నెల్లూరు

మేరా బేటా బతికాడు..! (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మస్తాన్ సాయిబుకు వంద మేకలున్నాయి. వాటికి నలభై మేకపిల్లలున్నాయి. ఉదయగిరి దుర్గం చుట్టూ విశాలమైన అడవి ఆకుపచ్చని చెట్లతో పచ్చదుప్పటి పరచినట్లుగా ఉంటుంది. మేకలకు తిన్నంత మేత. ఏటా కనీసం పది మేకపోతుల్ని అమ్ముతాడు మస్తాన్. తెగతిని బాగా బలసిన ఈ కొండ మేకపోతుల మాంసం చాలా రుచిగా ఉంటుందని నెల్లూరు, కడప మొదలైన దూర ప్రాంతాల నుంచి వచ్చి మంచి ధర ఇచ్చి మేకపోతుల్ని కొనుక్కుపోతుంటారు. అంతేగాక ఏడెనిమిది ఈతలు ఈనిన ముసలిమేకల్ని అమ్ముతాడు.
మస్తాన్ సాయిబు కొడుకు పనె్నండేళ్ల ఛోటే సాయిబు మేకల దొడ్డి ఊడ్చి, మేకపిల్లల దొడ్డి తడిక విప్పాడు. మేకపిల్లలు అరుచుకుంటూ పరుగెత్తుకు వచ్చి మేకల దొడ్డిలో దూరాయి. మేకపిల్లలు అక్కడున్న వంద మేకల్లో ఎవరి తల్లిని అవి గుర్తుపడతాయి. వాడికి మేకలంటే చాలా ఇష్టం. మేక పిల్లలంటే ఇంకా ఇష్టం. మేక ఆరునెలలకొకసారి పిల్లనీనుతుంది. అదే మేకల కాపర్ల ముఖ్యమైన ఆదాయం. ఎరువు అమ్ముకోవడం మరో ఆదాయ వనరు.
మేక పిల్లలు పాలు తాగేలోగా వాటి దొడ్డిని శుభ్రంగా ఊడ్చాడు. మళ్లీ పిల్లల్ని దొడ్డిలో తోలి తడిక కట్టాడు ఛోటేసాయిబు. తరువాత పచ్చి మిరపకాయ నంజుకుంటూ కడుపునిండా గంజి త్రాగాడు. మేకల్ని తోలుకుని అడవికి బయలుదేరాడు.
మస్తాన్‌సాయిబుకు పాతిక సెంట్ల భూమి కూడా ఉంది. ఆరోజు దాంట్లో వేసిన కూరగాయల చెట్లకు అతనూ, భార్యా కలిసి నీళ్లు పోయాల్సి ఉన్నందున కొడుకు వెంట అడవికి పోలేదు.
ఛోటేసాయిబు సన్నగా, పొడవుగా ఉంటాడు. నడుముకు పుట్టగోచి పెట్టుకుని ఉన్నాడు. మొలతాడులో పదునైన కత్తి దోపుకుని ఉన్నాడు. దాని పిడి మొలతాడుకు ఆనుకుని క్రిందికి జారకుండా పట్టుకుని ఉంది. భుజం మీద పొడవైన కర్ర. దానికి చివర తగిలించిన రాగి సంగటి మూట.
వాడు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పడు మొలకు తగిలించుకున్న కత్తితో మేకపిల్లలకు చిన్నచిన్న చెట్టు కొమ్మలు నరికి నెత్తిన పెట్టుకుని తెస్తాడు. మేకపిల్లలకు ఏవేవో మాటలు చెప్పి, బుజ్జిగించి వాటికి తినడం నేర్పిస్తాడు.
