నెల్లూరు

దేవుడిచ్చిన వరం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వమోహన్ గారికి ఈ మధ్య జీవితం చాలా నిస్సారంగా గడచిపోతున్నట్టు అన్పిస్తోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాత్రి అంతే తప్ప ఈ జీవితంలో ఇక ఏ మార్పులేదా? ఎందుకు తన జీవితం ఇంత ఉదాసీనంగా మారిపోయింది, భార్య మాలిక ఆర్నెళ్ల క్రితం ఉన్నట్టుండి చనిపోయింది. అంతకుముందు తనకు మాట్లాడే ఒక తోడు తప్ప భార్యతో పెద్దగా అనుబంధం కూడా అతడికి లేదు. ఇద్దరు కొడుకులు రేవంత్, హేమంత్ అమెరికాకు వచెయ్యమంటున్నారు, వాళ్లెపుడు టచ్‌లోనే వుంటారు వీడియో ఫోన్లలో. ఉన్న ఒక కూతురు తండ్రి వుండే ఊళ్లోనో ఉంటోంది ఆమె పేరు రూపిక, ఆమె భర్త వికాస్ కూడా తమ దగ్గరే ఉండమంటాడు. అతడు రీడర్‌గా జాబ్ చేస్తున్నాడు. విశ్వమోహన్ గవర్నమెంటు ఆఫీసులో మంచి జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాడు. పెన్షన్ కూడా 20,000 పైనే వస్తోంది. మంచి ప్లాట్ కూడా. పనిమనిషి వచ్చి రెండు పూటలా చేయాల్సిన పనులు చేసేసి వెళ్లిపోతుంది. ఐనా ఏదో వెలితి..అదేమిటి?
కూతురు ప్రతిదినం ఏదో ఒకటి స్పెషల్ వండి పంపిస్తోంది తను తన కొడుకుని తీసుకుని వచ్చి వారానికి ఒకసారి తనతో రెండు గంటల సేపు మాట్లాడి వెళ్లిపోతుంది. ఆ కాసేపు పదేళ్ల మనవడితో బ్యాట్, బాల్ ఆడుకుని తన ఒంటరితనానికి తాత్కాలికంగా ఫుల్‌స్ట్ఫా పెట్టేస్తారు విశ్వమోహన్.
అక్కడికి రూపిక ‘‘నాన్నగారు రండి మాతోపాటు ఉందురు, ఈ ఇల్లు రెంట్‌కు ఇచ్చేద్దాము’’ అంటే ‘‘వద్దు తల్లీ ఇంకా నేను గట్టిగానే వున్నాను కదా మీ ఇంటికి వచ్చి ఉండలేను ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఫ్రీగా వుండదు నాకు అంటే ‘‘మీ యిష్టం’’ అని వెళ్లిపోతుంది రూపిక. ఈ మధ్య మాలిక ఫొటో ముందు నిలబడి ఏవేవో నిష్ఠూరాలు ఆడుతూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకుంటాడు విశ్వమోహన్. ఇదిలా వుండగా ఒకరోజు విశ్వమోహన్ సెల్‌కి ఒక మెసెజ్ వచ్చింది. అది అతడి పాత చిన్ననాటి ఫ్రెండ్ ఆదిత్య నుండి. ఆ మెసేజ్ సారాంశం తను ఎల్లుండి ఊరికి వస్తున్నట్టు, రైల్వేస్టేషన్‌కు వీలైతే వచ్చి రిసీవ్ చేసుకోమని..
ఏమ్ పనులున్నాయని వీలైతే అని మెసేజ్ యిచ్చాడు.. ఆర్డరివ్వకూడదు, ఒరేయ్ తప్పకుండా రారా విస్సూ నేను వస్తున్నాను నన్ను రిసీవ్ చేసుకోరా అంటే ఎంత బావుంటుంది వీడికింకా ఈ రిక్వెస్ట్ చేసే గుణం పోలేదనుకుంటా ఔను వాడు చిన్నప్పటి నుండి చాల మెతక, తనలాగ రియలిస్టిక్ కాదు మొహమాటం ప్రతిదానికీ...
