నెల్లూరు

మమతానురాగం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఒంటరిగా తన భవితను గూర్చి ఆలోచిస్తూ నడుస్తూ వుంది. చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో ఉండి కష్టపడి ఉన్నత చదువులు చదివిన ఆమె ఉద్యోగం కోసం పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఒక వైపు పేదరికం, నిరుద్యోగం, మరోవైపు పెళ్లి వయసు దాటిపోతూ ఉండటం. ఇవన్నీ తనను వెంటాడుతున్న సమస్యలు. వీటన్నింటినీ మించి అంగవైకల్యంతో ఉన్న చెల్లెలు. ఇన్ని సమస్యలతో సతమతవౌతోంది మమత. తనకు మమత అనే పేరు ఎవరు పెట్టారో ఏమోకాని తన చుట్టూ వున్న కష్టాలు, పేదరికం ఒక్కొక్క సమయంలో ఆకలిబాధ ఇవన్నీ తన మీద అమితమైన మమకారాన్ని చూపుతున్న వైనం. తనలో తానే నవ్వుకుంది. ఆ నవ్వు వెనుక సముద్రగర్భంలో బడబానలం దాగున్నట్లు ఆమెలో అనంత దుఃఖం దాగుంది.
సరిగ్గా అలాంటి సమయంలోనే తన పరిస్థితిని గూర్చి ఆలోచిస్తున్న మమతకు దేవుడు వున్నాడా? లేదా? అనే అనుమానం. అయినా ప్రయత్నిస్తాం...తనకు ఎప్పుడైనా మంచిరోజులు రాకుండా పోతాయా? తాను సుఖపడకపోతానా? అనే ఆశ మమతను బతికిస్తూ వుంది.
మండు వేసవిలో ఉష్టతాపాన్ని భరించలేక బాధపడుతున్న సమయంలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో ప్రాణులను వరుణదేవుడు కరుణించినట్లు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన కూడా మమతను ఆనందింపజేసింది. తనతో పాటు చదివిన వారు కోచింగ్‌లకు వెళ్లారు. తనకు అంతటి స్తోమత లేదు కాబట్టి తనకు తెలిసిన వారిని అడిగి కొన్ని పుస్తకాలు తెచ్చుకుని చదవడం ప్రారంభించింది. పగలంతా గ్రంథాలయంలో చదవడం, సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం, భోజనం అయిన వెంటనే పుస్తకం చేపట్టి బాగా పొద్దుపోయేవరకు ఇంటి దగ్గర కష్టపడి చదువుతోంది మమత. అలా చదువుతూ ఒక్కోరోజు బాగా అలసిపోయి చదువుతూనే నిద్దట్లోకి జారిపోయేది. ఆ నిద్దురలో ఒక్కోరోజు పోటీ పరీక్ష బాగా రాస్తున్నట్టు ఇక తన జీవితానికి ఏ ఢోకా లేదనే ధీమా కలిగి సంతోషంగా నిదురపోయేది. ఒక్కొక్కరోజు తాను ఉద్యోగం పొందలేక పోయినట్లు, కొందరు జాలి చూపుతున్నట్లు, కొందరు వెటకారంగా మాట్లాడుతున్నట్లు కలలు వచ్చేవి. ఆ సమయంలోనే దిగ్గునలేచి కూర్చునేది. చుట్టూ చిమ్మచీకటి. ఒళ్లంతా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నోటిలో తడి ఆరిపోవడం ఇలాంటి లక్షణాలతో కలత చెందిన మనసుతో చెంబుడు నీళ్లు గటగటా తాగి, దిగాలుగా... తన పరిస్థితి ఏమిటా..అని ఆలోచిస్తూ..మరలా ఎప్పుడో నిద్దట్లోకి జారుకునేది.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది దగ్గర పడుతుండడంతో తెలిసిన వారిని అప్పు అడిగి తీసుకుని పరీక్ష ఫీజు కట్టి దరఖాస్తు చేసింది. తనకు ఎన్ని ఆటంకాలు ఎదురౌతున్నప్పటికీ శ్రద్ధగా చదివి పరీక్ష బాగా రాసింది. ఫలితాలు వెలువడడానికి కొంత సమయం ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఇంటి దగ్గర కూర్చుంటే కుటుంబం గడవటం ఎలాగని మమత ఒక ప్రైవేటు కంపెనీలో చేరింది. వాళ్లు ఇచ్చే జీతంతో తన ఖర్చులకు పోను ఇంట్లో వాళ్లకు కూడా పదిరూపాయలు ఇవ్వగల్గుతోంది.
