నెల్లూరు

ఎవరు దున్నపోతు? (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుండపోతగా కురుస్తున్న వర్షంలో గొడుగు వేసుకుని మరీ వచ్చిన శేషగిరిని చూసి నేనాశ్చర్యపోయాను.
‘‘ఇంత వర్షంలో వచ్చావేంట్రా? రారా!’’ అంటూ ఆహ్వానించాను, ఉబుసుపోక తిరగేస్తున్న ‘పోసుకోట పిట్ట’ తెలుగువీక్లీని పక్కన పడేసి..
శేషగిరి గొడుగు గుమ్మానికి ఆనించి, చెప్పులు విడిచి లోనికి ప్రవేశించాడు.
చేతిలో గొడుగున్నా కురుస్తున్న వర్షం సామాన్యమైందా? మనిషి సగానికి పైగా తడిసిపోయి ఉన్నాడు. చలికి కొద్దిగా వణుకుతూ ఉన్నాడు. ‘ఏదో అర్జంటు పనే ఉండుంటుంది.. లేకపోతే ఇంత వర్షంలో ఎందుకొస్తాడు? అని మనసులో అనుకుంటూ- ‘‘రారా! వచ్చి అలా కూర్చో! నీకు మర్యాదలేంటి?’’ అన్నాను కుర్చీ చూపిస్తూ..
వాడొచ్చి కూర్చున్నాక - ‘‘బాగా తడిసిపోయినట్టున్నావ్.. తుడుచుకో..అంటూ దండెం మీద వేళ్లాడుతున్న ఓ టవల్ని తీసుకొచ్చి అందించాను.
‘‘తల తడవలేదులే!’’ అంటూ ముఖాన్నీ, చేతుల్నీ తుడుచుకుని టవల్ని కూర్చీ హ్యాండిల్ మీద వేసి.. ‘‘చెల్లారుూ పిల్లలూ లేరా?’’ అనడిగాడు గదంతా కలియజూస్తూ..
పిల్లలకి పదిరోజులు సెలవులిచ్చారుగా పండక్కి! వాళ్లని తీసుకుని బుచ్చిరెడ్డిపాళెం వెళ్లింది పుట్టింటికి. అద్సరే - ఇంత వర్షంలో వచ్చావేంటి? అన్నాను.
‘‘చెప్తాగానీ, ముందా వెధవని కసిదీరా ఒకసారి తిట్టనీ..’’అన్నాడు శేషగిరి.
‘‘ఏ వెధవని?’’ అడిగానే్నను టక్కున.
‘‘మన సోంబాబు గాడిని..’’ చెప్పాడు శేషగిరి పటాపటా పళ్లు నూరుతూ.
నేనూ, శేషగిరీ, సోంబాబు ఒక ఆఫీసులో గత ఏడేళ్లుగా పనిచేస్తున్నాం. అంచేత మా ముగ్గురి మధ్యా ‘ఒరేయ్ అంటే ఒరేయ్’ అనుకునేంత చనువుంది.
‘‘సోంబాబు గాడినా?’’ నేను రవ్వంత ఆశ్చర్యంగా అన్నాను. నిన్న సాయంత్రం ఆఫీసయ్యేదాకా ముగ్గురం కలిసే వున్నాం గదరా? ఇంతలోనే ఏమయ్యిందని వాడి మీదిలా కారాలూ, మిరియాలు నూరుతున్నావ్?’’
‘‘చెప్తాగానీ, ముందీ విషయం చెప్పు? నేను మన సోంబాబు గాడికి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సహాయం చేశాను. అవునా, కాదా?’’ శేషగిరి కళ్లెగరేస్తూ అడిగాడు.
‘‘నువ్వసలే పరోపకారి పాపయ్యవయ్యే! సోంబాబుకనే ఏముందీ, అందరికీ చేతనైన సహాయం చేస్తూనే ఉంటావ్‌గా! ఆ మాటకొస్తే అనేకసార్లు నాక్కూడా అనేక సహాయ సహాయాలు చేశావ్..’’ అన్నానే్నను మనస్ఫూర్తిగానే.
శేషగిరి మా ఆఫీసులో అందరికన్నా ఫాస్ట్‌వర్కరు. అంచేత తన పని త్వరత్వరగా పూర్తి చేసుకుని, దాదాపు ప్రతిరోజూ ఎవరో ఒకరికి వాళ్ల పనిలో సహాయపడుతూనే ఉంటాడు. ఎవరికి వర్క్ లోడ్, ఎక్కువ ఉంటే వాళ్లని అందుకుంటూ ఉంటాడు’’
