నిజామాబాద్

శివాలయాలు భక్తులతో కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, ఫిబ్రవరి 24: ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో మహాశివరాత్రి వేడుకలను శుక్రవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఆయా శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగాయి. ఆర్మూర్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన నవనాథ సిద్ధేశ్వరాలయానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు సిద్ధేశ్వరాలయానికి తరలివచ్చి బారులుతీరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్ధులగుట్టపై రాళ్ల మధ్య వెలసిన శివలింగాన్ని భక్తులు దర్శించుకొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. తాగునీటి వసతి కల్పించి భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా వలంటీర్లను ఏర్పాటు చేయగా, పోలీసులు పర్యవేక్షించారు. ఎతె్తైన ప్రదేశంలో బండరాళ్లతో కూడిన సిద్ధులగుట్టపై ఆర్మూర్ పట్టణం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి శివలింగాన్ని దర్శించుకున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు గుట్టపై తరలివచ్చారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్, వైస్ చైర్మన్ లింగాగౌడ్, జడ్పీటిసి సభ్యుడు సాందన్న, ఎంపిపి పోతు నర్సయ్య, టిఆర్‌ఎస్ నాయకులు ఎ.రాజేశ్వర్‌రెడ్డి, ఇట్టెడి లింగారెడ్డి, సంజయ్‌సింగ్ బబ్లూ, యామాద్రి భాస్కర్, చెన్నరవి, ఖాందేశ్ శ్రీనివాస్, సుంకరి రంగన్న, సర్వసమాజ్ అధ్యక్షుడు బండారి మధు, ప్రజా ఐక్య సమితి అధ్యక్షుడు దమ్మన్న స్వామి తదితరులు శివలింగాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసదీక్షలు చేపట్టే అవకాశం ఉండడంతో జాగరణ నిమిత్తం గుట్టపై ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. శనివారం ఉపవాస దీక్ష విరమణ చేయనుండడంతో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏనుగు శేఖర్‌రెడ్డి, సభ్యులు భారత్‌గ్యాస్ సుమన్, పిసి గంగారెడ్డి, కిషన్, చక్రవర్తి, బోండ్ల ఆనంద్, గంగాధర్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా గుట్టపై తినుబండరాల దుకాణాలు వెలిసాయి. మెజీషియన్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా కార్యక్రమం జరిగింది. అలాగే ఆర్మూర్ పట్టణంలోని వీరబద్రుని మందిరం, మార్కండేయ మందిరం, తహశీల్ కార్యాలయ ఆవరణలోని నందీశ్వరునికి, రాజారాంనగర్‌లోని శివాలయం, జిరాయత్‌నగర్‌లోని స్వయంభూ శివాలయాల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమ్రోగిపోయాయి. మండలం నుంచి చాలామంది భక్తులు సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి తరలివెళ్లారు.

గోదావరి నది నుంచి ఇసుక అక్రమ రవాణా
మోర్తాడ్, ఫిబ్రవరి 24: ఇసుకాసురులు గోదావరి నదిని కూడా వదిలిపెట్టడం లేదు. అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఇసుకను గోదావరి నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోర్తాడ్ మండలం పెద్దవాగులో అధికారికంగా ప్రభుత్వం ఇసుక క్వారీలను ఏర్పాటు చేసిన విషయం విధితమే. అయితే కొంతమంది ఇసుక వ్యాపారులు ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల, బట్టాపూర్, దోంచంద తదితర గ్రామాల శివార్ల గుండా ప్రవహించే గోదావరి నుండి ఇసుకను తోడుతున్నారు. అధికారుల నిఘా లేకపోవడంతో మధ్యాహ్న సమయంలోనే ఇసుకను తరలిస్తూ గ్రామ శివార్లలోనూ, అటవీ ప్రాంతాల్లోనూ డంప్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల సహాయంతోనే డప్‌లకు ఇసుకను చేర్చుతున్న వ్యాపారులు, అనంతరం దానిని పరిస్థితులను బట్టి ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నట్లు సమాచారం. అధికారులు దృష్టి సారించి గోదావరి నది నుండి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని, లేనిపక్షంలో గోదావరిలో ఏర్పాటు చేసుకున్న ఫిల్టల్‌బెడ్‌లు ఎత్తిపోయే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.

స్నానానికి వెళ్లి బాలుడి మృతి
ఆర్మూర్, ఫిబ్రవరి 24: ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామ శివారులో గల శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో శుక్రవారం గంగా స్నానం కోసం వెళ్లిన గజ్రాల అశ్వీత్(13) మునిగిమరణించినట్లు ఎస్‌హెచ్‌ఓ సీతారాం తెలిపారు. శివరాత్రి సందర్భంగా గంగా స్నానం కోసం గంగా ఒడ్డుకు అశ్వీత్ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఎక్కువ లోతులోకి జారిపోయి నీళ్లు మింగాడని అన్నారు. బాలుడి కేకలు విని సమీపంలో ఉన్న బాజన్న, చిన్నయ్య, నరేష్‌లు వెంటనే అశ్వీత్‌ను కాపాడి బయటకు తీసి ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మరణించినట్లు డాక్టర్ నిర్ధారించారని అన్నారు. బాలుడు మగ్గిడి గ్రామంలోని హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

వదినపై కత్తితోదాడి చేసి మరిది ఆత్మహత్యాయత్నం
మాచారెడ్డి, ఫిబ్రవరి 24: వదినపై వరుసకు మరిది అయ్యే యువకుడు కత్తితోదాడికి పాల్పడి తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా, మాచారెడ్డిమండలంలోని సోమార్‌పేట్ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సాంకిపై నవీన్ అనే యువకుడు, కత్తితోదాడిచేసి పొడిచాడు, ఆమె కేకలు వేయడంతో, చుట్టుప్రక్కల ఉన్న వారు రావడంతో వెంటనే ఆయువకుడు అదే కత్తితో తనపొట్టలోపొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడాడు. వెంటనే స్థానికులు 108 వాహనంకు సమాచారంకు అందించి, నవీన్‌ను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో, హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాంకిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలోచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు సాంకి తండ్రి శంకర్, మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత కక్షలతో తన కూతురుపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పెర్కొన్నాడు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్‌ఐ నరేష్ వివరించారు.