నెల్లూరు

కృతజ్ఞత! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది శ్రావణ శుద్ధ విదియ. అది అందరికీ మంచి రోజు కాకపోవచ్చు. కాని మాకు మాత్రం మంచిరోజే. ఎందుకంటే ఆ రోజే దేవలోకంలో హాయిగా ఉన్న మా కోసం మేమంతా కలసికట్టుగా మా నాన్నగారిని స్మరించుకుని ఆహ్వానించేరోజు.
రామదాసు గారి ఇల్లంతా బంధువులతో హడావుడిగా ఉంది. ఉదయం నుంచి బంధువులు వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరుగా. ఒకరు విశాఖనుంచి మరొకరు భద్రాచలం నుంచి. భద్రాచలం దూరంగా ఉందన్నమాటే కాని అక్కడున్నది మాత్రం మా చిన్నాన్న. మా కుటుంబానికి ఆప్తుడు, హితుడు కూడా ఆయనే. ఆయన రాకతో మా కుటుంబ సభ్యులంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆయన చుట్టూ చేరి కుశల ప్రశ్నలు వేసి ఎంతో సంతోషాన్ని పొందాము. కొంతసేపటికి ఇంటి ఆడబిడ్డ కూడా రానేవచ్చింది. ఆమెకూ పుట్టెడు బంధువులు, ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పక్కఊరిలోనే ఉన్నప్పటికీ భర్తని ఉద్యోగానికి పంపించి చంటిపిల్ల ఆముక్తతో బస్సెక్కి మా ఇంటికి వచ్చింది. పితృదేవతల ఆహ్వానాది కార్యక్రమాలు ముగిసాక మాతో పాటు బంధువులు కూడా భోజనాల తంతు పూర్తయంది. భుక్తాయాసంతో కొద్దిసేపు ఎవరికి నచ్చిన చోట వారు నడుంవాల్చి ముచ్చట్లలోకి దిగారు. అక్కడకు చేరిన మా అన్నయ్య అప్పదాసు తనకు ఎదురైన సంఘటన వివరిస్తుంటే మా అందరి కళ్లు చెమర్చాయి. ఈకాలంలో కూడా ఇటువంటి వ్యక్తులుంటారా? అని.
***
క్లాస్‌బెల్ మోగగానే ఏడో తరగతి గదిలో పుస్తకాలు ముందువేసుకుని ఆ రోజు చెప్పే పాఠాన్ని సుందరం తిరగేస్తున్న సమయంలో టీచర్ అప్పదాసు క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెట్టారు. గుడ్‌మార్నింగ్ సార్ అని విద్యార్థులంతా ముక్తకంఠంతో పలుకుతుండటంతో పుస్తకాన్ని మూసి తాను కూడా లేచి నిలబడి వారితో గొంతు కలిపాడు సుందరం. సుందరం తల్లిదండ్రులు సాధారణ కూలీలు. ఇంటిల్లిపాది పనిచేస్తేనే వారి కుటుంబం నడిచేది. తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడకుండా తాను కూడా ఏదైనా చేసి సంపాదించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని మనసులో బలంగా నాటుకుంది సుందరానికి. నలుగుర్నీ చూసి అందరిలో మంచి నడతను సంపాదించుకోవడంతో పాటు అప్పదాసుగారు పాఠం మధ్యలో చెప్పే చిన్న చిన్న నీతికథలతో ప్రేరణ పొందిన సుందరం తాను పట్టుదలతో ఉన్నత చదువు చదువుకుని ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులు హాయిగా కూర్చుంటే చూడాలని మదనపడేవాడు. అందుకు తగ్గట్టుగానే కష్టపడి చదువుకుని క్లాస్ ఫస్ట్‌గా నిలిచేవాడు. దానికి టీచర్ అప్పదాసు ఆర్థిక సాయం కూడా మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అప్పదాసు తండ్రిపేరిట ఆ పాఠశాలలో ఎక్కువ మార్కులు సంపాదించిన వారికి తనకు తోచిన సాయంగా కొంత ఆర్థిక సాయం అందించేవారు. ఆ నగదును శ్రావణ శుద్ధ విదియనాడు స్కూలులోనే చిన్నపాటి