నెల్లూరు

165 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, మార్చి 31: జిల్లాలోని రైతులు పండించిన వరి ధాన్యానానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు రైతులు విక్రయించుకునేందుకు 165 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించి పటిష్టంగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. గురువారం కోవూరు, పాటూరు, యల్లాయపాళెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహణను పర్యవేక్షించి అక్కడ అమలుచేస్తున్న పనులపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కామన్ కేటగిరి క్వింటాల్ రూ. 1410లుగా, ఎ-గ్రేడ్ కేటగిరి క్వింటాల్ రూ. 1450లుగా నిర్ణయించారు. అలాగే కామన్ కేటగిరి రూ. 11,985లుగా, ఎ-గ్రేడ్ కేటగిరి పుట్టి రూ. 12,325లుగా మద్దతు ధరకు రైతులు నుండి కొనుగోలు చేసేందుకు జిల్లాలో 165 కేంద్రాలుగా గుర్తించగా, అందులో 53 కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆయా పరిధిలోని రైతులు సంబంధిత కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైతులు దళారుల ప్రలోభాలకు లోనుకాకుండా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించుకోవాలని కోరారు. ఈ విక్రయాలను వెలుగు, ప్రాథమిక పరపతి, వ్యవసాయ సంఘాల సమన్వయంతో సమర్ధవంతంగా జరిగేలా ఏర్పాటు చేశామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రయోజనం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ఓ ధర్మారెడ్డి, కొండయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కాగితం పులులు!
కాగ్ అడిగితే పిల్లులు
వృథా అవుతున్న ప్రభుత్వ ధనం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, మార్చి 31: కాగితాల్లో లక్ష్యాలు చెబుతున్న అధికారులు వాస్తవ లెక్కలు చెప్పలేకపోతున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగంలో అనవసరపు ఖర్చులను కాగ్ నివేదిక ఎత్తిచూపింది. నిధులు డ్రా చేస్తారు, వాటికి లెక్కలు చూపరు. నిర్మాణాలకు నిధులు విడుదల చేశామంటారు, వాటికి వివరాలు చూపరు. అడ్వాన్సు కింద ఇచ్చిన డబ్బులను కూడా వెనక్కి రాబట్టలేకపోయారు. ఇలాంటివి ఒకటేమిటి అనేక లోపాలను ఆడిట్ శాఖ ఎత్తిచూపింది. ప్రజాధనాన్ని సక్రమంగా ఖర్చు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో అవినీతి చోటుచేసుకుంది. జిల్లాలో సాగునీటి పథకాలు, భూసేకరణ, రోడ్ల నిర్మాణం, పాడి పశువుల పంపిణీ, రైతు పథకాల్లోను నిధులు దుర్వినియోగం అయ్యాయని కాగ్ తేల్చింది. సోమశిల, స్వర్ణముఖి లింక్ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో ఖర్చుపెట్టిన సాగు, తాగునీరు అందించలేని పరిస్థితిలో ఉంది. జిల్లాల్లో వరద గండ్లు పూడ్చేందుకు 2009లో 605.28 కోట్లు ఖర్చు పెట్టాలన్నది లక్ష్యం కాగా పెరిగిన వ్యయంతో సవరించిన అంచనాలు 652.71 కోట్లుగా చూపడంతో ప్రస్తుతం 47.42 కోట్లు అదనంగా ఖర్చుగా చూపారు. ఇప్పటివరకు 60.20 కోట్లు ఖర్చుపెట్టినా ఈ పనులు పూర్తికాలేదు. పెన్నా డెల్టా ఆధునీకరణ కింద పనుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంది. వెంకటాచలం, కృష్ణపట్నం రహదారి నిర్మాణం కింద నిధులు దుర్వినియోగం అయినట్లు కాగ్ ఆడిట్‌లో వెల్లడయింది. భూసేకరణపై వచ్చిన అనేక విమర్శలపై కాగ్ ఆడిట్ జరిపింది. దాంట్లో కూడా భూములు అధిక ధరలు చూపించి కొంత సొమ్మును కాజేశారని నివేదికలో పేర్కొంది. పశుసంవర్థక శాఖ నిర్వహించిన పశుక్రాంతి పథకంలో పశువులు, గొర్రెలు పంపిణీలో భారీ నిధులు డ్రా చేసుకున్నాయి. కానీ వాటికి లెక్కలు చూపలేదు. ప్రతియేటా నివేదికలు సమర్పించి మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఈ నివేదికలు ఎంతో సహకరిస్తూ వస్తున్నాయి. జరిగిన అవినీతి వ్యవహారాలను రూపుమాపేందుకు అధికారులు తప్పులతడకలు చూపిస్తున్నారు. కాగ్ నివేదికలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నా, వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. ఆర్థిక పద్దులు, వినియోగ పద్దులపై ఆడిటింగ్ జరిపి ప్రతియేటా నివేదికలు సమర్పించడం యథాతథం అయింది.