అడవిలో మేకల కాపర్లు ఎక్కడెక్కడ ఉన్న వాళ్లంతా మధ్యాహ్నం పూట తినేందుకు సంగటి మూటలు ‘కొంగల గుంట’ దగ్గరకు తెచ్చుకుంటారు. మేకలు గుంటలో నీళ్లు త్రాగి చెట్ల క్రింద తీరిగ్గా విశ్రమిస్తే, మేకల కాపర్లు గుంటలో కాళ్లుచేతులు కడుక్కుని తాము తెచ్చుకున్న మూటలు విప్పి సంగటి తింటారు. ఆరోజు ఉదయానే్న అందరితోబాటు మేకల్ని తోలుకువచ్చిన ఛోటేసాయిబు అవి ఒకచోట మేస్తుంటే అడవిలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. వాడి నాయన అక్కడ లేడు కాబట్టి వాడిదే ఇష్టారాజ్యం. అలా అలా తిరుగుతూ వాడు దట్టమైన అరణ్యంలోకి వచ్చేసాడు. సామాన్యంగా అక్కడికి ఎవరూ రారు. అక్కడ క్రూరజంతువులుంటాయని భయం. కాని ఛోటేసాయిబు అవన్నీ ఆలోచించడం లేదు. చిక్కని కొమ్మలతో ఆకాశమంత ఎత్తున్న ఆ చెట్లు వాడికెంతో ఆనందాన్ని కలుగుజేస్తున్నాయి.
వాడలో తిరుగుతోంటే వాడికొక పెద్ద వెలగచెట్టు కనిపించింది. వెలగచెట్టు నిండా పెద్దపెద్ద కాయలు కనిపిస్తూ వాడికి నోరూరిస్తున్నాయి. ఇక వాడు క్షణం ఆలస్యం చేయలేదు. చేతిలోని కర్ర క్రిందపడేసి చకచకా చెట్టెక్కి ఒక కొమ్మమీద నిలబడ్డాడు. అందిన కాయను కోసి చెట్టుకేసి కొట్టి పెంకు తీసి లోపల మెత్తగా, తీయగా ఉన్న గుజ్జు తిన్నాడు. పైకి చూసిన ఛోటేసాయిబుకు చిక్కని కొమ్మలతో ఆకాశమంతా వ్యాపించినట్లున్న వెలగచెట్టు. బాగాపండిన వెలగపండ్లు చెట్ల కొనకొమ్మలమీద కనిపించాయి.
తింటే ఇలాంటి కాయలే తినాలనుకున్నాడు ఛోటేసాయిబు. చెట్టు ఎక్కడంలో వాడు అఖండుడు. కోతికంటే వేగంగా చెట్టెక్కగలడు. అంతే చెట్టుకాండాన్ని ఆధారంగా చేసుకుని, కాండం పట్టుకుని కొమ్మల్ని మెట్లుగా చేసుకుని చెట్టు కొనకొమ్మకు చేరాడు. దూరంగా కొండమీద దుర్గం బురుజులు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచే దుర్గానికి సలాం చేశాడు. వాడి హృదయం ఉప్పొంగి పోయింది. ఒకప్పుడు అక్కడ హిందూ చక్రవర్తులు తమ రాణులతో, ముస్లిం చక్రవర్తులు తమ బేగంలతో నివసించారన్నదే కారణం. అక్కడ గుర్రాలు, ఏనుగులు తిరిగేవని తెలిసి పులకించిపోయేవాడు. వాడు అక్కడ నుంచి అనేక పండ్లు త్రుంచి క్రిందికి వేశాడు. వెళ్లేప్పుడు వాటిని ఏరుకుని ఇంటికి తీసుకువెళ్లి తన చిన్నారి తమ్ముడికి, చెల్లెలికి ఇచ్చి వాళ్లను ఆనందింపజేయాలనేది వాడి కోరిక. కాని కింద చెట్టుకొమ్మల్లో వాడికోసం ఒక మృత్యుదేవత కాసుకుని ఉందని వాడికి తెలియదు.
