విశాఖపట్నం

సిసి కెమెరా (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లంచం ఇవ్వడం నేరం- లంచం తీసుకొనుట నేరం’ అని అంతంత అక్షరాలతో బోర్డులు పెట్టిమరీ దండిగా లంచాలు దండే ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగిరీ ఉద్యోగం చేస్తోన్న సుబ్రావ్‌కి ఎంతటివాడైనాసరే తనకి లంచం ముట్టజెప్పందే చిన్న పని కూడా చేసిపెట్టడం అలవాటు లేదు. పైపెచ్చు ఎప్పుడూ అందరికీ నీతి కబుర్లు చెప్తూ హితబోధలు చెయ్యడంలో అతనో దిట్ట! జీతం రాళ్లతో జీవితాన్ని నెట్టుకురావడం కంటే దుర్భరం, దుర్లభం మరోటి లేదని అతని ప్రగాఢ నమ్మకం. స్వతహాగా లౌక్యం- సమయస్ఫూర్తి ఎరిగినవాడు కనుక తన పై అధికారులందరితోనూ ఎప్పటికప్పుడు సత్సంబంధాలు ఏర్పర్చుకుంటూ ఉద్యోగంలో చేరిన అతి తక్కువ కాలంలోనే అడపా దడపా బినామీ పేర్లతో ప్లాట్లూ- ఫ్లాట్లూ, నగానట్రా బాగానే కొనుక్కోగలిగాడు.
నిత్యం ఇలాంటి ఏవో లావాదేవీలతో తలమునకలుగా వుండే మన సుబ్రావ్ ఆ రోజు ఆదివారం ఆఫీసుకి సెలవు కావడంతో ఇంట్లో మహా బోర్‌గా ఫీలయ్యి తన ఆరేళ్ల కూతుర్ని వెంటేసుకుని షాపింగ్‌కని దగ్గర్లోనే ఉన్న మార్కెట్‌కి బయలుదేరాడు తన కూతురు చెప్తోన్న ముద్దుముద్దు అమాయకపు మాటలను ఎంజాయ్ చేస్తూ...
కూతురంటే ప్రాణం తనకి. కూతుర్ని చూస్తే చాలు అన్నీ మరచిపోయి తనూ ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడు సుబ్రావ్. అందుకే ఎక్కడికి వెళ్లినా తనని కూడా వెంటబెట్టుకుని పోతూంటాడు.
ఇద్దరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో ‘నమస్కారం బాబూ’ అంటూ పలకరిస్తూ ఎదురుపడ్డాడు సుబ్రావ్‌కి ఆ ముందురోజే ఒకానొక పనిమీద ఆఫీసుకొచ్చి తనని కలసిన రాఘవయ్య అనే రిటైర్డు ఉద్యోగి. అత్యంత క్రమశిక్షణగల వ్యక్తిగా నీతికీ నిజాయితీకి మారుపేరుగా రాఘవయ్యకి మంచి పేరుంది గానీ ఉద్యోగంలో వున్నన్నాళ్లూ చాలీచాలని జీతంతో కుటుంబ భారాన్ని, బాధ్యతల్నీ మోయలేక అవస్థపడుతూ బాగా చితికిపోయాడు పాపం! ‘ఏం రాఘవయ్యా... బాగున్నావా... ఏం చేశావు నేను చెప్పింది’ అంటూ అడిగాడు సుబ్రావ్. అలవాటు ప్రకారం అందరి ప్రభుత్వ ఉద్యోగులలాగే తనకన్నా చిన్నవాళ్లయినా పెద్దవాళ్లయినా ఏక వచనంలోనే సంభోదిస్తూ...