సభ ఏర్పాటుచేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా అందించేవారు. పదో తరగతి పాసై సుందరం ఉన్నత చదువులకు వేరొక ఊరు వెళ్లి చదువుకున్నాడు. తల్లిదండ్రులు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల ఆశీస్సులతో మల్టీనేషన్ కంపెనీలో మేనేజర్ ఉద్యోగంలో చేరాడు. తల్లిదండ్రులను తనవద్దకే పిలిపించుకుని అందరూ సుఖంగా జీవిస్తున్నారు. చదువుకునేరోజుల్లో అప్పదాసు మాస్టారి సాయం తనకు ఎలా ఉపయోగపడిందో తన కొలీగ్స్‌తోనూ కుటుంబ సభ్యులతోనూ అందరికీ చెప్పేవాడు సుందరం.
***
ఒకసారి ఉద్యోగానికి సెలవుపెట్టి కుటుంబ సభ్యులతో పుట్టిన ఊరు వచ్చాడు సుందరం. బస్సు దిగి నడుచుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకుంటూ తన ఇంటికి వచ్చాడు. ఆరోజు తన బాల్యమిత్రులు, ఇతర బంధువులతో సరదాగా గడిపిన సుందరం రాత్రి నిద్రకు ఉపక్రమించాడు. పడుకున్నాడే కాని కంటిమీద కునుకురాలేదు. కోడికూతకోసం ఎదురుచూస్తూ అలా నిద్రలోకి జారుకున్నాడు. ఒరే సుందరం అంటూ తల్లి లేపేవరకు తెలివిరాలేదు. బారెడు పొద్దెక్కిందని తెలుసుకుని వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని ముస్తాబై తాను చదువుకున్న స్కూలు బాట పట్టాడు. స్కూలు పరిసరాలన్నీ పరికించి చూశాడు. స్కూలు ప్రార్థన చేసిన ఆవరణ, మహనీయుల జయంతి, వర్ధంతి సందర్భంగా అప్పదాసుగారు ఏర్పాటుచేసిన వేదిక, తన పక్కన ఎవరెవరు కూర్చునేదీ మనస్సులోనే తలచుకుని ప్రధానోపాధ్యాయుని గదివైపు అడుగులు వేశాడు సుందరం. ఏడుకొండలు ఎంఎబిఇడి అనే నేమ్‌బోర్డు గది ముందు వేలాడుతూ కనిపించింది. తాను ఈ పాఠశాలలో చదువు పూర్తిచేసిన తర్వాత ఎంతోమంది ప్రధానోపాధ్యాయులు మారి ఉంటారనుకున్నాడు. అటెండర్‌ను పిలిచి తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థినని స్కూలును, ఉపాధ్యాయులను చూడాలని వచ్చానని, ప్రధానోపాధ్యాయుని కలవడానికి అనుమతి కోసం చెప్పిరమ్మన్నాడు. కొద్దిసేపటికి అటెండర్ వచ్చి కళ్లతో సైగ చేయడంతో సుందరం లోనికి వెళ్లాడు. టేబుల్, చార్ట్‌లు, మేపులు, దేశభక్తుల బొమ్మలు అవే. కాని కుర్చీలో ఉన్న ప్రధానోపాధ్యాయుడు మాత్రం వేరు. తనను తాను పరిచయం చేసుకున్న సుందరం ఉపాధ్యాయుల గురించి ముఖ్యంగా అప్పదాసు మాస్టారు గురించి వాకబు చేశాడు. సుందరం చెప్పిన పేర్లలో అప్పదాసు, శ్యామల తప్ప మిగతా వారు వేరొక ప్రాంతాలకు బదిలీ కావడం, ఇద్దరు ముగ్గురు రిటైర్ అయ్యారని చెప్పడంతో అప్పదాసు మాస్టారిని కలవాలని మనస్సు ఉవ్విళ్లూరుతోంది సుందరానికి. లంచ్‌బెల్ కొట్టగానే బిరబిరా విద్యార్థులంతా సందడి చేసుకుంటూ అటూ ఇటు వెళ్తుండగా చేతిలో బెత్తంతో వరండాలోకి వస్తున్న అప్పదాసు మాస్టారుకి ఎదురయ్యాడు సుందరం. మాస్టారుకు పాదాభివందనం చేశాడు.
‘లే నాయనా లే’ అని భుజం పట్టుకుని లేపారు.
‘మాస్టారూ... నేను సుందరాన్ని!’ అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఫలానా బ్యాచ్ విద్యార్థినని చెప్పాడు.
