్లెండి. మీరసలే నియమ నిబంధనలు తూచ తప్పక పాటించే అధికారి కదా!’’ అన్నాడతడు.
ఇతడిని ఎక్కడ చూశానో ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఇటీవల జరిగిన ఒక పోటీపరీక్ష సెంటర్‌కు నేను ఎగ్జామ్‌చీఫ్‌గా ఉన్నప్పుడు వీళ్లమ్మ, ఇతను వచ్చి నన్ను కలిశాను. అరె! ఇతగాడికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని స్క్రైబ్‌గా తెచ్చుకుంటానంటాడు. అందుకు నేననుమతించాలంటాడు. వీళ్లమ్మ కూడా చాలా పెద్ద కథే చెప్పింది. ‘‘అయ్యా! నా బిడ్డ సొంతంగా చదువుకోలేడు.. ఎవరన్న దయతో చదివి వినిపిస్తే విని గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్లం ఒకరికి ఇద్దరు అవిటిబిడ్డలు. ఈ పరీక్ష కోసమని బిడ్డ చానా కష్టపడ్డాడు. మీరు ఎవర్నిబడితే వాళ్లని రాయడానికిస్తే వాళ్లు సరిగ్గా చదవలేకపోతే నా బిడ్డ అన్యాయమైపోతాడు సార్!’’ అంటూ దండకం చదివింది. ‘‘నీ ఒక్క బిడ్డ కోసం మా నియమ నిబంధనలన్ని తుంగలో తొక్కమంటావా? స్కైబ్‌ను మీరు తెచ్చుకోవడం కుదర్దు. మేమే అలాట్ చేస్తాం. అతనికి వచ్చింది చెప్పమని చెప్పు. అయినా ఎస్కార్ట్ లేకుండా ఒక్క పని కూడా చేసుకోలేడు, రేపు ఉద్యోగమొస్తే ఎట్లా చేస్తాడమ్మా? అవిటివాళ్లు, అశక్తులు ఉద్యోగాల్లో చేరితో దేశం ఏమైపోవాలి?’’ అని గట్టిగా మందలించి పంపించాను, పకడ్బందీగా పరీక్ష జరిపించాను. ‘‘చాలా సమర్థవంతంగా పనిచేశారండి!’’ అంటూ కలెక్టర్ గారు కూడా నన్ను అభినందించారు. పాతికేళ్ల నా సర్వీస్‌లో ఎక్కడా తప్పు జరిగిందిలేదు.
ఏదో స్టేషన్ వచ్చినట్లుంది, రైలాగింది. నా ఆలోచనలను ఆపి పరిసరాలపై దృష్టి పెట్టా. ప్లాట్‌ఫాం పైనున్న ప్రయాణికులు ‘‘డోర్ తెరవండి’’ అంటూ తలుపులు బాదుతున్నారు. ‘‘వికలాంగులు తప్ప ఈ పెట్టెలో వేరెవరు ఎక్కకూడదు’’ లోపలివాళ్లు అరిచి చెప్తున్నారు. ‘‘వికలాంగులున్నారండీ! తలుపు తెరవండి’’ అంటూ బయటివాళ్లు మరింత గట్టిగా అరుస్తున్నారు. ఒక వ్యక్తి లేచి వెళ్లి డోర్ తెవరడంతో దాదాపు పదిమంది దాకా లోపలికి వచ్చేశారు. ‘‘టీసీ వచ్చాడంటే అందర్ని మధ్యలోనే దింపేస్తాడు. మామూలు వాళ్లంతా దిగండి రైలు కదులుతోంది’’ అంటూ హితవు చెప్పాడు డోర్ తెరిచిన వ్యక్తి. గోలగోలగా అరుచుకుంటూ, ఒకరినొకరు నెట్టుకుంటూ అందరూ దిగిపోయారు ఇద్దరు వ్యక్తులు తప్ప. ఆ ఇద్దరిలో ఒకతను కాలికేదో గుడ్డ చుట్టుకొని దెబ్బతగిలిందని చూపించి, పక్కనున్న వ్యక్తిని తన ఎస్కార్ట్ అని చెప్పాడు. రైలుబండి మరలా పరుగందుకుంది.