‘ఏం చెప్పమంటారు బాబూ... కుటుంబ బాధ్యతలేవీ పూర్తి చేయకుండానే రిటైరైపోయాను. ఇప్పుడు కూడా రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం నాది. మీరడిగినంత ఇచ్చుకోలేనుగానీ, మీరా పని పూర్తి చేసిన తర్వాత సంతోషం కొద్దీ సమర్పించుకుంటాను లెండి’ అంటూ ప్రాధేయపడసాగాడు రాఘవయ్య.
‘అదిగో మళ్లీ అదే వరస... మరో మాట లేదు... మీరు మార్రంతే! నేనడిగింది నాకోసం కాదంటే వినవేం? నువ్విచ్చేది నాపై ఆఫీసర్లకే నేనివ్వాలి తప్ప, నాదంటూ అందులో ఏమీ వుండదంటే అర్థంకావట్లేదా’ అంటూ చిరాగ్గా మొహంపెట్టి ‘నీ పని పూర్తికావాలంటే ఇలాంటివి తప్పదు మరి... అంతా నీలాగే వుంటారనుకున్నావా... సర్సరే... బాగా ఆలోచించుకుని రేపోసారి ఆఫీసుకొచ్చి కనబడు’ అంటూ కూతురు చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు సుబ్రావ్, రాఘవయ్య ప్రాధేయపడుతున్నా వినకుండా.
వాళ్లిద్దరి సంభాషణను విన్న తన ఆరేళ్ల కూతురు సుబ్రావ్‌ని అడగసాగింది... ‘ఏంటి నాన్నా ఆ తాతయ్య నిన్ను ఏదో అడుగుతూ వుంటే మధ్యలోనే వచ్చేస్తున్నావు’ అంటూ అమాయకంగా.
మా పెద్దోళ్ల సంగతులు నీకెందుకురా చిట్టితల్లీ., నీకేం అర్ధం అవుతాయని... పదపద అంటూ ఎదురుగావున్న డిపార్టుమెంటల్ స్టోర్సులోనికి దారితీశాడు సుబ్రావ్ కూతురి చెయ్యి పట్టుకుంటూ.
ఇసుకేస్తే రాలని జనంతో కిటకిటలాడిపోతోంది బాగా పేరొందిన ఆ డిపార్టుమెంటల్ స్టోర్సు. ఎంట్రన్స్‌లో వున్న షాపింగ్ ట్రాలీనొకదాన్ని తీసుకుని లోపలికి నడుస్తూ ఇంటికి కావాల్సిన సరుకుల్ని ఒక్కొక్కటీ అందులో వేయసాగాడు సుబ్రావ్. తన కూతురు కూడా షాపింగ్‌ని సరదాగా ఎంజాయ్ చేస్తూ తనకి కావాల్సిన ఆటబొమ్మలూ, చాక్లెట్స్ గట్రా ఆ ట్రాలీలో వెయ్యసాగింది. కూతురి ఆనందాన్ని చూస్తూ సుబ్రావ్ కూడా మురిసిపోతూ కాసేపట్లో షాపింగ్ పూర్తిచేసుకుని కౌంటర్‌లో బిల్లు చెల్లించి బయటపడ్డాడు కూతురి చెయ్యి పట్టుకుంటూ.
ఇద్దరూ నడుస్తోంటే తన కూతురుకోడౌటొచ్చి సుబ్రావ్‌ని ఇలా అడగసాగింది...
‘అవును నాన్నా... అలా అన్ని ఐటమ్సూ ఆ షాపువాళ్లు షాపులో అంత మంది జనం మధ్య వదిలేశారు... కాపలాగా ఎవ్వరూ లేరు కూడా... నా చాక్లెట్ షాపులోనే తినేసేననుకో... ఎవరికి తెలుస్తుంది. ఎంచక్కా బిల్లు కట్టక్కర్లేదుకదా’ అంటూ అక్కడికేదో తను గొప్ప విషయాన్ని కనిపెట్టినంత ఆనందంతో చెప్పసాగింది.
