విశాఖపట్నం

విరోధి ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.
ప్రస్తుత ఎమ్మెల్యే పరంధామయ్యగారిపై పోటీకి ఎవరిని నిలపాలని సోమసుందరం మాస్టారు ఆలోచిస్తున్నారు. పరంధామయ్య మంచివాడే కానీ వయసు మళ్లడంతో చురుగ్గా కార్య నిర్వహణ చేయలేకపోతున్నాడు. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు అయిన దానికీ కాని దానికీ వేలు పెడుతుండడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అన్ని రంగాలలో పదవీ విరమణకు నిర్ణీత సమయం అంటూ వయసు అడ్డుకట్ట ఉన్నా రాజకీయ రంగానికి ఆ సూత్రం వర్తించదెందుకో? అనుకుంటూ యువకులు రాజకీయ రంగంలోకి పెద్ద సంఖ్యలో వస్తే బాగుంటుందని మాస్టారు అనుకుంటూ ఉంటారు. కందుకూరి వీరేశలింగం ‘విద్యార్థుల శక్తి విద్యుచ్ఛక్తి’ అన్నారు. ‘ఓ యువకుడా మేలుకో’ అంటూ స్వామి వివేకానంద పిలుపునిచ్చారు. ‘యువశక్తే దేశ భవిష్యత్తు’ అంటూ అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. విద్యార్థులు లక్ష్యానికి గురిపెట్టిన బాణాలు. ఛేదించడం వారికి తెలుసు... ప్రయోగించడమే మనం నేర్పించాలన్నది సోమసుందరం మాస్టారి అభిప్రాయం. అందుకే దేశ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయగల నవ యువకులను తయారు చేయాలన్నది అతని దృఢ సంకల్పం. అందుకే ఆయన అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు.
శశికాంత్ మదిలో మెదిలాడు. పదిహేనేళ్ల క్రితం పదవ తరగతి చదువుతున్న శశికాంత్ ఆ మారుమూల గ్రామంలో బాలానంద సంఘం స్థాపించి ఆదివారం నాడు పారిశుద్ధ్యమే ప్రథమ కర్తవ్యం అంటూ యువశక్తిని కూడగట్టుకుని రహదారులను శుభ్రపరచడం మాస్టారికి ఇంకా గుర్తు ఉంది. ఆ తరువాత పదవీ విరమణతో శశికాంత్ నుండి దూరమైనా అడపాదడపా పత్రికా ముఖంగా శశికాంత్ సేవా కార్యక్రమాల గురించి తెలుస్తూనే ఉంది. అతడే తను వెదుకుతున్న యువకుడని మాస్టారు బలంగా భావించారు.
చిన్నప్పటి నుండి సంఘ సేవ లక్ష్యంగా ముందుకెళుతున్న శశికాంత్‌కి మాస్టారి నిర్ణయం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయింది. ఓ వేదిక తయారు చేసి, ప్రణాళిక రూపొందించి మార్గదర్శిగా నిలిచిన మాస్టారిపై ఎద నిండా కృతజ్ఞతాభావం నిండిపోయింది. ఎన్నికల సరంభం ప్రారంభమయింది. వీధులు, వాడలు, పల్లెలు, పట్నాలలో పండగ వాతావరణం నెలకొంది.
పరంధామయ్యగారు తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు ఇంతెత్తున లేచారు. తమ శక్తియుక్తులు ఉపయోగిస్తామంటూ ముందుకురికారు. పచ్చనోట్లు రెక్కలొచ్చిన పక్షుల్లా ఇంటి గుమ్మాల ముందు వాలాయి. సారా ఏరులై పారింది. చికెన్ పులావులు, దమ్ బిరియాలనీలు జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. శశికాంత్ యువకుడని, ఆవేశపరుడని, అనుభవరాహిత్యుడని, ఎవరో ఆడిస్తున్న ఆటలో అతడో పావు అని వదంతులు వ్యాపించాయి. కులరాజకీయానికి తెరలేపాయి. సామ, దాన, భేద, దండోపాయాలను అవలంబించాయి. శశికాంత్‌కి ప్రత్యర్థుల ఎత్తులు అర్ధం కావడంలేదు. నాలుగు వైపుల నుండి విరుచుకుపడుతున్న విరోధి సైన్యం మధ్యలో పద్మవ్యూహంలోని అభిమన్యుడిలా మారింది అతని పరిస్థితి.