కొన్ని నెలలు ఇలా గడిచాయి. తలవని తలంపుగా మమత జీవితంలోకి అనురాగ్ అనే వ్యక్తి ప్రవేశించాడు. దగ్గరివాళ్లు చనువుతో అనూ! అని పిలుస్తుంటారు. అతడు కూడా ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాడు. అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటాడు. అతడంటే మంచివాడనే అభిప్రాయం అందరిలో ఉంది. అతనిలోని ఆ మంచితనమే మమతను ఆకర్షించింది. అయినప్పటికీ మమత ముందుగా చొరవ తీసుకోలేదు. అతడే కల్పించుకుని మాట్లాడేవాడు. ఛలోక్తులతో నవ్వించేవాడు. కాబట్టి అతని సాన్నిహిత్యంలో మమత తన బాధలను మరిచిపోయేది. అనురాగ్ మీద సదభిప్రాయం కలగడానికి, చనువుగా మాట్లాడడానికి కారణం అతను చక్కగా మాట్లాడే విధానమే కాకుండా మమత లాగే తాను కూడా ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్ష రాసి ఉండడం మరొక కారణం.
నిరుద్యోగులంతా పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వలన ఫలితాలు ఆలస్యం అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వార్తతో నిరుద్యోగులు ఇంకా నిరుత్సాహపడ్డారు. ఎందరో యువతీ యువకుల పెళ్లిళ్లు ఈ పోటీపరీక్షల ఫలితాలతో ముడిపడి ఉన్నాయి. కొందరు తల్లిదండ్రుల మాటను వ్యతిరేకించలేక, అలాగని వాళ్లు చూసిన సంబంధాన్ని ఒప్పుకోలేక సతమతమవుతున్నారు. కొందరు ఇప్పటికే వయస్సు మీదపడి ముదిరిపోయిన బెండకాయలయ్యారు. ఉద్యోగం వస్తేనైనా తమను ఎవరో ఒకరు ఇష్టపడకపోతారా? జీవితంలో స్థిరపడకపోతామా? అనే ఆశతో వారు వెయ్యి దేవుళ్లకు మొక్కుతూ పదివేల కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలోనే ‘్ఫలితాల విడుదల మరింత ఆలస్యం’ అనే వార్త వారి ఆశల తివాచీ మీద బురద నీరు చల్లినట్లయింది. తమకు మంచిరోజులు రావాలని పదేపదే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇలా ఎదురుచూపులతో కొన్ని నెలల సమయం గడిచిపోయింది.
ఈ సమయంలోనే మమత, అనురాగ్‌ల పరిచయం బాగా పెరిగి స్నేహితులుగా ఉన్నవాళ్లు ప్రేమికులుగా మారారు. వారికి సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ, భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఏవేవో ఊహల్లో విహరించేవారు. అంతేతప్ప ఎప్పుడుకూడా హద్దుమీరి ప్రవర్తించలేదు. ఫలితాలు వెలువడ్డాయి. ఆత్రుతగా కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే ఫలితాలను చూసి ఉత్సాహంగా వెలిగిపోతున్న ముఖాలతో కొందరు, బాధగా, దిగులుగా కొందరు వస్తున్నారు. వాళ్లను చూసిన మమత, అనురాగ్‌లు వీళ్లలో తాము ఎవరిలాగా వస్తామో, ఏమోనని భయపడ్డారు.
మమత, అనురాగ్‌లు పరుగులాంటి నడకతో వెళ్లారు. క్రిక్కిరిసిన జనంలోనుంచి ఎలాగోలా నోటీసు బోర్డును సమీపించి తన నంబరు కంటే ముందు మరొకరి నంబరు చూసుకున్నారు ఆ ప్రేమ జంట. అదృష్టం వరించింది. ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. ఆ ఆనందంతో మనసులోనే భగవంతునికి ఆనంద భాష్పాలతో నమస్కృతులను ఆర్పించారు.
మమత, అనురాగ్‌లు ఉత్సాహంగా తమతమ ఇళ్లల్లో ఉద్యోగాలు సంపాదించిన విషయం చెప్పారు. వారు ఎంతో ఆనందించారు. మమత తల్లిదండ్రులతో అనురాగ్ విషయం చెప్పింది. వారు మళ్లీ చూద్దామంటూ దాటవేశారు. కాలచక్రంలో ఒక ఏడాది గడిచిపోయింది. అనురాగ్‌ను గురించి మమత తల్లిదండ్రులు వాకబు చేశారు. అందరూ మంచివాడనే చెప్పారు. తమ బిడ్డకు భర్తగా యోగ్యుడైన కుర్రవాడు దొరికాడని సంతోషించారు. అప్పుడు అనురాగ్‌తో వివాహానికి తమకెలాంటి అభ్యంతరం లేదని మమతకు చెప్పారు. అనురాగ్ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. వారుకూడా ఒప్పుకోవడంతో ఓ శుభ ముహూర్తాన మమత, అనురాగ్‌లు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