‘చూడు చిట్టితల్లీ... అదే నీకు చెప్పేది... నువ్వు చాలా చిన్న పిల్లవనీ, నీకేమీ తెలియదని! షాపువాళ్లు తమ షాపులో మనకి కనబడకుండా ప్రతిచోటా సిసి కెమెరాలు వుంచుతారు. సిసి కెమెరా అంటే క్లోజ్డు సర్క్యూట్ కెమెరా అని అర్థం. వాటి ద్వారా వారు మనం షాపింగ్ ఎలా చేస్తున్నామా అని దూరంనుంచే గమనిస్తూవుంటారు. ఎవ్వరూ చూడట్లేదులే ఫర్వాలేదని నువ్వు చాక్లెట్ ఓపెన్‌చేసి నోట్లో వేసుకున్నావే అనుకో... అంతే! వెంటనే వచ్చి నిన్ను పట్టుకుంటారు’ అంటూ నవ్వుతూ చెప్పాడు సుబ్రావ్ తన ముద్దుల కూతురికి తెలీని విషయం తానొకటి సందర్భోచితంగా చెప్పినందుకు మురిసిపోతూ.
‘ఓ అదా నాన్నా! అవునవును నాకిప్పుడు గుర్తొచ్చింది. మొన్ననే మా స్కూల్లో మా టీచర్ చెప్పార్లే. ఈ క్లోజ్డు సర్క్యూట్ కెమెరాల గురించి. మనకి తెలీకుండా వీటిని పోలీసులు ప్రతి చోట వుంచుతారని... మనమేం దొంగపనులు చేసినా... మనమెలాంటి వెధవ్వేషాలేసినా వెంటనే వచ్చి మనల్ని పట్టుకుంటారని’ అలాగే ఇంకో విషయం కూడా చెప్పారు నాన్నా...
‘దేవుడు కూడా మనకి కనబడకుండా ఇలాంటి సిసి కెమెరాలోనుంచే మనం చేసిన తప్పుడు పనుల్నీ, పాపపు పనుల్నీ గమనిస్తుంటాడనీ... మనం పైకెళ్లాక మన తాట వలిచి సలసలా కాగుతున్న నూనెలో మనల్ని వేసి వేపుతాడనీ, పొడవాటి గొలుసుల్తో కట్టి మనల్ని తల్లక్రిందులుగా వేలాడదీస్తాడని...’
ముద్దుముద్దు మాటల్తో ఇలా చెప్పుకుపోతూన్న కూతుర్ని చూసి సుబ్రావ్ ఒకింత షాకయ్యి ఈసారి కూతురికి ఏం సమాధానం చెప్పాలో తెలీక సిగ్గుతో తలదించుకున్నాడు. నిజానికి పిల్లలే పెద్దలకు గురువులనీ, ఎలాంటి తారతమ్యాలుగానీ, ఎలాంటి మర్మంగా ఉండని పిల్లల నుంచే పెద్దలు చాలా నేర్చుకోవాలనీ, లేనిపోని బేషజాలతో ఒక రకంగా పెద్దలే పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తూ వారి జీవితాల్ని అగమ్యగోచరం చేస్తున్నారని తొలిసారి రియలైజ్ అవుతూ ‘లాభం లేదు... నా గారాలపట్టి మాటలకైనా విలువిచ్చి నేను మారాలి... ఇకపై ఎవ్వరినీ లంచం అడక్కూడదు ఛీఛీ..’ అనుకుంటూ ఆ క్షణంలో ఒక నిర్ణయానికొచ్చాడు సుబ్రావ్!

