విశాఖపట్నం

ఎవరిది పాపం? కథానిక : మెరుపు విశాఖపట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కుదురుగా కూర్చోలేవూ’’ మురిపెంగా విసుక్కొందామె.
‘‘పక్కనే నువ్వుంటే ఎలా కుదురుగా ఉండను?’’ నవ్వుతూ ప్రశ్నించాడు ఆనంద్.
‘‘బుద్ధి లేకపోతే సరి’’
‘‘నువ్వే నేర్పాలి మరి’’ కొంటెగా నవ్వాడు.
‘‘ఇలా అయితే ఇక నీ మాట వినను’’
‘‘నేవింటాలే’’ మళ్లీ నవ్వు ఆనంద్ నుండి.
సాయంత్రం సంధ్య చీకట్లు కమ్ముకొంటుండగా బయల్దేరింది అంబులెన్స్. దాంట్లో ఆమె, వాళ్ల అక్కయ్య సుగుణ ఉన్నారు. వెనక స్ట్రెచర్‌మీద అన్నవరం స్పృహ లేకుండా ఉన్నాడు.
అతడి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడంతో అర్జెంటుగా హాస్పటల్‌కు తీసుకురావాల్సి వస్తోంది. బయల్దేరేముందు ఫోన్ చేసిందామె. ఎక్కడికో ‘‘నువ్వు వస్తున్నావు కదూ’’ అంటూ.
‘‘అలాగే’’ అంది అట్నుండి ఆనంద్ గొంతు.
రెండు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆగింది అంబులెన్స్. మరొకర్ని ఎక్కించుకొని బయల్దేరింది.
సుగుణ అంబులెన్స్‌లో ముందు సీట్లో కూర్చుంది. ఆమె ఆనంద్ ఇద్దరూ అంబులెన్స్‌లో ఒక పక్క కూర్చున్నారు.
అన్నవరం స్ట్రెచర్‌పై స్పృహ లేకుండా ఉండి, కుదుపులు వస్తే కాస్త కదుల్తున్నాడు.
తోవ పొడవునా ఇద్దరి మాటలు, చేతులు ఏకాంతంలో వాళ్ళెలా గడిపేవారో గుర్తుచేస్తున్నట్టున్నాయి- ప్రస్తుతం అంబులెన్స్‌లో కూడా అలాగే!
ఆనంద్ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుందామె. ఆనంద్‌కు కూడా అదెంతో హాయి అన్పించింది.
స్ట్రెచర్‌పైనున్న అన్నవరానికి మెదడు తప్ప ఇతర అవయవాలేమీ సహకరించడం లేదు. అది వౌనంగా వాళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణల్ని రికార్డు చేసుకుంటోంది. అంతకు మించి మరేం చేయలేనట్టు.
ప్రయాణం ఒక గంట సాగింది. ఈసారి కూర్చున్నవాళ్లు పడుకోగా, పడుకున్నవాళ్లు కూర్చున్నట్టు సుగుణకు ముందున్న అద్దం ద్వారా కొద్దిగా కన్పించింది. ఆమెకు ముళ్లమీద కూర్చున్నట్టుంది. ఆమె కళ్లు అద్దంగుండా ప్రశ్నిస్తున్నాయి ‘‘ఇంటి దగ్గరే కాకుండా ఇక్కడ కూడానా?’’ అన్నట్టు. అంబులెన్స్‌కు వెనుక క్లోజ్‌డ్ డోర్స్ ఉంటాయి. (అసిస్టెన్స్) తోడు ఎవరూ ఉండరు గనక ఆనంద్, ఆమె చాలా ఫ్రీగా ఇంట్లో ఉన్నట్టు ఫీలవుతున్నారు అని అన్నవరం మెదడు గ్రహించింది.
అన్నవరంకు దాదాపు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అతడికి ఒక కొడుకు. వయసులో ఉన్నప్పుడు కాస్తంత అటూ ఇటూ తిరుగుళ్లూ భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పాతేశాయి.
కొడుకు మరణించి సంవత్సరం గడిచింది. ఆమె కన్నీళ్లు ఆగలేదు. అన్నవరం కూడా బాధపడ్డాడు. బహుశా బాధపడ్డట్టు నటించాడు అని కూడా బంధువుల్లో కొందరు లోలోపల అనుకున్నారు కూడా!
కొడుకు మరణం తర్వాత ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇన్నాళ్లూ తన స్వేచ్ఛకు భంగం అయిన ఆటంకాలు ఒకటొకటే తొలగిపోతున్నట్టు అన్పించింది. ఇంకెన్నాళ్లు తను మడిగట్టుకు కూర్చోవడం, ఆఫీసులో పనులబట్టి అవసరాలు, అవకాశాలు ముందుండి నడిపించగా ఆమె గాలికి ఊగిన గాలిపటంలా ఎటుపడితే అటే మొగ్గసాగింది.
