నెల్లూరు

రిటైర్మెంట్! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాములూ ఎలాగుందయ్యా..’
‘ఏం చెప్పమంటావు శీనయ్య.. మనబోటోళ్లకి నాలుగువేళ్లు నోటిలోకి వెళ్లడమే కష్టమాయే.. దానికితోడు రోగాలొకటి’ ఖళ్ ఖళ్ అంటూ దగ్గుతూ సమాధానం చెప్పాడు రాములు.
‘బాగున్నారా అన్నయ్య గారూ’ అంటూ వెనుకనుంచి సుభాషిణి అన్న మాటలకు అటువైపు తలతిప్పి చూశాడు శీనయ్య. తోటి ఉద్యోగి కష్టాల్లో ఉంటే చూడడానికి రాములు ఇంటికి శీనయ్య వచ్చాడు.
***
వ్యవసాయశాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న రాములు రిటైరై మూడు నెలలు గడుస్తోంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరూ రాములును పొగుడుతూ పనులు చేయించుకున్నవారే. రిటైరైనాక ఆయనకు పలకరింపు కూడా కరవయింది. కాని ఒకే శాఖలో పనిచేస్తున్న శీనయ్యకు రాములంటే అమితమైన అభిమానం. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇద్దరూ ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. ఇద్దరికీ ఒకే ఏడాదిలో పెళ్లయింది. శీనయ్యకు ఇద్దరూ కొడుకులే. వారిద్దరూ మంచి చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డారు. దురదృష్టం వెంటాడుతున్న రాములుకు తొలుచూరు అమ్మాయి శ్రీజ. చదువు అబ్బకపోవడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. అల్లుడిది మంచి ఉద్యోగమే. కుమార్తె గురించి రాములుకు దిగుల్లేదు. అబ్బాయి సుబ్బారావు చిన్నవాడు. ఇప్పుడిప్పుడే హైస్కూలు చదువు పూర్తిచేసుకుని కాలేజీ మెట్లెక్కుతున్నాడు. రాములు దిగులంతా కొడుకు భవిష్యత్‌పైనే.
***
కాలింగ్ బెల్ మోగగానే ‘సార్’ అంటూ బాస్ ముందు నిలబడ్డాడు రాములు.
‘రాములూ నేను ఇటునుంచి ఇటే హెడ్ ఆఫీసుకు వెళ్లాలి.. సాయంత్రం ఈ బ్యాగ్ ఇంటిలో ఇచ్చి అమ్మగారికి ఏమైనా సరుకులు కావాల్సి వస్తే ఇచ్చి రా’ అంటూ ఐదొందలు రాములు చేతిలో పెట్టాడు. బాస్ ఆదేశాల మేరకు ఆఫీసు ముగియగానే సైకిల్‌పై బ్యాగ్ తీసుకుని బాస్ ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు ఆగి ‘అమ్మగారూ అమ్మగారూ’ అంటూ పిలిచాడు. రాములు గొంతు గుర్తుపట్టిన బాస్ ఇల్లాలు రాగిణి తలుపు తీసి ఏమిటన్నట్టు కళ్లతో చూసింది.
‘సారు హెడ్ ఆఫీసుకు అర్జంటు పనిమీద వెళ్లారమ్మ ఈ బ్యాగ్ ఇంటిలో ఇచ్చి రమ్మన్నారు’ అని చెప్పాడు.
‘సరేలే ఆ బ్యాగ్ అక్కడ పెట్టు. ఆ కుక్కను కాస్సేపు బైట తిప్పి తీసుకురా’ అని ఆర్డరేసింది. పులిలా భయపెట్టేలా ఉన్న మోటూ మెడకి కట్టిన గొలుసు చేతబుచ్చుకుని అలా కొద్దిసేపు వీధుల్లో తిప్పి మళ్లీ ఇంటికి తెచ్చి కట్టేశాడు రాములు.
‘అమ్మా వెళ్లొస్తానమ్మ బాగా పొద్దుపోయింది. మా ఇంటావిడ ఎదురుచూస్తుంటాది’ అన్నాడు.
‘సరేలే... రేపు ఉదయం ఒకసారి రా, కూరగాయలు తెద్దువు’ అంది రాగిణి. సరేనమ్మా అంటూ సైకిలెక్కి ఇంటికి వచ్చాడు. అప్పుడు సమయం తొమ్మిది దాటింది. ఉదయం నుంచి చాకిరీ చేయడంతో ఒళ్లంతా అలసి స్నానంచేసి నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని నిద్రలోకి జారుకున్నాడు.
