నెల్లూరు

డిమాండ్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరులో చైన్నై బస్సు ఎక్కిన కిరణ్ కండక్టర్‌కు టిక్కెట్‌కు సరిపడా డబ్బులు చెల్లించి లోనికెళ్లి కిటికీ పక్క సీటు ఎంచుకుని అందులో కూర్చున్నాడు. బస్సు ముందుకు కదులుతుంటే ప్రకృతి వెనక్కు వెళ్లడాన్ని చూసి ఆనందిస్తున్నాడు. అనుకోకుండానే తన చిన్ననాటి జ్ఞాపకాలు మనోఫలకంపై కదలాడాయి. చిన్నప్పుడు రైలులో అమ్మనాన్నలతో కలిసి వెళ్తున్నప్పుడు స్తంభాలు వెనక్కు వెళ్లడాన్ని నాన్నని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు అదంతే అని విసుక్కుంటూ నాన్న చెప్పిన సమాధానం మళ్లీ తళుక్కున మెరిసి మాయమైంది. బస్సు గూడూరు జంక్షన్ వద్దకు రాగానే కొంచెం నెమ్మదించింది. స్పీడుగా వెనక్కు వెళ్తున్న పొలాలు, స్తంభాలు కొద్దిగా నెమ్మదిగా వెళ్తున్నట్టు కన్పించాయి కిరణ్‌కు. తర్వాత స్తంభాలు, పొలాలు కూడా వెనక్కు వెళ్లడం ఆగాయి. ఒక్క కుదుపుతో బస్సు కూడా ఆగింది. కుదుపునకు ఊహాలోకంలోనుంచి బైట ప్రపంచానికి వచ్చిన కిరణ్ కిటికీ అద్దం కొంచెం పక్కకు తొలగించి బుర్రబైటకు పెట్టి ఏమైందో చూశాడు. ఎవరో జెండాలు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎర్రజెండాలు పట్టుకుని రోడ్డుకు అడ్డంగా నిలబడి నినాదాలు చేయడం కిరణ్‌కు కనపడింది. సమాచారం పూర్తిగా అందలేదు కాని వారి సమస్యల సాధనకోసం ఆందోళన బాట పట్టారని గ్రహించాడు. అరగంట సేపు బస్సు అలానే రోడ్డుపైనే ఉండిపోయింది. పోలీసులు వచ్చారో... ఇక లాభంలేదనుకున్నారో... ఫోటోలకోసం ఫోజలిచ్చామనో తెలియదు కాని ఆందోళనకారులు ఒక్కొక్కరే జారుకున్నారు. ట్రాఫిక్ క్లియరైంది. కిరణ్ కూర్చున్న బస్సు కూడా నెమ్మదిగా కదులుతూ క్షణాల్లో స్పీడందుకుంది. యధాలాపంగా కిరణ్ మళ్లీ కిటికీలోనుంచి ప్రకృతి అందాలను పరవశంతో చూస్తున్నాడు. ఇప్పుడు బస్సు ఆంధ్రా తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉంది. అక్కడ మరో ఆందోళన. అయితే రోడ్డు పక్కగా నడుచుకుంటూ నినాదాలు చేసుకుంటున్న ఆందోళనకారులను ఓర కంట చూసి వాళ్ల నినాదాలు వినడానికి విశ్వప్రయత్నం చేశాడు. వాహనాల రొదలో ఒక్కటీ అతనికి అర్థం కాలేదు. మెల్లమెల్లగా బస్సు ముందుకెళ్లింది. బస్సు చెన్నైకి సమీపంలోకి రాగానే మళ్లీ ఆగింది. ఇప్పుడు ప్రయాణికులు దిగుతున్నారేమో అని చూశాడు కిటికీలోనుంచి కిరణ్. ప్రయాణికులెవరూ బస్సు దిగలేదు. మరి బస్సు ఎందుకు ఆగింది అని తరచి ఆలోచిస్తుండగానే. తమిళనాడులో ప్రాథమిక స్థాయలో తెలుగుమాధ్యమం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపై టైర్లు పెట్టి దగ్ధం చేయడంతో రోడ్డు బ్లాక్ అయిందని, వేరొక మార్గం ద్వారా వెళ్లాలని అక్కడ సెంట్రీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రతీ వాహన చోదకునికీ చెపుతున్నాడు. బస్సు కొంచెం వెనక్కు వచ్చి మరో మార్గం ద్వారా కోయంబేడు వైపు పయనమైంది. కొంతసేపటికి కోయంబేడు బస్టాండ్‌లో బస్సు ఆగింది. అందరితోపాటు కిరణ్‌కూడా లగేజీని తీసుకుని దిగాడు. ఆటోవైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లాడు. అందులో ఎక్కి మెరినా బీచ్‌వైపు సమీపంలో చెల్లెలు ఆశాలత ఇంటికి చేరుకున్నాడు.
