నిజామాబాద్

ప్రభుత్వ తీరును నిరసిస్తూ మత్స్యకార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఫిబ్రవరి 23: ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో గ్రామాల్లో కొంతమంది అక్రమంగా చెరువులో చేపలు పట్టేందుకు సాహసిస్తున్నారని, ఆ జీవోను ఉపసంహరించుకోవాలంటూ మోర్తాడ్‌లో మూడు మండలాల మత్స్యకార్మికులు గురువారం ర్యాలీ, ధర్నా చేపట్టారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్ చెరువులో పలువురు ఇతర కులాలకు చెందిన వ్యక్తులు చేపలు పట్టేందుకు వెళ్లడంతో ఆగ్రహించిన మత్స్యకార్మికులు మండల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాలకు చెందిన మత్స్యకార్మికులంతా మోర్తాడ్‌కు చేరుకుని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహశీల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు విఠల్ తదితరులు మాట్లాడుతూ, చేపల పెంపకం, వ్యాపారం మత్స్యకార్మికులకు జన్మతః వచ్చిన కులవృత్తి అని, ప్రభుత్వం దీనిని కాలరాసి ముదిరాజ్‌లకు కూడా అవకాశం కల్పిస్తామని పేర్కొనడంతో చాలా గ్రామాల్లో ఇతరులు చెరువులకు వస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మత్స్యకార్మిక కుటుంబాలు వీధిన పడే అవకాశం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణా ప్రణాళికను రూపొందించుకుని, గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మత్స్యకార్మికులంతా మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అశోక్‌రెడ్డి దొన్కల్ గ్రామానికి చెందిన పలువురిని పిలిపించి, ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక, గుర్తింపు కార్డులు పొందిన తర్వాతే చెరువుల్లోకి దిగాలని, లేనిపక్షంలో చేపల వేటకు వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల మత్స్యకార్మిక సంఘం కార్యవర్గాలు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
ఇందూర్, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. శుక్రవారం శివ నామస్మరణతో ఈ ఆలయాలన్నీ మారుమోగనున్నాయి. ప్రతిఏటా మహాశివరాత్రి వేడుకకు ఎనలేని ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రాంత ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శివరాత్రి సందర్భంగా ఇప్పటికే ప్రధాన ఆలయాలకు రంగులు వేసి, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఎటుచూసినా ఆలయాల వద్ద భక్తులు బారులు తీరనుండగా, ఆలయ కమిటీల ప్రతినిధులు వారికి తగిన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శివునికి ప్రీతికరమైన పత్రి, గోగుపూలను సమకూర్చుకుని చిన్నా,పెద్దా, ఆడ, మగ అనే తేడాలేకుండా భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో పూజాసామాగ్రి, ద్రవ్యాలను విక్రయించేందుకు వీలుగా ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. ప్రధానంగా కంఠేశ్వర్ ప్రాంతంలోని నీలకంఠుని ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు బారికేడ్లు, తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర వసతులు ఏర్పాటు చేస్తున్నారు. శ్రద్ధానంద్‌గంజ్‌లోని ఉమామహేశ్వరాలయం, అహ్మదీబజార్‌లోని శంభునిగుడి, నంది గుట్టలోని శివాలయాలను శివరాత్రి పర్వదిన వేడుకల కోసం అందంగా ముస్తాబు చేశారు. వేలాది సంఖ్యలో భక్తులు ఈ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నందిగుట్ట వద్ద సైతం రెండు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల సందర్భంగా జాతర ఏర్పాటు కానుంది. శివరాత్రి పర్వదిన వేడుకల్లో అత్యంత ప్రాధాన్యమైనది జాగరణ పర్వమే అయినందున, భక్తులు జాగరణ చేసేందుకు వీలుగా ఆలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేదబ్రాహ్మణులు పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తూ శివరాత్రి పర్వదిన వేడుక ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించనున్నారు. అన్ని సినిమా థియేటర్లలో అర్ధరాత్రి అనంతరం ప్రత్యేక ఆటలను శివరాత్రి సందర్భంగా ప్రదర్శించనున్నారు. కాగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి ప్రతిఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహిస్తే శుభం చేకూరుతుందని, తెలిసో తెలియకో చేసిన పాపాలకు నిష్కృతి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు బాసర పుణ్యక్షేత్రం సందర్శనానికి ప్రాముఖ్యతనిస్తారు. ఇక వేములవాడలోని రాజరాజేశ్వరుని సన్నిధిలో శివరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు వందలాది మంది తమ పిల్లాపాపలను వెంటబెట్టుకుని గురువారం సాయంత్రం నుండే కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లారు. భక్తుల సౌకర్యార్ధం నిజామాబాద్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను వేములవాడకు నడిపించినప్పటికీ, శుక్రవారం నాడు మరింత రద్దీ ఏర్పడనుంది. కాగా, ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

