నిజామాబాద్

సమ్మె బాటలో కాంట్రాక్టు లెక్చరర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, డిసెంబర్ 29:రెండున్నరేళ్లుగా ఆందోళనలకు దూరంగా ఉంటూ క్రమబద్ధీకరణ కోసం నిలువెల్లా ఎదిరి చూసిన కాంట్రాక్టు లెక్చరర్‌లు ఎట్టకేలకు ఉద్యమ బాట పట్టారు. చాలీచాలని వైతనాలతో కాలం వెళ్లదీస్తున్న తమకు సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం తక్షణమే రెగ్యులర్ అధ్యాపకులకు చెల్లిస్తున్న మూల వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం అన్ని కళాశాలల అధ్యాపకులు సమ్మెకు శ్రీకారం చుట్టారు. అన్ని కళాశాలల్లో మెజార్టీ అధ్యాపకులు సమ్మెబాటలో పయనించడంతో కళాశాలల్లో విద్యాబోధనలు పూర్తిగా నిలిచిపోయాయి. బోధన్ డివిజన్‌లోని వర్ని, కోటగిరి, బోధన్‌లోని రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు సమ్మె నోటీసులు అందచేసి కళాశాల నుండి బయటకు వచ్చేశారు. వాస్తవానికి ఈ డివిజన్‌లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్ లెక్చరర్ల కంటే కాంట్రాక్టు లెక్చరర్ల సంఖ్యనే అధికంగా ఉంది. వీరంతా తమతమ ప్రిన్సిపాళ్లకు నోటీసు అందచేసి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ధర్నా శిబిరానికి తరలి వెళ్లారు. దాంతో సర్కారు కళాశాలల్లో విద్యాబోధన జరగక విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురి కావాల్సి వచ్చింది. వార్షిక ప్రణాళిక ప్రకారం ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అన్ని సబ్జెక్టులలో సిలబస్ పూర్తయ్యింది. వార్షిక పరీక్షలకు రివిజన్ తరగతులు మొదలవుతున్న తరుణంలోనే లెక్చరర్లు సమ్మెకు శ్రీకారం చుట్టడంతో విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు నెలలు కష్టపడితేనే విద్యార్థులు మంచి మార్కులతో గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి తరుణంలో అధ్యాపకులు సమ్మెకు వెళ్లడం వల్ల ప్రభుత్వ కళాశాలల్లో పరిస్థితులు గందరగోళంగా మారాయి. కానీ అధ్యాపకులు మాత్రం తాము న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత్యంతరం లేని పరిస్థితిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టామని వివరిస్తుస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ అంశాన్ని చేర్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు అనుగుణంగా జీవో నంబర్ 16 జారీ చేసినా ఇప్పటి వరకు తమ సర్వీసులు క్రమబద్ధీకరించలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సర్కారుపై ఉన్న నమ్మకంతో ఉద్యమాలకు, ఆందోళనకు దూరంగా ఉన్నామని అయినా కనీసం సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం తమకు పదవ పిఆర్‌సి ద్వారా మూల వేతనాన్ని కూడా అందించేందుకు సర్కారు చర్యలు చేపట్టలేదని వారు విమర్శించారు. ప్రతి నెలా 31వేల రూపాయల వేతనాన్ని చెల్లించాల్సి ఉన్నా ఈ ప్రభుత్వం నెలకు 27వేల రూపాయలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అలాగే కనీసం నెలకు రెండు సెలవులు కూడా లేవని సమైఖ్య సర్కారు జారీ చేసిన జీవో ఆధారంగా ప్రస్తుతం తమకు ప్రతీ నెలా ఒకే ఒక్క సిఎల్ ఉన్నదని అత్యవసర పరిస్థితులు వస్తే వేతనాన్ని కోల్పోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని అనేక సార్లు ప్రజాప్రతినిదులకు, అధికారులకు విన్నవించినా తమ గోడు పట్టించుకోక పోవడం వల్లనే సమ్మెకు సిద్ధమయ్యామని వారు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే విషయంలో ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