సోమసుందరం మాస్టారు శశికాంత్ వెన్ను నిమిరి ధైర్యం చెప్పారు. సమస్యల్ని భూతద్దంలో చూసి భయపడకూడదు. మనం భయపడి వెనుదిరిగితే అవి మనల్ని మరింతగా భయపెడతాయి. ధీశాలిలా నిలబడి ఎదిరిస్తే అవి ఓటమి పాలవుతాయి. ప్రశాంత మనస్కుడవై, దృఢ సంకల్పంతో ముందుకు అడుగేస్తే విజయం తథ్యం’’ అని మాస్టారు శశికాంత్‌లో కొండంత ధైర్యం నూరిపోశారు.
నాలుగురోడ్ల కూడలిలో సభావేదిక ఏర్పాటు అయింది. రాజకీయ ప్రముఖులు, మేధావులతో సభావేదిక కళకళలాడుతుంది. శశికాంత్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభించాడు.
‘‘సోదర సోదరీమణులారా! ఓటు మన హక్కు. యోగ్యుడైన వాడికి పిల్లనిస్తాం కానీ ప్రలోభాలకు లొంగిపోయి పనికిరాని వాడికి కట్టబెట్టంకదా! అయిదేళ్లు మనల్ని పరిపాలించే హక్కును పచ్చనోటుకు తాకట్టు పెట్టలేం. ఓ ఫుల్‌బాటిల్ మత్తుకు జాలరి గాలంలో ఎరను చూసి చిక్కే చేపలం కాదు మనం. ఏ స్వార్థంతో ఈ ప్రలోభాలన్నీ ఎందుకీ కపటప్రేమ. ఎవరి కోసం ఈ శుష్కవాగ్దానాలు. నిజానికి ప్రజాసేవ చేయాలనుకునే వారికి ఇవన్నీ అవసరం లేదు. నాకు రాజకీయ అనుభవం లేని మాట వాస్తవమే కాదనను. కానీ పుట్టగానే ఏ ఒక్కడూ అమ్మా అని పిలవలేడు. కొంత సమయం పడుతుంది అంతే. నేర్పు ఉన్నవాడు ఒక్క అడుగు ముందుకేస్తే నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవాడు రెండడుగులు ముందుకేస్తాడు. అంకితభావం, కార్యదీక్ష, తపన ఇవి మనిషిని ముందుకు నడిపిస్తాయి. నాకంటూ ఓ చరిత్ర లేకపోవచ్చు. మీరు చేయందిస్తే చరిత్ర సృష్టిస్తా... నమస్తే’’ అంటూ తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నాడు. సభ కరతాళధ్వనులతో మార్మోగిపోయింది.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయిదు ఓట్ల తేడాతో శశికాంత్‌ని విజయం వరించింది. ఊరేగింపుతో వెళ్లి సోమసుందరం మాస్టారికి కృతజ్ఞతలు తెలిపాడు. శశికాంత్ ఒక్క మాట. ఛత్రపతి శివాజీ విజయోత్సాహంతో గురువు గారి దగ్గరకు వెళ్లినప్పుడు గురువుగారు శివాజీకి ఒక్క చెంప పెట్టు పెట్టారట. ఎందుకో తెలుసా? విజయగర్వంతో నిన్ను నీవు మరిచిపోకు అని. నీ విజయానికి కారణమైన వారిని ఎన్నడూ మరువరాదన్నది అతని ఉద్దేశం. మరో ముఖ్య విషయం. వయోవృద్ధుడు అనుభవజ్ఞుడు అయిన పరంధామయ్యగారి ఆశీస్సులు తీసుకో. ఉత్తరోత్తరా అతని సలహా సంప్రదింపులు మనకు అవసరమవుతాయి అన్నారు సోమసుందరం మాస్టారు. శశికాంత్‌లో విజయోత్సాహం నీరుగారిపోయింది. అతని వెంట వచ్చిన వారు తమలో తాము గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. విరోధికి అభినందనలా? అర్ధం కావడంలేదు. సోమసుందరం మాస్టారు తలవంచుకు నిలబడ్డ శశికాంత్ భుజం మీద చెయ్యి వేసి ‘‘శశీ మానవునికి నిజమైన విరోధులు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మత్సరాలు. వీటిని దరి చేరనీయరాదు. రామరావణ యుద్ధానంతరం శ్రీరాముడు లక్ష్మణుడిని రావణుని వద్దకు రాజనీతి తెలుసుకునేందుకు పంపాడు. భీష్ముని చివరి ఘడియలలో ధర్మరాజుని శ్రీకృష్ణుడు ధర్మసూత్రాలు తెలుసుకునేందుకు పంపాడు. అంతకన్నా అధికులమా మనం? ఆలోచించు’’ అంటుండగా శశికాంత్ కనుకొనల నుండి నీటిబొట్లు జారి నేలపై పడ్డాయి, మనసులోని అహాన్ని కడిగేస్తూ.

