రాజమండ్రి

ఏమనిపించుకోవాలి? (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్యాలరావు ఒక ప్రభుత్వ శాఖకి జిల్లా అధికారి. ఆఫీసు పనులు కోసం వచ్చిన పౌరులను మాటలతో బోల్తాకొట్టించి పలుమార్లు తిప్పించుకుంటాడు. అందుకు కితాబుగా తాను ఒక మంచి మాటకారి ఆఫీసరనుకుంటాడు. అప్పుడప్పుడు సందర్భానుసారం సమయస్ఫూర్తితో ఇతరులను ఎద్దేవా చేస్తాడు. గొప్ప చమత్కారి అని అనుకుంటాడు.
రోగాలు రొస్టులు మనుష్యునికి రాక మానుమాకులకొస్తాయా అంటారు పెద్దలు. ఆ ప్రకారం ముత్యాలరావుకి గుండెజబ్బు ప్రాప్తించింది. వైద్యం చేయించుకుంటున్నాడు. స్పెషలిస్టుల చెకప్‌కి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లి వస్తుంటాడు.
అనారోగ్యం సంప్రాప్తించినా గాని ముత్యాలరావు స్వభావంతో మార్పు రాలేదు.
పుట్టినవారు గిట్టక తప్పదన్నట్టు వయస్సు రీత్యా లేక సర్వీసు రీత్యా ఉద్యోగి రిటైరవుతాడు. ముత్యాలరావు వయస్సు రీత్యా అయ్యాడు. పాపం రిటైరయ్యాక హృద్రోగం ఎక్కువైంది. రెగ్యులర్ డాక్టరు రాసిన మెడిసన్స్ మింగుతున్నాడు. ఆ డాక్టరు ముత్యాలరావుని ఒకసారి హైదరాబాద్ వెళ్లి ఫలానా స్పెషలిస్టుతో చెకప్ చేయించుకుని రమ్మన్నాడు.
ఎవరి ప్రాణం వారికి తీపి కాబట్టి స్వంతం గనుక ముత్యాలరావు తన ప్రాణరక్షణ కోసం ప్రయాణమయ్యాడు.
హైదరాబాద్ వచ్చిన ముత్యాలరావు హోటలు గదిలోకి రాగానే స్నానం చేసి ఆటోలో ఫలానా స్పెషలిస్టు డాక్టర్ హాస్పటలికి అపాయింటుమెంట్ కోసం వచ్చి తెగ ఆశ్చర్యపోయాడు.
రోగులు వారి బంధువులతో హాస్పిటలు నేల ఈనిందా అన్నట్టుంది. ముత్యాలరావుకి అపాయింట్‌మెంటు దొరకలేదు. మరునాడు ఎర్లీగా వెళ్లాడు. లభించలేదు. మూడోనాడు అలాగే జరిగింది. ఇలా ఎన్నాళ్లు తిరగాలి అని బాధపడ్డాడు. విసుక్కున్నాడు. తిట్టుకున్నాడు.
అప్పుడైనా ముత్యాలరావుకి గతంలో తన ప్రవర్తన వల్ల తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన పౌరుల మానసిక ఆందోళన ఆవేదన స్ఫురించలేదు. తనదాకా వస్తేగాని ఎవరికి ఏదీ అర్ధంకాదన్న ఆర్యోక్తి ముత్యాలరావుని భౌతికంగా ఆలోచింపచేసింది తప్ప మానసిక వికాసానికి సహకరించలేదు.
వారం తర్వాత ముత్యాలరావుకి అపాయింట్‌మెంట్ దొరికింది. డాక్టరు గారి పిలుపుకోసం బైట కూర్చుని ఉన్నాడు. పేషెంట్లు వరుస క్రమంలో వెళ్లి వస్తున్నారు. ముత్యాలరావు ఎప్పుడెప్పుడా అని ఆదుర్దాగా వున్నాడు. రెండు గంటల తర్వాత లోపలికి వెళ్లి డాక్టర్‌కి విష్ చేసి తన మెడికల్ రిపోర్టులు ఇచ్చి కూర్చున్నాడు.
డాక్టరు రిపోర్టులు పరిశీలిస్తూ ‘మీరు ఏం చేశారు?’ అంటే రిటైర్డు జిల్లా అధికారినన్నాడు దర్పంగా ముత్యాలరావు. చింత చచ్చినా పులుపు చావనట్టు!
‘ఇప్పుడేమి చేస్తున్నారు?’ అంటే రెస్టులో ఉన్నారా లేక ఏదైన ప్రైవేటు జాబ్ చేస్తున్నారా అన్న భావంతో ఆయన అడిగారు. ముత్యాలరావు డాక్టరుగారి ఉద్దేశాన్ని త్రోసిరాజని అవకాశం దొరికింది కదా అని ‘మీ అపాయింట్‌మెంట్ కోసం మీ హాస్పిటలు చుట్టూ తిరిగాను’ అన్నాడు. తన చమత్కారానికి డాక్టర్ నవ్వుతాడు అనుకున్నాడు ముత్యాలరావు.
‘వైద్యుడు దేవుడు గనుక నా కోసం మా హాస్పిటలు చుట్టూ మీ ఆరోగ్యం కోసం తిరిగారు. ప్రభుత్వాఫీసులు చుట్టూ తిరిగే ప్రజలు అధికారులని ఉద్యోగులని దెయ్యాలు, భూతాలు అంటారు. మీ సర్వీసులో మీరేమి అనిపించుకున్నారు?’ అని డాక్టర్ అడిగే సరికి ముత్యాలరావు తల నేలని చూసింది.