వాడు వచ్చే రోజు రానే వచ్చింది. రైల్వేస్టేషన్‌కి ఒక గంట ముందుగానే వెళ్లాడు. పోయిపోవడానికి ఒక పేపర్ కొనుక్కుని హెడ్‌లైన్స్ చదువుతూ కూర్చున్నాడు. ఎప్పుడు ఆలస్యంగా వచ్చే ట్రయిన్ ఈరోజు మరికాస్త ఆలస్యంగా వస్తోందేమో అనుకుని మాటమాటికి వాచ్ చూసుకోసాగాడు. అనౌన్స్‌మెంట్ వస్తోంది వెంకటాద్రి మరికాసేపట్లో వస్తుందంటూ సిగ్నల్ ఇస్తూ వచ్చి ఆగింది వెంకటాద్రి. కళ్లతోనే వెల్‌కం ప్రారంభించాడు ‘‘ఏయ్ విస్తూ ఇక్కడ..’’ అంటూ చెయ్యూపాడు ఆదిత్య ఆది..అంటూ ఆనందంతో ఆదిత్య చేతిలోని బ్రీఫ్‌కేస్ అందుకుని కౌగిలించుకున్నాడు విశ్వమోహన్.
‘‘నువ్వేమ్ మారలేదురా విస్సూ’’ అన్నాడు ఆదిత్య. ‘‘నీవు మాత్రం మారిపోయావురా ఆది ఎంత హేండ్సమ్‌గా వుండేవాడివి నిన్ను చూసి అందరూ కుళ్లుకుని చచ్చేవారు, అమ్మాయిలు నీవు ఒక్కసారి చూస్తే చాలని... ఒక్కసారి నవ్వితే చాలని ఎంతగా ఎదురుచూసేవారో తెలుసా’’ అంటూ హుషారుగా కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు విశ్వమోహన్, ఆదిత్య చిన్నగా నవ్వేడు.
‘‘ఔను మెసేజ్ పెట్టావు ఫోన్ చెయ్యకూడదా ఎంచక్కా కబుర్లు చెప్పుకునే వాళ్లం కదా’’ అదే నీవు ఏదైనా పనిలో వుంటావేమో’’ అంటూ నసిగాడు ఆదిత్య ‘‘అబ్బ అదే మొహమాటం నీకు, ఔను నీ భార్య, పిల్లలు బావున్నారా..!అంటూ ప్రశ్నించి ‘‘బాగానే ఉంటారులే నిన్ను చూస్తుంటే తెలీడంలా నీ మొహంలాగ ఉంది నా క్వశ్చన్’’ అంటూ తన చేత్తో తన నెత్తి మీద చిన్నగా కొట్టుకున్నాడు విశ్వమోహన్ కానీ, తన ప్రశ్న విన్న తర్వాత మాట్లాడబోయి ఆగిపోయిన ఆదిత్య మొహంలో ఒక నీలినీడ సర్ అంటూ మాయం కావడం గమనించకపోలేదు విశ్వమోహన్ కానీ, అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి అతను కనబరచలేదు ఆదిత్య అపుడే చెప్పనూలేదు. వౌనంగా తలాడించాడు.
ఇంటికి వెళ్లాక మాలిక చనిపోవడం తన ఒంటరితనం, కొడుకులు అమెరికా రమ్మనడం, కూతురు ప్రతిదినం పలకరించడం అందరి విషయాలు చెప్పి ‘‘చెప్పరా ఆది మనింట్లో మనం స్వతంత్రంగా ఉండడం బావుంటుందా లేక పిల్లల దగ్గర ఉండడం బావుంటుందా’’ అంటూ ప్రశ్నించాడు. ‘‘పిల్లల దగ్గర ఉండడం బావుంటుంది ఐనా నీ పిల్లలు చాలామంచివాళ్లు కదా’’ అలా అంటున్నప్పుడు ఆదిత్య గొంతు వణికింది. ‘‘ ఏంటి నీ పిల్లలు చెడ్డవాళ్లా? ఐనా ఇంత మంచి మనసున్న నీకు చెడ్డపిల్లలు ఎలా పుడతారు నేను నమ్మను వాళ్లు చెడ్డవాళ్లంటే’’ అంటూ నవ్వేశాడు విశ్వమోహన్. ‘‘వాళ్లు చెడ్డవాళ్లు కాదు ఆ దేవుడే చెడ్డవాడు’’ అన్న వాక్యం అతడి నోటి చివర వచ్చి ఆగిపోయింది మెల్లగా గొణుక్కుంటున్న అతడి మాటలు విశ్వం చెవినపడలేదు.