డిజి ధన్‌మేళా విజయవంతం
నగదు రహిత లావాదేవీలపై మరింత అవగాహన
కలెక్టర్ యోగితారాణా

నిజామాబాద్, ఫిబ్రవరి 23: నగదు రహిత లావాదేవీలపై ప్రజలు మరింతగా అవగాహన పెంపొందించుకునేందుకు డిజి ధన్ మేళా ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్‌లో గురువారం ఈ మేళాను ఏర్పాటు చేయగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మెగ్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు నగర మేయర్ ఆకుల సుజాత, నీతి ఆయోగ్ డైరెక్టర్ జుగల్‌కిశోర్ శర్మ తదితరులతో కలిసి కలెక్టర్ ఈ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. అన్ని బ్యాంకులతో పాటు సెల్‌ఫోన్ కంపెనీలు, వంట గ్యాస్, వ్యవసాయ - మార్కెట్ కమిటీ, చేనేత, యుఎఇ ఎక్స్‌చేంజ్, మెడికల్, పేటిఎం, మీ సేవా, సింగిల్ విండో సొసైటీలతో పాటు ఫ్రూట్స్, కూరగాయలతో కూడిన స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో కేవలం అవగాహన కల్పించడమే కాకుండా బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించడం, కోరిన వారికి స్వైప్ మిషన్లు ఇవ్వడం వంటి సేవలను అందుబాటులో ఉంచారు. గత వారం రోజుల నుండి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించడంతో డిజి ధన్ మేళాకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, వివిధ సంస్థల్లో కొనసాగుతున్న వారితో పాటు మహిళలు, ఇలా అన్ని రంగాలకు చెందిన వారితో మేళా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయి సందడిగా కనిపించింది. దాదాపు 15వేల మందికి పైగా మేళాను సందర్శించడం విశేషం. జన సమ్మర్థాన్ని చూసి కేంద్ర మంత్రి మెగ్వాల్ సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటివరకు కొనసాగిన డిజి ధన్ మేళాలలో ఇదే అత్యుత్తమ మేళాగా కితాబిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, ఈ మేళాను కేవలం అవగాహన కల్పించేందుకే కాకుండా ప్రజలకు సేవలు అందించాలనే ఆలోచనతో విరివిగా స్టాళ్లను ఏర్పాటు చేయించామని అన్నారు. ప్రస్తుతం మేళాలో పాల్గొన్న 15వేల మంది మరో పదింతలకు పైగా ప్రజలకు నగదు రహిత లావాదేవీల గురించి అవగాహన కల్పిస్తారనే నమ్మకం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే 77గ్రామ పంచాయతీలలో నూటికి నూరు శాతం నగదు లావాదేవీలు కొనసాగుతున్నాయని వివరించారు. సర్పంచ్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో ముందుకెళ్లడం వల్లే ఇది సాధ్యపడిందని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ డిజిటల్ లావాదేవీలు నిర్వహించేందుకు ప్రజలు చొరవ చూపాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలం క్రితం వరకు కూడా ఎటిఎంలను వినియోగించేందుకు ప్రజలు ఒకింత ఇబ్బంది పడేవారని, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎటిఎంల సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు. ఇదే కోవలో నగదు రహిత లావాదేవీలు కూడా తప్పనిసరిగా అలవడతాయనే నమ్మకం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, నగదు రహితం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నందున ప్రజలు త్వరితగతిన దీనికి అలవాటుపడాలని కోరారు. జేబులో నగదు లేకపోయినా, సెల్‌ఫోన్, పేటిఎం, భీమ్ యాప్ తదితర వాటిని ఉపయోగిస్తూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని సూచించారు. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మెగ్వాల్ గతంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారిగా పని చేశారని, రిటైర్డ్ అయిన అనంతరం రాజకీయాల్లో చేరి కేంద్ర మంత్రిగా ఎదిగారని కొనియాడారు. 2013లో ప్రతిపక్షంలో ఉండి కూడా ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నగదు రహిత చెల్లింపుల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయా గ్రామాల సర్పంచ్‌లు, సచివాలయ కార్యదర్శులు, బ్యాంకు ఉద్యోగులు, జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి మెగ్వాల్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐ.టి సాఫ్ట్‌నెట్ సిఇఓ శైలేష్‌రెడ్డి, జె.సి రవీందర్‌రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ సిక్తాపట్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్, డిఆర్‌ఓ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి దృష్టికి పసుపు రైతుల సమస్యలు
