నిజామాబాద్

కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటుచూసినా న్యూ ఇయర్ హంగామా
నిజామాబాద్, జనవరి 1: ఆంగ్ల నూతన సంవత్సరానికి కోటి ఆశలతో ఇందూరు ప్రజలు స్వాగతం పలికారు. 2015కు వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని ఆశిస్తూ ‘2016’ను సాదరంగా ఆహ్వానించారు. గురువారం అర్ధరాత్రి నుండి మొదలుకుని శుక్రవారం తెల్లవారుజాము వరకు జిల్లా అంతటా ఎటుచూసినా న్యూ ఇయర్ సంబరాలు కొనసాగాయి. పట్టణ ప్రాంతాల్లోనైతే యువత హడావుడికి అంతే లేకుండాపోయింది. కొత్త సంవత్సరం వేడుకలకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకున్న యువతీ, యువకులు సరిగ్గా రాత్రి 12గంటలు కాగానే రోడ్లపైకి చేరుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువకులు బృందాలుగా ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. ఈ క్రమంలో కొంతమంది విచ్చలవిడిగా మద్యం సేవించి, ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ బైక్‌లు అదుపుతప్పి చిన్నచిన్న ప్రమాదాలకు లోనయ్యారు. పలువురు యువకులు బైక్‌లపై ప్రధాన వీధుల గుండా షికార్లు చేస్తూ, మద్యం సేవిస్తూ బీరుబాటిళ్లను రోడ్లపైనే పగులగొట్టారు. హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థల్లోనూ నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. యువతీ, యువకులు ఎవరికి వారు తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించి బృందాలుగా ఏర్పడి ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో మునిగితేలారు. ప్రతి ఇంటి వద్ద డాబాలపై షామియానాలు, సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేసుకుని సినీ గేయాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ న్యూ ఇయర్ వేడుకను ఆస్వాదించారు. నిజామాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. తమతమ హోటళ్ల ముందు స్టేజీలను ఏర్పాటు చేసి, వాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో ఎంతో సుందరంగా అలంకరించి ఆర్కెస్ట్రా బృందాలతో యువతను ఆకర్షించారు.
మరికొంత మంది 2016వ సంవత్సరానికి నాంది పలుకుతూ పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలకు ఊపు తెచ్చారు. ధాబాలు మొదలుకుని హోటళ్లు, స్వీట్‌షాపులు, బేకరీలు, పూల బొకేల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. అనేక మంది కేకులు, మిఠాయిలు కొని కుటుంబ సభ్యులు, బంధువుల సందడి నడుమ వేడుకను నిర్వహించుకున్నారు. సాధారణంగా గురువారం రోజున అనేక మంది మాంసాహారం, మద్యం విందులకు దూరంగా ఉండడం ఆనవాయితీ అయినప్పటికీ, రాత్రి 12గంటల సమయం గడిచిపోయిన అనంతరం వారిలోనూ అనేక మంది మందు, విందులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపార వర్గాల వారు ముఖ్య కూడళ్లలో హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం రోజున మంచి పనులను తలపెడితే, ఏడాది కాలమంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో పలువురు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొంత మంది ప్రతీఏటా వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ, తమ స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి షిరిడీ, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు రాత్రంతా పెట్రోలింగ్ నిర్వహిస్తూ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా 20 స్పెషల్ పార్టీ బృందాలను నియమించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. కాగా, కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు తమతమ కార్యాలయాల్లో సిబ్బందితో కలిసి కేక్‌లు కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వివిధ శాఖల అధికారులు కలెక్టర్, ఎస్పీలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.