సుగుణ, ఇంకొందరు ఇది సరైన దారి కాదని అన్నా, ఆమెకు ఆ మత్తులో అదేమీ తెలియలేదు. తాను కోల్పోయిన జీవితాన్ని ఇన్నాళ్ల తర్వాతైనా పొందడం తప్పేమీ కాదనుకుందామె.
అప్పటికి శరీరం సహకరించకున్నా ఆరోగ్యంగా ఫర్వాలేదనిపించుకున్న అన్నవరం దీన్ని భరించలేకపోయాడు. తన చేతగానితనాన్ని వెక్కిరిస్తున్నట్టున్న ఆమె ప్రవర్తన అతడిని బ్రతుకు గురించి ఆలోచించుకునేలా చేసింది.
ఫలితంగా పది రోజుల్లో మంచాన పడ్డాడు. కళ్ల రెప్పలు మూతపడ్డాయి. శరీర క్రియలు కొన్ని మెల్లగా నిలచిపోవడం మొదలుపెట్టాయి. దాని ఫలితమే అంబులెన్స్ ప్రయాణం.
వృత్తిపరంగా ఆమెకు పరిచయం ఉన్న సన్నిహితుల వద్ద ఆమె మాటలు మరోలా ఉన్నాయి. అతడు కొన్ని రోజులుగా అతనికి సన్నిహితంగా ఉన్నవారి దగ్గరికి చేరాడని, తను ఆపినా ఆగేరకం కాదని, అక్కడ జరిగిన ఘర్షణ లేదా సంభాషణల్లో దొర్లిన తీవ్రతవల్ల ఇలా అయిందని ఆమె చెప్పిన సమాచారం. ఆస్తిపరమైన చర్చల పరిణామంలో మిగిలిన నష్టం.
నడిచి వెళ్లగలిగిన, వెళ్లిన మనిషి కారులో పడుకుని తిరిగి ఇంటికి చేరాడు అనుకున్నారు బంధువులంతా! కేవలం పది రోజుల తేడా అంతే.
ఆస్పత్రి అంతా కోలాహలంగా ఉంది.
కాజువాల్టీలో అడ్మిట్ చేయించి ఇంటెన్సివ్ కేర్‌కు తరలించారు. ‘‘ఆపరేషన్ అత్యవసరంగా చేయవలసి ఉంటుంది’’- అన్న డాక్టర్లే ‘‘ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేం’’ అన్నారు. ఒకరిద్దరైతే ‘‘తీసుకువెళ్లిపోతే బావుంటుందేమో’’ అని పరోక్షంగా సూచించారు కూడా!
ఆ రాత్రి లాడ్జిలో విశ్రమించారు అందరూ. అన్నవరం తమ్ముడు గోవర్థనం ఆ రాత్రి కాపలా ఉన్నాడు ఆసుపత్రిలో. సుగుణా, ఆమె, ఆనంద్‌లు లాడ్జిలో విశ్రమించగా!
రాత్రి తెల్లవారింది- తప్పనిసరి అన్నట్టు.
అనేక మీమాంసల తర్వాత- మళ్లీ అన్నవరం అంబులెన్స్ సిద్ధమైంది. ఈసారి కూర్చునే ప్రదేశం మారింది. ప్రయాణికులూ మారిపోయారు. ముందులాగే అంబులెన్స్ ముగ్గుర్నే తోడు తెచ్చుకుంది.
డ్రైవర్ పక్క సీట్లో ఆమె, పక్కనే ఆనంద్, స్ట్రెచర్ పక్క మరో కుర్రాడు దూరపు చుట్టం కూర్చున్నారు. రాత్రి అంబులెన్స్ మెల్లగా చీకట్లోకి జారుకుంది. వాళ్లని మళ్లీ గమినంచడానికి భయం వేసిన లైటు వౌనంగా నిద్రపోయింది. అన్నవరంలాగే ఉలుకూ పలుకూ లేకుండా!
డ్రైవర్, మరొకరు మాత్రమే కూర్చునే సీట్లో మొత్తం ముగ్గురు సర్దుకున్నారు. వెనక అన్నవరానికి తోడుగా ఇంకొకరు అంతే! మిగిలినవాళ్లు బస్సులో వచ్చారు.
అంబులెన్స్ ఇంటికి చేరింది.
డబ్బులు తీసుకున్న డ్రైవర్ సురేష్‌కి అదే ఆఖరిసారి స్టీరింగ్ పట్టడం. మర్నాడే వాళ్ల మామయ్యతో తగవుపడి ‘‘జెరాక్స్’’ దుకాణం తెరిచాడు.
అన్నవరం మరో వారం రోజుల్లో చనిపోయాడు. అంతవరకూ బతికి ఉండడమే గొప్ప అనుకున్నారందరూ!
‘‘ఆమె కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో దైవానికే ఎరుక’’ అనుకున్నారంతా!
సమాజంలో కొన్ని జీవితాలు ఎట్నుండి మొదలై ఎలా అంతవుతాయో!
ఆనంద్ పెళ్లి చేసుకున్నాడు నాలుగేళ్ల తర్వాత. ఈ లోగా ఆస్తి మొత్తం పోగొట్టుకున్న ఆమె అనాథగా ఆసుపత్రిలో జాయినయ్యింది.
ఈ కథకు ముగింపు ఎక్కడో మరి!