నత్త నడకన ‘ప్రాణహిత’
2017 ఖరీఫ్ నాటికి నీరందడం గగనమే

నిజామాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ప్రాణహిత-చేవేళ్ల పథకం పనుల పర్యవేక్షణ గాడితప్పడంతో నత్తనడకన కొనసాగుతున్నాయి. అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. నిజామాబాద్‌లో కొనసాగిన ప్రాణహిత-చేవేళ్ల సర్కిల్ కార్యాలయాన్ని మెదక్ జిల్లా సిద్ధిపేటకు తరలించడం కూడా పనుల ప్రగతిపై ప్రభావం చూపుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 18లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు సుమారు 38వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాణహిత-చేవేళ్ల పథకాన్ని రూపొందించిన విషయం విథితమే. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఈ పథకం డిజైన్‌లో మార్పులు చేస్తూ, ప్రాణహిత స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతోంది. కానీ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో మాత్రం ఇదివరకు రూపొందించిన ప్రాణహిత డిజైన్ ప్రకారమే పనులను చేపట్టాల్సి ఉండడం, ఈ విషయమై ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించడంతో తెరాస ప్రభుత్వం సైతం పై రెండు జిల్లాలలో ప్రాణహిత పనులు కొనసాగించేందుకు అనుమతులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో 3.04లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు వీలుగా 20, 21, 22ప్యాకేజీలు ఉండగా, వాటిలో 20, 21వ ప్యాకేజీలకు కెసిఆర్ సర్కార్ లైన్ క్లియర్ చేసింది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 27, 28ప్యాకేజీల పనులు కొనసాగుతున్నాయి. ఇదివరకు ఈ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రాణహిత సర్కిల్ కార్యాలయాన్ని నెలకొల్పారు. దీంతో పనులను వెంటదివెంట పర్యవేక్షిస్తూ వేగవంతంగా చేపట్టగలిగారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి మాసం మొదటి వారంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు నిజామాబాద్‌లోని ప్రాణహిత సర్కిల్ కార్యాలయాన్ని సిద్ధిపేటకు తరలించాలని ప్రతిపాదించగా, వారం రోజుల్లోపే ప్రభుత్వం ఇందుకు ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కార్యాలయాన్ని ఏప్రిల్ మాసంలో సిద్ధిపేటకు తరలించేశారు. ఈ పరిణామం కాస్తా ప్రస్తుతం రెండు జిల్లాలలో కొనసాగుతున్న ప్రాణహిత పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిజామాబాద్ జిల్లాలో 20వ ప్యాకేజీ పనులను 892 కోట్ల రూపాయల వ్యయంతో, 21 వ ప్యాకేజీ పనులను 1143 కోట్ల రూపాయల అంచనాతో చేపడుతున్నారు. గత బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం సుమారు 700 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. కానీ సర్కిల్ కార్యాలయాన్ని ఇక్కడి నుండి తరలించడంతో ప్రస్తుతం పనులను పర్యవేక్షించడం ఇబ్బందిగా మారింది. స్థానికంగా సర్కిల్ ఆఫీసును ఎత్తివేయడం వల్ల భూసేకరణ, గుత్తేదార్లకు బిల్లుల చెల్లింపులు వంటి అంశాల్లోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిసింది. 20, 21వ ప్యాకేజీ పనులను 2017 ఖరీఫ్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను తీరును పరిశీలిస్తే నిర్ణీత గడువులోగా సాగునీరందించడం దుర్లభమని తేటతెల్లమవుతోంది. ఇప్పటి నుండి శరవేగంగా పనులు చేపట్టినా, కనీసం 2018 ఖరీఫ్ నాటికి కూడా పనులు పూర్తి చేయగల్గుతారా? అన్నది కూడా అనుమానంగానే కనిపిస్తోందని ఇంజనీరింగ్ అధికారులే పేర్కొంటున్నారు. ఈ పరిణామం కాస్త ఆయకట్టు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది ఆశించిన రీతిలో వర్షాలు కురిసి ఎలాగోలా పంటల సాగు చేపట్టగల్గుతున్నామని, ప్రాణహిత పనులు పూర్తయితేనే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు.