- బండారు చిన్నరామారావు,
లోగిశ-535270,, విజయనగరం (జిల్లా).
సెల్ : 9553330545.

మొదటికే మోసం
అవును నా వాటా నాకు పడేస్తే చాలు ఎలాంటి తప్పయినా ఒప్పే అవుతుంది. అన్నాడా అధికారి.
అరగంటలో కావాల్సిన బ్రాండ్ సిగరెట్లు, మందు కార్లో కూర్చున్నాయి. కవరుతోబాటు వయసయి పోవడంవల్ల ఇంకొకటి అడగలేదంతే.
ఇలాంటి ఆఫీసర్ని యింతవరకూ ఎరగనివారు ఆ అధికారం వస్తే తామూ అలాగే నొల్లుకు పోవచ్చు అనుకుంటున్నారు. అతనికి కవచం ఒకటి ఎక్కవుంది కూడా!
వారం గడిచింది.
ప్రతిచోటా లంచం పొందడానికి వీలున్న ప్రతి అవకాశాన్ని సులువుగా ఉపయోగించుకొని టార్గెట్ దాటే దిశగా దూసుకుపోతున్నాడు ఆ అధికారి - రాకెట్ వేగాన్ని మించి. మీడియేటర్ కూడా జడుసుకున్నాడు. ఆ వేగాన్ని అందుకొనేలా అర్థం చేసుకోలేక.
అవినీతి నిరోధకశాఖకు ఉప్పందింది. కాటేశారు. కళ్లు బైర్లు కమ్మే నిజాలు ఒక్కొక్కటిగా బైటకు వచ్చాయి. ఉద్యోగంలో చేరింది మొదలు తన బాధ్యతల్ని ఒక్కటైనా సరిగా నిర్వర్తించకుండా కాలక్షేపం చేసి ప్రభుత్వ నిధుల్ని నొక్కేసి ఇంక్రిమెంట్స్ పోగొట్టుకొని, రాజకీయాల అండతో దొడ్డిదారిన టెంపరరీ ప్రమోషన్ పొందిన కొద్దికాలానికే అరకోటికి ఎగబాకిన అతడ్ని చూసి నాయకులకే కన్ను కుట్టినట్టయింది. అడ్డంగా దొరికాడు అధికారి. కొంత మొత్తం ప్రభుత్వ ఖాతాకు జరిమానాగా వెళ్లిపోగా యింకొంత రాజకీయనాయకులకు నజరానా అయింది. పెన్షన్ నుండి కొంత కోతా తప్పలేదు. లక్ష్మీనారాయణలూ ఉంటారు. వెలుగులోకి రావడం కాస్త ఆలస్యం అంతే.