- మాధవరపు కృష్ణ
పూళ్లవారివీధి, గాంధీనగరం
కాకినాడ-4
సెల్: 8985492283

కవి పరిచయం

మినీ కథల
మెగా కథకుడు

కె. బి. కృష్ణ

కృష్ణగారి కథలన్నీ నేలవిడిచి సాము చేయవు. కన్నడ భాషలోకి ఈయన కథలు, నవల అనువదింపబడ్డాయి. అంటే తెలుగు కథ పరిణతి, పరిమితికి తన స్థానం
భద్రపర్చుకున్న రచయితగా కృష్ణ కృషి సాగిందనేది
నిర్వివాదాంశం.

నేడు తెలుగు కథ - పఠితలు సమవేగంతో ప్రయాణిస్తున్నారు. కథా సంకలనాల విడుదల కూడా ఇబ్బడిముబ్బడిగా సాగుతూనే వుంది. తెలుగు కథకు అంతర్జాతీయ ప్రామాణికత్వం చోటుచేసుకున్న దాఖలాలు ఉండనే ఉన్నాయి. కథ-వస్తువు చెప్పే సూటితనం కొంతమందికి అలవడినట్లుగా, పాఠకుడి మేథోవలయాలకి చేరేందుకు కథాస్వామ్యంలో రచయితలు చేసే కథన కుతూహలం మేథోమధనం అప్రతిహతంగా సాగుతూనే వుంది. అయితే కథనరీతుల్లోని నిబద్ధత, సాహిత్య సంస్కారం కూడుకున్న రచనలు అరుదుగానే ఉంటాయి. ఇలా పాఠకుల, విమర్శకుల పూలు-రాళ్లు స్వీకరించడంలో చాలామంది సాహిత్యకారులు-కథకులుగా ఉండడానికి అలనాటి క్షేమేంద్రుని బృహత్క్థా మంజరి కథల నుంచి వర్తమాన కథకుల వరకూ వేలాదిమంది పాశ్చాత్య కథన రీతుల్ని ఆకళింపు చేసుకున్నవారు కొంతమందే కాల స్పృహతో రచనలు సాగిస్తున్నారు.
అలాంటి నేపథ్యంతోనే కె.బి.కృష్ణ (కాకరపర్తి భగవాన్ కృష్ణ) మినీ కథల మెగా కథకుడిగా గణతికెక్కారు. విభిన్న దృష్టిపథం-దృక్పథంతో రచనలు చేయడం ఆయన చేసిన మూడున్నర దశాబ్దాల అవిరళకృషి. అనుబంధాల దార్శనికుడిగా సందేశాత్మక సృజనతో వ్రాసిన ‘గాయత్రి’, ‘ఆమెనవ్వింది’ కథా సంపుటాలతో ప్రారంభించి, నేటికి 800 పైచిలుకు కథల్ని రాశారు. అసలు ఏ సాహిత్య ప్రక్రియైనా సరే సమాజహితం కోరాలి. రచనలన్నీ దాని కోసమే అన్న వాస్తవాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి, మధ్యతరగతి బతుకుల్ని, శైలీ, శిల్పాలకు ప్రాధాన్యత ఉన్నా, లేకున్నా సందేశం ఇచ్చిన తీరులో చాలా కథలు రాశారు... రాస్తున్నారు. ‘ఇంతే సంగతులు’లో మీడియా ప్రకటనలపై మోజు, విషయ ప్రలోభంతో ఆలోచనాజ్ఞానం కొరవడడం వల్ల జరిగే అనర్ధాలు తెలిపారు. ‘అభిషేకం’ సంకలనంలో అన్ని కథలు అనలవేదికల చిరునామాలే అవుతాయి. ‘రగిలే నిప్పుకణిక’ల్లో మాణిక్యాలు-మణిప్రవాళాలు దర్శింపచేస్తాయి. ‘మనిషిని-మనసుని’2, ‘ఏ ప్రశ్నకు-ఆ జవాబు’, ‘చెంపదెబ్బ’, ‘ఇదేమిటి’, ‘దిక్సూచీ’, ‘రేపటికి కొత్త వెలుగు’, ‘మిస్ ది కాల్’, ‘క్విక్’లు పరిశీలనా దృక్పథంతో పాటు అవగాహన పెంచే అంశాలయ్యాయి. సమస్యల్ని ఎలా సాధించుకోవాలో గహనంగాని రీతుల్లో కాస్త నాటకీయ వ్యంగ్యం, సునిశితంగా చెంప చెళ్లుమనిపించడం. అరే ఇదీ మన కథే - దీంట్లో నాకు పాత్ర ఉందేమో అనిపించడం, పెద్దల మాట-చద్దన్నం మూట చందంగా తన మాటల్ని అత్యంత నాటకీయంగా ముగింపు చేయడం కృష్ణలోని ప్రత్యేకత. కళ్ల ప్రాముఖ్యంలో యిక ‘కళ్లు’ కథలో మానసిక-శారీరక వికలాంగులపై కథల్లారు. ‘కోరిక’2 కథలో అధికారి ప్రయాణం పట్ల ఆసక్తిని ప్రదర్శించే కింది ఉద్యోగుల మనోచిత్రణ, సగటు ఆర్థిక బంధాల పరిధుల్లో ఉచిత ప్రయాణం కోసం అధికారి వాహనంలో ఉచిత ప్రయాణం చేయాలనుకున్నవారి నిరాశ కథాంశమయ్యింది. ఇక ఎవరినైనా అనాయాతంగా అర్థించడం వెనుకవాళ్ల ఆత్మాభిమానం ప్రకటించడాన్ని రెండు పాత్రలతోనే సరిపెట్టిన కథ ‘మగువ మనసు’. పేర్లు తారుమారైనప్పుడు ఉత్తరంలోని విషయాన్ని గ్రహించి, తెలియని మగువకు డబ్బు పంపి, ఆనక ఆ ‘మగువ మనసు’లోని ఆంతర్యం గ్రహించడం ఆలోచింపచేస్తుంది.