ఊ..సరే మాటల్లో మర్చిపోయాను ‘‘స్నానం చేసిరాపో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఉత్సాహంగా అన్నాడు విశ్వం. ‘‘బాగ అలసిపోయానురా విస్తూ రేపు మాట్లాడుకుందాము, తినడానికి ఏదైనా పెట్టు స్నానం చేసి వస్తాను’’ బ్రీఫ్ కేస్ తెరిచి టవల్, పైజాను తీసుకెళ్లాడు బాత్‌రూమ్‌లోకి ఆదిత్య. ‘‘ ఆ.. ఆ.. సరే సరే’’ అంటూ కూతురు ఇంటి నుండి వచ్చిన కారియర్ అందుకున్నాడు విస్సు. స్నానం చేసి రాగానే కాఫీ యిచ్చాడు, పదిహేను నిమిషాల తర్వాత కంచంలో చపాతి, కూర, కొద్దిగా అన్నం దొండకాయ వేపుడు, రసం, మజ్జిగ ఒకటి తర్వాత ఒకటి వడ్డించాడు. ఇద్దరు పక్కలు పైన వేసుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఆదిత్య ఎపుడో నిద్రలోకి జారుకున్నాడు. ‘‘అబ్బా ప్రయాణం చేశాడు కదా బాగా అలసిపోయాడు’’ అనుకుని తను నిద్రలోకి జారిపోయాడు విశ్వమోహన్.
ఉదయం అవుతూనే స్నానాలు చేసి టిఫిన్లు చేశారు. తనకు కాస్త బైట లెక్చర్ పని ఉందని ముగించుకువచ్చాడు ఆదిత్య. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు. రూపిక వచ్చింది ఆమెతో కాసేపు సంతోషంగా మాట్లాడాడు ఆదిత్య. ఆమె వెళ్లిపోగానే ఇద్దరూ ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు అన్ని చూసి మరునాడు కూడా చూసొచ్చారు ఇంకొన్ని ప్రదేశాలు. ఆదిత్యను చూసుకుని తన అసంతృప్తి మరచిపోయి సంతోషంగా గడిపేశాడు విశ్వమోహన్. ‘‘ఇక తాను వెళ్తానని’ ఆదిత్య చెప్పేసరికి విశ్వమోహన్ ముఖ కవళికలు మారిపోయాయి ‘‘ఏమిట్రా నీ భార్య గుర్తుకు వచ్చిందా ఐనా స్వప్నికను పిల్చుకువచ్చి వుంటే తను చూసేది కదా అన్ని ప్రదేశాలు’’ నిష్ఠూరమాడాడు విశ్వం.
ఉంటే కదా పిల్చుకురావడానికి ‘‘ఏంట్రా ఏమంటున్నావ్ ఏమైంది స్వప్నికకి’’ కంగారుగా అడిగాడు విస్సు. ‘‘చెప్పకూడదనుకున్నాను అనవసరంగా నీవు పడుతున్న బాధ చూసి చెబుతున్నాను... ఒరేయ్ విస్సూ ఈ జీవితం దేవుడిచ్చిన వరంరా దీన్ని వేస్ట్ అనుకోవద్దు నీకు ఒక్కటే లోటు మాలిక చనిపోవడం కాని, నాకు అంతా లోటే నా కొడుకు యాక్సిడెంట్లో పోయాడు అది విని నా భార్య చనిపోయింది నా కూతురికి షాక్‌తో మతి తప్పింది. మా అన్నయ్య చైతూ మా ఇంటికి వస్తూ ఫ్యామిలీతో సహా యాక్సిడెంట్‌లో పోయాడు. ప్రస్తుతానికి నేను ఒంటరిని. ఇప్పుడు కూడా నీకీ విషయం చెప్పకూడదు అనుకున్నాను కానీ, ఈ జీవితాన్ని పదుగురి సేవ కోసం మనం బ్రతకాలి. మన బాధలు ఉన్నా లేకున్న మరచిపోవాలి’’. స్నేహితుడి విషయాలు వినగానే కళ్లలో నుండి నీళ్లు కారుతున్నాయి విశ్వానికి. విశ్వం కళ్లు తుడిచి ట్రయిన్లో నుండి చెయ్యూపాడు నవ్వుతూ అందులో ఏదో సందేశం అందింది విశ్వానికి తలూపాడు ఆనందంగా అది చూసి తృప్తిగా కనుమరుగయ్యాడు ఆదిత్య.