గుమ్మంలో అన్నయ్యను చూసిన లత ఉబ్బితబ్బిబ్బయంది. ఆప్యాయంగా ‘రా అన్నయ్య’ అంటూ చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లింది. ఇంటర్ చదువుతున్న లత కుమారుడు కార్తీక్ మామయ్యచేతిలో బ్యాగ్ అందుకుని ఇంట్లో పెట్టాడు. కిరణ్ ఇంట్లో సోఫాలో కూర్చుని సేదతీరాడు. కొంతసేపటికి కార్తీక్ ‘ఇంద మావయ్య ’అంటూ కొన్ని దినపత్రికలు చేతిలో పెట్టి ‘మమీ ఫ్రెండ్స్‌తో బైటకెళ్లి వసా’్త అంటూ వెళ్లిపోయాడు. కాసేపు పత్రికలు తిరగేసి మెయిన్ హెడ్డింగ్స్‌నే చూశాడు. అందులో కూడా ఆందోళనలు- అరెస్టులే ఎక్కువగా కన్పించాయి కిరణ్‌కు. సాయంత్రం చెల్లెలు, బావగారు, మేనల్లుడితో బీచ్‌కు వచ్చి కొద్దిసేపు సరదాగా గడిపాడు. ఇంటికెళ్లాక చెల్లెలు ఆప్యాయంతో చక్కటి భోజనం వడ్డించడంతో తిని అలా మంచంపై వాలిపోయాడు. ప్రయాణ బడలికతో కిరణ్ వెంటనే నిద్రలోకి జారుకున్నాడు.
***
బీచ్ ఒడ్డున ఒక భవనం. అందులో దాదాపు 150మంది దాకా పోగయ్యారు. అందులో కిరణ్ కూడా ఒకరు. మూడు కుర్చీలతో వేదిక ఒకటి సిద్ధంగా ఉంది. పెద్దాయన ఒకరు ఒకదానిలో కూర్చున్నాడు. అటు ఇటు పాతికేళ్ల ప్రాయంలోని వారు కూర్చున్నారు. బహుశా అదో అసోసియేషన్ సమావేశం అయి ఉండొచ్చు. దానికి పెద్దాయన గౌరవ అధ్యక్షుడు. అటు ఇటు ఉన్న వారు అధ్యక్ష కార్యదర్శులు కావొచ్చు. ప్రతిరోజూ బీచ్ వరకు వెళ్లి సముద్రంలో స్నానం చేస్తున్న మనమంతా ఒక వేదికపై వచ్చి సమావేశం కావడం ఎంతో సంతోషకరం అని ఉపన్యాసం ప్రారంభించాడు పెద్దాయన. దేశంలో చాలామంది తమ తమ సమస్యల సాధనకోసం ఆందోళనలు చేస్తున్నారు. మనం కూడా మన డిమాండ్ల సాధనకోసం ఆందోళన చేయడంలో తప్పేమీలేదు. వేముల రోహిత్ చట్టంకోసం ఆ సామాజిక వర్గం వారు ఆందోళన చేస్తున్నారు. తమిళనాడులో ప్రాథమిక స్థాయిలో తెలుగుమాధ్యమం రద్దును నిరసిస్తూ అక్కడ వారు ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల్లోనూ అలజడులు, అశాంతులు వారి సమస్యల సాధనకు వారు పోరాటం చేస్తున్నారు అంటూ కొన్ని దినపత్రికల్లో వచ్చిన వాటిని చూపిస్తూ ఉపన్యాసం ముగించాడు. వేదికపై ఒక యువకుడు తన ప్రసంగంలో ఇదే మంచి సమయం, మనం కూడా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకీ మన సమస్య ఏమిటంటే... వేదిక దిగువన ఉన్నవారంతా ఊపిరి బిగబట్టుకుని శ్రద్ధగా వింటున్నారు. సముద్రం వరకు మనం వెళ్లే అవసరం లేకుండా సముద్రమే ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సమ్మతించేవారంతా చేతులు పైకెత్తండి అంటూ ఉద్వేగంగా అన్నాడు. చాలామంది బాగుందంటూ సముద్రం ముందుకు రావాలి.. సముద్రం ముందుకు రావాలి అంటూ నినాదాలు చేశారు. కిరణ్‌కూడా వారితో గొంతుకలిపాడు.
సముద్రం ముందుకు రావాలి అంటూ నిద్రలో ఉన్న కిరణ్ పలవరిస్తూ నినాదాలు చేయడంతో అన్నయ్యా అంటూ చెల్లెలు లత తట్టిలేపి కలగంటున్నావ్ అని అనగానే ‘అదంతా కలా’ అని ముసిముసి నవ్వులతో మంచంపై నుంచి లేచి బాత్‌రూమ్ వైపు నడిచాడు.