- వందన శ్రీనివాస్
విశాఖపట్నం
సెల్: 9989198970.

మినీకథ

కొందరి జాతకాలంతే!

‘‘మొన్న వైజాగ్‌లో మా తమ్ముడు కూతురు పెళ్లికి వెళ్లాను కదా! ఆ పెళ్లికి మనూరి లలిత కూడా వచ్చింది. పిల్లిలా ఉండే లలిత చిక్కిపోయి బల్లిలా తయారయింది. మొదట పోల్చుకోలేకపోయాను. తరువాత అదే నన్ను పలకరించేసరికి ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యాను’’
సీతాలు నవ్వుతూ ‘‘పిల్లికి, బల్లికి పోలికేమిటే పిచ్చిమొహమా! ఇంతకీ విశేషాలేమిటో చెప్పు. చాలా రోజులయింది దాన్ని చూసి’’
‘‘లలిత పెళ్లికి పుష్టిగా దబ్బపండులా ఉండేది కదా! సన్నగా బలిల్లా అయిపోయిందని చెప్పడానికి మన ఊళ్లో పిల్లులు బలిష్టంగా బాగుంటాయి కదా అని పిల్లితో పోల్చాను. దానికి ఇంత వెటకారమా?’’
‘‘మహాలక్ష్మి ఇక సోది ఆపి అసలు కథ చెప్పు’’
‘‘లలిత జాతకం ఏమిటో కానీ అది పెళ్లయిన దగ్గర నుండి సుఖపడలేదే! వాళ్ల నాన్న పాడి, పంట ఉండి స్థితిపరులని పల్లెటూరు సంబంధం దానికి చేశారు. ఒక్కడే కొడుకు సుఖపడుతుందనుకున్నారు. వారికున్న ముగ్గురు కూతుళ్ల గురించి ఆలోచించలేదు. ఆడపడుచులు పురుళ్లకని ఒకరి తరువాత ఒకరు వచ్చేవారుట. అలా పదేళ్లు వారి సేవలతో సరిపోయిందట. తరువాత తనకు కొడుకు, కూతురు పుట్టారట. వారి ఆలనాపాలనతో పదేళ్లు గడిచిపోయాయి. దానికి మొగుడి సరదాలు, సరసాలు తెలియవట. పెళ్లయ్యాక ఒక తిరుపతి తప్ప ఎక్కడికీ వెళ్లలేదట. పెళ్లిళ్లు, పేరంటాలు వస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం దాటి బయటికి వెళ్లలేదుట. ఎప్పుడూ వ్యవసాయం, తోటలు పని అంటాడుట. అలాగే జీవితం గడిచిపోతోందని ఏడ్చింది’’
‘‘పిల్లలు చేతికి అందలేదా?’’
‘‘ఇంకా అసలు కథ వినకుండానే రామాయణంలో పిడకలవేటలా ఆ ప్రశ్నలేమిటి?’’ అంటూ విసుక్కుంది మహలక్ష్మి.
‘‘అసలు విషయం చెప్పకుండా నానుస్తున్నావని అడిగానే తల్లీ. ఇక ప్రశ్నలు అడగను వివరంగా కథ చెప్పు’’ అంది సీతాలు.