- శ్రీనివాస భారతి
శ్రీకాకుళం.

సామరస్య సమాజం వేమన జ్ఞానమార్గం

మినీకథ

ఆధునిక కాలంలో జ్ఞాన సంపాదనకు ఎలక్ట్రానిక్, ప్రసార మాధ్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చదివి తెలుసుకొనే జ్ఞానం సగం మాత్రమే. మిగతా సగం జ్ఞానాన్ని స్వీయ ఆలోచనలతో, తర్కంతో కూడిన విశే్లషణతో మనిషి పొందగలడు. అటువంటి జ్ఞానం గురించి వేమన తన కవిత్వంలో విశదీకరించాడు.
‘‘తరువ తరువ బుట్టు తరుపున నవలంబు
తరువ తరువ బుట్టు దధిని ఘృతము
తలప తలప బుట్టు తనువున తత్వంబు’’
అగ్నిలో మానవుడు జీవించలేడు. అగ్నిలో వృక్షం ఉండజాలదు. కానీ వృక్షంలో అగ్ని బీజం దాగి ఉంటుంది. ఆ రీతిగానే ప్రపంచమనే చెట్టులో అగ్ని దాగి ఉండవచ్చును.
రాపిడి చేయడం ద్వారా రెండు అరణి కర్రల నుండి అగ్నిని జనింపచేయవచ్చు. చిలకగా చిలకగా పెరుగు నుండి వెన్న తీయవచ్చును- అలాగే మనిషి ఆలోచనల పరంపరలోంచి తత్వజ్ఞానం పుట్టుకొస్తుందని వేమన పద్యంలోని భావము.
వైరుధ్యాల ప్రపంచంలో కోర్కెల వలన ‘‘స్థిరత్వం’’ చెదిరిపోకుండా చూసుకోవాలి. జ్ఞాన సూర్యుణ్ణి కోర్కెలనే మేఘాలు కప్పివేయకుండా జ్ఞాన సౌందర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ‘‘మరుపు’’ అనే అడ్డంకి ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. గురువు కృప వలన అడ్డంకులన్నీ తొలగిపోతాయని ‘‘గురువే’’ భూమి మీద దైవాంశ సంభూతుడని వేమన తెలిపారు. మనిషిలోని దైవత్వం యొక్క పూర్ణ రూపం మానవ సంబంధాలలో దర్శించవచ్చునని వేమన పేర్కొన్నారు.
‘‘అమ్మ సుమీయాలనగా
నమ్మనగా నాలుసుమీ మాయిద్దరిన్
ఇమ్మయిలో పరమాత్ముని
నెమ్మదిలో తెలయదానె నేర్పరివేమా!
సంపూర్ణ వ్యక్తిత్వం కలిగినవారే సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలరు. మనిషి దినచర్యల క్రమంలో అసందర్భ ప్రేలాపనలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొంటుంటాడు. ఇటువంటి మానవుల ధోరణిని గురించి వేమన తన పద్యాలలో విశదపరిచారు.
‘‘మాట ఎడగకున్న మంత్రంబు దొరకదు
మంత్ర ముడగకున్న మనసు నిలవదు
మనసు నిల్వకున్న మరి ముక్తి లేదయా’’