ఆడేరు చెంచయ్య, నాయుడుపేట
చరవాణి : 9492331449
స్పందన

పాఠకులకు చెవిలో పువ్వు
గత వారం మెరుపులో కోలపల్లి ఈశ్వర్ గారు పాఠకులకు చెవిలో పువ్వు పెట్టారు. ఆయన రాసిన చెవిలో పువ్వు కథ ఆద్యంత్యం హాస్యభరితంగా, ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా కోలపల్లి గారి కథలంటేనే ఏదో తెలియని ఉత్కంఠ, హాస్యభరితంగా పాఠకులను అలరిస్తుంటాయి. ఈ చెవిలోపువ్వు కథలో కూడా ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణ ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి చెవిలో పువ్వు పెట్టి కథను ముగించిన తీరు బాగుంది. కథ మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా హాయిగా, కొంచెం టెన్షన్‌గా సాగింది. కథకు పెట్టిన హెడ్డింగ్ అక్షరాల కుదిరింది అంతే.
- హేమంత శైలజ, కందుకూరు
- అనసూయమ్మ, చిత్తూరు
- పాయసం రవికుమార్, బుచ్చిరెడ్డిపాళెం

హమ్మయ్యా..నేనొచ్చాను ఇంటికి కవిత బాగుంది
మెరుపు కవి కొండూరు వెంకటేశ్వరరాజు కవిత అంటేనే అందులో ఓ సామాజికస్పృహ ఉంటుంది. ఈ కవితలో కూడా సగటు స్ర్తి పడే వేదన, అసలు సమాజంలో మహిళ పడే పాట్లు, ఆమెకుండే భద్రత వంటి అంశాలను సవివరంగా వర్ణించిన విధం బాగుంది. ఇప్పటికీ ఇంకా ఆడపిల్లలకు పూర్తిస్థాయిలో భద్రత లేకపోవడం మన దుస్థితికి నిదర్శనం.
- గాలి పుష్పలత, కావలి
- సుబ్బరాజు, నెల్లూరు

కనురెప్పల్లో ఇంతా భావమా?
మన కనురెప్పల్లో ఎన్నో భావాలున్నాయని రచయిత గుర్రాల రమణయ్య గారు తన కవితలో వర్ణించిన తీరు అద్భుతం. తొలి సంధ్య నుండి మలిసంధ్య వరకు అలసిసొలసిన మనసుకు కనురెప్పలు చేయూతనివ్వాలి అంటూ మొదలెట్టిన కవిత చివరి వరకు ఎంతో గొప్ప భావాలను ఆవిష్కరించింది. గొప్ప కవితను అందించిన రమణయ్య గారికి ధన్యవాదములు.
- ప్రభాకర్ వర్మ, కావలి
- పొత్తూరి సరళ, నెల్లూరు
- జి.శ్రీనివాస్, వింజమూరు

రచనలకు
ఆహ్వాన

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

పుస్తక సమీక్ష

నాన్నకు ప్రేమతో...