- శ్రీనివాస భారతి, శ్రీకాకుళం

పుస్తక సమీక్ష

హృదయాల మధ్య...
కాలం నా కరవాలం

తెలుగు కవితా వనంలో మొలిచిన నిలిచిన చందన తరువు చిమ్మపూడి శ్రీరామమూర్తి. సంగీత, సాహిత్య స్థానద్వయాన్ని సంపాదించిన ప్రజ్ఞానిధి. ప్రవచనరథి. కవిత్వంలో రవ్వలు రాల్చగలరు. స్వరార్చన చేసి వెలుగుపూలు పూయించగలరు. పంచ్ల విపంచిని వినిపించగల విరించి. పాటలా పల్లవించగలరు. పద్యమై ప్రవహించగలరు. నాటకమై నందుల నందుకొనగలరు. అంతర్యామిని సాక్షాత్కరింపజేయగలరు. అంతరాలను తరిమివేయగలరు. అందుకే కాలానే్న కరవాలం చేయగలరు.
వారి రచనా పాటవాన్ని పఠించి పులకించాలంటే ‘కాలం నా కరవాలం’ చదవదగ్గ సంపుటి. వారి హృదయ పుట నిండా ఉన్న ఆర్తి, ఆవేదన అక్షరాల నిండా కనిపిస్తుంది. మనిషితనం చిరునామాను శోధిస్తుంది. ప్రకృతి పరిణామాలను ఆవిష్కరిస్తుంది.
వచన కవిత్వంలో పరిణతి గల వీరు గేయరచయిగా కావడం చేత కొన్ని కవితలు వనచన గేయాలై, మరికొన్ని గేయ వచనాలై, ఇంకొన్ని పద్యపాదాలై, మరికొన్ని హృదయనాదాలై మనల్ని పకలరిస్తాయి. ‘ ఈ జనారణ్యంలో ఎవరో మానవత్వానికి కర్ఫ్యూ విధించారు/ ప్రపంచం గొంతులో దిగబడిందో విషపు ఇనుపముల్లు/ విశ్వశాంతి ప్రయోగశాలలో విస్ఫోటనాలు తలెత్తితే/మానవ కక్షలోకి అగ్నిపర్వతాలు ప్రవహించ ఏం చేస్తాయి’ అంటారు. ఎంత చక్కని అభివ్యక్తి. మనిషన్నాక మానవత్వాన్ని భావితరాలకు వీలునామా రాయాలని కమ్మకు పద్యమో అమ్మకు నైవేద్యమో అయిపోవాలని కవి మనకు విజ్ఞప్తి చేస్తాడు. వీరి వచనంలో అంత్యప్రాసలు అశువుగా అంచ నడకలతో పంచ్ నడకలతో సంచరిస్తుంటాయి. నీ ఆలి తాళి/ ఏ ధూళిలో కలిస్తే నాకేం? నీ ఆనందమే నా కందం/నీ అనుభూతికే నా బిందు గంధం/ ఆ మత్తే పథకాలకు విత్లు/ జాతికి నేటి ఉపనిషత్తు అంటారు. మద్య బాలశిక్షలో ఈ పద విన్యాసం ఒక్కొక్క పదం ఒక వ్యాసం. మద్యోగ్రవాదాన్ని నిరసిస్తూ మతోన్మాదాన్ని వదలని మందుబాబుల అలసత్వాన్ని, బలహీనతను మధుశాల సీసాలపై ఛందస్సుతో పనిలేని సీసాలు వినిపిస్తున్న వైనాన్ని అక్షరీకరించిన తీరు అద్భుతం. సామాజిక అకృత్యాలకు బలవుతున్న బిడ్డలను అప్పగించమని కాలాన్ని కోరుతున్న కవి వాక్కు ‘ఆ పాపిష్టి నేల మీద మనుషులంతా నడిచే ఆయుధాలైపోతారని తెలీదు/ విధుల వలలో నిధుల ఊబిలో చిక్కుకుపోయిన నా బిడ్డను అప్పగించడం యువత ఎన్ని రకాల చిక్కుల్లో పడి చిక్కిపోతుందో భావగర్భితంగా పదచిత్రణ చేశారు. రాజకీయాలపై నిరసన ధ్వని కొంచెమైనా ఆలోచించండంటూ రాసిన అక్షరాలు చదవాల్సిందే. ‘రాజకీయ వ్యాపారులారా ఖనిజాల్లో నిజాన్ని కొంచెం నన్ను తెలుసుకోనివ్వండి/ కవిత్వం రాసుకోవడానికి కొందం ఆమనిని ఆహ్వానించుకోనివ్వండి/ మా బుజ్జికి గుజ్జన గూళ్ల కోసం పిడికెడు ఇసుకను జారవిడవనివ్వండి’ అంటారు. నా దహనం కోసం ఆరడుగుల నేలనైనా దక్కనివ్వండని అర్ధిస్తాడు కవి. అక్షరాలను కుదిస్తే, పదాన్ని మదిస్తే, క్లుప్తతను పాటిస్తే కవితకు ఎంత శక్తో ఈ భావ ప్రసారికలలో మునగండి.
‘కవితకు కవి బ్రహ్మ/ కవికి కవిత అమ్మ/ అమ్మది ప్రసవవేదన కమ్మది భావ వేదన. ఇలా మినీ కవిత్వపు హొయలు, నానీల సొగసు, మాత్రాబంధం... అక్షర బంధం మనల్ని కన్ను తిప్పనీయకుండా చదివిస్తాయి ఈ కలం విన్యాసాలు.