మాటల మీద నియంత్రణ లేకపోతే జ్ఞానం (మంత్రం) లభించదు. జ్ఞానం లభించకపోతే మనసు నియంత్రణ ఉండదు. మనసు నియంత్రణలో లేకపోతే బేటిట్యూడ్ లేద ముక్తి పొందలేరని తెలిపారు. ఆధునిక యుగంలోని మానవులు మనసు నియంత్రణ చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నవారికి వేమన జ్ఞాన మార్గంలో పరిష్కారాలు కనిపిస్తాయి.
మానవ సంబంధాలలో చేయకూడని పనులను కూడా వేమన వివరంగా తెలిపారు. స్ర్తి పొందుకు తహతహలాడే మానవ నైజాన్ని మేమఘలు, యోగులు వదులుకోవాలని వేమన ప్రబోధించారు. శృంగార కాంత మీద దృష్టిని వదలి, జ్ఞానకాంత మీదికి దృష్టిని మనిషి మరల్చాలని సూచించారు-
‘‘కుండలి యోగము తెలిసిన
బండాలపు యోగికేల బాలకి పొందుల్
దండిగ నీ తనువందే
మెండగు నొకముక్తికాంత మెలగుర వేమా’’
అని అంటారు వేమనగారు.
భౌతిక జీవన సంబంధాలలో, వస్తు వినియోగం తారతమ్యాలను, వివక్షతను వేమన ఖండించిన తీరు. ఒక బావ విప్లవాన్ని తీసుకొచ్చింది-
‘‘అన్నమునకు అంటుయైన నాత్మకునంటు
యాత్మను పెనుగొన్న అన్నమంటు
ఆత్మ శుద్దియన్న మన్నశుద్దియునాత్మ
మిన్ను మన్ను మాడ్కి మెరము వేమ’’
అన్నానికి అంటు సాంప్రదాయాన్ని వర్తింపచేసి అది మనసులకు కూడా వర్తిస్తుందని, అసలు అన్నం, మనసు పరస్పరం శుద్ధి సాధనాలని- ఆకాశం, భూమికి ఉన్న సంబంధం లాంటిదని, దానిని వక్రీకరించరాదని వేమనలోని హేతువాది ఒక గొప్ప శాసనాన్ని ఏనాడో రచించి మానవాళికి అందించారు.
‘‘వేమన చెప్పిన వేదము
వేమనకే తెలియుగాని వినుడెరుగ రొరుల్
వేమన నెరిగినవారికి
వేమరు నీకాక్షరంబు విదితము వేమా!’’
సూర్యుడు తన కాంతితో అంతరిక్షంలోని బ్రహ్మాండమైన గోళాలను స్పర్శించి చైతన్యపరుస్తున్నట్లుగా, వేమన సరళమైన తన పద్య భావనలతో మానవుల యొక్క బ్రహ్మాండమైన సమస్యలకు పరిష్కారాలందించి మనసులను చైతన్యపరుస్తారు.
అనేక మతాల, వర్ణాల ప్రజలు కలిసి జీవించే భారతదేశ సమాజంలో సామరస్య జీవన ధర్మాన్ని అందించిన అశోకునిలా, వేమన అరమరికలు లేని సామరస్య సమాజ ధర్మాన్ని ఎలా ఏర్పరచుకోవాలో విశదంగా తన పద్యాల ద్వారా తెలిపారు.