***
అలా నాలుగేళ్లు గడిచిపోయాయి.
ఆరోజు ఆఫీసంతా హడావుడిగా ఉంది. కారణం ఇద్దరు ఉద్యోగులు రిటైర్ కావడమే. ఒకరు సూపరింటెండెంట్ రహీం కాగా మరొకరు రాములు. సాయంత్రం అందరూ పనిని తొందరగా ముగించేశారు. ఆఫీసులో ఒకచోట చిన్నపాటి వేదిక ఏర్పాటుచేశారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ కొలువుతీరింది. వేదికపై బాస్ పక్కనే రహీం, ఆ పక్కనే రాములు ఆశీనులయ్యారు. బాస్‌పక్కన ఆసీనులు కావడం రాములుకు అదే తొలిసారి, చివరిసారికూడా. ఇబ్బందిగానే కూర్చొన్నాడు. యూనియన్ నాయకులు ఒకరిద్దరు ప్రసంగించిన తర్వాత ఆఫీసులో పనిచేసే ఒకరిద్దరు పరిచయస్తులు రాములు, రహీం సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. చివరగా బాస్ మాట్లాడుతూ రాములు మా ఇంటిలో మనిషంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. బాస్ పూలమాల వేసి శాలువా కప్పి సత్కరించారు. ఆయన వెంట మరికొందరు పూలమాలలు వేశారు. అందరూ వారిని ఇంటివరకు సాగనంపారు. ఆ కార్యక్రమం వేడుకగా ముగిసింది.
ఆ ఆనందం వారం రోజులు పాటు తీపిగుర్తుగా అనుభూతి పొందాడు రాములు. తన బంధువులకు, బజారుకు వెళ్లినప్పుడు తారసపడే మిత్రులకు తన రిటైర్మెంట్ పండగ గురించి గొప్పగా చెప్పేవాడు. నెలరోజులు గడిచింది. ఉద్యోగంలో ఉండగా నెల నెలా వచ్చే జీతం డబ్బులు ఇప్పుడు చేతికిరాలేదు. గ్రాట్యుటీ సొమ్ము కూడా ఇంతవరకు చేతికందలేదు. బ్యాంకులో దాచుకున్న కొద్దిపాటి సొమ్ము డ్రాచేసి ఆ నెలవారీ సామాన్లు కొన్నాడు. మరుసటి నెల కొంచెం గడవడం కష్టమైంది.
పెన్షన్ ఫిక్సేషన్ కోసం అడపాదడపా ఆఫీసు మెట్లెక్కుతునే ఉన్నాడు. ఒకరిద్దరు బాగున్నావా అంటూ పలకరించి తమ పనుల్లో నిమగ్నమయ్యేవారు. బాస్ సంగతి సరేసరి. రాములుకు ఇంటర్‌వ్యూ ఇవ్వడమే కష్టంగా మారింది. ఎప్పుడూ బిజీబిజీ అని అక్కడ అటెంటర్ రాములుకు సమాధానం చెప్పేవాడు. ఎట్టకేలకు ఒకసారి ఆఫీసు బాస్‌ను కలిసి తన పెన్షన్, గ్రాట్యుటీ విషయాన్ని కదిలించాడు.
‘తెలుసయ్యా అదే పనిలో ఉన్నాం.. రోజంతా నీపనే చేస్తూ పోతే మిగతా పనులు ఆగిపోవా’ అంటూ ఒకింత కోపంతో ముక్తసరి సమాధానం చెప్పాడు.
రాములుకు కొంత ఆగ్రహం తెప్పించాయి ఆ మాటలు. కొంత నిగ్రహించుకుని ఇంటిముఖం పట్టాడు. ఏడాది కావస్తున్నా గ్రాట్యుటీ సొమ్ము కాని పెన్షన్‌కాని చేతికందలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. పరిచయస్తుల వద్ద వంద, యాభై అప్పుచేసి ఇన్నాళ్లూ జీవితాన్ని నెట్టుకొచ్చాడు. రేపు ఎలా గడుస్తుందో అర్థం కాని స్థితిలో రాములు కుటుంబం ఉంది.
కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఆఫీసు మెట్లెక్కాడు. అక్కడ అందరూ రాములును చూసి ఓసారి తలపైకెత్తి కనుబొమ్మలతోనే పలుకరించి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కొంతసేపు నిరీక్షించి బాస్‌ను కలిసి తన గ్రాట్యుటీ, పెన్షన్ సొమ్ము మంజూరు కోసం మళ్లీ అడిగాడు. మళ్లీ పాత సమాధానమే.