గత స్మృతులను కళ్ల ముందు నిలిపిన అవ్యక్తం

ప్రతులకు
ఆత్మకూరు రామకృష్ణ, 8-8/1-101,
ప్రణీత రెసిడెన్షీ, పండిత్ నగర్, గుంటుపల్లి,
విజయవాడ-521 241

తండ్రి ప్రేమలో మమేకమైన కుమారుడు కలం చిందించిన కవితా కుసుమాలే అవ్యక్తం దీర్ఘకవిత. ఇందులో చాలా వరకు నాన్న చుట్టు తిరిగేవే. ఆయన స్మృతులే. నాన్న ఎలా ఉంటాడో నాన్న అందించే జీవిత సత్యాలు కళ్లముందు నిలిపారు రచయిత ఆత్మకూరు రామకృష్ణ. తండ్రి లేని బాధను దిగమింగుకుని భారాన్ని దించినట్టు ఉంది ఈ ఎలిజీ. స్పందించే హృదయం ఉన్నవాడు ముందుగా అమ్మమీదే కవితలు రాస్తాడు. నాన్న తర్వాతివాడే. పాలిచ్చి లాలించే తత్వం అమ్మదైతే పాలించి లాలించే తత్వం నాన్నది. ఆకాశంలో సగం అమ్మతే పూర్తి ఆకాశం వంటి నాన్నని ఇంకా చక్కగా అక్షరాల్లో పొదగవచ్చని గతంలో చాలామంది ప్రయత్నించి లబ్ధ ప్రతిష్టులయ్యారు. తండ్రిపై కవితలు రాయడం, సంకలనంగా రూపొందించే విధానం 2006లో అన్వర్ సంపాదకత్వంతో ప్రారంభమైంది. అందులో దాదాపు 234 మంది కవులు తండ్రితో తమ అనుభావాలకు కవితాత్మకంగా అక్షర రూపం ఇచ్చారు. మరోప్రయత్నంలో ప్రముఖ కవి విమర్శకుడు ద్వానాశాస్ర్తీ సంపాదకత్వంలో 60కవితలతో ‘నాన్న’ వెలువడింది. తర్వాతి కాలంలో నాన్న సైకిలు, యాది, నాన్న జ్ఞాపకాలు, కనుపాపల తోటమాలి, ఫాదర్ ఈఎస్ ఎన్ అన్‌సంగ్ హీరో వంటి దీర్ఘ కవితలు పాఠకులకు పరిచయమయ్యాయి. సతీష్‌చందర్ వంటివారు కూడా నాన్ననే హీరోగా చేస్తూ పలు కవితలు ఆవిష్కరించారు. ఇప్పుడు రామకృష్ణకూడా తనను విడిచి వెళ్లిన నాన్న స్మతులకు ఆర్ధ్రత చిలికి కన్నీటి కవితను మన ముందుంచారు.
‘మీరు కూర్చుని కనిపించే వరండా బోసిపోయింది
కళ తప్పిన మా ముఖాల్లా అంటూ తండ్రి స్మృతుల్లో కవి
మమేకమయ్యారు.
వివేచనా దృష్టితో కవిత్వంగా మలచిన రామకృష్ణ కవిత పాఠకుడికి తన తండ్రిని గుర్తుచేస్తుంది.
మీరికలేరన్న లోటు
పోటయింది హృదయానికి
-
ఆకలిగొన్న కడుపుకు అన్నం
మీరయ్యారు
ఏడ్చినవేళ ఓదార్పు చేయి
మీరయ్యారు
అధైర్యపడ్డ గుండెకు దిటవు
మీరయ్యారు
కానరాని దారుల్లో కళ్లే
మీరయ్యారు అంటూ ఒకచోట

జన్మనిచ్చిన తల్లి రుణం
తండ్రి మరణానంతరం లోటు
ఎంత తలచినా తీరనివే

దారినపోయే దానయ్యలు
వెనుకేమన్నా ఆస్తిపాస్తులున్నాయా అన్నప్పుడు
నాన్నున్నారని చెప్పుకునేవాళ్లం
నేడు ఎంతున్నా..
ఏమీలేనివాళ్లయ్యాం అని
నాన్న ఉన్నతిని చక్కగా చెప్పారు.

మీరికలేరన్న వార్త విన్న గ్రీష్మం
తీక్షణ బాధతో
కనె్నర్రజేసి వేడిగాడ్పులే వీచింది
ప్రకృతి తల్లడిల్లింది
మీ తిథినాడు దిగివచ్చి ఎడతెరిపిలేకుండా ఏడ్చింది ఆకాశమై!!
అంటూ ప్రకృతితో ముడి పెట్టి నాన్న ఉన్నతిని కవి ఆవిష్కరించారు.