-బడబాగ్ని శంకరరాజు,
శ్రీకాకుళం,
సెల్ : 9440508511.

కథల వర్ణమాల -
బాలల ‘అక్షరమాల

బాల సాహిత్యం అంటేనే ఒక అపూర్వమైన సృజనాశక్తికి గీటురాయి. గొప్ప ఊహాశక్తి అక్షర రూపం దాలుస్తుంది. బొమ్మలతో కూడిన పిల్లల కథలంటే చెవి కోసుకుంటారు బాలలు. అందులోనూ ‘అ’ నుండి ‘ఱ’ దాకా కల అక్షరాల కూర్పుతో ఒక చోట కథలను కుప్పగా పొయ్యడం చాలా అరుదైన ప్రయోగానికి మచ్చుతునక. ఈ ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు కథా రచయిత తల్లాప్రగడ రవికుమార్. ఒకప్పుడు వ్యవహారంలో ఉన్న నీతి కథలతో పాటు, తనదైన సొంత శైలిలో అక్షరీకరించి గ్రంథస్థం చేసిన తీరు మనల్ని ముచ్చటగొలుపుతుంది. ‘అక్షరమాల’ పేరుతో రచించిన ఈ తెలుగు కథలు కొనే్నళ్ళ క్రితం ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో ధారావాహికంగా వచ్చాయి. పాఠకాదరణ పొందాయి. బిఎస్సీ పట్ట్భద్రులైన ఈ రచయిత గతంలో ‘బాలభాను’ అనే బాలల పత్రికను నడిపారు. చిన్నారుల కోసం పలు కథలు, నాటికలు, గేయాలు రాసిన దిట్ట. పంచతంత్రం, నీతి చంద్రిక వంటి కథల కోవకి చెందిన సృజనాత్మక శైలిని తనదైన బాణీలో అందిపుచ్చుకున్నారు. ఈ అపూర్వ ప్రయత్నం వలన బాలల్లో ఆత్మవిశ్వాసం, నిబద్ధత, నిజాయితీ, సామాజిక చైతన్యం, పరోపకార దృష్టి, సత్ప్రవర్తన, వివేకం, వ్యక్తిత్వ వికాసం వంటి లక్షణాలు అప్రయత్నంగా చోటుచేసుకుంటాయి. ఈ స్ఫూర్తిని అందించడంలో విజయవంతమయ్యారు రవికుమార్. ఇందులో 49 కథలు దర్శనమిస్తాయి. బాల ప్రపంచానికి పఠనాసక్తి కలిగించి, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను, వ్యవహారికతను, నుడికారాలను, పలుకుబడులను అలవర్చి, కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టించడంలో తనదైన పాత్ర పోషిస్తుంది.
పిచ్చుకల గూడుకీ- గోపి లెక్కలకి ముడిపెట్టి చెప్పి జ్ఞానోదయాన్ని కలిగించిన మాస్టారు కథ ‘ఇల్లు’. శివపార్వతుల సంభాషణా చమత్కృతికి దర్పణం పట్టే కథ ‘శివుడు’. శ్రీరాముడు-ఉడుతల మధ్య దాగిన ప్రేమ, భక్తికి నిలువెత్తు సంకేతం ‘ఉడుత’ కథ. దేవకి అష్టమ గర్భ సంతానం బాలకృష్ణుడిని కంసుడు బారి నుండి రక్షించడానికి యశోద- నందుడుల నివాసప్రాంతం రేపల్లెకు వసుదేవుడు తీసుకొచ్చిన కథాకథనమే ‘ఊయల’ కథ. ఈ కథల్లో ఆధ్యాత్మిక స్పృహతో పాటు కనువిప్పు కలిగించే దూరదృష్టి వ్యక్తమవుతుంది. ‘రుషి’ కథ చాలా విలక్షణమైనది.
