నెల్లూరు

ఉగాదీ... నీవెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋతువుల రాణి వసంతకాలం
ప్రకృతిగట్టెను పచ్చనిచీర
కుహుకుహు రవముల కోకిల పాలు
ఘుమఘుమలాడే మల్లెల సొబగులు
పులుపు, తీపి, చేదుల కలయిక
వగరు, ఉప్పు, కారపు రుచులు
ఆరు ఋతువులు, ఆరు రుచులను
మానవ జీవిత సుఖదుఃఖాలకు ప్రతీకలు
గతితప్పిన కాలచక్ర గమనం
తారుమారైన ఋతువుల ఆగమనం
కలుషితమయ్యెను వాతావరణం
వంట చెరకుకు, ఇటుక బట్టీల ఎర్రదనానికి
సమిధలాయెను చింతచెట్టులు
చెరకు రైతులకు బెల్లమె అల్లమాయెను
నిప్పుకు చెదలంటిన చందం
వేధించెను వేపచెట్లను మాయదారి రోగం
వేపపూతకై ఎదురుచూపులు
వాతావరణం వ్రాసెను
మామిడిపూతకు మరణశాసనం
ఇక మామిడి పిందెల వగరుకు చోటెక్కడిది?
చీడపీడలతో నషాళమంటెను మిర్చి రైతుకు
ఆటుపోట్లు ఆరగించినవి లవణరాశుల
ఇక షడ్రసోపేత ఉగాది పచ్చడికి తావేది?
కరవైనవి కవి సమ్మేళనానికి కరతాళ ధ్వనులు
పంచాంగ శ్రవణానికి పల్చన ప్రజలు
బుల్లితెరలో ప్రదర్శనలకు జయజయధ్వానాలు
అందుకే ఉగాదీ.. నీవెక్కడ..!
- ఆడేరు చెంచయ్య, నాయుడుపేట
చరవాణి : 9492331449

ఓ ఉగాది వసంతమా!
వడివడిగా ఉదయించుమా!
అచ్చ తెలుగు సంవత్సరమా
అపురూప క్షణాల మయమా
తెలుగుదనం పొంగి పొర్లగ
తెలుగింట జరిగే వైభవమా
చైత్రశుద్ధ పాడ్యమి
శుభదినమై..అడుగిడే
నవ్యశోభల నిలయమా
ఓ.. ఉగాది వసంతమా..
వడివడిగా ఉదయించుమా!
కమ్మని కోయిల రాగాలతో
పచ్చని పొలాల అందాలతో
ప్రవహించే సెలయేళ్ల పరవళ్లతో
వెండిలా విరబూసిన
వేపపూల ఘుమఘుమలతో
బంగారు వనె్నలా చిగురించిన
లేలేత మామిడి చివురులతో
నిరాశల జీవితంలో ఆశలు నింపుతూ
సుఖదుఃఖాల సంకేతం
షడ్రుచుల పచ్చడితో
సత్‌కాల సందేశమిస్తూ...
సరిక్రొత్త ఉత్సాహాన్ని మేల్కొలుపుతూ..
ఓ..ఉగాది వసంతమా..
వడివడిగా ఉదయించుమా!
కమనీయ నృత్యాలు సరిగమలతో
రమణీయ కవితాగానాల మధురిమలతో
పిండివంటల పసందులతో
భక్తిశ్రద్ధల పూజలతో...సారెల సందడితో
సంతోషాలు పంచు..శుభప్రద పర్వదినమా!
సౌభాగ్యములనిచ్చు..శుభోదయాల కాలమా!
ఓ..నవ్య ఉగాది వసంతమా
నీకిదే స్వాగతం..నీకిదే సుస్వాగతం!!