ఇక కె.బి.కృష్ణ సంస్కారం - సాంప్రదాయం కలగల్పిన భావవాది. ‘వ్యష్టి నుంచి సమిష్టి’ అన్న నానుడిని నిజం చేసేందుకు చాలా ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ‘గన్-పెన్’2 అసిధారావ్రతంగా కథాగ్నిగుళ్ల వర్షం కురిపించారు. కృష్ణ ఇన్ని ‘పెన్నిధులు’గా చేసిన రచనల్లో - గాయత్రి, ఆమె నవ్వింది, అనుబంధాలు, చిత్రలోకం (కామెడీ కథలు), జంతర్ మంతర్ (నవల), మోహనరాగం (నవల), అభిషేకం (101 మినీ కథలు), రివర్స్‌గేర్ (కామెడీ కథలు), సంస్కారం (2015లో మినీ కథలు) ఇంకా కొన్ని అముద్రితాలు ఉన్నాయి. దీనికి మూడున్నర దశాబ్దాలకు పైబడిన సహానుభూతి ఉంది. ఒక మెగా భావాన్ని - సమయోచితంగా మినీ కథలుగా చేయడం జరిగింది. ఆయన సుదీర్ఘ జీవనానుభవం, విభిన్న పార్శ్వాల కథనశైలిని ప్రోత్సహించిన ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, చినుకు, వార్తాసాగరం, అభయ, చతుర, తెలుగు పలుకులకు ప్రత్యేక అభినందనలందించాలి. ఈ రచనా వ్యాసంగం ఎవరికైనా యోగం. అంటే కలయిక. ఒక అనుభవం. కాబట్టి ఇద్దరు ఎంఫిల్‌లు, ఒక పిహెచ్‌డి పట్టా కోసం, మరొక ఎం.్ఫల్ కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుగు కథకులకు గర్వకారణం కాక మరేముంటుంది? ఇక కృష్ణ కథలన్నింటినీ తీసుకునే కంటే అభిషేకం (101 కథలు), సంస్కారం (36 మినీకథలు) సంపుటల్ని పరిశీలించినప్పుడు ఒక ఆత్మీయ అనుభూతిని పాఠకుల సహానుభూతిని పొందుతాము. లోకోక్తుల్ని - చిన్న విషయాల్ని క్లుప్తంగా మినీ కథకు కూడా అన్ని లక్షణాలను ఆపాదించకపోయినా, శైలీ విన్యాసం ఆకట్టుకునే రచనలు చేశారని కథలు చదివిన తర్వాతి అభిప్రాయమైంది. ఇక ‘పుట్టినరోజు’2 కథలోని పాత్రలు - నేటి వృద్ధాశ్రమాలను చాలా దగ్గర నుంచి పరిశీలించారు రచయిత. ఇకముందు కృష్ణగారి సాహిత్య చలనసూత్రాలు - సమాజ వికాసాన్ని, కథాగౌరవాన్ని, విలక్షణాత్మక శిల్ప విన్యాసాల్ని సంతరించుకోవాలని ఆశిద్దాం. మన కథాప్రపంచానికి వందేళ్లకు పైబడిన సంస్కృతి, చరిత్ర ఉన్నాయి.
కృష్ణగారి కథలన్నీ నేలవిడిచి సాము చేయవు. కన్నడ భాషలోకి ఈయన కథలు, నవల అనువదింపబడ్డాయి. అంటే తెలుగు కథ పరిణతి, పరిమితికి తన స్థానం భద్రపర్చుకున్న రచయితగా కృష్ణ కృషి సాగిందనేది నిర్వివాదాంశం. ఇక శ్రీ కాకరపర్తి భగవాన్ కృష్ణ పొందిన బహుమతుల కోవలో మరో మణిమకుటం ‘మినీ కథాచక్రవర్తి’2చేరబోతోంది. కె.బి.కృష్ణపై అభిమానంతో కవి, కళాత్మక చిత్రకారుడు, విమర్శకుడు, ప్రజ్ఞాశాలి మాకినీడి సూర్యభాస్కర్ ప్రత్యేకంగా వ్రాసిన ‘మినీకథక బ్రహ్మ కె.బి.కృష్ణ’2 ఆవిష్కరణ జరుగుతోంది. కథన సంస్కారుని అక్షరాలా అభినందిస్తూ - అభిషేకపు అక్షరాల్ని అందిస్తున్నాను.

- వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు, కాకినాడ, సెల్: 9441148158

పద్యకథ

స్నే‘హాని’కి...
అనగా అనగా అనగన
గనగా ఒక ఊరి తోటయందు వసించునే
వినుమీగ దోమ చీమలు
చినతనమున నుండియు కలసిమెలగుచుండెన్

ఎగిరి ఎగిరి వస్తాయి ఆ ఈగ దోమ
బాగ తిరిగి వస్తుంది ఈలోగ చీమ
తిన్నవి నెమరువేసుకొంచెన్నొ ఊసు
లాడుకొంచు స్నేహమ్ముగ గడుపుతాయి

ఇటులుండనొకానొకనా
డెటనుండియె సాలెపురుగు ఎదురుగ వాలెన్
బొటబొట కన్నీరొలుకుచు
చిటిపొటి మాటల తనకత చెప్పదొడంగెన్

నాకెవరును లేరిల, నేననాథనయితి
నేనెవరికేమి కాను, విన్నాను మీగు
రించి, మీ స్నేహము నభిలషించుచుంటి
మీదయమె కావలయు నాకు, కాదనకుడు

పొత్తు కోరు సాలీడును పొమ్మన మన
సొప్పలేక, మాటకెదురు చెప్పలేక,
ఈగదోమ చీమలు, చూచి మొగమొగాలు
స్నేహితునిగ సాలీడును చేసికొనెను