అపకారికి సైతం ఉపకారం చేసే పరోపకార బుద్ధిని అక్షరబద్ధం చేస్తారు ‘ఏనుగు’ కథలో. ‘ఐకమత్యం’ కథలో పులి జిత్తులమారితనాన్ని యుక్తితో తిప్పికొట్టిన నాలుగు ఎద్దుల ఇతివృత్త నేపథ్యమిది. కథ చిన్నదైనా ఏకత్వం విలువను విడమర్చి చెబుతుందిది. ఒంటె కోసం బాటసారి- వర్తకుడు మధ్య జరిగిన వివాదాన్ని గుడ్డితనం వంకతో కనిపెట్టి నిజమైన తీర్పు ఇచ్చే ఓ న్యాయాధికారి కథ ‘ఒంటె’. ఓర్పు విలువను చాటిచెప్పే కథ ‘ఓర్పు’ కథ. ఈ రెండూ కొంచెం ఆలోచింపజేస్తాయి. ఇలాంటివే మరికొన్ని కథలు తమ ప్రత్యేకతను చాటిచెబుతాయి.
వీటిలో ఔషదం, అందలము, ప్రాతఃకాలము, కమలం, గంథము, రత్నము, లక్ష్యము, వరము, షావుకారు, సరస్సు, హక్కు, కళ, క్షమ, వెఱ్ఱి-మఱ్ఱి కథలు మెదడుకి ఆలోచనతో పదునుపెడతాయి. పలు సామాజిక కోణాలను విభిన్న పార్శ్యాల్లోంచి తట్టిలేపి మేల్కొలుపుతాయి. మేదస్సుకి, వివేచనా శక్తికి అద్దంపట్టే ఈ కథల్లో వైవిధ్యంతో పాటు విలక్షణత ఉట్టిపడుతుంది. లోచూపుతో సునిశిత పరిశీలనా శక్తికి కథా వస్తువుల్ని అనువుగా మలిచి పాక్షిక సందేశాలను అందిస్తాయి. ‘గోరంతలో కొండంత’లను చూపెట్టి లోక నైజ ప్రవృత్తిని అక్షరమాల రూపంలో పరుస్తాయి. ఈ ప్రత్యేకతలు చాలు. ఈ కథల సారాంశాన్ని ఔపోసన పట్టి చూపించడానికి నేటి తరం చిన్నారుల కోసం వీటి ఆవశ్యకతను కథాపరంగా నొక్కి చెప్పడానికి. కాబట్టే ఈ కథలకు ఒక ప్రత్యేక స్థానం సాహితీ లోకంలో ఏర్పడింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే, ఘనసారం కథ మరొక ఎత్తు. దేవుడి పూజ కోసం సర్వం సిద్ధం చేసి, పూజారి రాక ఆలస్యమైన వేళ తమ గొప్పలను ఒప్పులుగా అహంకార భావనతో విర్రవీగే సకల పూజాద్రవ్యాల సహజ నైజాన్ని ప్రతిబింబిస్తుంది ఈ కథ. చివరిలో ఘనసారం (కర్పూరం) పూజారి రాక ఆలస్యంతో పూజకు జరిగే విఘ్నాన్ని ప్రకటించడంతో పూజా ద్రవ్యాలకు గర్వభంగం జరిగి అసలు నిజాన్ని గ్రహించే స్థితికి చేరుకుంటాయి. అన్నీ సమానమనే అంతర్లీన భావనను కర్పూర పదార్థం చేత చెప్పించిన రాములవారి పాత్రను సృష్టిస్తారు రచయిత. రవికుమార్‌గారి లోతైన పరిశీలనాదృష్టికి, కథాకథన రహస్యానికి మూల సూత్రం, చిట్కాలు ఇవే. ఈ లక్షణాలను ఒడిసిపట్టుకున్నాడు కనుకే కథకుడయ్యాడు.
సొంత బాణీలో తనదైన ముద్ర వేస్తూ బాల సాహిత్యాన్ని కథల రూపంలో అందించిన రవికుమార్ కృషిని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే! చక్కని ముఖచిత్రం పిల్లల ‘అక్షరమాల’ను అడుగడుగునా తడుముతూ, పాఠకుల మనసులను ఊరిస్తూ అలరింపజేస్తుంది.