- కిలపర్తి దాలినాయుడు,
సాలూరు-535591,
విజయనగరం (జిల్లా).
సెల్ : 9491763261.

సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక భారత భారతి

ఆధునిక కవితా రంగంలో లబ్దప్రతిష్టులైన కవిశేఖరుల కోవకు చెందిన వారిలో భావశ్రీ ఒకరు. విద్వత్కవిగా, విశిష్ట విమర్శకునిగా, సాహితీవేత్తగా, అనువాదకునిగా, అనుసంధానకర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలగా గుర్తింపు పొందిన భావశ్రీ కలం నుండి జాలువారిన భారత భారతి (ఖండకావ్య సంపుటి) సంస్కృతీ సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుంది. ఆధునిక సంపద్రాయ పద్య కవితా రీతిలో సాగిన ఖండకావ్య సంపుటి ఇది. ఇరవై ఆరు కవితలున్న ఈ పుస్తకం దేనికదే ప్రత్యేకంగా, విలక్షణంగా ఉంటాయి. నవీనత గోచరింపగా రక్తి ఘటింపజేయగల లక్ష్యమునన్ రచియింప గావలెన్’ అని నేటి కాలపు పద్య కవులకు దిశా నిర్దేశం చేశారు.
‘తెలుగు జాతి నాది తెలుగు సంస్కృతి నాది/ తెలుగు భాష నాది తెలుగు నాది/ ఇతరమైన భాషలెన్ని నేర్చిన గాని/ తెలుగు విడువబోని తెలుగువాడ’ అంటూ రచయిత భావశ్రీ సరళ సుందరంగా మాతృభాషపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తిష్ఠ ఖండికల ఒకనాడు తండ్రి యజ్ఞకు సర్వవాజ్యము / విడిచెకానల కేగె కొడుకొకండు/ ఒకనాడు సత్యదీక్షకు ధర్మపత్నినే/విక్రయించెను మహీ విభుడొకండు’ అంటూ రాసిన తీరు పాఠకకులను ఆకట్టుకుంటుంది. మిగిలిన అన్ని ఖండికలను చదివి తీరాలనే ఆసక్తి కలిగిస్తుంది.
‘మాతృపూజ’ ఖండికలో ఈ తెల్లదొరతనం బేల మాకొద్దన్న/ గరిమెల్ల కీనేల కన్నతల్లి/ బిగి వ్యవహార భాషోద్యమ స్రష్టమా/ గిడుగు వారీయమ్మ కడుపు పంట/ తొలి డాక్టరేట్‌తో వెలసిన చిలుకూరి/తల్లియై వరలిన ధన్య రుూమె’ అని శ్రీకాకుళం జిల్లా ఘనతను రాశారు. తెలుగు పలుకు కవితలో చెలువమ్మ చిగురించు తొలుకారు క్రొమ్మించు/తళుకు లందించు మా తెలుగు పలుకు/గుండె లోతుల లోన నిండి తేనియతేద/ లొలుకచిందించు మా తెలుగు/ ఇతర భాషా పదాలెనె్నని తనలోన/ మలచుకోగలగు మా తెలుగు పలుకు/ అంటూ మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నారు.
సంస్మరణ ఖండికలో గిడుగు గొప్పతనాన్ని వర్ణిస్తూ వ్యవహార భాషలో నరసి బోధింపగా/ దగునంచు ఆనాడె తరచెనితడు/ గురజాడ మార్గమ్ము గురువైనదని యెంచి/ మించు వేడుకను శ్లాఘించెనితడు’ అని రాశారు.
స్వతంత్ర భారతం ఖండికలో శ్రీకారమ్మొనరించె బాపు విజయ/శ్రీస్ఫూర్తితో శాంతికిన్/ప్రాకారమ్మనరించె జవ్వరు జగ/ద్వైశద్య సౌజన్యంతా/శ్రీకారమ్మొనరించె శాస్ర్తీ సమతన్/చేకూర్చగా కీర్తికిన్’ అంటూ నాటి మహానుభావులను స్మరించుకున్నారు. తెలుగువాడు కవితలో చదువుకున్న వాడు సర్వజ్ఞుడై నిల్చు/చదువురాని వాడు చతికిలపడు/చదువు వంటి ధనము జగతిలో లేదురా/తెలుగు వాడి/ప్రతిభ వెలుగువాడ అంటూ చదువు ప్రాధాన్యతను వివరించారు. స్ర్తిలను గౌరవించు శీర్షికలో రాసిన ఖండికలో నీ చెల్లిపై జూపు నీదు వాత్సల్యమ్ము/పొరుగింటి చెల్లిపై మరతువేమి?/నీ తల్లిపై చూపు గౌరవమ్మును/పొరుగింటి తల్లిపై మరుతువేమి? అంటూ రాసిన ఈ సందేశాత్మక కవిత ఆలోచింపజేస్తుంది. నాడు-నేడు ఖండికలో వేద చతుష్టయమ్మిచట/వీనుల విందుగ పొల్చె, నిచ్చటన్/పాదయి ప్రాకులాడివి/్భరత ముఖ్యమ హేతిహాసముల్’ అని వేదాల గురించి చక్కగా ప్రస్తావించారు. ఈ పుస్తకంలోని మిగిలిన కవితలు కూడా హృదయోల్లాసంగా ఉంటాయి. ఇటీవల కాలంలో విడుదలన మంచి పుస్తకాల్లో ఇదొకటి. ఈ పుస్తకాన్ని చదవాలనుకునే వారు రచయిత భావశ్రీ సెల్ నెంబర్ 9676412311లో సంప్రదించాలి.