‘ఏం చేస్తున్నావు బాబు’ అని ఆప్యాయంగా అడిగారు అప్పదాసు సుందరాన్ని. సాధారణంగా చదువుచెప్పిన గురువును గుర్తుంచుకోవాలే కాని ప్రతి ఏడాదికి పెద్ద సంఖ్యలో పై తరగతికి పంపించే గురువులకు విద్యార్థులు గుర్తుండరు. ఇద్దరూ అలా నడుస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ స్ట్ఫారూమ్ వైపు వచ్చారు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. మాస్టారు ముందు కుర్చీలో కూర్చోడం ముళ్లపై కూర్చున్నట్టు ఉంది సుందరానికి. కాని తప్పక కూర్చున్నాడు. ‘సార్ మీ ఆశీస్సులతో మల్టీనేషన్ కంపెనీ మేనేజర్‌గా ఉద్యోగాన్ని పొందాను. లక్ష రూపాయల జీతం’ అని చెప్పగానే ‘సంతోషం నాయనా.. ఆ దేవుడే నిన్ను చల్లగా చూశాడు. మంచి ఉద్యోగం సంపాదించావు’ అని అప్పదాసు అన్నారు. ‘కాదు మాస్టారూ... మీరు నాకు ఇచ్చిన ఆర్థిక సాయం నాకు కష్టకాలంలో ఎంతో ఉపయోగపడింది. మా అమ్మనాన్న కూలీగా ఈ ఊరిలో ఉన్నప్పుడు ఆ సొమ్ము జాగ్రత్తగా వాడుకుని ఉన్నత చదువులు చెప్పించారు సార్’ అన్నాడు. ‘సంతోషం నాయనా’ అని అప్పదాసు అని కుర్చీలోనుంచి లేవబోతుండగా ఆయన పాదాలకు మరోసారి నమస్కరించాడు. లేచి నుంచుని చేతిలో నోట్ల కట్ట పెట్టబోయాడు. ‘ఏంటి నాయనా ఇది. అది సార్ మీ ఆర్థిక సాయంతో ఉన్నత ఉద్యోగంలో చేరిన నా కృతజ్ఞత సార్ ఇది. కాదనకండి అంటూ ఇది లక్ష రూపాయలు సార్. కృతజ్ఞతతో ఇస్తున్న ఈ సొమ్ము కాదనకండి’ అని చెప్పాడు. అప్పదాసు మాస్టారు సొమ్ము తీసుకుంటారని భావించాడు సుందరం. కానీ చిరునవ్వు నవ్విన అప్పదాసు ‘నీకు కృతజ్ఞత ఉండడం సహజం. కాని నా తండ్రి పేరిట నేను నీకు ఆర్థిక సాయం చేశానే తప్ప, నీ నుంచి మళ్లీ వడ్డీ రూపంలో తీసుకోడానికి కాదు నాయనా’ అంటూ చెప్పి ‘నీ పేరుతో మరికొంతమంది విద్యార్థులకు ప్రోత్సాహన్నివ్వు నాయనా’ అని చెప్పి ఇద్దరూ ప్రధానోపాధ్యాయుని గదివైపు వెళ్లారు. అప్పదాసు మాస్టారు రాకను గమనించి లేచి నిలబడి ఇద్దరినీ ఆహ్వానించి కుర్చీ చూపించారు ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండలు. ‘ఇతను మీ పాత విద్యార్థట. ముందుగా నన్ను కలిశాడు. మీ వద్దకు పంపించాను’ అని చెప్పారు ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండలు. ఆ మీదట అప్పదాసు మాస్టారు కల్పించుకుని ‘మొక్కనాటి దాన్ని సంరక్షిస్తే అది పుష్పించి ఫలాలు అందిస్తుంది. అలానే ఈ ఊరులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని మల్టీనేషన్ కంపెనీలో మేనేజర్ స్థాయికి ఎదిగిన సుందరం మన పాఠశాలో ప్రతిభావంతులకు తన వంతుగా లక్ష రూపాయలు కార్పస్ ఫండ్‌గా నిధిని ఏర్పాటుచేస్తున్నాడు’ అని చెబుతూ లక్ష రూపాయలను ప్రధానోపాధ్యాయునికి సుందరం ద్వారా ఇప్పించారు. ఇంటికొచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో కడుపునిండినంత ఆనందంగా ఉంది సుందరానికి.
***
అప్పదాసు జ్ఞాపకాల్ని విన్నవారంతా మనసులో తాము కూడా ఇలానే చేద్దాం అనుకుని మరుసటిరోజు ఎవరి ఇళ్లకు వారు నిష్క్రమించారు.