- గౌతమి
9347109377

హేమలంబ మాలిక

నవరత్నాల నవాబ్ది
మల్లె మొగ్గలు ముత్యాలుగా
మావిచివుళ్లు పగడాలుగా
మంకెనపూలు కెంపులుగా
మామిడి పిందెలు పచ్చలుగా
పుష్ప పరాగాలు పుష్యరాగాలుగా
తుమ్మెదలు, కోయిలలు ఇంద్రనీలాలుగా
వేపపూతలు వజ్రపు తునకలుగా
కుసుమరసాలు గోమేధికాలుగా
తరువరుల హృదయాలను
తమకంతో అల్లుకున్న
విరితీగ వధువుల
మేని విరుపుల వైఢూర్యాలుగా
నవరత్నకాంతులతో వచ్చింది
నవాబ్ది
నవోదయ నాంది

- చిరమన వెంకట రమణయ్య
గూడూరు
చరవాణి : 9441380336

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

చిరుకవిత

ఉగాది సంబరాలు
అరుణ కిరణ శోభతో
అవని పులకరించింది
ప్రకృతిమాత క్రొంగొత్త
సోయగాలతో పరవశించిపోయింది
సృష్టంతా చైతన్యవంతమై
ఆమని వికసించింది.
ఋతువులలో ఋతురాజం
వసంతం - వసంతాగమనంతో
ప్రకృతి, నవవికసిత పల్లవములతో
పచ్చగా కళకళలాడుతుంటే
కుహు..కుహు..మని కోకిలలు
సప్తస్వరాలు ఆలపిస్తున్నాయి
విరిజల్లులతో - మలయమారుత
పవనాలు - మైమరిపిస్తుంటే
మనసంతా - రాగరంజితవౌతుంది
ఈ శుభసందర్భంలో..
శ్రీ హేమలంబి నామ సంవత్సరమా!
నీకిదే - మా ఆత్మీయ - ఆహ్వానం
షడ్రుజుల సమ్మేళనమే కదా!
తెలుగు ఉగాది - తెలుగు సంస్కృతి
నీ ఆగమనం - మాకు శుభసంకేతం
ఓ! తెలుగుతల్లి ముద్దుబిడ్డలారా!
మానవ జీవితం - శిశిర వసంతాల
సంగమం - అందుకనే
నూతన సంవత్సరంలో
పంచాంగ శ్రవణం చేసి
కష్టసుఖాలను సమీక్షించుకొని, సంస్కారవంతమైన
సర్వమానవాళి ప్రశంసించే
జీవన పథంలో పయనించు
సకలాంధ్రులు శాంతి, సౌభాగ్యాలతో
వర్థిల్లాలని - ఆకాంక్షించు..!

- కొడవలూరు ప్రసాదరావు
చరవాణి : 8500757622

మనోగీతికలు

హృదయ వసంతం
గతం గుండె గాయాలని
వర్తమాన రాగాల వసంతాలతో
నిలువెల్లా నిర్మల భావ వీచికల లేపనంతో
ఉపశమనం కలిగించాలి
గతాన్ని వెంటాడేకలలా
మరుపురాని దృశ్యంలా
గుండెనిండా నింపుకోవాలి
వచ్చే వసంతాన్ని అనురాగ ధారతో
చిగురింపచేయాలి
జీవితాన్ని సామరస్యంగా
పన్నీర్ జామూన్‌లా మలచుకోవాలి
పసిపాప చిరునవ్వులో
వసివాడని యెద పరిమళంలా
గుండె గుండెలో స్వచ్ఛత
గడప గడపలో మానవత
ప్రతి అడుగులో
ప్రతి బాటలో వెల్లివిరియాలి
అప్పుడే వసంతం నిర్మల భావ
పరిమళ భావాలతో
వడివడిగా అగుడులు వేస్తుంది
మనసు మనసులో
ఆనందం వెల్లివిరుస్తుంది..!