‘‘మరి అలాంటి నా విషయంలో వాడెలా ప్రవర్తించాలి?’’
విషయమేంటో చెప్పకుండా శేషగిరి అలా అడుగుతుంటే, నాకేం చెప్పాలో తోచలేదు ఓ క్షణం.
‘‘ఎలా ప్రవర్తించాడు? అసలు నువ్ చెబుతోంది దేని గురించి?’’ అనడిగాను ఆ క్షణం తర్వాత.
‘‘చెప్తా.. చెప్తా.. ముందు నాకొక విషయం చెప్పు? నేను నీ నుండి ఏదైనా సహాయం కోరాననుకో.. నువ్వేం చేస్తావ్?’’
‘‘చెయ్యగలిగిందైతే తప్పకుండా చేస్తాను...’’
‘‘ఒకవేళ చెయ్యలేకపోతే..సారీరా అంటావ్.. అంతేతప్ప, నాకేసి క్రూరంగానూ, అసహ్యంగానూ చూడవు కదా?!
‘‘అదేంట్రా.. అలా అంటావ్?’’ నేనొకింత అయోమయంగా అన్నాను... ‘‘ఆ సోంబాబు గాడు ఎంత హర్ట్ చేసుండకపోతే వీడింత బాధపడతాడు?’’ అనుకుంటూ.
‘‘అడిగిన సహాయం చెయ్యకపోగా, వాడు నాకేసి అలాగే చూశాడు మరి.. అందుకే అనాల్సొచ్చింది’’ అన్నాడు శేషగిరి బాధగా.
‘‘్ఛ!?’’ అన్నానే్ననే నాలోని అయోమయాన్ని ఆశ్చర్యంగా కన్‌వర్ట్ చేస్తూ..
శేషగిరి లాంటి మంచివాడి విషయంలో ఆ సోంబాబుగాడలా ప్రవర్తించడం ఘోరమే అనిపించింది నాకు.
‘‘మరలాంటి వెధవని మనిషనుకోవాలా, పశువనుకోవాలా?’’ అన్నాడు శేషగిరి - తల విదిలిస్తూ.
విషయమేమిటో పూర్తిగా తెలియకపోయినా ‘‘దున్నపోతనుకోవాలి’’ అనేశానే్నను- శేషగిరిని సంతోషపెట్టడం కోసం.
‘‘నేనూ అదే అన్నాన్రా! పోరా దున్నపోతా! నువ్ సహాయం చెయ్యకపోతే ఇంకెవరూ చెయ్యరనుకుంటున్నావా? అసలు నిన్నడగడం నాదే బుద్ధి తక్కువ! అని వాడి మొహం మీదే నాలుగు దులిపేసి- ఇంత వానలో నేరుగా ఇక్కడికొచ్చేశాను’’ అన్నాడు శేషగిరి.
‘‘మంచి పనే్జశావ్...అసలింతకీ విషయమేంటి’’ ఈ నాన్పుడు ఏంటో నాకర్థం కాలా. ‘టి.వి. సీరియల్స్‌లో కూడా ఇంతగా సాగదీయరే- అని మనసులో’ అనుకున్నాను.
‘‘ఏంలేదురా! నీకు చెప్పకేం? నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికెళ్లే సరికి మా ఇల్లంతా బందరు నుంచి వచ్చిన చుట్టాల్తో కిటకిటలాడిపోతూ కనిపించింది. ఒకరూ, ఇద్దరూ కాదు... కట్టగట్టుకుని ఒకేసారి ఎనిమిది మంది దిగబడ్డారు. అంతా దగ్గరివాళ్లే...నా భార్య తరపున. ‘ఆలి తరపువారు ఆత్మబంధువులు’ అని ఊరకే అన్నారా... మనకున్నా లేకపోయినా వాళ్లకి రాచమర్యాదలు చెయ్యక తప్పదుగదా... అతిథి దేవుళ్లు గదా! అందుకే పొద్దునే్న సోంబాబు గాడి దగ్గరికెళ్లి ఓ మూడువేలుంటే సర్దు ఫస్ట్‌కిచ్చేస్తాననడిగాను...అంతే...చెప్పాగా, వాడెలా ప్రవర్తించాడో...నువ్వన్నట్టు నిజంగా వాడు దున్నపోతేరా! కనీసం ఇంగితం లేదు వాడికి. ఛ! లేకపోతే, నాలాంటి వాడు అప్పడిగితే. తల తాకట్టుపెట్టయినా సరే, తెచ్చివ్వాల్సిందిపోయి, నీకే కాదు- నాకూ నెలాఖరేనమ్మా- అదీ ఇదీ గుడ్డూ, గుడుసూ అని కారుకూతలు కూస్తాడా? అందుకే వాడిని ‘్ఛ’కొట్టి నీ దగ్గరికి పరుగెత్తుకొచ్చా...చూస్తున్నావ్‌గా ఎంతవానలో వచ్చానో... మూడు వేలుంటే సర్దరా ఫస్ట్‌కిచ్చేస్తా...’అన్నాడు శేషగిరి అభ్యర్థనగా.