‘‘వికలాంగులు సకలాంగులపై ఆధారపడుతున్నారో లేక సకలాంగులే వికలాంగుల అవకాశాలను వినియోగించుకుంటున్నారో అర్థం కావటం లేదు’’ నన్ను గుర్తించిన అంధయువకుడు అన్నాడు. ‘‘తెల్లవారేసరికి ఎవరిదారిన వాళ్లం దిగిపోతాం. ఇంతలోనే అంత పెద్దమాటలెందుకు బాబు!’’ ఒక వ్యక్తి మాట కలిపాడు. ‘‘తెల్లవారితే మీకు వెలుగొస్తుంది. ఎన్ని రాత్రులు గడచినా చీకటి తొలగని మా బతుకుల్లోకి మీరేనాడు తొంగి చూడరు కదా!’’ లోపలికి చొచ్చుకువచ్చే సుడిగాలికి కిటికి అద్దాన్ని అడ్డం వేస్తూ అన్నాడతడు.
మరో వ్యక్తి అందుకొని ‘‘ఎవరి బతుకులు వాళ్లు బతకడమే కష్టంగా ఉన్న రోజులు బాబు ఇవి’’ అన్నాడు. ‘‘అవునండీ! అందుకే మా బతుకులను దెబ్బతీయొద్దూ అంటున్నాము’’ మరో అందుడన్నాడు. ‘‘ఎవరికేంపనయ్యా! పనికట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి’’ ఆవేశంగా అన్నానే్నను. ‘‘్భరతదేశం ఈ రైలుపెట్టంత చిన్నది కాదు సార్!’’ అన్నాడతడు. ‘‘ఇంత చిన్న రైలుపెట్టెలో కొద్దిగంటలే ప్రయాణం. నువ్వు రాద్ధాంతం చేయాల్సినంత పెద్దది కాదబ్బాయ్!’’ కాస్త కటువుగానే అన్నా.
‘‘సార్! ఆరోజు మీరు పకడ్బందీగా నిర్వహించిన పరీక్ష కొద్దిగంటలు మాత్రమే. కానీ అది కొనే్నళ్ల మా జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఇన్విజిలేటర్స్ దగ్గర నుంచి ఎగ్జామ్ చీఫ్‌కి, స్క్వాడ్‌కి, పోలీసులకి, పరీక్షేతర సిబ్బందికి ఆఖరికి మంచినీళ్లందించే వాళ్లకు కూడా పరీక్షకు ముందు ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు ఆయా విద్యార్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్షకు అనుమతించి ఒక గంట ముందు వారికి నియమనిబంధలన్నీ తెలియజెప్పి పరీక్ష రాయిస్తారు. ఒక పరీక్షపై ఇన్ని విధాలుగా శ్రద్ధ ఎందుకు తీసుకుంటారు? అర్హత ఉన్నవారికి అన్యాయం జరగకూడదనేకదా! కానీ అంధ అభ్యర్థులకు స్క్రైబ్‌ను నియమించే విషయంలో మాత్రం అలసత్వం చూపుతారు. పరీక్షకు పదినిమిషాల ముందు ఎనిమిది, తొమ్మిది తరగతులు చదివే విద్యార్థులతో, అక్షరాలకు