‘చేస్తాలేవయ్యా’ అని ముక్తసరిగా సమాధానం చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. అయినా అది ఎక్కడా కన్పించకుండా ధిక్కారస్వరంతో ‘ఎందుకు సార్ గ్రాట్యూటీ, పెన్షన్ మంజూరుకు లేటు చేస్తున్నారు. నానుంచికూడా ఏమైనా ఆశిస్తున్నారా’ అని అనడంతో బాస్ దిగ్గున లేచి ‘లంచం గురించా.. నీవు మాట్లాడేది’ అంటూ గద్దించాడు. ఇద్దరి మధ్య గట్టిగా వాదనలు జరిగాయి. ఒక సందర్భంలో గట్టిగా మాట్లాడేసరికి అల్పప్రాణి రాములుకు గుండె దడ ఎక్కువైంది. మాట పెగల్లేక అక్కడే కుప్పకూలిపోయాడు. మిగతా స్ట్ఫా అందరూ వారి సీటులోనుంచే లోపల జరిగిన సంభాషణలు వింటున్నారే తప్ప రాములుకు ఒక్కరూ మద్దతుగా రాలేదు. అటెండర్ శ్రీధర్ అతన్ని చేతుల్లోకి తీసుకుని గది బయటకు తీసుకొచ్చి ఆటో ఎక్కించాడు. ఇంటికి ఎలా వచ్చాడో తెలీదు. ఆటోలో భర్త రాములును చూసిన భార్య అతన్ని తెచ్చి మంచంపై పరుండబెట్టింది. సపర్యలు చేసింది. స్వస్థత చేకూరిన తర్వాత మెల్లగా జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకుంది. ‘ఏం చేస్తామండీ మన ఖర్మ’ అంటూ నాలుగు మాటలు చెప్పి ఓదార్చింది. ఆ రాత్రి ఇద్దరూ పడుకున్నారు. మరుసటి రోజు రాములు ఎంతకీ లేవకపోయేసరికి భార్య రాములు వద్దకు వచ్చి తట్టిలేపింది. పరీక్షించి చూస్తే నిద్రలోనే తుదిశ్వాస విడిచాడని గ్రహించింది. ఒక్క కేక పెట్టి మంచం వద్దే రోదిస్తూ పడిపోయింది. కేక విని పక్కింటి వాళ్లు వచ్చి జరిగిన విషయాన్ని గ్రహించి రాములు కుమార్తెకు, తెలిసినవాళ్లకు సమాచారం ఇచ్చారు. ఆఫీసు వాళ్లు, యూనియన్ నాయకులు అందరూ వచ్చారు. రాములు పార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాములు ఎలా చితికిపోయాడో దానికి కారకులెవరో అందరూ మాట్లాడుకున్నారు. అందరూ బాస్ చర్యల్ని ఖండిస్తూ మాట్లాడుకున్నారు. బాస్ అలా చేసి ఉండకపోతే నిండుప్రాణం మనకు మిగిలేదని అనుకున్నారు. అక్కడ అందరి మధ్య బాస్ టాపిక్కే. శీనయ్య దగ్గరుండి శ్రీరాములు అంత్యక్రియలు జరిపించాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందకముందే శ్రీరాములు మృతిచెందడం అందర్నీ బాధించింది.
***
ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతమంది ఇలా బాధను అనుభవిస్తూ జీవితాల్ని చాలిస్తున్నారో వెలుగులోకి రావడం లేదు. రిటైర్మెంట్ తర్వాత మనం దాచుకున్న సొమ్మే మనకు దక్కడానికి మధ్యలో ఎన్ని అవరోధాలు, ఎన్ని అవాంతరాలు, వారి ధన దాహానికి లంచం అని పేరుపెట్టినా, ఆమ్యామ్యా అని అన్నా, సంతోషం అనుకున్నా ఆ లాంఛనం పూర్తికాకపోతే ఈ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైలు కదలదు అనడానికి రాములు జీవితమే ఒక ఉదాహరణ.... అనుకుంటూ శీనయ్య ఆవేదనతో ఇంటిముఖం పట్టాడు.