వాడు చెట్టు ఎక్కే హడావుడిలో చెట్టు మధ్యలో కొమ్మల్లో కలిసిపోయినట్లుగా ఒక కొమ్మ మీద పడుకుని ఆహారం కోసం ఎదురుచూస్తున్న కొండ చిలువ తలమీద కాలుపెట్టి ఎక్కాడు. ముందే ఆకలి మీద ఉంది. దానికి తోడు తన తల మీద కాలుపెట్టి వెళ్లేసరికి అది కోపంతో తలెత్తి చూసింది. కోతి కంటే వేగంగా ఎక్కుతున్న ఛోటేసాయిబు కనిపించాడు. మంచి ఆహారం దొరకబోతుందన్న ఆనందంతో క్రిందికి దిగి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది. దానికి కోతుల్ని మింగడం చాలా ఇష్టం. అవి దొరకనప్పుడు చిన్నచిన్న జంతువులను మింగుతుంది. ఈరోజు ఏమీ దొరకలేదు. అందువల్ల మంచి ఆకలిమీద ఉంది. కానీ ఇప్పుడు నున్నగా, మెత్తగా, వెన్నలా ఉన్న ఛోటేసాయిబు మానవదేహం కనపడేసరికి ఎప్పుడెప్పుడు వాటంగా పట్టుకుని మింగుదామని ఎదురుచూస్తూ ఏమీ తెలియనట్లు కొమ్మమీద నిశ్శబ్దంగా పడుకుని ఉంది.
ఛోటేసాయిబు దిగడం మొదలుపెట్టాడు. కొండచిలువ ఉన్న కొమ్మమీద మొదట కుడికాలు పెట్టి, ఎడమకాలు పెట్టేలోగా విసురుగా తల తిప్పుకుని తన వెడల్పైన నోరు తెరచి వాడి రెండుకాళ్లను మోకాళ్ల వరకు మింగేసింది. వాడి బరువుకు కొండచిలువ శరీరం మూడోవంతు కొమ్మమీద నుంచి జారి గాలిలో వ్రేలాడసాగింది. దాంతో బాటు ఛోటేసాయిబు కూడా తలక్రిందులుగా గాలిలో వ్రేలాడసాగాడు.
వ్రేలాడుతున్న ఛోటేసాయిబు ప్రాణభయంతో వెర్రికేకలు పెట్టసాగాడు. ‘‘నాయనా కొండసిలవ.. కొండసిలవ నన్ను మింగేసింది’’ అంటూ కేకలు పెట్టాడు.
మస్తాన్‌సాయిబు తోట పని అయిన తర్వాత ఇంట్లో అంత సంగటి తిని కొడుకునెతుక్కుంటూ అడవిలోకి వచ్చాడు. ఛోటేసాయిబు ఎక్కడా కనిపించలేదు. మేకలు మాత్రం అలవాటు ప్రకారం వేళకు నెమళ్లగుంట సమీపంలో మేస్తున్నాయి. మిగతా మేకలకాపర్లను వాడి ఆచూకీ గురించి అడిగాడు. ఎవరూ తమకు తెలియదన్నారు. యధాప్రకారం ఛోటేసాయిబును పిలుస్తూ చెట్ల మీద చూస్తూ చాలాసేపు వెతికాడు. కాని ఛోటేసాయిబు ఎక్కడా కనిపించలేదు. తరువాత బడేసాయిబు మళ్లీ నెమళ్లగుంట దగ్గరకు వచ్చి, వాడెక్కడా కనబడ్లేదని, ఎక్కడికి వెళ్లి ఉండవచ్చని, తోటి మేకల కాపర్లను తన కొడుకు సంగతి అడిగాడు.
దానికి వాళ్లు, కొంత కోపం ప్రదర్శిస్తూ ‘‘నువ్వు లేకపోతే నీ కొడుకు మా మాట ఇంటాడా. వాడు పెద్దడివిలోకి పొయ్యినట్లున్నాడు. ఎళ్లి ఎతుక్కో’’ అన్నారు.
‘‘ఆడ సిరతపులులూ, తోడేళ్లు, కొండ సిలవలూ ఉంటాయి గదయ్యా. ఆడకి పోతంటే మీరయినా ఆపగుడదంటయ్యా’’ అన్నాడు భయం భయంగా.
వాళ్లు కోపంగా, ‘‘ఆ సంగతి వాడికి తెలియదా. అయినా వాడు మాతో సెప్పి పోకుండా పోవద్దని సెప్పడానికి. ఆడికి పోయుంటాడని మా అనుమానం’’ అన్నారు.