- డా॥ ఎం. ఎస్. జ్ఞానేశ్వర్, మదనపల్లె
చరవాణి : 9440729701

మనోగీతికలు

పదిహేడుకు స్వాగతం
ఎప్పటిలాగే వచ్చిన కొత్తవత్సరమా
ఏమి అనుకోకమ్మా స్వాగతించలేదని
నిన్నటి దాకా బారుల నిలచినిలచి
నీరు పట్టి వూరిన బోదకాళ్లతో
నడవడానికే లేదమ్మా యిక్కడ దిక్కు
పబ్‌లన్నీ పెద్దదిబ్బలుగా మారాయి
రెస్టారెంటులు రెస్ట్ తీసుకుంటున్నాయి
దుకాణాలన్నీ దిగాలుగా వున్నాయి
గీకడానికి చేతినిండా కార్డులున్నా
గీకించుకునే యంత్రాలు సున్నా
‘అంగట్లో అన్నీ వున్నా
అల్లుడి నోట్లో శనిలా’
ఖాతాలు నిండుగా వున్నా
చేతుల్లో పైసలు లేవన్నా
వున్న పెద్దనోటు మార్చలేము
వుల్లిపాయనైనా కొనలేము
నమో నమో దేవాధిదేవా
నడుము విరిచావు కదయ్యా మహానుభావా
ఎంత గింజుకున్నా ఏమి లాభం
ఎలుగెత్తి ఆహ్వానించడం తప్ప
వెనుకటి ఆర్భాటాలు చెయ్యలేము
నీ రాకతోనైనా వెతలు వెనకడుగు వేస్తాయని
నిలువెల్లా ఆశతో నిలుచున్నాము
చిన్నబోక రావమ్మా నూతన వర్షమా!
చింతలన్నీ తీర్చవా పదిహేడు ప్రాయమా!

- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706

నూతన శుభాకాంక్షలు
స్వార్థపు నీడన నిలబడి
నిస్వార్థపు ముసుగున భ్రమపడుచూ
కలల అలలపై తేలియాడే
ఓ కలియుగ కల్తీ యుగమా
భారతీయ సంస్కృతికి బాధ్యత వహిస్తూ
ఏండ్ల తరబడి నేను ఏలుబడిలో వున్నాను
అవినీతి సామ్రాజ్యాన్ని అణచలేకున్నాను
న్యూ ఇయర్ అంటారు,
హ్యాపీ న్యూ ఇయర్ అంటారు
కోటి ఆశలతో క్రొత్త కలలు కంటారు
అర్ధరాత్రి హంగులతో అలజడి సృష్టిస్తారు
విలాస వ్యసనాలతో నయవంచన చేస్తుంటారు
అమ్మనేర్పిన ఆచారాలు అశుభం అంటారు
పాశ్చాత్యుల అలవాట్లతో
ముందుకు సాగాలంటారు
కదిలే కాలలన్నీ కనుమరుగై పోతున్నాయి
తలపండిన తరాలన్నీ తెరమరుగై పోతున్నాయి
సుఖసంతోషాల సంస్కారాలు
శిధిలమై పోతున్నాయి
ఆచార వ్యవహారాలు ఆవిరైపోతున్నాయి
అవినీతి రహిత భారతావని బాధ్యతలో
నరుల నడవడిక చూసి నవ్వుకుంటున్నాను
మంచిచెడ్డల మధ్య నలిగిపోతున్నాను
గడచిన గతమొక పీడకలగా భావించి
మనసున్న మనుషులుగా బ్రతకాలని
భరతభుమి నందు బ్రతుకు వెనె్నల
కురవాలని కాంక్షిస్తూ
మానవాళికి ఆంక్షలు లేని
శుభాకాంక్షలు అందిస్తూ
నూతన సంవత్సరముగా
మీ ముందుకు వస్తున్నాను

- హస్తి మోహన్‌రాజు, నెల్లూరు
చరవాణి : 8008511316

అమ్మలాంటి విందు
ఆ కళ్లల్లో జాలువారే కరుణ
ఆ పలకరింపులో వాత్సల్యం
అమ్మను మరపించే వంట కూడా
ఎంత కాలానికి మా అమ్మ వంట
రుచి చూస్తున్నాను
విందు భోజనంలో ఏం పెట్టావన్నది కాదు
వేల విలువ చేసే కూరలు వడ్డించావన్నది కాదు
విలువ కట్టలేని ఆప్యాయతానురాగాల్ని
తీయదనాన్ని జోడించావు
విందు అందుకే అంత రుచికరమైంది
విందారగిస్తున్నంత సేపు మా అమ్మే
నా ముందున్నట్లుగా
కొసరి కొసరి వడ్డిస్తున్నట్లుగా
మారాం చేస్తున్నప్పుడు మురిపాల
ముద్దలు తినిపిస్తున్నట్లుగా
అంతా మా అమ్మ చేస్తున్నట్లే!
నా ముద్దు మాటలు వింటూ
పులకించిన మా అమ్మ
నా కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లుగా ఉంటుంది
కోటానుకోట్లు ముంగిట ఒంపినా
కలకలాలం కంటికి రెప్పలా కాస్తున్న
అమ్మను మించిన భాగ్యం ఉందా
ఎన్ని భోగభాగ్యాలున్నా సిరిసంపదలున్నా
ఏ ఒక్కటీ అమ్మ ప్రేమకు సరికావు కదా
అమ్మంటే గుండెలోయల్లో దాగిన ప్రేమనిధి
అమ్మంటే గుండెగూటిలోని మమతల పెన్నిధి
అమ్మంటే అణువణువునా నిండిన
వాత్సల్య లోగిలి.. అందుకే
ఏ అమ్మలో చూసినా మా అమ్మే గుర్తొస్తుంది
ఏ అమ్మ ఆప్యాయత కనిపించినా మా అమ్మే సాక్షాత్కరిస్తుంది
అమ్మంటే ఆశించకనే మనపై కురిపించిన
వరాల జల్లు
అమ్మను మరచినవాడు అమ్మరూపంలోని
వింతపశువు కాదా!