నాకు గుండెల్లో బాంబు పేలినట్టు అయ్యింది.
నా దగ్గర జస్ట్ మూడువేలే ఉన్నాయ్.
అది నేను కట్టాల్సిన ఓ చీటీ బాపతు సొమ్ము... రేపు కాదు... ఎల్లుండే కట్టాలి... మా శ్రీమతి మరీ మరీ చెప్పి వెళ్లింది...‘ఏవండోయ్ సుబ్బరత్నమ్మ గారి చీటీ డబ్బులు నా బీరువాలో గాజుల బాక్స్‌లో పెడుతున్నా... మొదలే మీది మతిమరుపు యవ్వారం. మీ చేతికిస్తే ఏడ తగలబెడతారో... వింటున్నారా? ఇక్కడ దాచాను. సమయానికి కట్టండి... మాటొస్తుంది...’ అంటూ సవాలక్ష ఏకరువుపెట్టి వెళ్లింది.
ఇప్పుడా సొమ్ము శేషగిరికి ఇచ్చేస్తే, నేను మళ్లీ అప్పు కోసం ఎక్కడకయినా వెళ్లాల్సొస్తుంది. నా పెళ్లాం చేతుల్లో చెప్పుదెబ్బలు తినాల్సొస్తుంది. ఏం చెయ్యను?
అయినప్పటికీ ‘దున్నపోతుని’ కావడం ఇష్టంలేక ‘దాందేముందిరా... ఇస్తానుండు... ఇబ్బందులు ఎవడికి రావు’...అంటూ నేను లేచి లోనికెళ్లాను- బీరువాలోంచి డబ్బు తెచ్చి అతనికి ఇవ్వడం కోసం.
నేనిచ్చిన డబ్బు అందుకున్నాక- ‘మెనీమెనీ థ్యాంక్స్‌రా! అన్నట్టు నేనివ్వాళ ఆఫీసుకి రావట్లేదు. ఆ సంగతి మన మేనేజర్కి చెప్పు. లీవ్‌లెటర్ రేపొచ్చినపుడు సబ్‌మిట్ చేస్తానని చెప్పు... వెళ్లొస్తాన్రా! సమయానికి నన్నాదుకున్నందుకు నీ రుణం ఈ జన్మలోనే ఫస్ట్‌కి తప్పకుండా తీర్చేస్తాను...’ అని నవ్వేసి, గుమ్మం దగ్గరికెళ్లి చెప్పులేసుకుని తన గొడుగు తీసుకుని, ఆ వర్షంలోనే వెళ్లిపోయాడు శేషగిరి - మరోసారినవ్వి!
కుండపోతగా వర్షం కురుస్తున్నంత మాత్రాన ఆఫీసెగ్గొడితే ఊరుకోరు గదా! అదీగాక నా సియల్స్ అన్నీ అయిపోయాయ్. అంచేత ఓ అరగంట తర్వాత నేను కూడా ఓ గొడుగేసుకుని, ఆ వర్షంలోనే ఆఫీసుకి బయలేర్దాను.
నేను వెళ్లేటప్పటికే సోంబాబు గాడు ఆఫీసులో ఉన్నాడు. వాడిని చూడగానే నాకు శేషగిరి వ్యవహారం గుర్తుకొచ్చింది. ‘‘పొద్దునే్న గిరిగాడు మీ ఇంటికి అప్పుకోసం వచ్చాడటగా?’’ అని అడిగేశాను.
‘‘గిరిగాడు.. పొద్దునే్న మా ఇంటికి అప్పుకోసం వచ్చాడా?’’ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు సోంబాబు.
‘‘ ఏంట్రా నువ్ అంటోంది? నిన్న సాయంత్రం ఆఫీసయ్యాక మనం ముగ్గురం బస్టాప్ దగ్గర విడిపోయామా, అంతే! ఆ తర్వాత నేను మళ్లీ వాడి మొహం చూసిందే లేదు..’’
వాడు అబద్ధం చెప్పడం లేదని, వాడి ఫేసే చెబుతుంటే - ఆశ్చర్యంతో నోరు తెరవడం ఈసారి నావంతయ్యింది. ఇంతకీ దున్నపోతు ఎవరు?
గిరిగాడు ఎంత గేమ్ ఆడాడు?!