మరో చోట
కట్నాలకు ఆశపడని మామా..!
కూతుళ్లను కనకుండానే
అయ్యావు వాళ్లకు నాన్న!!
అని కోడళ్లను కూడా కూతుళ్లుగా భావించే తండ్రిలోని మరోపార్శ్వాన్ని కవి చక్కగా ఆవిష్కరించారు. చెరిపితే పోయేవి కాదు స్మృతులు ఆ స్మృతులను నెమరువేసుకుంటూ ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయడనానికి అసంపూర్ణం అని కవి కవితను ముగించడం ముదావహం
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామంలో సామాన్యరైతు కుటుంబంలో జన్మించిన ఆత్మకూరు రామకృష్ణ ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయంలో చిత్రకళా అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్నారు. రామకృష్ణ చక్కని చిత్రకారుడు కూడా. అందరిలా బ్రష్ వాడే చిత్రకారుడు కాదు. తన చేతివేళ్లనే కుంచెగా చేసుకుని చిత్రీకరించే తెలుగులో ఏకైక అరుదైన చిత్రకారుడు.ఈ విషయంలో ప్రపంచ రికార్డులు, ఇంకా అనేక రికార్డులు కూడా సొంతంచేసుకున్న వ్యక్తి కూడా.

-గౌతమి, 9347109377

శ్రద్ధాంజలి
పందికొక్కులు వారు
మతం మత్తులో మూర్ఖపు ముష్కరులు వారు
కంచెదాటున పొంచి కాటేస్తూ ఉంటారు!
ఉగ్రవాదమనే ఉగ్గుపాలతో
దేశం కోసం త్యాగాలంటూ
కరుడుకట్టిన కసాయి గుండెలై
పరాయిదేశంపై పగపడతారు
సరిహద్దుల్లో సంచరిస్తారు
నమ్మక నేస్తాలై నటియిస్తారు!
అందరిని నమ్మిస్తారు
అదును చూసి కాటేస్తారు!
ప్రళయం విరుచుకుపడిన
ముష్కరులు తెగపడిన
దేశ రక్షణ కోసం దివిటిలై
భారతమాత భద్రతకు
కనురెప్పలై
మంచుకొండలలోన
కాళ్లు బండగ మారిన
దాటోద్దు మా హద్దని
హెచ్చరించిన వేళ
తుపాకీ తూటాతో
ఎద తట్టిన వేళ నిశిరాత్రి నీడలో కంచె దాటున పొంచిన
ముష్కరుల చేతిలో అశువులు బాసిన వీర సైనిక జవానులకు
వందనాలతో శ్రద్ధాంజలి.

- హస్తి మోహన్‌రాజు
చరవాణి : 8008511316

విశ్వచైతన్యం
ఉగ్రవాదం.. ఉగ్రవాదం
బుసలుకొట్టి వేయి తలల విషనాగం
ఉగ్రవాదం.. ఉగ్రవాదం
మానవుడు రుధిరంతో చేసే హింసాయాగం
ఉగ్రవాదుల్లారా.. ఉన్మాదుల్లారా
దేవుడి పిల్లలమని చెప్పుకొనే
పిశాచ తనయుల్లారా..రక్తపుటేర్లలో మునగడం
శవాల నిచ్చెన ఎక్కడం
మోక్షం మార్గం కాదు మూర్ఖుల్లారా
మానవత్వపు నదిలో మునగాలి
ఆత్మజ్ఞాన సోపానం ఎక్కాలి
జ్ఞానదృష్టితో చూస్తే లేవు
ఇన్ని దైవాలు, దేశాలు, సిద్ధాంతాలు,
రాద్ధాంతాలు, వివాదాలు, మతాలు, అభిమతాలు ఉన్నది ఒకే ఒక్క విశ్వచైతన్యం.

