నిజామాబాద్

వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 22: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తెరాస పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఎనలేని అసంతృప్తి వ్యక్తమవుతోందని కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ 2019 కంటే ముందుగానే ఎన్నికలు నిర్వహించినా, తమ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడం తథ్యమని ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తపర్చారు. ఆదివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 60వేల కోట్ల రూపాయలను మాత్రమే అప్పులు చేసిందని, కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం కేవలం 30నెలల కాలంలోనే 60వేల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనే అభిలాషతో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణను ఏర్పాటు చేసిందని, ఆంధ్రాలో పార్టీ ఓడిపోతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు. అయితే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ, తన కల్లబొల్లి మాటలతో కెసిఆర్ ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చారన్నారు. తెరాస పాలన చేపట్టి 30నెలల కాలం గడిచినా, ఇంతవరకు ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయిందని ఆక్షేపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు, హైదరాబాద్ నగర అభివృద్ధి, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు వంటి అనేక అంశాలపై తాము ప్రభుత్వాన్ని నిలదీసినప్పటికీ, స్పష్టమైన సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణిని అవలంభించారని అన్నారు. విద్యారంగంపై చర్చ సందర్భంగా 350ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకంటూ సిఎం కెసిఆర్ పేర్కొనడాన్ని బట్టి చూస్తే విద్యార్థుల పట్ల ఆయనకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోందన్నారు. కేవలం కమీషన్ల కోసమే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులను చేపడుతున్నారే తప్ప, రైతులు, ప్రజల సంక్షేమం గురించి తెరాస నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ 30ఏళ్లు కాలం వెళ్లదీశారని, ప్రస్తుతం మళ్లీ అవసరమైతే కోర్టుకెళ్తామంటూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామన్న హామీ హామీగానే మిగిలిపోతోందని, కనీసం సిఎం కుమార్తెగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపి కవిత సెగ్మెంట్‌లోనూ ఏ ఒక్క చోట కూడా నిర్మాణాన్ని చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల హామీని నిలుపుకోవాలని, రాష్ట్రంలో కనీసం 2.60 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా మళ్లీ కెసిఆర్‌నే తామంతా సిఎంగా చేస్తామని కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు. కాగా, టి.పిసిసి నాయకత్వ బాధ్యతలను కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరికి కట్టబెట్టేందుకు హైకమాండ్ యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని విలేఖరులు ప్రస్తావించగా, తమకు పదవుల ఆశ ఎంతమాత్రం లేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తు చేశారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, కాంగ్రెస్ శ్రేణులమంతా కలిసి కట్టుగా ఉంటూ ముందుకు సాగుతామని, గ్రామగ్రామాన పర్యటిస్తూ తెరాస ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, టి.పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, కేశవేణు, నగేష్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.