- కోలపల్లి ఈశ్వర్
చరవాణి : 8008057571

స్పందన

ఎక్కడమ్మా.. చందమామ అదుర్స్
గత వారం మెరుపులో సీనియర్ రచయిత పిడుగు పాపిరెడ్డి గారి కలం నుంచి చాలాకాలం తర్వాత వికసించిన కథ ఎక్కడమ్మా చందమామ. ఈ కథలో ప్రతి ఒక్కరిని సున్నితంగా విమర్శించిన తీరు బాగుంది. నిజంగా ప్రస్తుతం సమాజం అలానే వుంది. ఒక్కడు కూడా నిజమైన చందమామలా కనిపించడు. అలాంటి గొప్పలక్షణాలున్నా చందమామ కోసం చివరి వరకు వెతికి ఇక చందమామ కనిపించకపోగా, బాగా ఆలోచించి తన తల్లిదండ్రులను మించిన చందమామ లేడనుకుని, తన తల్లి కంటే గొప్ప చందమామ ఎవరున్నారు అని తెలుసుకోవడం.. ఇలాంటి సంగతుల సమాహారంగా సాగిన కథ మమ్మల్ని చైతన్యవంతుల్ని చేసింది.
- రావి దుర్గ్భావాని, అడ్వకేట్, దర్శి
- వై.్భస్కరరావు, జూ.అసిస్టెంట్, వెంకటగిరి
- పి.వి.రాఘవచార్యులు, నెల్లూరు