- గుర్రాల రమణయ్య
చరవాణి : 9963921943

కవిత

నేనూ నీలాంటి మనిషినే
చూస్తూన్నా, చూస్తూన్నా, చూస్తూ చస్తూనే ఉన్నా
మరిచిపోయిన మనువుకాలం నాటి ధర్మాలను
మరల మరల వల్లెవేస్తూ, మానని గాయంలా రేపుతూ
నా విలువల వలువల్ని ఊడదీసి
విలాసాల వీధుల్లో విపణి బొమ్మను చేశారు
నేనుకూడా రక్త మాంసములతో కూడిన మనస్సు ఉన్న
పదార్థాన్ని అన్న విషయాన్ని ఉప్పుపాతరేసి
అవసరాల కోసం అత్యాచారాలను నిస్సుగ్గుగా చేస్తున్నారు
నేను అబలను అంటూ మాటిమాటికి
నా ఆత్మాభిమానాన్ని
దెబ్బతీస్తూ నీ కాలికింద చెప్పులా ఉంచేస్తున్నావు
సమస్త ప్రపంచం పుట్టుక, పోషణ నా ద్వారానే అయినా
నేను ఎప్పుడూ గర్వంగా తలెత్తలేదు
గోరుముద్దల నాటినుండి అనగా అనగా ఒకరాజు
రాజుకు ఏడుగురు కొడుకుల కథలే తప్ప
రాజుకు గల కూతురు కథ ఎవ్వరూ నేర్పించనే లేదు
నీకు అమ్మాయి అంటే అంత అలుసు
నీ లోదుస్తుల నుండి, నీవు వాడుకొనే స్ప్రే మొదలు
నీ గడ్డం గీసుకున్నపుడు కూడా నేనే మోడల్‌ని
నీ చంకలోసువాసన కోసం పరిమళాన్ని అద్దుకుంటే
నీతో పడుకోవడం కోసం నేను వెంపర్లాడే యాడ్లు
సరికొత్త ఫ్యాషన్ అంటూ
మూడేళ్ల పాపకు వేసే గౌనును
రెండు పదుల పడుచుకేసి పిల్లినడకలు నడిపిస్తున్నారు
టు పీస్‌లు, సింగ్‌ల్ పీస్‌లు, బికినీలు ఆపై న్యూడ్‌లు
నేను మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లెలు లాంటిదాన్ని అయినా
మీ కనురెప్పల కింద కామపు సిసి కెమేరాలు
నా దేహంలోని అంగాంగాన్ని అంగుళం అంగుళం
క్షణక్షణము స్కానింగ్ చేస్తూనే ఉన్నాయి
నేను నిరంతరం గమనిస్తూ అసహ్యించుకుంటూనే ఉన్నాను
నాకు ఎన్నోసార్లు గొంతెత్తి అరవాలనిపిస్తుంది
లోపల అస్థిపంజరం నీకు నాకు ఒక్కటేరా అని

అంతులేని అంతర్జాలంలో లెక్కలేని సైట్లలో
కబేళాకు పోయే పశువుల కన్నా హీనంగా
నా రహస్యాన్ని విశృంఖలత్వం చేసి పారేస్తున్నారు
ఓలి, కప్పం, రుణం, పరిధి ఏవేవో వింత పేర్లుతో
శీలం అనే శూలాన్ని నాకు మాత్రమే గుచ్చివేసి
మీరు మాత్రం అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతున్నారు
అమానుష సంఘటనల రాత్రుళ్లకి మసి దీపపు
గబ్బిలాల లాగా ఎగబడుతున్నారు
ఇంట్లో, బళ్లో, గుళ్లో, బస్సుల్లో, రైళ్లలో ఏమని చెప్పను
వావి లేదు, వరుస లేదు, చిత్తకార్తె కుక్కల్లా కరుస్తుంటే
ఎన్నిచోట్ల నేను నా రక్షణ కోసం
నా చుట్టూ పట్టుపురుగులా
గూళ్ళు కట్టుకోను, అమీబాలా ఒదిగిపోను
ఓరే బాబు, నీవు మగాడివి అని నేను తల్లినైతేనే
గుర్తించేది
నీ మగతనం కోరిక నీ భార్య అనురాగములో తీర్చుకో
అంతేగాని కనబడే అతివలందరితో కాదు
నేను తిరగబడితే ఆదిపరాశక్తిని అవగలను
దుర్గుణాలను దునుమాడే దుర్గను కాగలను
నీ వికారపు అంగాలన్నీ ఉత్తరించి
బృహన్నలను చేయగలను
అంతదాకా తెచ్చుకోకు నేస్తం
నాకేమి అలివిమాలిన స్వేచ్ఛ వద్దు
ఆకాశంలో సగం వద్దు
నేను కూడా మనిషినే అని గుర్తిస్తే చాలు