ఆర్మూర్, ఫిబ్రవరి 23: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మెగ్వాల్‌ను కలిసి పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించామని పసుపు రైతుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహంనాయుడు తెలిపారు. గురువారం మంత్రి అర్జున్‌ను నిజామాబాద్ వచ్చిన సందర్భంగా కలిసి పసుపు రైతులు పండిస్తున్న పసుపును క్వింటాల్‌కు 15 వేల రూపాయల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. అలాగే పసుపు అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ అంశాలను సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి పసుపు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అర్జున్ హామీ ఇచ్చారని కోటపాటి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో లోక భూపతిరెడ్డి, పల్లె గంగారెడ్డి, టక్కర్ హన్మంత్‌రెడ్డి, కిరణ్ యాదయ్య తదితరులు ఉన్నారు.

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ధర్నా
పిట్లం, ఫిబ్రవరి 23: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం ఎన్‌ఎస్‌యుఐ నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నియోజక వర్గ కన్వీనర్ ఇమ్రోజ్ మాట్లాడుతూ, హైద్రబాద్‌లో నిరుద్యోగ యువత సమస్యలపై జెఎసి చైర్మన్ కోదాండరాం ఎన్‌ఎస్‌యుఐ నాయకులచే శాంతియుత ర్యాలీని చేపట్టకుండా పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి ఆయా శాఖాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని యెడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మద్దతు పలికారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారాం, శివ, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు బంటి, నితిన్, సాజీద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, రాము, మోహన్, తదితరలు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం
బిజెపి మాజీ ఎమ్మెల్యే యెండల విమర్శ
డిచ్‌పల్లి రూరల్, ఫిబ్రవరి 23: కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు. డిచ్‌పల్లిలోని తెలంగాణ వర్శిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా యెండల మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు గత పది రోజులుగా నిరవధిక ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టు పేర్కొన్నట్టుగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిన బాధ్యతను విస్మరించిన ప్రభుత్వం, కనీసం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. తెరాసను గెలిపిస్తే కాంట్రాక్ట్ అనే పదమే లేకుండా చేస్తామని ప్రచార సభల్లో కెసిఆర్ హామీలు ఇచ్చి గద్దెనెక్కాక వాటికి తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించేందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే, కనీసం వారికి రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలను పెంచేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కానప్పటికీ, ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ తప్పించుకునే యత్నాలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. అసలే వార్షిక పరీక్షలు సమీపించిన తరుణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మె నిర్వహిస్తుండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వర్శిటీల్లో విద్యా బోధన కుంటుపడిందన్నారు. అయినప్పటికీ ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించకుండా కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని, తెరాస హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యక్తంగా మారిందని యెండల ఆక్షేపించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను విడుదల చేయకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, కాంట్రాక్ట్ ఉద్యోగులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. నిరసన దీక్షలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం బాధ్యులు డాక్టర్ దత్తహరి, టి.ఆనంద్, డాక్ట్ డానియెల్, బిఆర్.నేత, నాగేంద్రబాబు, గోపిరాజు, స్వామిరావు, షరత్ తదితరులు కూర్చోగా, వీరికి యెండల వెంట వచ్చిన బిజెపి నాయకులు స్వామియాదవ్, కెపి.రెడ్డి, ఎబివిపి నాయకులు రమణ, రాజురాథోడ్, సందీప్, సాయిబాబా, వినోద్, రాజునాయక్, నగేష్ మద్దతు తెలిపారు.