అంకెలకు తేడా తెలియని అటెండర్లనో హడావిడిగా పిలిపించి మా పరీక్షలో కూర్చొబెడతారు. ప్రశ్నాపత్రం చదవడమే చేతకాని ఆ స్క్రైబ్‌లు మాకెక్కడ ఆన్సర్లన్నీ చెప్పేస్తారేమోనని వారిపై గట్టి నిఘా పెడతారు. కొన్ని సెంటర్ల అధికారులకైతే అంధులు స్క్రైబ్ సహాయంతో పరీక్ష రాస్తారని, వారికి అదనపు సమయం ఇవ్వబడుతుందన్న కనీస విషయం కూడా తెలియదు. వివిధ రకాల మోసాలకు పాల్పడే మామూలు అభ్యర్థులను మాత్రం పసిగట్టలేరు. సవాలక్ష సమస్యలకోర్చి సబ్జెక్టు అంతా నేర్చుకుని అక్షరాలు రాని స్క్రైబ్‌లతో పరీక్షలు వ్రాసిన అంధులెక్కడ అధికారులైపోతారోనని మీబోటివాళ్లు భయపడుతుంటారు’’ గద్గద స్వరంతో అతడు చెప్తుంటే బోగి అంతా నిశ్శబ్దం అలుముకుంది.
కాళ్లు లేని మరో వ్యక్తి కల్పించుకుని ‘‘నిన్నోమొన్నో పేపర్‌లో చూశా. ఒకతను కంట్లో ఉన్న చిన్న మచ్చను అడ్డుపెట్టుకొని మెడికల్ సర్ట్ఫికెట్లు సంపాదించి పి.హెచ్. కేటగిరీకి రిజర్వు చేసిన ఎండివో పోస్ట్‌లో జాయినై రెండేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడంట. ఎవరో కూపీలాగి ఇప్పుడు విషయాన్ని బయటకు తీశారు. అతని పేరూ! మధుబాబో యేదో ఉంది’’ అన్నాడు.
ఆ మాటలకు నా ఒళ్లంతా చమటలు పట్టాయి. ఇక వాళ్ల మాటలేవీ నా చెవికెక్కలేదు. మధుకర్ నాకున్న ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం ‘‘ఓపన్‌లో గ్రూప్-2 పోస్ట్ కొట్టా నాన్నా! ఎండివోగా సెలక్టయ్య’’ అంటూ పోస్టింగ్ ఆర్డర్స్ చూపించే సరికి ఉప్పొంగిపోయా నా బిడ్డ నన్ను మించినవాడయ్యాడని గర్వపడ్డా కానీ ఇప్పుడు జరిగిందేమిటి! వాడు చేసిన వెధవపనికి నేను తలెత్తలేకపోతున్నా ఎలాగో వాడిచావుకు వాణ్ణి వదిలేద్దామా అంటే వాడికేమైనా అయితే ‘‘ఉరేసుకొని చస్తము’’ అంటూ నా భార్యాకోడలు నా మెడకు ఉచ్చు బిగించారు. ఆ పోస్టింగ్ ఆర్డర్స్‌ను పి.హెచ్.నుంచి ఓపన్‌లోకి మార్పించేందుకు ఎందరికాళ్లు పట్టుకోవాలో.
అరెరే! ఆ కాళ్లూ లేనతను సీటుపై నుంచి కింద పడిపోయినట్లున్నాడే. ‘‘ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ప్రయాణాలు మానేసి ఇంట్లో ఉండొచ్చు కదయ్యా!’’ అతన్ని సీట్లో కూర్చొబెడుతూ అన్నాడొక వ్యక్తి. ‘‘చూడండి! పడినా పైకిలేచినా ఫలితం అనుభవించేది మేమేకదా’’ చేతికర్ర కింద పెడుతూ అన్నాడతను.