- గౌతమి
చరవాణి : 9347109377

మనోగీతికలు

ప్రియదర్శిని పేటిక
శశిరేఖ ముంగిట.. ప్రియదర్శిని పేటిక
వీరాభిమాన్యు ఎదరాగాలాపనల ప్రేమపీఠిక
మెరిసి మురిపించిన మాయాబజార్‌లో
ప్రియుని ప్రియంవద తానై కాంత
కాంతులీనిన కాలాన
ముచ్చట తానయిన స్కైప్ తెరమీద ప్రియశశి
మనసిచ్చిన వానికి
‘మనసిజ’ తానవుతూనే ఉంది!
పురాణమైనా... ఆధునికమైనా యుగాల
సాక్షిగా పరవశించి
విప్పారి విస్తృతమైన సాంకేతికత.. పరిజ్ఞానము..
వేరులు ఒక్కటిగా వేళ్లూనుకున్న
ప్రియదర్శిని పేటికల సంస్కృతి
ఇప్పుడు ల్యాప్‌టాప్‌గా.. స్కైప్‌గా..వాట్సప్‌గా..!
అతిశయం తెలియని.. దుర్వినియోగం చేతకాని పురాణ సంస్కృతిలో
పరిజ్ఞానమంతా పరిధుల మధ్యే
పరిఢవిల్లిన వైనం..
ఇప్పుడు మనిషే శాస్ర్తియమవుతుంటే
క్రమాన్ని కోల్పోయిన విషబీజాలు అవిచ్ఛిన్నమై..
అందలం ఎక్కానంటున్న భ్రమలలో వాడు
విశ్వవినాశనానికి తెరదీస్తున్నాడు!
తనకు తాను పరిధిని లిఖించుకున్న అప్పటి
శాస్తజ్ఞ్రానం,
ఇప్పటి కాలాల క్రతువులను చూసి
నివ్వెరబోతూంటే
అభిమన్యులు.. శశిరేఖలు..
మాయాబజారులు.. శ్రీకృష్ణులు..
సందర్భాలు ఎప్పుడూ సార్వజనీనమై
అలరిస్తూనే ఉన్నాయి!!
కాలాలను అతిక్రమిస్తున్న మనిషి మేధ
కార్యశుద్ధిలేక.. చిత్తసిద్ధి లేక ప్రపంచాన్ని
నట్టేటముంచి పోషిస్తుంటే
కళ్ల ఎదుట అన్నీ అనైతిక స్వరాలు..
ఉపద్రవాలు.. విపరీతాలూ..
రేడియేషన్.. వాట్సప్, స్కైప్‌ల సంస్కృతిలో
వికటాట్టహాసం చేస్తున్న వాస్తవం!
బహుశా భూతదయ కల్గిన కాలంలో
మూగజీవాలు మృగ్యం కారాదన్న
ముందుచూపు కావచ్చును!
భూతజాతుల మనుగడ కోసం
విముఖతా కావచ్చును!!
లోకాభ్యున్నతికి పరిజ్ఞానాన్ని
విస్మరించీ ఉండొచ్చును!!!
భూతదయ ఊసేలేని ఇప్పటి
ఆధునిక ప్రస్థానంలో
రేడియేషన్ రుగ్మత విశృంఖలమై
వికటాట్టహాసం చేస్తూంటే
మనిషి మనోవికారాల ముందు
చిట్టిపిచ్చుకలు, పాలప్రాణులు
నేలకొరుగుతున్నాయి!
మర్మం ఎరిగిన మనిషితో అంటకాగుతూన్న శాస్తమ్రు, పరిజ్ఞానము
జాతుల పతనానికి శిలాశాసనాలను లిఖిస్తుంటే
శరాఘాతాన్ని త్రోసిరాజన్న
ఆనాటి ప్రియదర్శిని పేటిక
మాయాబజార్ సాక్షిగా ఈనాటి
జీవచ్ఛమైన జీవనస్వేచ్ఛను చూసి
విస్తుబోతూనే ఉంది!