- మోపూరు పెంచల నరసింహం
చరవాణి : 9346393501

మనోగీతికలు

కాలం - మహత్యం
ఏం తెచ్చానని ఈ ఆరాటం
ఏం తీసుకుపోతున్నానని
ఈ పోరాటం
ఎంతకాలం ఊపిరితీస్తానో
నిఖ్ఖచ్ఛిగా తెలియని
ఈ అయోమయ అవస్థలో
ఉన్నదంతా నాకే కావాలని,
అనుకున్నదంతా అనుభవించేయాలి
ఈ తపన, ఆశకు అంతులేదిక్కడ
ఎక్కడి నుండి వచ్చానో తెలియదు
ఎక్కడికి పోతున్నానో తెలియదు
అయినా ఈ రాకపోకల మధ్య
ఎన్నో అనుబంధాలని, అనురాగాలని
అమానవీయ దృక్కోణ చిత్రాలని
వాటేసుకొంటున్నాను,
వాడేసుకుంటున్నాను
నేను చేస్తున్నది, చూస్తున్నది, న్యాయం అనుకుంటున్నాను
నాణానికి అవతల వైపు అంతా అబద్ధం అనుకుంటున్నాను
ధర్మం అనే మాటను
నా హృదయాంతరంలో ఉరివేసి
అర్థంపై మమకారంతో, కామాన్ని కావల్సినంతగా తీర్చుకుంటూ
సమస్త జీవరాశుల్లో ప్రత్యేకముగా ఉన్న మనిషి అనే నేను మానవత్వాన్ని, కృతజ్ఞతని ఏనాడో మర్చిపోయాను
అన్ని నాకే తెలుసు అనే అహంభావం
నరనరాల్లో జీర్ణించుకుపోయిన నేను
చావుపుట్టుకల రహస్యం
ఇంతవరకు చేధించలేదు
ప్రయత్నిస్తూనే ఉన్నాను
ఓడిపోతూనే ఉన్నాను
ఊపిరితీయడం ఆపివేసిన మరుక్షణం
చింకిచాపమీద, ఇంటి ఆరుబయట
ఆఖరికి ఇంకా ఎంతసేపు
పారవేయలేదా..ఇదేనా నా జీవితం
నా ముత్తాత, తాత, తండ్రి, తల్లి, స్నేహితులు
ఎందరో మరెందరో నా కళ్లముందే కనిపించకుండా పోయారు
ఖాళీ చేతుల్తో గోడ మీద ఫొటో మిగిల్చి
రేపు నేను కూడా అంతేకదా, వైరాగ్యం జూలు విదిల్చి
మరీ మరీ హెచ్చరిస్తున్నా నాకేం కాదులే, పోయినవాళ్లు
తెలియక పోయార్లే అని మనసును మాయచేస్తున్నా
కాదు కాదు మనస్సే నన్ను మళ్లీ మళ్లీ మాయచేస్తుంది
ఎన్నో వేల ప్రవచనాలు, మరెన్నో అనుభవాల సారాలు
అయిన నేను నేర్చుకున్నది శూన్యం
మనం అనే మాటను ఏనాడో పాతరేసి
నేను, నా భార్య, నా పిల్లలు, నా వరకే
అంతా నా అనుకున్న వాళ్లకే
ఇంతచేస్తున్నా నాతో తోడు వచ్చేదెవరు
ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతికి వెతికి వేసారను
అదే ప్రశ్న నాకైతే నేను ఎవరికి తోడు వెళ్లాను
నేను చేసిన కర్మల తాలూకు పాపపుణ్యాలను బేరీజు వేసుకొంటూ
ఇది అంతా ఆ పైవాడి ఆట అని తెలిసుకొనే లోపు ఇంద్రియాల
పటుత్వాన్ని నిగ్రహానిగ్ర శక్తిని
బలవంతంగా లాగేసుకొని
ఈ బ్రతుకు ఇక చాలులే అని అంటూ బలవంతంగా నా ఊపిరికి ఉరితాడు బిగించి
కాయం నుండి వేరుచేసి కాడులో కట్టెను చేస్తుంది
కాల్చి బూడిద చేస్తుంది
నా అనే వాళ్లకు పంచింది
ఏదీ ఏదీ నాతో రాలేదు, రాదు కూడా
వెలుగుతున్న జ్ఞానజ్యోతి కాంతిని ఒడిసిపట్టుకొనే వరకు
అందరికి అన్ని తెలిసినా అంతా అయోమయం..అదే కాలమహత్యం
దైవం వేరే ఎక్కడో కాదు
- కాలమే దైవం

- గర్నెపూడి వెంకటేశ్వరరావు
మార్టూరు, 8341169772

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

ఆడేరు చెంచయ్య