రైలొచ్చింది..మోర్తాడ్ మురిసింది
మోర్తాడ్, డిసెంబర్ 29: సుదీర్ఘకాల నిరీక్షణ అనంతరం మోర్తాడ్‌కు కూతలు పెడుతూ రైలు వచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, మంత్రి దత్తాత్రేయ, ఎంపి కవిత వీడియో ఆన్‌లైన్ ద్వారా జగిత్యాల్-లింగంపల్లి స్టేషన్ వద్ద జెండాఊపి ప్రారంభించారు. సరిగా మధ్యాహ్నం 3.05 నిమిషాలకు రైలు కూతలు పెడుతూ స్టేషన్‌కు చేరుకుంది. బిజెపి, టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రైలుకు స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, బిజెపి జిందాబాద్ అంటూ కాషాయ టోపీలు ధరించి, పార్టీ జెండాలను చేతబూని బిజెపి శ్రేణులు రైలుకు ఘన స్వాగతం పలికాయి. కోరుట్ల, మెట్‌పల్లి తదితర స్టేషన్ల నుండి పెద్దఎత్తున ప్రయాణికులు మోర్తాడ్ వరకు ట్రైన్‌లో వచ్చారు. మోర్తాడ్ నుండి కూడా అధిక సంఖ్యలో ఆయా పార్టీల శ్రేణులు, యువకులు తిరుగు ప్రయాణంలో రైలు ఎక్కారు. గంట పాటు మోర్తాడ్ స్టేషన్‌లో నిలిపి ఉంచిన అనంతరం, 4.10 గంటలకు ట్రైన్ తిరిగి బయలుదేరి వెళ్లింది. తొలి రోజు ప్రయాణాన్ని తీపి గుర్తుగా ఉంచుకునేందుకు చాలామంది యువకులు ట్రైన్ ఎక్కారు. దక్షిణ మధ్య రైల్వే కూడా మొదటి ప్రయాణాన్ని ప్రయాణికులకు ఉచితంగానే అందజేసింది. అయినప్పటికీ, తొలి ప్రయాణపు టికెట్‌ను భద్రపర్చుకునేందుకు చాలామంది యువకులు స్వచ్ఛందంగా టికెట్ కొనుగోలు చేశారు. రైలు వెంట 10 మంది టిసిలు, ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు, సిబ్బంది రాగా, ప్రయాణికులు తమ తొలి ప్రయాణాన్ని కొనసాగించారు. ఎట్టకేలకు రైలు మోర్తాడ్‌కు చేరుకోవడంతో వేలాదిమంది ప్రజలు రైల్వే స్టేషన్‌లో సంబురాలు జరుపుకున్నారు.

నేరాలు తగ్గించడానికి కృషి
జిల్లా ఎస్పీ శే్వత

కామారెడ్డి, డిసెంబర్ 29: నేరాలు తగ్గించడానికి పోలీస్ శాఖ కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ శే్వత అన్నారు. గురువారం డిపిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. 2014-15 సంవత్సరంలో జరిగిన నేరాల సంఖ్య ఎక్కువగా ఉందని, 2015-16లో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ప్రజలతో పోలీసులు మమేకంగా ఉంటున్నారని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. డయల్ 100 పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగిందని, పేక్ కాల్స్ చాలా తగ్గాయని తెలిపారు. భారీ స్థాయిలో దొంగతనాలు జరగడం లేదని, అక్కడకక్కడ దొంగతనాలు జరుగుతున్నప్పటికీ రికవరి చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. వీటిని నివారించేందుకు నైట్ బీట్స్, పెట్రోలింగ్, తదితర చర్యలు చేపడుతున్నామన్నారు. నేరాలను నియంత్రించడానికి పోలీస్ శాఖ ప్రతి గ్రామంలో, పట్టణంలో కృషి చేస్తుందన్నారు. పేకాట, గంజాయి, మట్కా నివారణకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 2017 సంవత్సరంలో 5,640 మొక్కలు నాటుతామని తెలిపారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఒక లక్షకు పైగా చిల్లర మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. వైట్‌కాలర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ పోలీస్‌శాఖ సమన్వయంతో బ్యాంకుల వద్ద పనిచేసిందన్నారు. ఎటిఎంల వద్ద సిబ్బందిని పెట్టి ఎలాంటి గొడవలు జరగకుండా చూడడం జరిగిందన్నారు. హైవే పెట్రోలింగ్, జాతీయ రహదారులపై దృష్టి సారించి ప్రమాదాలు జరగకుండా చూస్తుందన్నారు. ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి రోడ్డు ప్రమాద నివారణ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసులపై ఉన్న నమ్మకంతో ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలను తెలుపుతున్నారన్నారు. ప్రతిరోజు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీ నిర్వహించి ట్రిపుల్ రైడింగ్ నివారణతో పాటు వాహనదారుల ప్రాణ రక్షణకు హెల్మెట్ ధరించే విధంగా పోలీస్‌శాఖ కృషి చేస్తుందన్నారు. జిల్లా పరిధిలో 44వ ఇవ్‌టిజింగ్ కేసులు నమోదు కాగా వారికి కౌనె్సలింగ్ ఇచ్చి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. తిరిగి ఈవిటిజింగ్‌కు పాల్పడితే కేసులతో పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చీటింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, విద్యార్థుల రక్షణకు షీ టీంలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజల రక్షణకు పోలీస్‌శాఖ ఎల్లవేళల కృషి చేస్తుందన్నారు.