- గౌతమి
9347109377

మనోగీతికలు

ఉదయరాగాలు
వెలుగు వాకిట
తొలకరి సంధ్యల
వర్ణ సోయగపు రంగవల్లికలు
పొద్దులరేడు సూరీడి
తొలిచూపులకు
సిగ్గుపడిన వేకువ కన్య
మసకేసిన మంచు తెరలమాటున
అందాలను ఆరబోసుకొంటోంది
పచ్చటి కిరణాల వెలుగుటద్దంలో
ముస్తాబవడానికి ఎదురుచూస్తోంది.

సతత హరితాలతో
అడవి అందాలు పుడమికి
పచ్చటి పరువాలను అందిస్తోంది
అల్లిబిల్లిగా అలముకొన్న
ఆకుల మధ్య
చిట్టిగువ్వల వేకువ కువకువలు
చిరుగంటల సవ్వడిలా
గుండె గదిలో మోగుతోంది.

పిల్ల గాలుల హొయలు నడుమ
పైరు పచ్చల పారవశ్యపు
అభినయాలు
గరికపరకలపైన మెరిసే
ముగ్ధ మోహనపు స్నిగ్ధ బిందువుల తళుకు బెళుకులు
విరితోటల పయనించే
కొంటె తుమ్మెదల
ప్రణయ విహారాలు
వినువీధుల విహరించే
విహంగాల చైతన్యపు చిద్విలాసాలు
పల్లె వాకిళ్లలో పల్లవించే
ఉదయగానపు సుప్రభాతాలు
సనాతన మానవీయతను
శృతి చెయ్యమంటూ
మోగే రాములోరి గుడిగంటల
మధువొలికే మత్తకోయిలల
సుస్వరాల సప్తాక్షరీయాలు
పొదుగును చూసిన లేగల
తుళ్లింతల పారవశ్యాలు
గోమాలక్ష్మి నుదుటి కుంకుమ
గృహిణుల పాపిట సింధూరపు వైనాలు
రైతన్నల భుజం తట్టే బసవన్నల
ఆత్మీయపు ఆలంబనలు
తడి ఆరని కొప్పులతో
తరణుల ధూపపు పరిమళాల
మధ్య కొలువైన
అభయాల తులసమ్మ కోటలు

కడిగిన ముత్యంలా తాజాగా
హిమపరదాల మాటున
పొడమరిస్తున్న
ఓ! సరికొత్త ప్రపంచం
ఉల్లాసంగా ఉత్సాహంగా
కళ్ల ముందు ఆవిష్కృతవౌతోంది
నవజీవన చైతన్యపు
భావనాస్రవంతుల మధ్య
వెలుగులీనుతోంది..
బ్రతుకు పుస్తకంలో
ఓ సరికొత్త పేజీకి శ్రీకారం
చుడుతోంది.