కాంగ్రెస్‌ను వీడిన వారంతా జీరోలు
ఆ రెండు పార్టీల్లోకి నాయకులే వెళ్లారు
ప్రజలు తమ వెంటే ఉన్నారు
టిడిపి, వైకాపాలు కుటుంబాల పార్టీలు
పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడి
నెల్లూరుసిటీ, మార్చి 31: కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి బయటకు వెళ్లినవారంతా వచ్చే ఎన్నికల్లో జీరోలు, పనికి రాకుండా పోతారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఇందిరాభవన్‌లో జరిగిన అంబేద్కర్ 125వ జయంతోత్సవంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయ సాధికారత యాత్ర సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు మాత్రమే టిడిపి, వైకాపాలోకి వెళ్లారని, ప్రజలు మాత్రం తమ పక్షాన ఉన్నారని అన్నారు. తెలుగుదేశం, వైకాపాలు కుటుంబాలకు చెందిన పార్టీలని విమర్శించారు. టిడిపిలో చంద్రబాబునాయుడు సిఎం పదవి వారి కుటుంబానికి తప్ప బయటివారికి అవకాశం ఇవ్వరన్నారు. అదేవిధంగా జగన్ పార్టీలో కూడా సిఎం పదవి ఆ కుటుంబానికి తప్ప బయట వ్యక్తులకు అవకాశం ఉండదన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఎవరైనా నాయకులు కావచ్చున్నారు. టిడిపి, వైకాపాలో కుటుంబాన్ని దాటి రాజ్యాధికారం ఎవరికీ ఉండదన్నారు. కాంగ్రెస్ ఒక కులం సొత్తు కాదని అన్ని కులాలకు చెందిన పార్టీ అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ బడుగులకు అత్యున్నతమైన పదవులను ఇచ్చిందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి జెండా నెల్లూరులో ఎగురుతుందని అన్నారు. టిడిపిలో ఎస్టీ, మైనార్టీలకు చెందిన నాయకులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన పోరాటం చేస్తుందన్నారు. అంబేద్కర్ 125వ జయంతోత్సవాలకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ చైర్మన్‌గా, కోచైర్మన్‌గా వినయ్‌కుమార్ ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ కారణజన్ముడన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ పేరును స్మరించుకోవడమే జీవితంలో చేసుకున్న పుణ్యం అన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఉన్నారని, వారి అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే దళితలకు అత్యున్నతమైన పదవులను ఇచ్చారని చెప్పారు. నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి శైలజానాధ్, డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

దక్కని గిట్టుబాటు ధర
* వేలం మొదలై ఐదు వారాలు
* దింపుడు కళ్లెం ఆశలో పొగాకు రైతు