అతడి మాట పూర్తికాక ముందే అంధ యువకుడు అందుకొని ‘‘ ఏవండీ.. మీరీ సమాజంలో ఏకాకిలాగా బ్రతుకుతున్నారా?’’ అనడంతో ‘‘అదేం ప్రశ్న’’ గట్టిగా అడిగాడతడు. ఆ అబ్బాయి మరలా ‘‘మీ అమ్మ గర్భాశయం అనే ఆధారం లేకుండానే మీరు పుట్టారా? అమ్మానాన్నలపై ఆధారపడకుండానే పెరిగారా? భార్యపిల్లలపై ఆధారపడకుండానే జీవనం సాగిస్తున్నారా? సమాజంపై ఆధారపడకుండానే ధనం సంపాదిస్తున్నారా? అంతెందుకు పడిపోయిన వ్యక్తిని ఆధారంగా చేసుకొనేగా మీరీ రైలు పెట్టెలో సుఖప్రయాణం చేస్తున్నారు. ఇంతమంది మీద ఆధారపడడం మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు కదలకుండా ఇంట్లోనే కూర్చొలేకపోయారా?’’ అనడంతో ఆ వ్యక్తి వౌనం వహించాడు.
‘‘మనుషులనే వారు ఒకరికొకరుగా బ్రతకాలండీ! సాధ్యమైనంత వరకు సహకరించుకోవాలి. అవయవలోపం అనేది యాదృచ్ఛికమే కానీ దురదృష్టం కాదు. మనిషన్నవాడికి తప్పనిసరిగా పొరుగువారితో అవసరముంటుంది. అయితే మాకు ఆ అవసరం కాస్త ఎక్కువగా వుంటుంది. అంతమాత్రానికే అదేదో శాపమని, ఖర్మని కాని మాటలు చెప్పి మమ్మల్ని, మా శక్తిని నిర్వీర్యం చేయకండి’’ అంటూ ఆ కుర్రవాడు చెప్తుంటే దృష్టి మరల్చలేకపోయాను.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మా వాళ్ల ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరనిది. సకలాంగులకన్నా సమర్ధవంతంగా ముందుకు వెళుతున్నారు. మావాళ్లు అందుకోగలిగిన స్ఫూర్తి ఎవరెస్ట్ శిఖరమంత ఉన్నతమైనది. కొత్త కళలకు ఊపిరులూదగలం, శాస్త్రాలను తిరగరాయగలం, గోరంత సహకారం ఈ సమాజం మాకందించగలిగితే మా వైకల్యానే్న కాదు ఈ ప్రపంచానే్న జయించగల శక్తిసామర్థ్యాలను అందుకోగలం’’ అంటూ ఆ యువకుడు చెబుతుంటే చూడలేని ఆ కళ్లను కళ్లార్పకుండా చూస్తున్నాందరు.
అతని వాక్చాతుర్యానికి అడ్డొస్తూ రైలువేగాన్ని తగ్గించింది. మరో స్టేషనొస్తున్నట్లుంది అనుకునేలోపే టీసి లోపలికొచ్చాడు. నాలో సన్నగా భయం మొదలైంది. అతను లోపలికొస్తూనే ‘‘హాండీకాప్డ్, ఎస్కార్ట్స్ కాకుండా ఎక్‌స్ట్రా ఉన్నవాళ్లంతా లేవండి’’ అన్నాడు గంభీరమైన గొంతుతో, ఎవరూ కదలలేదు. ‘‘ఏం! చెప్తుంటే వినిపించట్లేదూ?’’ ఇంకాస్త గట్టిగా అన్నాడు.