- గుర్రాల రమణయ్య
నెల్లూరు. 9963921943

విరి వైశిష్ట్యం
ఆమని ఆగమనంతో
వనదేవత సొగసుకు వింత శోభలు
వివిధ వర్ణాల విరుల కనువిందుతో కవ్వింపులు
సుగంధ, సుమధుర పరిమళాల మేళవింపులు
పురుషులకు విరులతో కొంతే బంధం
ఆడజన్మతో ఆజన్మాంతం అనుబంధం
వనితల ఒయ్యారపు వాల్జడన
సుకుమార కుసుమాల హొయలు
అతిథుల ఆహ్వానానికి ఆలంబన
నెచ్చెలి జవరాండ్లకు ప్రేమకానుక
సృష్టికార్య నిర్విఘ్నతకు దోహదం
చిత్రపట, విగ్రహాలకు భూషణం
దేవతార్చనకు విరులే ప్రథమం
పార్థీవ దేహయాత్రతో అంతిమం
మరుని శరాల తాకిడికి
తనువులో తహతహలు
మగతగా మాధుర్య ఆస్వాదన
విరహిణుల ఒంపుసొంపులలో
అదో ఊహలకందని స్వాప్నిక జగత్తు
నింగినున్న తారలు నిశిరాత్రినే మెరుపు
నేలనున్న సుమతారలు అహర్నిశలు మైమరపు
మధువుకై మధుపముల పరుగులు
పిపీలకాది ప్రాణులకు జీవశక్తి ప్రదాతలు
తన జీవితం ఒకటి, రెన్నాళ్లే అయినా
పరులకై గడిపేను ఆనంద, నిస్వార్థ జీవనం
సృష్టికి ప్రతి సృష్టి చేసే నరులు
కాకూడదు కాకూడదోయ్ అప్రతిష్టపాలు
‘పరోపకారార్థ మిదం శరీరం’ అనే
ఉపకర్తల ఉపదేశ సారమే కదా
మనకు విరులిచ్చే సిరుల సందేశం.

- ఆడేరు చెంచయ్య
నాయుడుపేట, 9492331449

సరికొత్త ఉగాది
శిశిర దిసమొలతో సిగ్గుపడుతున్న
చెట్లన్నీ ఇపుడిపుడే
ఆకుపచ్చ వస్త్రాలను కప్పుకుంటున్నాయి
అలలతో పాటు ఎగిరెగిరి పడుతున్న
చేపపిల్లల్లా..
ప్రకృతి అంతా ఉత్సాహంగా
ఆమని అందాలను సింగారించుకుంటుంది

ప్రపంచానే్న బతికిస్తున్నామన్నా
గర్వంతో చెట్లు ఠీవీగా నిలబడి
అభయమిస్తున్నట్లు...
తమ కొమ్మలనూపుతున్నాయి

కాలచక్రం అద్భుతాలను
కొసరి..కొసరి తెచ్చుకుంటుంది
జీవితచట్రములో
రాలిపోవటాలు..పూతపూయటాలు
పక్కపక్కనే.. జయాపజయాల్లా..
జీవన రహదారుల్లో పయనిస్తుంటాయి.

వసంతం అలికిడితో
ఝుమ్మని లేచే సీతాకోకచిలుకల్లా...
కాల మహిమని కాంచుతూ పరవశిద్దాము.

ఏ కరెన్సీ నోట్లతో అల్లగలము..
ప్రకృతీ సుందరాలను..!
ఏ ఇంద్రజాలంతో సృష్టించగలము
చినుగుపడే క్షణాలను..!
పడిపడంగానే విరబూసే సోయగాలను..!
విరజిమ్మే మట్టి సువాసనను..!

మనుమిపుడొక్కటే చేయాల్సింది
ప్రకృతిని వికృతి చేసే
క్రియలను సమాధి చేసి
సరికొత్త ఉగాదులను
హృదయంలో ప్రసవింపచేద్దాము
- అవ్వారు శ్రీ్ధర్‌బాబు
చరవాణి : 8500130770

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- గౌతమి 9347109377