ఆత్మకూరు, మార్చి 31: ప్రస్తుత సంవత్సరంలో పొగాకు వేలం ప్రక్రియ ఆరంభించి ఇప్పటికే ఐదు వారాలు పూర్తవుతోంది. ఇంతవరకు ఆశాజనకమైన స్థితిలోకి పొగాకు రైతు చేరలేదు. అలాగని పండించిన పొగాకు రాశిని విక్రయిస్తే నష్టపోయే దుస్థితి కూడా లేకపోవడంతో కర్షకులు సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాలోని రెండు వేలం కేంద్రాల్లోనూ ఇదే వైనం సాగుతోంది. కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. డిసి పల్లి వేలం కేంద్రంలో మాత్రం రైతులు ఊగిసలాడుతున్నారు. వాస్తవంగా డిసి పల్లిలో ఎప్పుడూ నిరసనలతోనే వేలం ప్రక్రియ ప్రారంభం కావడం ఆనవాయితీ. అయితే ఈదఫా ఇంతవరకు ఆ ఛాయలు కనిపించలేదు. ఏటేటా పొగాకు రైతు పరిస్థితి దింపుడు కళ్లెం ఆశలానే మారుతోంది. ఈ ఏడాది సగటున నాణ్యతాయుతమైన పొగాకు ఉత్పత్తి కావడం విశేషం. అయితే ఇదే సందర్భంలో పరిమాణంలో తేడా చోటుచేసుకుంది. నాణ్యమైన పొగాకు లభించినా బరువు రాకపోవడంతో రైతుల్లో ఒకింత వేదన చోటుచేసుకుంది. గత ఏడాది పరిస్థితి ఇందుకు విరుద్ధం. నాణ్యమైన పొగాకు చాలా తక్కువగా ఉత్పత్తి అయింది. అదే సమయంలో పొగాకు రాశి మాత్రం బాగానే ఉన్నా రైతులు తీవ్రంగా నష్టపోయారు. లోగ్రేడ్ ధర విపరీతంగా పతనమయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు గరిష్ట ధర 146 రూపాయల వరకు పలుకుతోంది. కనిష్ట ధర కూడా తొలుత 130 రూపాయల వరకు పలికినా క్రమేపి ఈ రేటు తగ్గుతూ 117కు చేరుకోవడంతో కర్షకుల్లో కలవరం నెలకొంది. రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేయడంలో సింహభాగం ఎప్పుడూ ఐటిసిదే. కొనుగోలు చేసే రాశిలో సగానికిపైగానే ఐటిసి చెంత చేరుతుంది. అయితే ఈ ఏడాది ఇంతవరకు ఐటిసి ప్రతినిధులు వేలం ప్రక్రియలో కీలక భాగస్వాములు కావడంలేదు. ఈ పరిణామం రైతులకు తీరని భంగపాటు. గరిష్ట ధర కిలో 146 రూపాయలు పలుకుతున్నా, ఐటిసి ప్రతినిధులు కేవలం 141 రూపాయలకే ధర స్థిరీకరణ దిశగా పావులు కదుపుతున్నారు. వేలం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు గరిష్ట ధరకు కొనుగోలు చేస్తున్నదంతా చిన్నాచితక కంపెనీలే. వారు కొనుగోలు చేయగలిగినన్ని రోజులు వదిలేయాలనేది ఐటిసి యోచనగా ఉంది. చిన్నాచితక కంపెనీలన్నీ వెళ్లిపోతే అప్పుడు రైతులు తమకే తలొగ్గి 141 రూపాయలకే కిలో పొగాకు ఇస్తారనేది అసలు సంగతి. ఇదిలాఉంటే ఒకప్పుడు సిరులు పండించిన పొగాకు నేడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వేలం కేంద్రాల అధికారుల అవకాశవాద వ్యవహార శైలి, కొనుగోలు కంపెనీల అక్రమాల పరంపరతో రైతులు కుదేలవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఏటేటా ఉత్పత్తి వ్యయం పెరుగుతుండటం వల్ల అదే స్థాయిలో ధరలు పుంజుకుంటునే పొగాకు రైతుకు మనుగడ. అందుకు విరుద్ధంగా గత ఏడాది చోటుచేసుకున్న అనుభవాల పరంపరతో ఈ సంవత్సరం పొగాకు సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. ప్రతి బ్యారన్‌లోనూ అనుమతులకు తగ్గట్లుగానే పంట సాగు చేశారు. ఇదిలాఉంటే జాతీయంగా, అంతర్జాతీయంగా పలు అంశాలు ప్రభావితం చోటుచేసుకోవడం కూడా పొగాకు సాగుకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.

మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు:ఆర్‌డిఓ
మనుబోలు, మార్చి 31: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, దళారుల చేతిలో మోసపోవద్దని నెల్లూరు ఆర్‌డివో కాసా వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. గురువారం ఆయన మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశిలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికి ఇతర రాష్టల్ర నుంచి వచ్చిన కొనుగోలుదారులు మంచి ధరలకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో తాము కొనుగోలు కేంద్రాలపై దృష్టి పెట్టలేదన్నారు. దీంతో అన్ని కేంద్రాలలో సక్రమంగా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. రెండు, మూడు రోజులుగా ధాన్యం కొనుగోలుదారులు రాకపోవడంతో ధరలు తగ్గాయన్నారు. రైతులను మోసం చేసే దళారులపై కఠనంగా వ్యవహరిస్తామన్నారు. బుధవారం మండలంలోని బద్దెవోలు ధాన్యం కేంద్రంలో పుట్టు 12,325 వంతున 34 పుట్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇతర జిల్లాల నుండి ఎక్కువగా మిల్లర్లు వస్తున్నారని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వారంలోపు రైతుల ఖాతాలలో నగదు జమ అవుతుందన్నారు. ఈ ప్రాంతంలో గోడౌన్ నిర్మాణానికి స్థలం కేటాయింస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం వెంకటాచలంలోని చవటపాళెం సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన వెంకటాచలం తహశీల్దార్ సుధాకర్‌తో కలసి పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ కెవి రమణయ్య, ఆర్‌ఐ సుజిత, విఆర్‌వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తర కాలువ ఎప్పటికి పూర్తయ్యేనో?
కొండాపురం, మార్చి 31: సోమశిల ఉత్తర కాలువ ఎప్పటికి పూర్తవుతుందోనని మండలవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ కాలువ పూర్తయితే మండలంలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. అసలే మెట్టప్రాంతమైన కొండాపురం మండలంలో పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తారు. మండలంలో 46 చెరువులు కింద వున్న సుమారు 15వేల ఎకరాలలో వర్షం కురిస్తేనే పంట పండుతుంది. మోపాడు రిజర్వాయరు కింద 4500 ఎకరాలు, రాళ్లపాడు రిజర్వాయరు కింద 4వేల ఎకరాల ఆయకట్టు మండలంలో ఉంది. అయితే ఈ రెండు రిజర్వాయర్లు ప్రకాశంజిల్లా పరిధిలో ఉండడంతో ఆ జిల్లా అధికారులు, రైతులు, నాయకులు చెప్పింది వింటేనే పంటలకు నీరు ఇస్తారు. లేకుంటే మండలంలోని ఆయా రిజర్వాయర్ల కింద పైర్లు ఎండిపోవాల్సిందే. నెల్లూరు జిల్లా నాయకులు, కాని అధికారులు కాని దీనిపై స్పందించే ధైర్యం చేయరు. ఇటువంటి పరిస్థితులలో ఉత్తర కాలువ పొడిగింపు త్వరగా జరిగితే మెట్టప్రాంతమైన కొండాపురం సస్యశ్యామలం అవుతుంది. అయితే ఈ కాలువ మండలంలోని చింతలదేవి గ్రామం వద్ద అర్ధాంతరంగా ఆగిపోయింది. దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కాలువను కొండాపురం వరకు పొడిగించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు కాని పనులు మాత్రం జరగలేదు. ఇటువంటి పరిస్థితిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కలిగిరిలో ఈ కాలువ పొడిగింపు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే కాలువ నిమిత్తం ప్రభుత్వం రైతుల వద్ద నుండి భూమిని