కాలికి గుడ్డ చుట్టుకున్న వ్యక్తి ‘‘ఎక్‌స్ట్రా ఎవరూ లేరు సార్!’’ అనడంతో టీసి అతణ్ణి పరిశీలనగా చూసి కాలికి చుట్టివున్న గుడ్డను లాగేశాడు. ఏ సమస్యాలేదతనికి ‘‘లే పైకిలే’’ అంటూ టీసి కొట్టినంత పనిచేశాడు. ‘‘ఏంటయ్యా! మా ఇష్టం ఎక్కడైనా ఎక్కుతాం. ఈ రైలు జనానిది, నీ బాబుది కాదు’’ అంటూ వాదనకు దిగాడు. టీసి మొబైల్ బయటకు తీసి ‘‘హలో! ఇన్స్‌పెక్టర్ ఒకసారి హ్యాండికాప్డ్ కోచ్‌లోకి రండి! అని మాట్లాడుతుండగా ‘‘సార్... ప్లీజ్ సార్! ఏదో తెలియక ఎక్కాము.. సారీ సార్!’’ అని బతిమాలటం మొదలుపెట్టారా ఇద్దరు.
టిసి దృష్టి నావైపునకు మళ్లింది. నా వంట్లో వణుకు మొదలైంది. లేచి నిల్చున్నాను. ‘‘నువ్వు ఎవరి ఎస్కార్ట్‌వి’’ అడిగాడు. ‘‘అదిఅదీ!’’ నీళ్లు నమిలాను. ‘‘ఏమయ్యా! చూడ్డానికి పెద్దమనిషిలా ఉన్నావు బుద్దిలేదు నువ్వుకూడా వీళ్ల పక్కకొచ్చి నుంచో’’ అన్నాడు టీసి. ఓరి భగవంతుడా ఈ కష్ట సమయంలో నన్ను రక్షించేవారే లేరా! కనీసం పరువు దక్కేలాలేదు అనుకుంటుండగా ‘‘టీసి గారూ! ఆయన నా ఎస్కార్టండి’’ అన్నాడా అంధ యువకుడు. ‘‘అలాగా ఓకే మీరు కూర్చోండి’’ అంటూ అందరి టికెట్లు చెక్‌చేసి ఆ ఇద్దరిని తనతో తీసుకువెళ్లాడు.
రైలు మళ్లీ కదిలింది. మాటలురాని వౌనం మధ్యన గాలి చొరబడి సవ్వడి చేస్తోంది. పైకి లేచి అతని దగ్గరకు వెళ్లి రెండు చేతులూ పట్టుకున్నాను. ‘‘సార్!’’ అంటూ అతను లేచి నున్చున్నాడు. కాసేపటి నిశ్శబ్దం తరువాత అతనిలా అన్నాడు. ‘‘సార్! సాధారణంగా మీబోటి అధికారులు ఏసి కోచ్‌ల్లోనే ప్రయాణిస్తుంటారు. ఈ బోగి ఎక్కారంటే ఏదో అర్జెంట్ పని ఉంటుంది. మీరు సమాజానికి ఎస్కార్ట్ లాంటివారు. మీ ప్రయాణానికి ఆటంకం కలిగితే అక్కడ పని కుంటుపడుతుంది, తద్వారా ప్రజలు నష్టపోతారు. అందుకే అలా చెప్పాను’’ తన మాటలతోనే నా చెంప చెళ్లుమనించినట్లు అనిపించింది.
‘‘బాబు! ఇన్నాళ్లు ఎవరు ఎవరికి ఎస్కార్టో తెలుసుకోలేకపోయాను’’ అన్నాను. ‘‘సార్! మీరు మావంటివాళ్లకు ఎస్కార్ట్‌గా ఉండకపోయినా ఫర్వాలేదు. అన్యాయానికి, అవినీతికి, అనర్హతకు మాత్రం ఎస్కార్ట్‌గా ఉండకండి దయచేసి. బాగా పొద్దుపోయింది రెస్ట్ తీసుకోండి’’ అంటూ తన సీటులో కూర్చున్నాడు. స్థాయి మారినా ఈ రైలు ప్రయాణం నాకు కొత్త దారిని చూపించింది. నన్ను అత్యున్నత స్థాయికి చేర్చింది.