అలరించే అరుణోదయాల నడుమ
కొంగ్రొత్త ఆలోచనలు
సరిగంగ స్నానాలు చేయాలి
ఉషోదయపు ఉల్లాసాల మధ్య
ఊహల ప్రపంచం
ఊపిరిపోసుకోవాలి
ప్రభవించే ప్రభాతాల ఆహ్లాదపు పారవశ్యాలే
దైనందిన కర్తవ్యాలను
ప్రభావించాలి
సనాతన హైందవ గ్రామీణ
సంస్కృతిల
పులకింప చేసే ప్రాకృతిక
సంప్రదాయాలే
ఈ ఉదయరాగాలు
అందుకే అవి జీవజాలపు
జీవనజ్యోతులు
మానవలోకపు
మధురానుభూతులు..!

- కె రవీంద్రబాబు, పాకాల
చరవాణి : 9052778988

వృక్షోరక్షతి రక్షితః

ప్రకృతి కాంతకు జేజేలు..!
ఎండల్లో అందరికి నీడనిచ్చే చెట్టు
నువ్వు మా ప్రగతికి మెట్టు
మంచి గాలినిస్తూ, వానలు కురిపిస్తూ
చిలుక, పిచ్చుక, గువ్వలకి గూడునిస్తూ
ప్రకృతికి అందాన్ని తెచ్చిపెట్టిన చెట్టు
ప్రతి ఇంటిలో నువ్వు ఉంటావు
ఇంటికే అందాన్ని తెస్తావు
కాలుష్యాన్ని దూరం చేస్తూ
అందరికి ఊపిరినిస్తూ
అందరి ఆకలి సమస్యలు తీరుస్తూ
అందరికి మంచి జీవితాన్ని ఇస్తున్న ఓ చెట్టూ..!
నీ కొమ్మలు పిల్లలకి ఊయలలు
నీ ఆకులు రోగులకు ఔషధాలు
నీలో ఉన్న గుణాలు అందరికీ రావాలని
కోరుకుంటూ
నీకు వందనాలు, జోహార్లు..!

- కాళిదాసు విజయచంద్ర
చరవాణి : 9959138791

అఖండ జీవరాశికి
వెలుగురేఖలు మన వృక్షాలు..!
చెట్టంటే చెట్టు కాదురా
భూమిపై పుట్టిన అఖండ జీవరాశిరా
పల్లెల వెంట, పట్నాల నడుమ పెరిగే మానుకాదురా
పదిలంగా అందరి సుఖాన్ని కోరే బంధువురా
అనుబంధాలు, ఆప్యాయతను పంచే ఆత్మబంధువురా
మానవాళిని మునుముందుకు నడిపే
ప్రగతిశీలపు ఆయువు పట్టురా..!

ఏ ఊరూ, ఏ వాడా పోయినా
ఏ క్షేత్రం, ఏ తీర్థం చూసినా
ఏ కొండా, ఏ కోనా తిరిగినా
నేనున్నానంటూ స్నేహ హస్తం అందించేది
నిస్వార్థం, నిర్మలత్వాలకు చిహ్నమురా
పట్టుదల, మొక్కవోని ధైర్యానికి గుర్తురా
ప్రాణవాయువులనందించే విశ్వప్రదాతరా..!

కాలుష్యము, ఉక్కపోతలు
తాననుభవిస్తూ
విషవాయువులు, రసాయనాలు
తాను దిగమింగుతూ
రంపపు కోతలు, విధ్వంసకాండలు
తాననుభవిస్తూ
రోజురోజుకు తన జాతులు అంతరిస్తున్నా
మానవాళికి పచ్చ(్ధ)నాన్ని పంచుతూ
జనాహ్లాదము పంచే హరితమురా
కొవ్వొత్తిలా తాను కాలుతూ
భూగోళపు తాపాన్ని తీరుస్తూ
సర్వజనుల భవితను సరిదిద్దే
విశ్వగురువురా.. అన్ని విద్దెలు నేర్పించే ప్రకృతిరా
చెట్టంటే చెట్టుకాదు..