- కొండూరు వెంకటేశ్వరరాజు
గూడూరు
చరవాణి : 9492311048

ఉగాది ఆకాంక్షలు
సరిక్రొత్త తెలుగు సంవత్సరమా
పవిత్ర తెలుగు పర్వదినమా
ఓ.. ఉగాది మహోత్సవమా
నీకిదే..స్వాగతం..
అందమైన ఆశలకు రూపమవుతూ
ఎదురుచూపుల కనులకు ఉత్సాహమిస్తూ
వసంత శోభల సింగారాలతో
లక్ష్మీరూపమై.. రావమ్మా ఉగాది!
కోకిల గాన మాధుర్యంలా
మనుషుల మధ్య
మమతానురాగాలు పల్లవించాలి
మామిడాకుల మిసమిసల్లా
ఇంటింట దరహాసాలు నిండాలి
వేపపూతల పరిమళంలా
మంచితనాన్ని మేల్కొలపాలి
కవుల కవితాస్వరల్లా
కల్లకపటం లేకుండా బతకాలి
శుభోదయ తేజమా
దుర్మిఖినామ పర్వదినమా
ఉగాది పచ్చడి షడ్రుచులతో
పంచాంగ శ్రవణ జాగృతులతో
జన జీవన గమనానికి
నవ్య ఒరవడి దిద్దుమా..
‘శుభమస్తు’ అంటూ
దివ్య ఆశీస్సుల నివ్వుమా..!

- కె.అలేఖ్య, గూడూరు
చరవాణి : 9642797392

దుర్ముఖి నామ ఉగాది
నీ పేరే ఎంతో చిత్రంగా కనిపిస్తోంది
నీ నామంతో రాక్షసమూర్తి అగుపిస్తోంది
నీ పిలుపే భయం కలిగిస్తోంది
నీ తలపే ఒక శాపంలా వినిపిస్తోంది

గత మన్మధనామ సంవత్సరం
గోదావరి పుష్కరాల
గలగలలు మదినింపింది
దేశ శాస్తవ్రేత్తల కలలు పండించింది
పిఎస్‌ఎల్ వి, జిఎస్‌ఎల్‌విలను
విజయాలకు చేర్చించి
2జి పోయే, 3జి వచ్చే
ఆపై 4జి మెరుస్తోంది

ఓ దుర్మిఖినామ వత్సరమా
కృష్ణా పుష్కరాలు నీలో రానున్నాయి
అచ్చ తెనుగు అమరావతి
ఆంధ్రుల రాజధానిగా
నీతోనే మొదలవుతుంది
జలాలు పెంచు, ఫలాలు పంచు
ప్రేమను పంచు,
ప్రపంచాన్ని జయించు
తెలుగుజాతి ఔన్నత్యాన్ని
దశదిశలా ప్రకటించు

- కటారి రామయ్య, సదుం,
చిత్తూరు జిల్లా.
చరవాణి : 9704025771

ఏమన్నది?
ఏమన్నది?
గున్నమావిపై విరిసిన
కొసరు చిగురు ఏమన్నది?
తెలుగుదనము, బిగువు, తెగువ
ఎరుపై మెరవాలన్నది!
కుహుకుహు రాగాలొలికే
ఎలకోయిల ఏమన్నది?
తెలుగువారు ప్రగతి గీతి
కలనిటు పాడాలన్నది!
కడు పసందు చిందించే
రసాలమ్ము ఏమన్నది?
తెలుగుభాష తియ్యదనము
ఇట్టులె వెలగాలన్నది!
సుమములందు వెల్లివిరియు
సుగంధమ్ములేమన్నవి?
మానవతా గంధమిటుల
మంచిగ వెలయాలన్నవి!
పంచాంగం జాతకాల
ఫలశ్రవణమేమన్నది?
నవ్యాంధ్రుల రాజధాని
నవనవలాడాలన్నది!
పండుకొరుకు చిలక చెవుల
పండువగా ఏమన్నది?
పుష్కరాల కృష్ణాశ్రీ
మనకిక పుష్కలమన్నది
అలరులపై జుంజుమ్మని
మ్రోగెడు అళులేమన్నవి?
‘దుర్ముఖి’యును కృషితో
జయ ‘దుందుభి’ నిశ్చయమన్నది!