- పెండ్యాల గాయిత్రి, కనిగిరి

స్పందన

ఎంత గొప్ప వర్ణన పచ్చ తేనె
గతవారం మెరుపులో పచ్చ తేనె కవితను అద్భుతంగా అందించిన కవి వడలి రాధాకృష్ణ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదములు. అసలు మామిడికాయ గురించి ఇంత గొప్పగా ప్రతి లైను పోటీపడి వర్ణించిన రచయిత రాధాకృష్ణ గారేనెమో. మామిడిని జవరాలు, చింతామణి, ముత్తయిదవు వంటి పదాలతో పోల్చిన తీరు బాగుంది. ఆఖరున మామిడి ఎన్ని భోగభాగ్యాలు అనుభవించినా చివరికి మిగిలేది పీచుటెంకె అంటూ గొప్ప సత్యాన్ని మన కన్నులముందు వుంచిన కవి వడలికి మరోసారి కృతజ్ఞతలు
- బొర్రా సాంబశివరావు, వెంకటగిరి
- పాయసం సావిత్రమ్మ, అంజయ్యరోడ్డు, ఒంగోలు
- రెడ్డినాయుడు, మదనపల్లె

హాస్యభరితంగా సాగిన కథ
మెరుపులో ప్రచురితమైన సొట్టయ్యకు పిల్లదొరికింది కథ మొదటి నుంచి చివరి వరకు హాస్యభరితంగా సాగింది. నిజంగా సొట్టయ్యకు దొరికింది పిల్ల కాదు..పిశాచి అంటూ కథను మలిచాడు రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. ఈ కథను ఆసక్తిగా నడిపించడంలో రచయిత తన కలాన్ని బాగానే వాడారు. ఒక అందమైన ఆడపిల్ల కనిపించగానే తయారయ్యే కుర్రాళ్లున్న ఈ రోజుల్లో ఆ అందం వెనుక ముళ్లు కూడా వుంటాయని, వాటిని గ్రహించి ముందుకెయ్యాలనే సందేశం అంతర్లీనంగా కథలో దాగుంది.
- కె.శ్రీనివాసులు, ఎల్.ఐ.సి. ఆత్మకూరు
- భాను నాడార్, పీలేరు
- కరవది వేణుగోపాల్, అద్దంకి
గొప్ప సందేశాన్నిచ్చిన అమృతత్త్వం
చిరుకవితలో గొప్ప సందేశాలను జొప్పించొచ్చు అని చెప్పేందుకు మంచి ఉదాహరణ అమృతత్త్వం కవిత. కవిత నేటి సమాజంలో జరుగుతున్న తంతును కళ్లకు కట్టింది. జన్మనిచ్చిన తల్లిని, నీడనిచ్చిన చెట్టును శత్రువుగా చూసే మహాపాపికి ఏనాటికైనా విముక్తి వుందా? అంటూ కవితలో ఘాటైన పదాన్ని వాడిన రచయిత తన మనసులోని ఆవేదనను అక్షర రూపంలో మలచినట్లు వుంది. గొప్ప కవిత అందించిన ఎంవిఎస్ శాస్ర్తీ అభినందనీయుడు
- సుశీల, బనిగిసాహెబ్‌పేట,గూడూరు
- జమునారాణి, మార్కాపురం

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

పాతూరి మాణిక్యమ్మ రాష్టస్థ్రాయి స్మారక సాహిత్య పురస్కారం-2016

పాతూరి మాణిక్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం 2016 కోసం కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షురాలు పాతూరి అన్నపూర్ణ తెలిపారు. సామాజిక స్పృహ అంశంగా ఉన్న 40 వరుసలు మించని కవితలు మాత్రమే పోటీకి స్వీకరిస్తామన్నారు. మూడు అత్యుత్తమ కవితలకు నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. కవిత రాసిన కాగితంపై రచయిత పేరు, చిరునామా, ఫోన్‌నెంబర్లు రాయకూడదని తెలిపారు. హామీపత్రంతో పాటు కవిత రెండు కాపీలు, పాస్‌పోర్టు ఫొటోను పాతూరి అన్నపూర్ణ, డోరునెం.1156/28-1, ప్రశాంతినగర్, నవలాకుల గార్డెన్స్, నెల్లూరు- 524 002 (్ఫన్:9490230939) అనే చిరునామాకు ఆగస్టు 30వ తేదీలోగా పంపాలని ఆమె కోరారు.