కనువిప్పు కలిగించిన
అమ్మా..క్షమించు
అమ్మా.. క్షమించు అంటూ శింగరాజు శ్రీనివాసరావు గారు రాసిన సందేశాత్మక కవిత మమ్మల్ని ఆలోచింపచేసింది. పిల్లల్ని ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు, పిల్లల మనసులో ఎలా గాయపడుతున్నాయో వివరించిన విధం బాగుంది. అమ్మా..క్షమించు అంటూ బిడ్డ వేదనను వర్ణించిన ప్రతి పదం తల్లిదండ్రులు ఆలోచించేలా సాగింది. కార్పొరేట్ స్కూళ్లంటూ పిల్లల్ని బాల్యానికి దూరం చేసి వారిపై గుదిబండలు మోపే తల్లిదండ్రులకు ఈ కవిత కనువిప్పు కావాలి.
- దయాన శేషగిరి, నాయుడుపేట
- గాలి వేణుగోపాల్, ఆత్మకూరు
- దివ్యశ్రీ, నెల్లూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

ముదిమి
బేగంపేట స్టేషను బెంచీల మీద
బేఫికరుగా బాతాఖాని కొడుతూండే
గోపుర వృద ధశాంతి కపోతాలను చూస్తూ,
తనదాక వస్తే త్వమేవాహం అనుకున్నాను.
పరీక్షాపత్రాల మూల్యాంకనంలో
బోనస్ మార్కులిచ్చిన నాకు
ముదిమిలో బోనస్ వత్సరాలంటే
బోధపడిందిప్పుడు.
తారు దారి మీద జోరుగా పోతున్న కుర్రకారు
కారుకడ్డం తగిలితే తాతా అయిపోయావనే అత్యుత్సాహం
అరుపులతో అర్థమైంది తాతనయ్యానని.
క్షణంలో చటుక్కుమని ఆగిన వాహనం నుంచి
‘సారీ..సార్’ అన్న సంస్కార శబ్దాన్ని విన్నాను.
ప్రశాంత సాయం సంధ్యా సమయ
వాహ్యాళిని ఆనందించానప్పుడు.
ప్రస్తుత నా జీవన మలిసంధ్యా సమయం అంటే
అవగాహన అయిందిప్పుడు!
పదవీ విరమణంటే మృత్యుద్వార
ప్రవేశమనుకున్నాడొక విరాగి
పదవీ విరమణ వయసుకేకాని మనసుకు
కాదన్నాడొక అలుపెరగని ఔత్సాహి!
మందులతో బ్రతుకుతున్నానన్నాడొకరు
మందుసీసా శరీర నుదుటిపై తయారి తేది
తనువు తరలే తేది
ముద్రింపబడిందన్నాడొక మహాయోగి
ఫుట్‌బోర్డు పట్టుకొని రన్నింగ్ బస్సెక్కేటప్పుడు
పట్టుతప్పి పడిపోయి ఫూలైనప్పుడు
వృద్ధాప్యపు ప్రథమ పిలుపు విన్నా
పెన్షనర్స్ ప్యారడైజ్‌లో ప్రశాంత జీవనం
నాదన్నాడొక నాన్న
మరమ్మత్తుకొచ్చింది ఫోననుకొని మొబైల్
షాపుకెళ్లిన ఒక నాన్నకు
‘మంచిగుంది ఫోను నీకే ఫోను రాటంలే’దంటే నిరాశ.
ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదని
చిచ్చరపిడుగుల్లాంటి సిసింద్రీలకు చాక్లెట్లను
ఇచ్చుకుంటూ సంతోషపడే తాతగారి సంతృప్తి..
పట్టించుకోని పుత్రుల ఆర్థిక పరిపుష్టితో
పుట్టెడు ఆనందం పొందే తండ్రుల సంతుష్టి
సన్మానాల, సత్కారాల సంతృప్తికర
జీవనయానం చేస్తున్న సీనియర్ సిటిజన్లు
అవమానాలు, ఛీత్కారాల చరమాంకంలో
సన్‌స్ట్రోక్ తగిలిన
తల్లితండ్రులను వృద్ధాశ్రమాల్లోకి
తరలించిన తనయ నెటిజన్లు
తనువును వదలి తరలే వేళ
తనయుడు తన దరికి రానప్పుడు
తల్లడిల్లే తండ్రి ఆవేదనకన్నాను -
అనుకున్నా మదిలో
సంతానాన్ని సంపాదన యంత్రాలుగా కాక
సంస్కారవంత అనుశాసనైక అనుబంధాల
విలువలతో మలచిన నాడు ముదిమిలో
ముదమందుతారు అదే ముదావహం!