- రామడుగు వేంకటేశ్వర శర్మ,
9866944287

రేపటి ఉగాదులు
ఋతువుకొక్క రుచియన్నట్టు
ఆరు రుచుల అనాది ఫలహారం
మురిసిన మనసుల ‘తీపి’ గురుతులు
చెదిరిన కలల ‘చేదు’ గుళికలు
మండే గుండెల ‘కారపు’ రీతులు
తప్పని ముప్పుల ‘ ఉప్పు’ హెచ్చరికలు
పొగరుమోతుల ‘వగరు’ మాటలు
రేపటిరోజుల ‘పులుపు’ పిలుపులు
సుఖదుఃఖాల వెలుగునీడలు
ఉగాది పచ్చడి చెప్పే నీతులు
ఇగుళ్లు, పూపలు తొడిగిన గున్నమావిళ్లు
రెక్కలు విప్పిన కోయిల పాటలు
మురిసిన ప్రకృతి పులకరింతలు
అదిగో.. అవిగో..నవ ఉషస్సులు
తెలుగుజాతి కవి చిరయశస్సులు
తొలగిపోయినవి
మనసును కమ్మిన తమస్సులు
తెలుగువారివే ఆ తపస్సులు
రేపటి ఉగాదులన్నీ మనవే.. మనవే.

- కావేరిపాకం రవిశేఖర్, నాయుడుపేట
చరవాణి : 9849388182

స్వాగతం.. సుస్వాగతం
దుర్ముఖినామ సంవత్సరానికి
స్వాగతం..!
కొత్త..కొత్త ఆశలకు చిగురు తొడిగి
నునులేత రెమ్మల చిరుగాలి సయ్యాటలో
కోయిలమ్మ కుహు..కుహు.. నాదాలతో
సరాగాల సరిగమల స్వరాలతో
పరవశించి..పులకించి
ప్రకృతి ఒడిలో
ఓలలాడిన నాట్యమయూరిలా
అరుదెంచిన దుర్ముఖి ఉగాదీ!
నీకు స్వాగతం..
యుగాలు మారినా తరాలు గడిచినా
తెలుగుభాష అఖండజ్యోతిలా
దశదిశలా వెలుగొందాలని ఆశిస్తూ
తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలతో
మనముందుకు వస్తున్న
దుర్ముఖి నామ ఉగాదికి
స్వాగతం.. సుస్వాగతం..!

- కాళహస్తి వెంకటశేషగిరిరావు,
నెల్లూరు
చరవాణి : 9849619628

స్వాగత గీతిక
ప్రకృతికాంత పచ్చని తివాచీ పరచగా
మేఘుడు హరివిల్లు తోరణం కట్టగా
పొదరిల్లు పూలవానను కురిపించుచుండగా
మలయమారుతం వింజామరలు
వీచుచుండగా
జలపాతపు హోరు మృదంగ నాధం
వినిపించుచుండగా
మయూరములు ఆనంద నర్తనములు
చేయుచుండగా
కోయిలలు సుస్వాగత గీతికల
నాలపించుచుండగా
అవనిపైకి అరుదెంచిన ఉగాది కాంత
‘‘దుర్ముఖి’’ అనే నామముతో
మనలో దుర్లక్షణములను తొలగించి
మన అంతర్ముఖాలను పరిశుద్ధం గావించి
నవ్య ఉషస్సులను
కోటి శుభాలను
ప్రసాదించడానికి అవనిపైకి
అరుదెంచెను ఈ ఆమనికాంత!