కట్టుకున్న కొత్తింటికి పుట్టకి, తన
సఖుల ప్రేమపిలిచి చీమ సత్కరించె,
అచ్చటలు ముచ్చటలతో, అంత్యాక్షరి పద
ములతో ఆనాల్గు ఆనందముగును గడిపె

అపుడె చెప్పింది సాలీడు, అనతికాల
ముననె కట్టుకోదలచితిననుచు గూడు,
ఎందుదొరకని ఘనమైన విందు భోజ
నమ్ము ఏర్పాటుచేత ఆనాడనినది

మూడురోజులయింది సాలీడు కలసి
ఏమయిందో యేమోయని ఈగదోమ
చీమలెంతో, ఆందోళన చెందినవయి
వెదుకసాగె, ఆహారము నిదురమాని

నాలుగోరోజు సాలీడె, నాటకీయ
ధోరణిలో అటుగాపోవు దోమను, విక
టాట్ట హాసముతో పిల్చె, కొట్టదురుగ
వాలి దోమ ఉండిప్పుడె వత్తుననెను
‘గొప్పగ మన సాలీడొక గూడు కట్టె
గూడుకాదది చక్కని మేడ, చూడ
రెండు కనులు చాలవు, వేగరండ’నుచును
చీమ ఈగల దోడ్కొని దోమవచ్చె

అంతఃపురమున మహారాణిలా ఉంటి
వీవు, నీయింటికదేది దారి?
ఏమెలా నిన్నుచేరేది? తెలియజేయి,
మూడూ ఒకేసారి అడిగెనంత
ముగ్గురు ఒకపరి పోలేరొకక్కరె
వచ్చి ఆతిథ్యము పుచ్చుకొనుడు
చక్కని విందు భోజనమున్నదిక్కడ
చేసి ఆనందింపజేయుడు కడు

ప్రతి పదమును పాటవలెను శ్రుతిలయలతో
మేళవించి సాలీడనె, తాళము జత
చేసినట్లీగ దోమయు చీమలంత
వహ్వాయనుచు సంతోషము వ్యక్తపరచె.

ముందు ఈగ వెనుక దోమ ముందుకెగిరె
హుమ్మనుచు, వాటి రెక్కలు ఉరుల చిక్కె
‘అమ్మొ’ అని విలవిల్లాడె, తమ్ముగావు
మనుచు సాలీడునని వేడుకొనె భయముతో

భయమదేల భయమదేల భయము వలదు
కష్టముల కడతేర్చక కావలసిన
శక్తిగలుగు సాలీడుండ శంకవలదు
వచ్చుచుంటి నాగండని వచ్చిదరికి

వాటినొకటొకటిగ భక్షించె సాలీడు
చెంతజేరి చీమచిక్కువరకు
ఎదురుచూడసాగె కుదురుగనప్పుడు
ఏగుదంచె చీమ వేగిరపడి

చీమ చేసుకున్నట్టిదే నోము ఫలమొ
ఏపురాకృత పుణ్యముదేమొకాని
ముందుకాలును సాలీడుకందజేసి
నేలకు పడి ప్రాణాలను నిల్పుకొనెను
పెల్లుబికి వచ్చు దుఃఖము పెదవులదిమి
దాచిపెట్టి అమరులైన తన సఖులగు
ఈగదోమలను తలంచి యెట్టులెటులో
చీమ తన పుట్టనింటికి చేరుకొనెను

దుష్టబుద్ధి సాలీడుది, ఇష్టసఖుల
తిన్న రాక్షసి, స్నేహానికున్న విలువ
ఇంచుకైన తెలియనిది, వంచనమ్మె
మార్గముగనెంచుకున్నట్టి మాయలాడి

సాలీడును తిట్టుకొనుచు
పైలోకముకరిగిన తన ప్రాణ సఖులకై
ఆలోచించుచు, బ్రతుకును
కాలోచితరీతి చీమ గడుపుచునుండన్
ఒకనాడా సాలీడే
నికరముగా తనదు గృహము నెతుకుచురాగా
చకిత భయకంపితయయి చ
తికిలబడినయట్టి చీమ ద్రిగ్భాంతిగనెన్