మనోగీతికలు

రా! కదలిరా!
రా! కదలిరా!
నల్లమబ్బుల కురులు విదుల్చుకొని
కావ్యకన్యకలా
జలజల గలగల రాలుతూ
నింగిని విడిచి నేలపైకి దిగిరా!
మోడువారిన బ్రతుకులెన్నో
మొండి ధైర్యముతో నింగి వంక చూస్తూ
వేడి నిట్టూర్పుల వడగాల్పుల కోర్కెలతో
పాడి పంటలు కరువు కాగా
నీకై ఎందరెందరో ఎదురు చూచుచుండగా
కదలిరా! కలుసుకొనిరా!
చినుకువై కోర్కెల మిణుకువై
జగతి అంతయు దీనస్థితిలోనుండగ
అలసిసొలసిన మానసంబులకు
ఉక్కపోతులను తుక్కుతుక్కు చేయగ
జనచైతన్య స్ఫూర్తిదాయివై
రా! కదలిరా!
మేఘాలచాటున దోబూచులాడక
శిఖరాల మాటున దొంగాట లాడక
రాలిపోతున్న హరిత(్ధ)దనమునకు
కాలిపోతున్న ధరణి సెగల పొగలను
అంతమొందించుటకు కనికరించి
కదలిరా! రా! కలహంసలా దిగిరా!
అనావృష్టి అవకతవకలను
ఎండమావుల మాయలాటలను
పారదోలుతూ వాగువంకలు,
కొండకోనలు, మూరువాడలు
తడుపుకొంటూ బీడుభూముల ఆర్తిదీరుస్తూ
కోడుపట్టిన అరకలా
జాలువారు రసగంగలా
జలజల గలగల రాలుతూ
రససిద్ధిలో మునులందరిని ముంచివేస్తూ
హర్షపులకితవై కదలిరా!
బిందు బిందువై తేలియ సింధువై
బిందులెత్తంగ చిన్మయానంద భరితవై
చెరువు దొరువు, కాల్వలు, నదులందు
అమృతధారలు కురియు ఆనందవృష్టిగ
కురిసి కురిసి పుడమి తల్లికి సేదతీర్చంగ
భూమి ఎల్లడల సస్యశ్యామలు కాగ
తల్లివై కల్పవల్లివై
అనురాగ చెల్లివై అనుబంధ మల్లివై
బుడిబుడి నడకల పాపడివై
జవసత్త్వములను జనులలోన నింపుటకై
భూతాపము తీర్చుటకై వేవేగముగ రా
రా! కదలిరా!
గడ్డి గాదమన్నదే లేక పసులు బక్కచిక్కగా
గుక్కెడు నీటికై మైళ్లమైళ్ల వెదుకులాడే
జనాల బాధను చూసి
ఊరు ఊరులు వలసపోతుంటే
పల్లెపల్లెలు భోరుమంటుండగ
కరుణతోడను కనికరించి కదలిరావే
వర్షరూపాన వరపున దిగిరావె..!

- లక్కరాజు శ్రీనివాసరావు
ఆర్టీసీకాలనీ, అద్దంకి
చరవాణి : 98491 66951

ఫాదర్స్‌డే (జూన్-19) సందర్భంగా

నాన్నంటే..
నాన్నంటే ఆకాశమంత ప్రేమ
నాన్నంటే కొండంత ధైర్యం
నాన్నంటే సముద్రమంత గాంభీర్యం
నాన్నంటే వాయువులోని స్పర్శ
నాన్నంటే మట్టి పరిమళం
ఆత్మీయత
అనురాగం
ఆత్మవిశ్వాసం
క్రమశిక్షణ కలగలిపితే
వచ్చే నిలువెత్తు రూపమే నాన్న..!

- మోపూరు పెంచల నరసింహం
చరవాణి : 7386362476

యోగా డే (జూన్-21) సందర్భంగా

యోగా
నిరంతరం క్రమశిక్షణ
నిండు జీవితానికి రక్షణ
ఆరోగ్యమే మహాభాగ్యం
యోగసనాలతో ఉల్లాస జీవితం
ఉదయ సంధ్యాసమయ సాధన
అలసిన దేహానికి
ఆసనాలతో ప్రార్థన
వేకువ జామున లేచేద్దాం
యోగాపై మనసు పెడదాం
నిద్దర మత్తును వీడదాం
యోగాముద్రలో లీనమవుదాం
శ్వాసమీద ధ్యాస పెడదాం
చల్లని గాలిని స్వీకరిద్దాం
క్రమశిక్షణ పాటిద్దాం
యోగాసనాలతో ముందుకెళదాం
ప్రతి నిత్యం పాటిద్దాం
ప్రతి భంగిమను ఆస్వాదిద్దాం
నిరంతర సాధన చేద్దాం
నిండు జీవితాన్ని కాపాడుకుందాం!

- హస్తి మోహన్‌రాజు,
చరవాణి : 8008511316

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- పెండ్యాల గాయిత్రి