- వేదం సూర్యప్రకాశం, చరవాణి : 9866142006

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్-5) సందర్భంగా

పర్యావరణ ప్రగతి
అందమైన ప్రపంచం
అద్భుతమైన భూగోళం
సృష్టిలో వెలసిన చిత్రవిచిత్రాలు
ప్రకృతి పంచిత పంచభూతాలు
పచ్చని పర్యావరణ వరాలు
అబ్బురపరచే అందచందాలు
మానవ మనుగడకు ఆధారాలు
ప్రాణికోటికి జీవనాధారాలు

కలియుగంలో కృత్రిమ యుగం
పరుగులు తీసే పోటీ ప్రపంచం
అభివృద్ధి దిశగా ఆరాటం
మానవ మేధస్సు ఆర్భాటం
పచ్చని పర్యావరణం కలుషితం
సమస్త జీవులు సతమతం
సమాజ మనుగడ పాతాళం

ఆలోచిస్తూ అడుగేద్దాం
పరిసరాలను కాపాడుకుందాం
పరిరక్షణ బాధ్యతకు ముందుందాం
ముందు తరాలకు అందిద్దాం
స్వచ్ఛ్భారత్‌కు సహకరిద్దాం
పర్యావరణ ప్రగతి సాధిద్దాం!

- హసి తమోహన్‌రాజు,
చరవాణి : 8008511316

ధాత్రి కాలిపోతోంది
ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా..
వెంటనే సమాచారమివ్వండి
చిన్నవారని, పెద్దవారని
తెలిసినవారని, తెలియనివారని
తేడాలు చూడవద్దు
మిత్రులకు, బంధువులకు
సహచరులకు, శ్రేయోభిలాషులకు
ప్రతి ఒక్కరికీ..
ప్రపంచ మానవాళికీ..
హెచ్చరికలు పంపండి
హితాన్ని పంచిపెట్టండి
ధాత్రి కాలిపోతోంది!...
అవసరాల కోసం.. అదేపనిగా
పచ్చనిచెట్లు కూల్చడంతో
కాంక్రీటు కట్టడాలు పెరగడంతో
పొగలు కక్కుతున్న భూమి పొరల
దాహం తీర్చే దారిలేక
ధాత్రి కాలిపోతోంది!..
పరుగులిడుతున్న వాహనాలు
చేస్తున్న రొదలు, పొగలతో
హెచ్చుమీరుతున్న కర్మాగారాలు
విడుదల చేస్తున్న వ్యర్థాలతో
కలుషితమవుతున్న జలాలతో
కోరలు చాస్తున్న రసాయనాలతో
ఊపిరాడనివ్వని ఉష్ణోగ్రతలతో
ధాత్రి కాలిపోతోంది!..
స్వార్థపరత పెంచుకుంటూ
సామాజిక ప్రయోజనాన్ని
ఒంటరిగా వదిలేస్తూ
ప్రతి పనికి..
యంత్రాల్ని వాడుకుంటున్న
మనిషి.. రోజురోజుకి
యాంత్రికమై పోతుంటే..
పర్యావరణ పరిరక్షణపై
సమాజంలో..
చైతన్యం కొరవడి
వాతావరణంలో ముంచుకొస్తున్న
విపరీత వాయువులతో
ధాత్రి కాలిపోతోంది!..

- కొండూరు వెంకటేశ్వరరాజు
గూడూరు
చరవాణి : 9492311048

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- కోలపల్లి ఈశ్వర్