కొబ్బరీనెల చీపురు దెబ్బతగిలి
గాలితాకిడికిటు తేలివాలినాను
గూడు చెదరి గుండెపగిలి నీడకొరకు
వెదకునన్నిదిగో చావువెంబడించు
ప్రియసఖా, చీమ! రక్కసి పిచ్చుక, నను
మ్రింగి వేయవస్తున్నది, మీ గృహమున
ఆశ్రయమొసంగి దయతో నన్నాదుకొనుము
జాగయినచొ పిచ్చుక నను చంపితినును

కావు’ మనెడు సాలీడును కసరి చీమ
‘స్నేహమునకు ద్రోహము చేయు చీడపురుగు
లకు తగిన శాస్తియగు చివరకు’ అనగనె
అటు పిచుక నోట్లో సాలీడు గుటుకుమనెను

- తటవర్తి రాఘవరాజు
రామచంద్రపురం, సెల్: 9963610243
మనోగీతికలు

మాటలు మొక్కవోవు
ఆలోచనకు అంతరాయం కలిగి
అవకాశం వెక్కిరిస్తుంటే
ఆశ ఆవిరిగా నిరుత్సాహమయి
మనసు నిట్టూర్పు విడుస్తుంది

పలుకులు పేలవంగా మారి
పెదాలపై పదాలు నర్తిస్తుంటే
దేహంలో నరాలు బిర్ర బిగిసి
మెదడు నిష్ఠూరమాడుతుంది

చెప్పుకొనేవి గొప్పగా కీర్తించి
చెప్పనివాటిని గుట్టుగా దాచేసుకొని
అప్రయత్నంగా మాట ఏనోట జరినా
ములుకులై నింద చిందులేస్తుంది
వ్యక్తిత్వం, నీతి నుంచి
నీరుగారి నిస్సారమయితే
అవకాశాన్ని ‘అవసరం’ నీడ కమ్మేస్తే
నిర్మొహమాటమై నిజంగా చేయబడుతుంది

- అమృత్
సెల్: 9494842274

చెట్లు లేనిదే బతుకే లేదు

వరాల వర్షం కురవాలంటే
పసిడి పంటలే పండాలంటే

చిన్నా పెద్దా చేతులు కలిపి
చెట్టూ చేమా పెంచాలి!

జగతిని హర్షం నిండాలంటే
ప్రగతికి బాటలు వేయాలంటే
తరువులు బాగా పెంచాలి
కరువును దూరం చేయాలి!

చల్లని నీడలు కావాలంటే
వ్యాధుల పీడలు పోవాలంటే
వృక్షసంపదను పెంచాలి
స్వచ్ఛతనే సాధించాలి!

కలుషిత వాయువు
తొలగాలంటే
మనిషికి ఆయువు
పెరగాలంటే
పచ్చని చెట్లను పెంచాలి
ప్రాణవాయువునె పంచాలి
చెట్లే పుడమికి ప్రాణాధారం
చెట్లే కలిమికి మూలాధారం
చెట్లులేనిదే బతుకేలేదు
మానవజాతికి మెతుకేలేదు

- పంపన సాయిబాబు, సెల్: 9652801014

ఆమె ఒక సంచలనం

ఎన్ని సంచలనాలో!
ఎన్ని పరివర్తనాలో!
కాస్సేపట్లో సూర్యుడు దుకాణాన్ని మూసేస్తాడని
చీకట్లో అలిగిన రాత్రి
ఆమె కౌగిట్లో కరిగిపోయింది
ఆమె నవ్వుల కాంతిలో వసంతం వాడిపోయింది
ఆమె కురుల నుండి విరుస్తున్న సుగంధికా వీచికలు
మలయ మారుతాల లయ మార్చి వాకిట వెనుతిరిగాయి
ఆమె కుచ ద్వయం పూర్ణకుంభాన్ని వెనక్కు నెట్టింది
ఆమె తనువు సంచలనాల హరివిల్లు
ఆమె చుట్టూ పరిభ్రమిస్తున్న వినీలకాంతులు
చంద్రకాంతిని కరిగించాయి
ఆమె ముగ్ధ, మధ్య, ప్రౌఢ
ఆమె ధీర, లలిత, ఉదాత్త, నిభృత
ఆమె స్వాధీన పతిక, వాసవ సజ్జిక,
విరహూత్కంఠిక, విప్రలబ్ద, ఖండిత
కలహాంతరిత, ప్రోషిత భర్తృక, అభిసారిక
ఆమె శృంగార రసాలంబన విద్యుల్లత!

- భాను వారణాశి

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- మాధవరపు కృష్ణ