‘‘లలిత కూతురు, కొడుకు కూడా బాగా చదువుకుని ఇద్దరూ ఇంజనీర్లయ్యారు. సలక్షణమైన సంబంధాలు చూసి ఇద్దరికీ పెళ్లిళ్లు చేసింది. కూతురు, కొడుకు కూడా ఉద్యోగస్తులే. అందుకే ఎప్పుడైనా చుట్టం చూపుగా వాళ్ల ఊరు వచ్చి చూసి వెళతారట. లలితను హైదరాబాదు రమ్మని అనరు గానీ లలిత మామగారికి తొంభై ఏళ్లు. అత్తగారికి ఎనభై ఏళ్లు. ఊళ్లో ఉత్తమ కోడలిగా బిరుదు సంపాదించి అందరి మన్ననలను పొందేది. పంటలు సరిగా లేకపోవడం, పిల్లల చదువులకు ఊళ్లో తోటలు అమ్మేసారుట. పది ఎకరాల పొలం వర్షాలు పడితే పండుతుందట. లేకుంటే పంట ఉండదు మరి. నాలుగు ఆవులుండడం వలన డెయిరీకి పాలు అమ్ముతారుట. ఇలా వారి అత్తమామలకు, పశువులకు సేవలు చేసి చేసి బల్లిలా అయిపోయిందిట.
‘‘ఇంకా ముసలాళ్లిద్దరూ బతికే ఉన్నారా?’’
‘‘అదే చెప్పబోతున్నాను. రెండేళ్ల కిందట తొంభై అయిదేళ్లు వచ్చాక మామగారు, తొంభై ఏళ్లు వచ్చాక అత్తగారు స్వర్గానికి వెళ్లారుట. లలిత గట్టిగా ఊపిరి పీల్చుకుని ఊళ్లో ఉన్న పొలం, ఇల్లు అమ్మేసి హైదరాబాదులో ఉన్న కొడుకు, కూతురి దగ్గరకి వెళ్లడానికి నిశ్చయించుకుని మొగుడిని ఒప్పించి పొలం, ఇల్లు అమ్మి హైదరాబాదు చేరుకుని అక్కడ ఒక అపార్ట్‌మెంట్ కొనుక్కున్నారుట. కూతురికి ఇల్లు కొనుక్కోమని కొంత డబ్బు ఇచ్చారుట. హమ్మయ్య అనుకుని ఉప్పొంగిపోయిందట. కూతురు, అల్లుడు ఉద్యోగస్తులు అవడం వలన వారింట్లో కొన్నాళ్లు ఉండి కూతురికి సాయం చేసేసరికి మనవడు పుట్టాడట. మనవడి సేవలో తరలించిందట. ఇంతలో కోడలు గర్భతయిందని కొడుకు చెప్పడంతో మనవడితో కొడుకు ఇంటికి వెళ్లిందట. తరువాత కూతురికి మరొక కొడుకు, కొడుక్కి కూతురు, కొడుకు పుట్టారుట. బంతాటలా కూతిరింటికి కొన్నాళ్లు, కొడుకు ఇంటికి కొన్నాళ్లు పిల్లలకి చాకిరీ చేస్తూ జీవితం వెళ్లబుచ్చుతుందిట. కూతురు, కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులు అవడం వలన వారి సేవలు చేయలేక ఛస్తున్నాను అంటూ కష్టాలు చెప్పుకుని ఏడ్చింది’’
‘‘అంతే కొందరి జీవితాలు అలాగే ఉంటాయి. ప్రాణానికి సుఖం ఉండదు. మంచితనమే ఒక్కొక్కసారి ముంచుతుంది. కొందరి జాతకాలు అలాగే ఉంటాయి. ముప్ఫై ఏళ్లు అత్తమామలకు గొడ్డులా చాకిరీ చేసింది. తను సుఖపడాలనుకునే సమయానికి ఉద్యోగస్తులైన కూతురు, కోడలికి సేవలు చేయాల్సి వచ్చింది. ఇటువంటి కథలకి అంతం ఉండదు. అయ్యో పాపం లలిత జీవితం అలా అయిందా! అని సానుభూతి చూపడం తప్ప మనమేమీ చేయలేము’’ అనుకుంటూ సీతాలు ఇంటికి బయలుదేరింది.