- గర్నెపూడి వెంకటేశ్వరరావు, మార్టూరు
చరవాణి : 8341169772

స్పందన

కర్ణపిశాచి కథ బాగుంది
గతవారం మెరుపులో మూఢనమ్మకాల ఇతివృత్తంగా తీసుకుని పొట్లూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన కర్ణపిశాచి కథ బాగుంది. కథలో మూఢనమ్మకాలను ప్రజలు ఎలా నమ్ముతారు, వాటిని ఎలా వాడుకుని తమ పబ్బం గడుపుకోవాలని కొందరు ప్రయత్నిస్తారో చక్కగా వివరించారు. గతంలో సమాజంపై మూఢనమ్మకాల ప్రభావం ఎక్కువగానే ఉండేది. క్రమేపీ అది తగ్గింది. పాతతరం కథను మళ్లీ గుర్తుకుతెచ్చిన రచయితకు అభినందనలు. కథలో సుబ్బమ్మ పాత్రను చక్కగా మలిచారు. సోది చెప్పే వాళ్లు గతంలో ప్రతి పల్లెలో తిరుగుతూ తమ పబ్బం గడుపుకునేవారు. మూఢనమ్మకాలే వీరికి జీవనోపాధి. మరుగుపడిన అంశాలతో కథను రాసిన రచయితకు ధన్యవాదములు.
- కరీముల్లా షేక్, వింజమూరు
- కాగితపు లక్ష్మిప్రియ, గూడూరు

కాలంతో చెలిమి సూపర్
గతవారం మెరుపులో లక్కరాజు శ్రీనివాసరావు గారి కలం నుంచి జాలువారిన కాలంతో చెలిమి కవిత సూపర్. 2016లో జ్ఞాపకాలను తోరణాలుగా మనముందు వుంచిన తీరు బాగుంది.
- కవితాకిరణ్, నెల్లూరు
- పుష్పకుమార్, తిరుపతి

లక్ష్య శస్తచ్రికిత్స చేస్తే బాగుండేది
వేదం సూర్యప్రకాశం గారు రాసిన లక్ష్య శస్త్ర చికిత్స కవిత బాగుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాసిన కవిత ఇది. మన పాలకులు కొండ నాలుకకు మందెయ్యకుండా నోరంతా మందేసినట్లు వుంది నోట్ల రద్దు ప్రక్రియ. ఇది యదార్థం. ఏదైనా ఒక పని చేయదలచినపుడు ఎక్కడైతే సమస్య వుందో అక్కడే చికిత్స చేయాలి కాని శరీరమంతా గాట్లు పెడితే శరీరం అస్తవ్యస్తమవుతుంది ఇలాగే వుంది ఇప్పుడు మన దేశంలో దుస్థితి. మంచి సామాజికాంశాన్ని చక్కగా, ఆలోచింపచేసేలా అందించిన రచయితకు ధన్యవాదములు.
- మునికృష్ణమాచారి, తిరుచానూరు
- సుందరయ్య, నాయుడుపేట
- సురభి లక్ష్మి, నెల్లూరు

మెరుపు రచయతలకు, పాఠకులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు

2017

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- డా॥ ఎం. ఎస్. జ్ఞానేశ్వర్