మస్తాన్‌సాయిబుకు కూడా పెద్దడివికి పోవాలంటే భయమే. అయినా బిడ్డకోసం పోక తప్పదు. అందుకే చేతిలోని కర్ర వాటంగా పట్టుకుని ఛోటేసాయిబును కేకలేస్తూ పెద్దడివిలోకి వచ్చాడు. ఈయన కేకలు వాడికి వినబడలేదు గాని, వాడి వెర్రికేకలు గాల్లోంచి మస్తాన్‌సాయిబుకు వినిపించాయి. ఆ చిక్కని అడవిలో పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ వెలగచెట్టు క్రిందికి వచ్చాడు.
గాల్లో వ్రేలాడుతున్న మీరాసాయిబును కొద్దికొద్దిగా నడుముల వరకూ మింగేసింది కొండచిలువ. మస్తాన్‌సాయిబుకు పై ప్రాణాలు పైనే్న పోయాయి. అంతపెద్ద కొండ చిలువను అతను జీవితంలో చూళ్లేదు. చిరుతపులిని కూడా అమాంతంగా మింగేయగల కొండ చిలువ అది. తండ్రి చూసి మరింత పెద్దగా ఏడవసాగాడు కొండచిలువ నోట్లోంచి ఇరవై అడుగుల ఎత్తులో తలకిందులుగా వ్రేలాడుతున్న ఛోటేసాయిబు.
‘‘బాబా.. నేను సచ్చిపోతాను బాబా. రచ్చించు బాబా’’ తండ్రిని చూసి ఇంకా అరవడం మొదలుపెట్టాడు.
మస్తాన్‌సాయిబు కడుపు తరుక్కుపోయింది. ‘‘నేనేం సేసేదిరా బేటా.. దయలేని ఆ కొండసిలువ నన్ను మింగినా బాగుండేదిరా బేటా’’ అంటూ చేతిలోని కర్రను గిరగిరా గాల్లో తిప్పి కొండచిలువ మీదకు విసిరాడు. అది కొండచిలువకు తగల్లేదు. అయిదడుగుల క్రింద వరకు వచ్చి తిరిగి నేలమీద పడిపోయింది.
మస్తాన్‌సాయిబు ముసలివాడయినందున అంత పెద్దచెట్టు ఎక్కలేడు. ఎక్కినా దానె్నదిరించి గెలవలేదు. అతను చూస్తుండగానే కొండచిలువ ఛోటేసాయిబును పూర్తిగా మింగేసింది.
‘‘యా అల్లా’’ అంటూ క్రిందబడి తల బాదుకోసాగాడు మస్తాన్‌సాయిబు. ‘‘మేరీ ప్యారీ బేటా ఏడని మీ అమ్మాజాన్ అడిగితే ఏమని చెప్పేదిరా. నీ చోటా బెహన్‌కి, నీ చోటా భాయికి ఏడకిపోయావని సెప్పేదిరా. అల్లా నేనిక్కడే మర్‌గయా అయిపోతా’’ అంటూ భోరున ఏడవసాగాడు.
ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ‘‘బాబా’’ అన్న ఛోటేసాయిబు గొంతు వినిపించింది సమీపంలోంచి. ఏడుపు ఆపి తలపైకెత్తి చూసిన మస్తాన్‌సాయిబుకు ఎదురుగా నిలబడి ఉన్నాడు ఛోటేసాయిబు.
మస్తాన్‌సాయిబు ఆశ్చర్యానందాలతో వాడ్ని చూసాడు. మేరా బేటా బతికాడు.. అంటూ చిందులేశాడు. వాడి ఒళ్లంతా జిగట అంటుకుని ఉంది. వాడి మొలలోని పదునైన కత్తికి రక్తం అంటుకుని ఉంది. విషయం అర్ధమైన మస్తాన్‌సాయిబు పక్కకు తిరిగిచూశాడు. రెండుగా చీలి కొండ చిలువ కొద్ది దూరంలో తెగిన గాలిపటంలా పడి వుంది. ‘వాడి మొలలోని కత్తే వాడిని కాపాడింది’ అనుకొంటూ వాడ్ని వడివడిగా నడిపించుకుంటూ కొంగలగుంట దగ్గరకు తీసుకుపోయాడు వాడికి స్నానం చేయించడానికి.