- మోపూరు పెంచలనరసింహం
చరవాణి : 9346393501

రావమ్మా...
వసంత రాజ్యలక్ష్మి
రావమ్మా! ఓ దుర్ముఖి నామా!
కోయిల గీతాలాపనకు సామ్యంగా
నా కవితా సుమధుర గానంలో స్వాగతిస్తున్నా
కంప్యూటర్ మూషికానికి బందీలై
టెక్నాలజీ మాయాజాల మోహితులై
విలువలకు వలువలూడదీస్తున్న
‘‘జాతి యువత’’ను సంస్కరింపగ నడచిరావమ్మా..
మా తెలుగులోగిళ్లలో మృగ్యమయ్యే..
తెలుగు వెలుగులను, సత్‌సాంప్రదాయాలను వెంటబెట్టుకొని..
పచ్చటి ప్రకృతి చీరను చుట్టబెట్టుకొని రావమ్మా..
షడ్రుచుల సమ్మేళనంలాంటి జీవితంలోనికి
ఇంధ్రధనస్సు వర్ణాల ‘కుసుమాల మాల’
ధరించి రావమ్మా..
మా భవిష్యత్ పంచాంగాన్ని మా స్వార్థపు
పునాదులపై కాకుండా
మా శ్రమైక స్వేద సుగంధాల ‘స్వశక్తి’పై
నిర్మింపగ నడచి రావమ్మా
శిశిరాన్ని ఎదిరించి చిగురిచ్చే నీ కీర్తే మాకు స్ఫూర్తి
ప్రకృతి సుగంధ సోయగాలతో
సద్బుద్ధిని ప్రసాదింపగ..‘‘వసంత రాజ్యలక్ష్మివై’’
రావమ్మా..హారతులిద్దుము ఓ దుర్ముఖినామమా!

- అన్నం శివకృష్ణ
చరవాణి : 9490325112

కొత్త ఆశ
చేస్టలుడిగి చేతలు చేజారిపోయి
కలలు చెదిరి కళ్లు అలసిపోయి
ఆశల ఆకులురాలి ఆనందం ఆవిరైపోయి
జవాన్ని కోల్పోయి జీవనాన్ని మరచిపోయి
శిశిరం నిండిన వృక్షంలా
సిరా అయిపోయిన కలంలా
నీరింకిపోయిన నదిలా
నిర్లిప్తంగా నిలుచున్న నిజంలా
జడత్వంలో ఉన్న నా హృదిని
నీ పలుకులు పాటలా పలకరించాయి
రాగం మరచిన నా స్వరతంత్రులు మీటి
పల్లవి పాడించాయి
నాలో చేతనత్వాన్ని రగిలించాయి
రాలిన నా ఆశలకు ఆయువులూదాయి
ఎవరు నువ్వు!
నా వెన్నంటి ఉండే ప్రేరణవా!
నన్ను వీడిపోని నిద్దురవా!
నా కళ్లలో నిలిచి ఉండే నిజానివా!
నా కాళ్లకు తోడొచ్చిన ఉదయానివా!
నన్ను నడిపించే ఆశయానివా!
నాకామనినందించే ఉగాదివా!
నాకవితలిముడ్చుకొనే కాగితానివా!
ఎలా పోల్చుకోను నాలో ఉన్న నిన్ను
నీవున్న నేను
నిండు జాబిలిలోన వెనె్నల వెలుగును
నవ వసంతుడిని వలచి విరిసిన
లేలేత పరిమళాన్ని
అమావాస్య, శిశిరాలెన్ని వచ్చినా
నాలోని వెలుగు పరిమళం నన్ను వీడిపోదు
దుర్ముఖినామ ఉగాదిలా నువ్వొచ్చి వెళ్లిపోయినా
నేను వరించిన ప్రయత్నం నన్ను వీడిపోదు
పరాజయం నాపై దాడిచేసినా
నీవందించిన కొత్త ఆశ చచ్చిపోదు
మరలమరల నీవు రాకపోవు

పెండ్యాల గాయత్రి, కనిగిరి
చరవాణి : 8985314974

--
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 email: merupunlr@andhrabhoomi.net