- వడలి రాధాకృష్ణ, చీరాల
చరవాణి : 9985336444

ఎప్పుడూ వీడకు
ఎవరి కోసం, ఎందుకోసం
ఈ జీవితం అనుకోకు
నీ కోసం నీవాళ్ల కోసం అని నమ్ము
లే, లేచి నీ పయనాన్ని సాగించు
పడిలేచిన కెరటాన్ని చూడకు తీరం చేరాలనే దాని ఆరాటం చూడు
నిరంతరం అలుపెరుగని దాని తపన చూడు
దానికంటే నువ్వు తక్కువేమీ కాదు
నీకంటే నిక్కమైన మగవాడు లేడిక్కడ
నీ విజయం దూరం ఒక్క అడుగు
ఆ దూరం చేరువయ్యే దాకా నీ దృష్టి మరల్చకు, నీ కన్నులార్పకు
శ్రమ అనే ఆయుధం నీ చేతిలో ఉన్నంతవరకూ
విజయం నీ కాళ్ల దగ్గర బానిసే అవుతుంది
నిన్ను నువ్వు నమ్ము
క్షణికావేశంలో చేసుకోకు ఏ అఘాయిత్యం
నిన్ను నమ్మిన నీ వాళ్లు నీ విజయానందం కోసం ఎదురుచూస్తున్నారు
కృషి, పట్టుదల నీతో ఉంటే గెలుపు
మందహాసంతో నువ్వెక్కడంటూ
నీ వెనుకే దాసోహమవుతుంది
కనుక ఎప్పుడు ఆత్మవిశ్వాసం వీడకు నేస్తం.

- దువ్వూరు సుమలత
నెల్లూరు
చరవాణి : 9494799248

నిత్యచైతన్యం
ఒడిసి పట్టాల్సిన అమృత బిందువుల్ని
అప్పనంగా సింధువు పాల్చేస్తున్న
మన అజ్ఞానాన్ని చూసి
ప్రకృతి పగలబడి నవ్వుతుంది
ఋతువుల జూదం,
మనిషి మొద్దు నిద్ర జోకొడ్తుంటే
చైతన్యం కావాల్సిన మనం అదే రొంపిలో
కూరుకుపోతున్నాం.
భవిష్యత్ తరాలకు అందాల్సిన నిధులు
కళ్లముందే కరిగిపోతుంటే
ఆ తరాలు క్షమిస్తాయా..?
అందరూ లేవండి
అరుదుగా జారే వాన ముత్యాలను
ఒడిసిపట్టి మితంగా ఖర్చుచేద్దాం
వర్తమానమే ప్రశ్నార్ధం కాకముందు
భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం.
అరుదైన చినుకులను దోసిళ్లతో బంధించి
కరువు కాటకాలను తరిమేద్దాం.
నీటిచుక్కను ఒడిసిపట్టు
నింగిలో నీ చూపుపెట్టు
అమృతాన్ని చవిచూడు
ఆనందంతో తేలియాడు
నినదిద్దాం సుజలాం సుఫలాం
కలిసి పాడుదాం వందేమాతరం!