- ఎం. రామలక్ష్మి,
అలకనందాకాలనీ,
విజయనగరం-535003.
సెల్ : 9985014751.

పుస్తక సమీక్ష
తల తిప్పకుండా చదివించే
‘తలతిక్క రాజు కథలు’

బాలల లోకానికి గేయాలు బలవర్థక రసాయనాలైతే కథలు పాలబువ్వతో నిండిన వెండిగినె్నలౌతాయి. వారి ఊహల్లో రాకుమారులు, మాంత్రికులు, వింతల విహార యాత్రలు... ఎనె్నన్నో దృశ్యమాలికలు కనిపిస్తాయి. కుటుంబ, సమాజ జీవనంలో వారి పాత్రను మలచడానికి, మంచి పౌరునిగా తయారుచేయడానికి కథలు, గేయాలు, నాటికలు, పాటలు, పద్యాలు ఉపయోగపడతాయి. ఇలా బాలలను వారి భవితవ్యాన్ని తీర్చిదిద్దడానికి ఎంతో మంది రచయితలు బాల సాహిత్య లోకానికి ‘చందమామ’లై, ‘జాబిల్లు’లై బాలమిత్రులై, బుజ్జాయిలై వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బాల కథా రచయిత నారంశెట్టి ఉమామహేశ్వరరావుగారొకరు.
కథా పూలవనం ‘పార్వతీపురం’ నుండి మంచి మంచి కథలనందించినవారిలో ‘నారంశెట్టి’ ఇప్పటికే బాల సాహితీవేత్తగా ప్రసిద్ధులు. వారు రాసిన ‘తలతిక్క రాజు కథలు’ 14 కథల సంపుటిని పరిశీలిస్తే మనకు నిత్య జీవిత గాథల పార్శ్యాలు కనబడతాయి. జంతువుల పేర్లతో మనుషుల ‘నక్కతెలివి’ కాగా మిగిలినవి మనచుట్టూ ఉన్న సంఘటనలనే వ్యాఖ్యానిస్తాయి. చరిత్ర నేపథ్యంలో రాసిన కథలుగా ‘బాల తిమ్మరుసు’, ‘లింకన్ నిజాయితీ’ మనకు పరిచితాలౌతాయి.
‘అసలు సిసలు నేస్తం’, ‘కొత్త చెప్పులు’, ‘గొర్రెపిల్ల సందేహం’, ‘ఔదార్యం’, ‘మంచి విత్తనాలు’, ‘గురుశిష్యులు’, ‘తెలివైనవాడు’ వంటి కథల్లో పాత్రలు తీసుకున్న నిర్ణయాలు మంచి తీర్పులుగా మిగిలి బాలల్లో విచక్షణను పెంచేవిగా, మంచి చెడ్డలను ఎంచి చూపడంలో మార్గదర్శకాలుగా నిలుస్తాయి. శీర్షిక కథ ‘తలతిక్కరాజు’ కూడా ఈ విభాగానికి చెందిందే.
‘నక్క తెలివి’, ‘వృకాసురుడు’, ‘వింత పోటీ’ కథల్లో మంచి యుక్తి మనకు కనబడుతుంది.
చాలా పరిచితమైన కథ ‘బాల తిమ్మరుసు’ను స్వల్పమైన మార్పులతో రాశారు. ‘వృకాసురుడు’ పురాణ నేపథ్యంలో రాసినప్పటికీ ఇది భస్మాసుర కథకు దగ్గరగా కొత్త కొసమెరుపుతో అంతవౌతుంది.
‘గురు శిష్యుల కథ’ను విశే్లషిస్తే ‘నారంశెట్టి’ వారి శైలి, కథా నిర్మాణం, సందేశం మనకు అవగతమవుతుంది. అది నదీ మార్గం. ఒక త్రోవ. విద్యార్థులు స్నానం చేసి వస్తున్నారు. గురువుగారు స్నానానికి వెళుతున్నారు. త్రోవ ఇవ్వాలంటే ఎదురుపడినవారిలో ఎవరో ఒకరు బురదలో దిగాల్సిందే. అయితే గురువుగారే దిగి శిష్యులను ఆశ్రమానికి వెళ్లమంటారు. దీనికి అతడు ఇచ్చిన వివరణ లేదా వ్యాఖ్య. పిల్లలు పరిశుభ్రంగా వస్తున్నారు. వారికి బురద అంటడం సరైన విధానం కాదు. గురువు స్నానం చేయడానికి వెళుతున్నారు. వారికి మట్టి అంటడం కాదు. పది మంది మేలు కోసం ఒకరు త్యాగం చేయడం, అన్న ధ్వని వినిపిస్తుందీ కథలో. ‘మేలెరిగిన మనిషి’ వంటి అయిదారు సంఘటనలతో మంచి కథలను అందించిన నారంశెట్టి ఉమామహేశ్వరరావును అభినందిద్దాం.

- కిలపర్తి దాలినాయుడు
సెల్: 9491763261

మనోగీతికలు

ఓ పిచ్చుకల్లారా!
ఏమైపోయిరి?
కిచకిచమనే చప్పుళ్లతో
చూడముచ్చట గొలిపే
ఓ పిచ్చుకల్లారా!
ఇళ్ల పంచలకూ
మట్టి మిద్దెలకూ వేళ్లాడదీసే
వరికంకుల గుత్తులను
తినుటకు రాలేదేం?
ఎటు వైపు చూసినా
మీ జాడ కనిపించదేం?
పర్యావరణ కాలుష్యం
మీ ఉనికినే కనుమరుగు చేసిందా?
ప్రపంచీకరణ వేగంలో
మీరేమైపోయిరో
ఓ పిచ్చుకల్లారా?