- పోట్లూరు సుబ్రహ్మణ్యం, నెల్లూరు
చరవాణి : 9491128052

స్పందన

అవయదానం విలువ తెలిపిన మట్టిపొరలు
గత వారం మెరుపులో పెండ్యాల గాయత్రి గారు రాసిన మట్టిపొరలు కథ చాలా సందేశాత్మకంగా సాగింది. కథలో ఓ పాఠశాల ఉపాధ్యాయుని ఏమైనా చేయగలదు అని నిరూపించారు. ఉపాధ్యాయులు తలచుకుంటే విద్యార్థుల నుంచి అద్భుతాలు సృష్టించగలరు అని చెప్పేందుకు ఈ కథ ఓ ఉదాహరణ. కథలో విద్యార్థులకు అవయవదానం గురించి అర్ధమయ్యేలా చెప్పి వారిలో మార్పు తెచ్చిన తీరు బాగుంది. కథలో రసూల్ పాత్రను మలచిన విధానం బాగుంది. ముఖ్యంగా పిల్లల్లో ఏదైనా విత్తనం నాటి దానికి నీళ్లు క్రమం తప్పకుండా పోస్తే అది కచ్చితంగా ఫలితం ఇస్తుంది.
- మల్లిపోగు శర్మ, రిటైర్డ్ లైబ్రేరియన్,అల్లూరు.
- వల్లెపు కృష్ణవేణి, కందుకూరు

కళ్లు తెరిపించిన నిష్ఠూర సత్యం
రచయిత బాలు గారు గొప్ప మేధావితనం ప్రదర్శించారు గత వారం మెరుపులో ప్రచురించిన నిష్ఠూర సత్యం కవితలో. కవితలో ఓ మనిషి అంటూ మొదలెట్టి చివరి వరకు మానవ నైజాన్ని ఎండగట్టిన తీరు బాగుంది. నిజంగా మనిషి తీరు ఒక్కొక్కరిలో ఒక్కొలా ఉంటుంది. చాలామంది తమ అవసరాలకు ఏవేవో చేస్తుంటారు.. అవసరం తీరిన తరువాత అన్నీ బుట్టదాఖలు చేసేస్తారు. అందితే జుట్టు పట్టుకుంటారు..లేకపోతే కాళ్లుపట్టుకుంటారు ఇలా సమాజంలో రకరకాల మనుషులు..రకరకాల ఆలోచనలు. వీటన్నింటిని కళ్లకు కట్టినట్లు చూపిన తీరు బాగుంది. అయనా మనం మారం.
- అనంత గిరిబాబు, మాళవ్యనగర్, గూడూరు

నేటి సమాజానికి దగ్గరగా మానవత
మెరుపులో మానవత కవిత నేటి సమాజంలో జరిగే తంతును అక్షరం పొల్లుపోకుండా చూపింది. మహాత్మాగాంధీ మద్యపానం నిషేదం అంటే ఇప్పుడు మేము మద్యపాన ప్రియులను పెంచాం, ఊరురూ మద్యపానశాలలు తెరిచాం. సత్యం గాంధీ అస్తమ్రేతే...హింసే మా మార్గం అంటూ అప్పటికీ ఇప్పటికీ ఉన్న వ్యత్యాసాన్ని చాలా చక్కగా పోల్చి సగటు పాఠకుడికి అర్ధమయ్యేలా రచన చేయడం బాగుంది.
- శ్రీ్ధర్, కావలి,
- నందిపోగు హేమశ్రీ, నెల్లూరు.

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

జీవితమంటే
చీకటి గుహలాంటి
మాతృగర్భం నుంచి
తేజో ప్రస్థానం వైపు
ఆకాశం దద్దరిలేటట్లు
రూపు లేని రేపటిలో
హాయిలేదని రోదన చేస్తూ
శిశువుగా జన్మించి
జగత్తనే ఊయలలో పరుండి
భవిత కోసం కలలుకంటూ
దిగంతాలపై దృష్టిని నిల్పి
నింగికి నిచ్చెనలేసే ఆలోచనలు
విలాసాల మృగతృష్ణను
చేరుకోవాలనే ఆరాటం
నానా గడ్డి కరచి
ఎందరి బ్రతుకులనో బుగ్గిని చేసి
పరమపద సోపానంలో
పరుగు పరుగున వెళ్లి
పామునోట్లో పడ్డట్టు
కష్టాల కడలిలో చిక్కి
ధైర్యమనే నావలో పయనించి
సుఖాల తీరం చేరుకోవడమే
జీవితమంటే.