- ఆవుల వెంకటరమణ
పెద్దపట్టపుపాలెం, ప్రకాశం జిల్లా
చరవాణి : 9494088110

ఆవేశం
ఆవేశం అథోగతి
పాల్జేస్తుంటే
చేష్టలుడిగి చూస్తున్నామా?
కన్నులు మూసుకొని
పట్టనట్లున్నామా?
ఎవరి పనులలో
వాళ్లుంటే
చెప్పే వాళ్లు లేక,
ఆలోచన రాక
చేయాల్సింది చేయకుంటే
వాయిదాలు పడుతాయి!
ప్రణాళికాబద్ధంగా వెళ్లకుంటే
సాయమబద్దంగా
వ్యవహరించకుంటే
అంధకారంలో
మునిగిపోతాం
ఆవేదనకు
గురవుతుంటాము
లే! యువకా!
శక్తియుక్తులు ప్రదర్శించు
ఉన్న స్థితి నుంచి
ఉన్నతస్థితికి చేరుకో!
ఉన్నత శిఖరాలు
అధిరోహించు

- శ్రీకంటి
చరవాణి : 9441685812

స్పందన

అందరికి ఆదర్శం వాచ్(ఉ)మెన్
గతవారం మెరుపులో ప్రచురితమైన వాచ్ ( ఉ) మెన్ కథ చాలా బాగుంది. ప్రస్తుత సమాజంలో కాలేజీల్లో చేరిన యువత ఎటువైపు పయనిస్తుందో వారికే అర్ధంకాకుండా వుంది. కాలేజీల్లో చేరి విద్యనభ్యసించకుండా పెడదారి పడుతున్న యువతీయువకులను దగ్గరకు చేర్చుకుని వారికి తనకు తెలిసిన మంచిని బోధించి వారి మార్పునకు సహరిస్తున్న వాచ్‌మెన్‌ను అందరికీ ఆదర్శప్రాయురాలు. ప్రస్తుతం లవర్స్ మధ్య జరిగే సంభాషణలను బాగా కూర్చారు. కథను కూడా ఎక్కడా బోరింగ్ లేకుండా చక్కగా తీర్చిదిద్దిన రచయిత్రి ములుగు లక్ష్మీమైథిలీ గారికి అభినందనలు. గతంలో మైథిలీ గారు రాసిన కథలను కూడా చదివాము. చాలా స్ఫూర్తివంతంగా రాస్తారు.
- హేమలత దూర్జటి, అద్దంకి
- ఆశాలత, జెబి కాలేజీ, కావలి

పుస్తక సమీక్ష బాగుంది
గత వారం మెరుపులో పరిచయం చేసిన మామిలు పుస్తక సమీక్ష బాగుంది. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగే నాలుగులైన్లలో చెప్పే మామిల పుస్తకాన్ని పరిచయం చేసిన దామెర్ల గీత గారికి ధన్యవాదములు. వాక్యాలు చిన్నవైనా అర్ధం అమాంతం. ఇదే మామిల ప్రత్యేకత.
- ఆనంద విహారి, మాగుంటలేఅవుట్,నెల్లూరు

కవితలు రెండూ సూపర్
గత వారం మెరుపులో మెరిసిన కాలాన్ని వేడుకుందాం, కవి హృదయం కవితలు రెండూ చాలా బాగున్నాయి. కవి హృదయం ఎలా వుంటుందో, పత్రికలో కవిత లేక కథ అచ్చయినపుడు కవి పొందే అనుభూతిని వర్ణించిన కవిహృదయం కవిత బాగుంది. ప్రముఖ రచయిత్రి పాతూరి అన్నపూర్ణ గారి కవితను చాలాకాలం తర్వాత మెరుపులో చూశాం. అలాగే పాకాల రవీంద్రబాబు కూడా ఎంతో గొప్ప కవితను అందించిన తీరు బాగుంది. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.
- కొప్పోలు రచన, మెక్లిన్స్‌రోడ్డు, నెల్లూరు
- వెంకటేశ్వర్లు తోడేటి, లయన్స్‌క్లబ్, ఒంగోలు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- గౌతమి