సంబురాలు అంబరాన్నంటిన వేళ
మోర్తాడ్, డిసెంబర్ 29: దక్షిణ మధ్య రైల్వే మోర్తాడ్ వరకు గురువారం రైలును ప్రారంభించడంతో సంబురాలు అంబరాన్నంటాయి. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల ప్రజలతో పాటు కమ్మర్‌పల్లి మండల ప్రజలు కూడా వందల సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారు. బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఉన్న కిలోమీటర్ రోడ్డు వాహనాలు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌కు రెండు వైపులా ప్రజలు, ఆయా పార్టీన కార్యకర్తలు జెండాలను చేతబట్టి స్వాగతం పలుకుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వీరికి తోడుగా కోరుట్ల, మెట్‌పల్లిల నుండి వచ్చిన ప్రయాణికులు కూడా స్టేషన్‌లో దిగడంతో ఆ ప్రాంతమంత జనసంద్రమైంది. వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటూ బిజెపి నేతలు, జై టిఆర్‌ఎస్, జై కెసిఆర్ అంటూ టిఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. చాలామంది యువకులు ట్రైన్‌లో ఎక్కి, సెల్ఫీలు దిగారు. నిజాం హయాంలో తొలిసారిగా సర్వే జరిగిన సమయంలో తాను చిన్న విద్యార్థిగా ఉన్నానని, 70 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ట్రైన్ రావడంతో ఆనందంతో తబ్బిపోతున్నానని మాజీ సర్పంచ్ గడ్డం సుభాష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆనాటి తన సన్నిహితులతో కలిసి ట్రైన్ ఎక్కి తన కుతుహాలాన్ని తీర్చుకున్నారు. మోర్తాడ్‌లోని చతురస్రా పాఠశాలకు చెందిన చిన్నారి విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకుని, మోర్తాడ్‌కు వచ్చిన ట్రైన్‌కు స్వాగతం అంటూ కేరింతలు కొట్టారు. విద్యార్థులంతా ట్రైన్ ఎక్కడంతో వారి వెంట వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులందరిని సీట్లలో కూర్చోబెట్టి ఫొటోలు తీసుకున్నారు. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు జ్యోతిబాపులే రైల్వే స్టేషన్‌కు స్వాగతం అంటూ ఫ్లకార్డులు పట్టుకుని రైల్వే స్టేషన్‌కు జ్యోతిబాపూలే పేరు పెట్టాలని నినాదాలు చేశారు. గంటన్నర పాటు కేరింతలు, ఆనందోత్సవాలతో కనిపించిన రైల్వే స్టేషన్ మొత్తం, ట్రైన్ వెళ్లిన 15నిమిషాల్లోపే నిర్మానుషంగా మారింది. స్టేషన్ మాస్టార్ సూర్యప్రకాష్‌తో పాటు కొంతమంది సిబ్బంది రైల్వే స్టేషన్‌లో ట్రైన్ రాకపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తానికి ఏడు దశాబ్దాల సుదీర్ఘ కల, కళ్లముందు కనిపించడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

ఏప్రిల్‌లోగా పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైన్
బిజెపి చొరవతోనే పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు లక్ష్మీనారాయణ