చెట్టే కదాయని పట్టుపట్టి
గొడ్డళ్లెత్తబోకురా
నోరూ, వారుూ లేదని దుర్మార్గంగా
యంత్రాలు ఉసికొల్పకురా..
విచక్షణారహితంగా నీవు
నరికేసుకుంటూ పోతూ వుంటే
ఆఖరికి నీ చివరి మజిలీలకు కూడా కర్రే దొరకదురా
అంధకారంతో నీవు అడ్డంగా నరికేస్తుంటే
అవనియంతా విశాల శ్మశానమగునురా
భావితరాల వారు నిను నిరంకుశుడని
ముందు దృష్టి లేని ధృతరాష్ట్రుడని
తరతరాలుగా మూల్యం చెల్లించాల్సిన
శిక్షపడుతుందిరా..
సహజ సంపదలు దోచిన దోపిడీకారుడని
నిను నిందించునురా..
సహజ సంపదలు నీవని విర్రవీగకురా
భగభగలాడే భూగోళపు సెగలకు
కాసింత సేదతీర్చే పెద్ద తరువులను
బతకనీయిరా.
మరో అశోకుడిలా
వన సంరక్షణ కార్యము చేపట్టుమురా
మరో సిద్ధార్థుడిలా..
మనుషుల సుఖశాంతులు
చెట్ల పాలిట దీనబంధువుకమ్మురా..!

- లక్కరాజు శ్రీనివాసరావు, అద్దంకి
చరవాణి : 9849166951

స్పందన

ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు
దగ్గరగా అభ్యుదయం
గత వారం మెరుపులో ప్రచురితమైన అభ్యుదయం కథ చాలా బాగుంది. ప్రస్తుత రాజకీయం ఎలా వుంది..వుండబోతుంది అనే విభిన్న కోణంలో రచయిత పాపిరెడ్డి గారు కథను నడిపిన తీరు బాగుంది. కథను కూడా సాదాసీదాగా చెప్పకుండా ఓ గొప్పరాజ్యంతో పోల్చి జరిగే పరిణామాలను కళ్లకు కట్టి గొప్ప కథను మనకు అందించారు. చాలాకాలం తర్వాత మెరుపులో ఓ మంచి కథను చదివామన్న భావన కలిగించిన రచయితకు ధన్యవాదములు.
- రామారావు హేమలత, నాయుడుపేట
- అరిగెల సత్యనారాయణ, ఒంగోలు
- రాచాల బాబు, తిరుపతి

ఓడి గెలువు కవిత సూపర్
నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరరావు గారు చాలా కాలం తర్వాత మెరుపులో రాసిన ఓడి గెలుపు కవిత చాలా బాగుంది. గతంలో కూడా మేము వీరి కవితలు మెరుపులో చదివాము. మళ్లీ చాలాకాలం తర్వాత ఓడి గెలువు కవితను ఎంతో గొప్పగా అందించి గొప్ప సందేశాన్ని మన కళ్లకు కట్టినట్లు ప్రతి లైన్‌ను తీర్చిదిద్దిన రచయితకు అభినందనలు.
- అబ్బాయిరెడ్డి, అడ్వకేట్, నెల్లూరు
- రజా షారోను, శ్రీకాళహస్తి

రెక్కలు చాలా బాగున్నాయి
గుర్రాల రమణయ్య గారు రాసిన రెక్కలు కవితలో ప్రతి లైను మనల్ని చైతన్యవంతం చేశాయి. నిజంగా ఇవి రెక్కలు కాదు ప్రతి మనిషికి వర్తించే జీవన సూత్రాలు. కులాలెన్ని వున్నా మతాలెన్ని వున్నా శ్మశానం ఒక్కటే వుండాలి.. ఎందుకంటే విశ్వానికంతా దేవుడు ఒక్కడే కదా అంటూ గొప్ప తాత్విక భావన గొప్పగా వుంది. అలాగే దోచుకునేవాడు, ద్రోహం చేసేవాడు, ఆదరించేవాడు, అనుగ్రహించేవాడు ఏ యిద్దరూ ఒకేలా ఉండరు అంటూ గొప్ప నీతిని చొప్పించిన తీరు బాగుంది. హేట్సాప్ రమణయ్య గారు.
- రావిపూడి లక్ష్మి, కలువాయి
- అనంత సాయికిరణ్, రావినూతల

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net
email: merupunlr@andhrabhoomi.net

- గౌతమి 9347109377