- ఆడేరు చెంచయ్య,
నాయుడుపేట
చరవాణి : 9492331449

డిస్పోజబుల్ అమ్మ
అవును.. ఆమె అమ్మట..
ఏమో ఒకప్పుడు అంటే నేనెలా మలచబడతానో
నేనెందుకు పుడుతానో తెలియని
ఎర్రటి మాంసపు ముద్దపుడు..
నా భారాన్ని మోస్తూ గర్భంలో
వెచ్చగా భద్రంగా దాచి కాపాడుకొస్తున్న
అమ్మ రక్తాన్ని వౌనంగా పీల్చి
జీర్ణించుకుంటూ తొమ్మిది నెలలు గడిపానట.
నను కన్న ప్రేగుమంట ఆరక ఆకలితో ఉన్న
అమ్మ నోటి దగ్గర ముద్దను
ఒక ఏడ్పుతో ఆపిన నాకు అన్నప్రాసన రోజున
ప్రేమతో కలిపిన అమ్మచేతి
గోరు ముద్దను.. ఆ గోరుముద్దను?
తిన్నందుకు జీవితాంతం అమ్మను
పోషించాలట..
‘‘అమ్మది ఎంతటి స్వార్థం’’?
నలభై అయిదేళ్ల తరువాత ఇప్పుడు విన్న
‘‘అమ్మతనం’’ గురించి
ఎవరో చెబుతుంటే సమయాభావం వల్ల
కొంత విన్నా!
జన్మనిచ్చే సమయాన పంచభూతాలను సైతం
సంభ్రమాశ్ఛర్యాలకు గురిచేసే
అమ్మశక్తి కమ్మతనం గుర్తెరగని నాకు
బారసాల చేసి పెంచి పెద్దచేసి
సహజంగా మానవాకృతి పోలి ఉన్న
నన్ను మనిషిని చేశాననుకుని భ్రమపడిన అమ్మను
‘ ఓల్డేజ్ హోం’లో పడేశా..
‘ప్రేమగా నేను అమ్మనురా’ అంది నేను
వెనుదిరుగుతుంటే,
మానవీయత నిండిన కన్నీటిని విశ్వంపై చల్లుతూ..!!

- కాళిదాసు ఆనంద్, చరవాణి : 7330737033

సర్కారు చదువులు
మారాలి
బడిపంతులు...
బడిపంతులు
బతకలేని వాడు బడిపంతులు
ఆరోజుల్లో.
పొట్టకూటి కోసం విద్య నేర్పే
ప్రతి ఒక్కరూ పంతులే ఈ రోజుల్లో.
అందుకే స్కూళ్లు ఇలా
అఘోరిస్తున్నాయి
ఆ చదువులే దిట్ట
ఈ చదువులు సొట్ట
పేరుకే సర్కారు బళ్లు
కనీస వసతులు లేక
కంపుకొడుతున్నాయి
ఇంగ్లీషు మీడియం స్కూల్ అంటే సరదా
ఇంగ్లీషు రానివాళ్లకెందుకు దురద
బడికెందుకెళతారో వారికి
తెలియదు.
బడిలో టీచరుండడు,
దానికితోడు పిల్లలగోల
వినడానికి అనిపిస్తుంది అవహేళ
నూటికో కోటికో ఉన్నారు నిజమైన టీచర్లు
క్రమశిక్షణతో చదువు చెప్పే టీచర్లు తక్కువే
మారాలి సర్కారు సూళ్ల పరిస్థితి
మారాలి ఈ విద్యావ్యవస్థ
గుర్తించాలి విద్యార్థులు పడుతున్న అవస్థ
పిల్లలకు చదువు నేర్పించే దృక్పథం కలగాలి
సరియైన లక్ష్యంతో పనిచేస్తే
ప్రతి టీచర్ అభినందనీయుడే.
సర్కారు స్కూళ్ల అథోగతి శూన్యం
సర్కారు బళ్లే ఇక విద్యార్థులకు శరణ్యం
సహృదయంతో సర్కారు టీచరు
పనిచేయాలని కోరుకుంటూ
నేటి విద్యార్థులనే దేశానికి
వెనె్నముకలుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ..

- పాలపర్తి శ్రీనివాసకుమార్, కావలి
చరవాణి : 88860 86635
email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- పోట్లూరు సుబ్రహ్మణ్యం