మోర్తాడ్, డిసెంబర్ 29: కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అనేక రైలు మార్గాలకు లింకేజీగా ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ పనులు వచ్చే ఏప్రిల్ లోగా పూర్తవుతాయని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ఉన్న ఎన్డీయే సర్కార్ పెద్ద మొత్తం నిధులు కేటాయించడం వల్లే అనేక పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందన్నారు. జగిత్యాల్ నుండి మోర్తాడ్‌కు రైలు ప్రారంభం కావడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జోనల్ రైల్వే కమిటీ సభ్యురాలు అరుణలతో పాటు కార్యకర్తలతో కలిసి గురువారం ఆయన మోర్తాడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ యెండల ముందు నడువగా, పార్టీ శ్రేణులంతా వందేమాతరం అంటూ గొంత కలిపి నినదించారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మినారాయణ విలేఖరులతో మాట్లాడుతూ, 1956 నుండి పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పెండింగ్‌లో ఉందన్నారు. గత ప్రభుత్వాలు సరిపడా నిధులు కేటాయించకపోవడం వల్లే రైల్వేలైన్ నిర్మాణం జరగలేదని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వాల హయాంలోనే ఈ రైలు మార్గానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గడిచిన మూడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సుమారు 300కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని స్పష్టం చేశారు. పెండింగ్ రైల్వేలైన్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయని అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ వరకు రైల్వే లైన్‌ను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇటు బంగాళాఖాతం నుండి అటు అరేబియా సముద్రం వరకు రైలు మార్గాలకు పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ లింకేజీగా ఉండటం వల్లే కేంద్రం దీనిపై దృష్టి సారించిందన్నారు. ఈ రైలుమార్గం పూర్తయితే ఢిల్లీకి 176 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయన తెలిపారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అనేకమంది అనునిత్యం బాంబే వంటి సుదూర ప్రాంతాలకు వెళ్తారని, ఈ రైలు మార్గంతో ఆ ప్రయాణీకుల కష్టాలు తీరుతాయని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుకు 156కోట్ల రూపాయలు కేటాయించారని, ప్రభుత్వ నిబద్ధతకు ఇది తార్కాణం అన్నారు. నిజామాబాద్ వరకు రైల్వేలైన్ పూర్తయితే, ఈ మార్గంలో అనేక రైళ్లను ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. జగిత్యాల్‌లో ప్రారంభమైన ఈ రైలుకు మోర్తాడ్ వరకు గ్రామగ్రామాన ప్రజలు అఖండ స్వాగతం పలికారని, వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి డమల్‌కర్ శ్రీనివాస్, అనుబంధ సంస్థల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మండల నాయకులు నారాయణరెడ్డి, తీగల సంతోష్, ముత్యంరెడ్డి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, బద్దం సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నా

కంఠేశ్వర్, డిసెంబర్ 29: కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట టిఎస్ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ వీరికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్దతిని రద్దు చేసిందని, త్వరలోనే ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులర్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం 2016 ఫిబ్రవరిలో జీవో నంబర్ 16ను జారీ చేయడం జరిగిందన్నారు. కానీ, ఇంతవరకు ఏ ఒక్క కాంట్రాక్ట్ లెక్చరర్‌ను క్రమబద్దీకరించలేదన్నారు. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సుమారు 4500మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాలు తీవ్ర మానసిక వేదన చెందుతున్నాయని అన్నారు. నెలకు ఒక సిఎల్ తప్పా ఎలాంటి సెలవులు లేకుండా పని చేస్తున్నా, ప్రభుత్వానికి తమపట్ల ఏలాంటి సానుభూతి లేదన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు 2011లో జీవో నెంబర్ 3 ప్రకారం 9వ పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెంచిన పాపానపోలేదన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ పూర్తయ్యే వరకు 10వ పిఆర్‌సి బేసిక్‌పే, డిఎ చెల్లించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ఆయన కోరారు.

నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలి
* కలెక్టర్ సత్యనారాయణ
గాంధారి, డిసెంబర్ 29: గ్రామీణ ప్రాంతాల ప్రజలు త్వరగా నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం గాంధారి గ్రామపంచాయతీ పరిధిలోని మాధవపల్లి గ్రామంలో జరిగిన నగదు లావాదేవిలపై అవగాహణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్థులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో అన్నీ నగదు రహిత లావాదేవిలు జరుగుతాయని, కావున ప్రజలు ఇప్పటి నుండే నగదు రహిత లావాదేవిలను తెలుసుకోవాలని వివరించారు. ప్రతీ ఒక్కరు బ్యాంకు అకౌంటు కలిగి ఉండాలని తెలిపారు. మాధవపల్లి గ్రామంలో గాంధారి మండల పశువైద్యాధికారి రవికిరణ్ గత నాలుగైదు రోజుల నుండి నగదు రహిత లావాదేవిలపై అవగాహణ కల్పిండడం అభినందనీయమన్నారు. దేశంలో మొదటి పూర్తి నగదు రహిత లావాదేవిలు జరిపిన 50 గ్రామాలను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేస్తుందని వివరించారు. దీనికి గ్రామస్థులు నగదు రహితం కోసం కృషి చేయాలని కోరారు. నగదు రహిత కార్యక్రమాల ద్వారా జరిగే ఆన్‌లైన్ నగదు మార్పిడి మూలంగా ప్రజలకు ఎన్నో లాభాలుంటాయని తెలిపారు. బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ చెప్పవద్దని వివరించారు. ఆన్‌లైన్ నగదు రహితం మొదట్లో ఇబ్బందిగా అనిపించినా అదేం పెద్ద సమస్య కాదన్నారు. నేర్చుకుంటే దేనికైనా అలవాటు పడవచ్చని వివరించారు. నగదు రహిత లావాదేవిల మూలంగా ప్రభుత్వానికి చేరాల్సిన వివిధ రకాల పన్నులు తప్పని సరిగా చేరడం జరుగుతుందన్నారు. సంవత్సర కాలంలో మనం ఎంత ఖర్చు చేశాం అనే పూర్తి సమాచారం కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు తప్పని సరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. మరుగుదొడ్లు నిర్మించుకుని రోగాలకు దూరంగా ఉండాలన్నారు. నగదు రహిత లావాదేవిలు ఎలా జరిపించుకుంటే బాగుంటుందనే విషయాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం పెద్ద నోట్లను రద్దు చేసిందనే విషయాలను గ్రామస్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో జెసి సత్తెయ్య, జడ్పీటిసి తానాజీరావు, సర్పంచ్ సత్యం, తహశీల్థార్ ఎస్వీ.లక్ష్మణ్, ఎంపిడిఒ సాయాగౌడ్, పశువైద్యాధికారి రవికిరణ్, ఎంఈఓ సేవ్లా నాయక్, ఇంచార్జ్ ఎడిఎ యాదగిరి, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శివాజీరావు, గాంధారి సొసైటీ చైర్మెన్ ముకుంద్‌రావు, గాంధారి ఉప సర్పంచ్ ఆకుల శ్రీ్ధర్, ఐకెపి ఎపిఎం గంగరాజు, ఆయా బ్యాంకు మేనేజర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పోచారం ప్రధాన కాలువ మరమ్మతులకు
రూ.2.35 కోట్లతో ప్రతిపాదనలు
గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు
ఎల్లారెడ్డి, డిసెంబర్ 29: డివిజన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ శివారులోగల పోచారం ప్రధాన కాలువకు గత సెప్టెంబర్ చివరి మాసంలోకురిసిన భారీ వర్షాలకు పడిన గండిని గురువారం గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు, నీటిపారుదల శాఖ ఎస్‌ఇ గంగాధర్, ఇఇ మధుకర్‌రెడ్డి, డిఇఇ వెంకటేశ్వర్లుతోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్‌రావు విలేఖరులతో మాట్లాడారు. భారీ వర్షాలకు పోచారం ప్రధాన కాలువకు రెండు చోట్ల పడిన గండి మరమ్మతులకు నీటి పారుదల శాఖాధికారులు 2కోట్ల 35 లక్షల రూపాయల ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. గండి పడిన స్థలాన్ని పరిశీలించి, గండిపడిన చోట అక్విడక్ట్ నిర్మాణానికి కోటి 76 లక్షలు, అండర్ టనే్నల్ నిర్మాణం కోసం 55 లక్షల రూపాయలు కలిపి మొత్తం 2కోట్ల 35 లక్షల రూపాయల ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపించడంతో, గండిపడిన స్థలాన్ని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. నీటిపారుదల ఇంజనీరింగ్ వారి అనుమతులు రాగానే పనులు ప్రారంభించడం జరుగుతోందన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అలాగే పోచారం ప్రధాన కాలువ మరమ్మతుల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపించాలని డిఈఈని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రధాన కాలువకు మరమ్మతులు చేయక పోవడంతో తిమ్మాపూర్ నుంచి తిమ్మారెడ్డి గ్రామ శివారు వరకు దాదాపు 2,500 ఎకారాలకు సాగు నీరు అందడం లేదన్నారు.