కోదండరాంను సీమాంధ్ర పాలకులు కూడా ఇంతగా అవమానించలేదు
టిజెఎసి మైనార్టీ చైర్మన్ షేక్ నజీర్‌అలీ
కంఠేశ్వర్, ఫిబ్రవరి 23: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ టి.జెఎసి చైర్మన్‌గా కొనసాగిన ప్రొఫెసర్ కోదండరాంపై సీమాంధ్ర పాలకులు సైతం ఇంత అమానుషంగా ప్రవర్తించలేదని టి.జెఎసి మైనార్టీ చైర్మన్ షేక్ నజీర్ అలీ ఆరోపించారు. గురువారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు నీళ్లు, నిధులు, ఉద్యోగాలే ఏకైక ఎజెండాగా తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన టిఆర్‌ఎస్, నేడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ టి.జెఎసి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన ర్యాలీకి పిలుపునిస్తే, అర్ధరాత్రి సమయంలో పోసులను ఉసిగొల్పి కోదండరాంతో పాటు జెఎసి నాయకులను, విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ దౌర్జనంగా అరెస్ట్ చేయించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కావాల్సి వచ్చిందని, ఆ ఉద్యమ ఫలితంగానే నేడు అధికారంలో ఉన్న సిఎం కెసిఆర్‌కు ఉద్యమ నేతలు కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులోనూ తాత్సారం చేస్తూ ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో తాత్సారం చేయడం వల్లే నిరుద్యోగుల నిరసన ర్యాలీ చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోదండరాం అడిగితే, తెరాస పాలకులకు ఆయన ఉగ్రవాదిగా, నక్సలైట్‌గా భావించి అర్ధరాత్రి సమయంలో తలుపులు బద్దలుకొట్టించి అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు జెఎసి, విద్యార్థి నాయకుల అక్రమ అరెస్ట్‌లను టి.జెఎసి తీవ్రంగా ఖండిస్తుందని ఆయన పేర్కొన్నారు. టి.జెఎసి ఎవరి ఒత్తిళ్లతో పని చేయడం లేదని, ప్రజలు, నిరుద్యోగ యువతీ, యువకుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలని, లేదంటే ప్రజా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో టి.జెఎసి మైనార్టీ నాయకులు అన్వర్‌ఖాన్, ఖదీర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఆర్మూర్, ఫిబ్రవరి 23: నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వ అక్రమ నిర్బంధాన్ని, అణచివేత ధోరణిని నిరసిస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుమన్, పివైఎల్ జిల్లా అధ్యక్షుడు బి.కిషన్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మల నిఖిల్‌లు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని జెఎసి నేతృత్వంలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీపై నిర్బంధకాండ అమలు చేయడం శోచనీయమని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు విద్యార్థులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వెలమ దొర పాలనకు చరమగీతం పలికే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న హామీని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు, పివైఎల్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు ఎం.నరేందర్, దుర్గాప్రసాద్, సంతోష్, తులసీ, రోజా, రజిత, వాణి, సాయికుమార్, సూరిబాబు, శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పిడిఎస్‌యు చంద్రన్న వర్గం, ఎన్‌ఎస్‌యుఐల ఆధ్వర్యంలో కూడా ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఎన్‌ఎస్‌యుఐ మండల అధ్యక్షుడు షాహిద్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
* బిజెపి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి

కామారెడ్డి, ఫిబ్రవరి 23: బిజెపి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని 33వార్డులకు 61బూత్‌ల కమిటీలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. మండల కమిటీలు, మోర్చ కమిటీలు మార్చి 15వ తేదిలోగా వేయాలన్నారు. త్వరలోనే పట్టణంలోని అన్ని వార్డుల్లో పాదయాత్రలు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో బిజెపి అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ మురళిధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోతె క్రిష్ణాగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం రాజు, పట్టణ అధ్యక్షుడు రమేశ్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు జులూరి సుధాకర్, నాయకులు పేర రమేశ్, నరేశ్‌రెడ్డి, బాలమణి, తదితరులు పాల్గొన్నారు.