- మానాపురం రాజా చంద్రశేఖర్
సెల్ : 9440593910.

మనోగీతికలు

ధరాఘాతం
ఆ॥ ధరల తల్లి నీకు దండాలు దండాలు
నింగి వదలి నీవు నేల దిగుము
వెయ్యి నోటు నేడు వెలవెల పోయెను
డబ్బు విలువ తరిగి డాబు పెరిగె
ఆ॥ కందిపప్పు నేడు కనకంబు సమమాయె
మినుము, పెసర, శనగ మింటనిలిచె
సంచి డబ్బులిచ్చి సంగోరు సరుకులు
కొనెడి కాలమొచ్చి కొక్కొరొక్కొ
ఆ॥ కాలి ఇతిమారె కష్టవౌ పండింప
భూములమ్మె రైతు బువ్వకొరకు
పొలములున్నచోట- కొలరాళ్ళు పాతిరి
పాటు కొరకు రైతు పాట్లు పడెను
ఆ॥ ఉన్న కొద్దీ నేల మిన్నగా పండింది
అమ్మజూప బోవ అసలు రాక
పంట పండెకాని పందికొక్కులు మేసె
పైన కింద పడ్డ ఫలము లేదు
ఆ॥ వలసబాట పట్టె వదులుచు సేద్యంబు
కూలిపనికి రైతు- కుదురుకొనిన
తిండి లేక జాతి- ఎండిపోవుట కద్దు
అన్నదాతనిపుడు- నాదుకొనుడు
ఆ॥ రైతు నడ్డివిరిచి రక్షణ నీయక
ఆధునికత పేర అణచివేయ
దైవమంటి రైతు దైన్యవౌపోతుంటె
దిక్కులేనిదౌను దేశమిపుడు
ఆ॥ రైతు చల్లగున్న- రాజ్యమే రాజ్యమ్ము
కడుపు కొట్టరాదు కర్షకునకు
జారనీయరాదు జాతి వెనె్నముకను
రండి నేతలారా రైతు కొరకు

- చావలి శేషాద్రి
సోమయాజులు,
పాచిపెంట.
మొబైల్ : 9032496575.

ఆత్మీయాంజలి
అజరామరమైనది మన తెలుగు భాష
ఆంధ్రుల ఆశల పెన్నిధి అమ్మ భాష
నన్నయ హృదయపు స్పందన తెలుగు భాష
తిక్కన కవితకు ప్రాణం మన అమ్మ భాష
ఎర్రన వాక్కుకు నాదం ఈ తెలుగు భాష
పోతన ఆర్ద్రత రూపం మన అమ్మ భాష
భాషకు ప్రాణం పోసిన మహా కవులెందరో
అందరికీ అర్పిద్దాం ఆత్మీయ అంజలి
అజరామరమైనదీ...
శ్రీనాథుని నైషథ కవితకు
బాసట ఈ తెలుగు భాష
బద్దెన శతకపు నీతికి ఆధారం
మన అమ్మ భాష
జాషువ వేదన స్వరమునకు
రాగం ఈ తెలుగు భాష
విశ్వనాథ రామాయణ
పదమంజరి మన అమ్మ భాష
భాషకు వనె్నలుదిద్దిన మహానుభావులెందరో
అందరికీ అర్పిద్దాం ఆత్మీయ అంజలి
అజరామరమైనదీ...
చిలకమర్తి, కందుకూరి
రచనా దీప్తి ఈ తెలుగు భాష
రాయప్రోలు, గురజాడల
చుక్కాని మన అమ్మ భాష
శ్రీశ్రీ కవితా రూపపు
ఆకృతి ఈ తెలుగు భాష
దాశరథి, సినారెల
పద భంగిమ మన అమ్మ భాష
భాషకు తిలకం దిద్దిన
మహామహులెందరో
అందరికీ అర్పిద్దాం ఆత్మీయ అంజలి
అజరామరమైనదీ మన తెలుగు భాష

- మండా శ్రీధర్,
శ్రీకాకుళం.
సెల్ : 9493309030.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.