- బుద్దా రామారావు,
ఫోన్ : 08854-256886.

పప్పులుడకవు
‘బందీ’ అయిన ‘కంది ముఖం’
చిందేసింది సుముఖంలో
దాడి చేసి తన
దాస్య శృంఖలాన్ని తృంచినందుకు
అధికార గణ ఔదార్యంలో
వ్యథ నుండి వీడిన ఘనతతో
పదుగురి నోట పండేను
పదిలంగా ‘రుచి’లో కలిసేను
నిత్యావసర దినుసులకు
సదా ‘నిఘా’ పరిశీలనతో
అక్రమ నిల్వలు అంతమయ్యేను
సక్రమ మర్గాన సంచరించారు
తప్పుడు పనులకు దండన తప్పదు
బప్పుగా పప్పులుడకవు

- శ్రీమాన్ శ్రీకాశ్యప,
సింహాచలం, సెల్ : 9985520479

యంత్రాల మంత్రం
చల్లకవ్వం, పెరుగుకుండ
మటుమాయం అవుతున్నాయి
జల్లెడలు, తిరగళ్లు, చాటలు
చెప్పుకోడానికే మిగులుతున్నాయి
దంపుళ్లు, ఉతుకుళ్లు
దరి చేరుట మరిచాయి
దుక్కి దున్నడం, కుప్ప నూర్చడం
కనుమరుగు అవుతున్న తరుణంలో
యంత్రాల స్వైరవిహారంతో
ప్రపంచీకరణలో అప్పటి న్యాయం
కనుమరుగు అయిపోతూ
మనిషికి సుఖమంత్రమై మిగిలింది

- కొంకేపూడి అనూరాధ,
విజయనగరం. సెల్ : 9618425243.

వర్తమానాన్ని
చక్కదిద్దుకో
గతంలోన ఎనె్నన్నో తప్పులు చేశాను
సోమరిగా జీవితాన్ని వ్యర్థంగా గడిపాను
దుర్వ్యసనాలకు లోనై దుష్టుడిగా నడిచాను
చేత చిల్లు గవ్వలేక చతికిలబడి పోయాను
సమస్తాన్ని కోల్పోయి దరిద్రుడిగా మిగిలాను
కలహాలతో బంధు జనుల దూరం కావించాను
అన్నిటనీ పోగొట్టుకుని భ్రష్టుడనై పోయాను
నా భవిష్యత్తును నేనే పాడు చేసుకొన్నాను
అనుకుంటూ విలపిస్తూ నెత్తి, నోరు బాదుకోకు
గత కాలం తలచుకుంటూ దిగాలుపడి కూర్చోకు
వర్తమాన కాలాన్ని వ్యర్థంగా గడిపేందుకు
గతం గతః అనుకుంటూ అనుభవాలు నెమరేస్తూ
వర్తమాన కాలంలో తప్పులు సరి చేసుకుంటూ
ఒక్కొక్క తప్పు తెలుసుకుని, దూరంగా తొలగిస్తూ
సోమరితనమును విడిచి, శ్రమించి పనిచేస్తే
ఉన్నతి నీ ముందుకొచ్చి సాగిలపడుతుంది
ఇంటికి పట్టిన దూళి దులిపి శుభ్రపరచినపుడు
పరిశుభ్రంగా మారి, నివాస యోగ్యమైనట్టు
ఇప్పుడు నీ ముందున్న, వర్తమాన కాలంలో
పాత వాస నొక్కొక్కటి తొలగిస్తూ పయనిస్తే
కోల్పోయిన సమస్తమూ ఒక్కక్కటి వచ్చి చేరు
గతించిన దానికి వగచక భవిష్యత్తు కొరకు చింతించక
వర్తమాన కాలాన్ని చక్కదిద్దు కొన్నప్పుడు
భవిష్యత్తుకు బంగారపు బాట అదే అవుతుంది!

- వెలగల ప్రదీప్ వెంకటరెడ్డి,
కొంకుదురు
email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- వందన శ్రీనివాస్