సేకరించే విషయంలో సరైన విధానం అనుసరించక పోవడంతో రైతులు భూమిని ఇచ్చేందుకు నిరాకరించారు. ముఖ్యంగా కొండాపురం మండలం చింతలదేవి గ్రామ రైతులు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం చాలదంటూ 2009 సంవత్సరంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్లు కాలువ తవ్వకాన్ని ఆపేశారు. ఈలోగా వైఎస్ మరణానంతరం ఏర్పడ్డ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి మంత్రి కావడంతో ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఉత్తర కాలువను కొండాపురం నుండి రాళ్లపాడు రిజర్వాయర్ వరకు పొడిగించే విధంగా ప్రభుత్వంతో ఉత్తర్వులు జారీ చేయించారు. అయితే రైతులు కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ నష్టపరిహారం చెల్లించలేమని రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కోర్టుకు అందచేసింది. అయితే పట్టా భూములను కోల్పోతున్న రైతులు ఎవ్వరూ ఆ సరిహారాన్ని తీసుకోలేదు. ప్రభుత్వం నుండి అసైన్‌మెంట్ భూములను పొందిన కొందరు వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. అవి రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ సర్వే ప్రకారం పాతవారిపైనే నష్టపరిహారం వచ్చింది. అసైన్‌మెంట్ భూములను ఇతరులకు అమ్ముకున్నవారే మరలా కోర్టుకు వెళ్లి నష్టపరిహారం తెచ్చుకున్నారు. ఇందువల్ల వారు రెండు విధాలుగా లాభపడగా కొన్నవారు నష్టపోయారు. ఇదిలావుంటే తాము సాగునీటి కోసం బోర్లు, బావులు తవ్వించామని కాలువ వెళ్లే ప్రాంతంలో ఎన్నో బోర్లు, బావులు ఉన్నాయని వాటికి నష్టపరిహారం ఎవరు ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా వుంటే ఇటీవల తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ భానూప్రసాద్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యంరెడ్డి, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చింతలదేవి రైతులను ఒప్పించేందుకు ఆ గ్రామానికి వెళ్లి రైతులతో చర్చించారు. అయితే తాము ఎంతో విలువైన పంట భూములను కోల్పోతున్నామని, ఈ కాలువ వెళ్లే భూములలో బోర్లు, బావులు ఉన్నందున సంవత్సరం మొత్తం ఏదోఒక పంట సాగు చేసుకుని జీవిస్తున్నామని రైతులు అంటున్నారు. గతంలో కోరిన కోరికలనే మరలా వారికి తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇదిలావుండగా ఈ కాలువకు చింతలదేవి వద్ద ఉప్పుటేరుపై వీయర్ నిర్మాణానికి ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని శంకుస్థాపన చేశారు. అయితే రైతులు మాత్రం తమకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభిస్తే వాటిని అడ్డుకుంటామని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కాగా ఇటీవల రాళ్లపాడు నీటిని మండలంలోని సాయిపేట, భీమవరప్పాడు పంచాయతీలలో ఎండిపోతున్న వరి పైరుకు అందించేందుకు కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం అంగీకరించక పోవడంతో మండల రైతులు ఉత్తరకాలువను రాళ్లపాడు వరకు పొడిగించేందుకు విముఖత చూపుతున్నారు. భవిష్యత్తులో ఇందువల్ల ప్రజాపోరాటాలు జరిగే అవకాశం ఉందని పలువురు విశే్లషకులు అంటున్నారు. అయితే ఈ సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో? కాలువ పొడిగింపు పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని ఈ ప్రాంత రైతులు ఎదురుచూస్తున్నారు.