- వాండ్రంగి కొండలరావు,
పొందూరు-532168,
శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 9490528730.

నివాళి

స్ఫూర్తి ప్రదాత

ఆడపిల్ల అందాల ఆటబొమ్మ అనే
సమాజానికి తన సాహిత్యంలో
అతివను ఇంద్రధనుస్సులా
ఆవిష్కరించిన ఆధునిక యుగకర్త!
ముక్కుపచ్చలారని వయసున
ముదుసలితో మనువైనా
కన్యాశుల్కపు కోరలలో
పసిప్రాయం బూడిదైనా
ఆచారాల సంప్రదాయాన్ని నిలబెట్టిన ముద్దుగుమ్మ పూర్ణమ్మ!
చదువనేర్చిన గడసరితనం
వంటింట్లో మగ్గిపోతూంటే
పొయ్యూదుకుంటూ - రుబ్బురాయ తిప్పుకుంటూ
కన్నీళ్ళను మోచేతితో తుడుచుకునే - బేల బుచ్చమ్మ!
మూఢాచారాల, మత దురహంకారాన
దిక్కుతోచక అల్లాడిన కుటుంబ మగ మహారాజుల
రెపరెపలాడే ప్రాణాలను నిలిపిన తెగువరి - నాంచారమ్మ
మరో మగువపై మనసుపడే మగని
సుతిమెత్తగా దారికితెచ్చి
భార్యలు ‘బెటర్ హాఫ్’లు అనిపించిన - గడసరి కమలిని!
చాందసాన గ్రాంథికానికి పెద్దపీట వేసిన
మహాకవుల బాటమార్చి
పదిమంది నడవాల్సిన త్రోవ చూపిన
వ్యావహారిక భాషోద్యమకర్త!
ఇంటితోపాటు దేశాన్ని, ప్రపంచాన్ని గెలిచి
యెల్లలోకములొక్క యల్లన్న వసుధైక కుటుంబ పెద్ద!
కనుమరుగై వంద వత్సరాలు
మచ్చుకైనా కానరావు ఆనాటి ఆచారాలు
కానీ సమస్యలు రూపాల్ని మార్చుకున్నాయ
ఆడదంటే అందాల అంగడి బొమ్మ ఈనాడు!
ఆసిడ్ దాడుల, లైంగిక వేధింపుల, మానభంగాల -
హత్యల, ఆత్మహత్యల - ముప్పేట దాడిలో
ముదితకు రక్షణ లేని - నవజీవన విధానం!
ఆకాశంలో సగభాగానివి. అందుకో... అవకాశాలివిగో...!
అని ఊరించి ఎండమావులను చూపే - కాలుష్య ప్రపంచం!
అవరోధాలను అధిగమించి - విచక్షణతో మసలుకునే తరుణమిది!
స్ఫూర్తి ప్రదాతను తలచుకుని
ఆకాశాన్ని అందుకునే సమయమిది!
ఆడదంటే శక్తి ప్రతీక - సకల విద్యాపారంగత
ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది
రేపటి తరానికి ఆమె ప్రతీక!

- చివుకుల శ్రీలక్ష్మి, విజయనగరం, 9441957325

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- బండారు చిన్నరామారావు