నిజామాబాద్

పసుపు సాగులో నూతన విధానాలే అవలంబించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఫిబ్రవరి 24: మారుతున్న వ్యవసాయ విధానాలకు అనుగుణంగా రైతులు పసుపు సాగులో నూతన విధానాలనే పాటించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్ రాఘవేందర్‌రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ పూర్వీకులు నివాసం ఉన్న మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరిగిన అర్చన, అభిషేకం, కల్యాణోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తనఎత్తు బెల్లంను తులాభారంగా చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. మొట్టమొదటిసారిగా గ్రామానికి రావడంతో గ్రామ ప్రజలు, గ్రామస్థులు వెంకట్ రాఘవేందర్‌రెడ్డికి ఘనమైన పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పూర్వీకులు ధర్మోరా, వెల్కటూర్ తదితర గ్రామాల్లో నివసించారని, తమ ఇష్టదైవమైన ధర్మోరా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకే గ్రామానికి రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో రైతులు పసుపును విస్తృతంగా సాగు చేస్తారని, అయితే తమిళనాడు, కేరళతో పోల్చుకుంటే, సరైన గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారని అన్నారు. పురాతన పద్ధతులను అవలంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిని అధిగమిస్తూ రానున్న కాలంలో ఆధునీక పసుపు విత్తనాలను వినియోగించాలని అన్నారు. తమిళనాడు, కేరళలో రైతులు క్వింటాళుకు 16వేల రూపాయల వరకు గిట్టుబాటు ధర పొందుతున్నారని, స్థానికంగా మాత్రం ఇక్కడి రైతులు 6వేల రూపాయలు మాత్రమే పొందడం బాధాకరమన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రానున్న సంవత్సరంలో డిటిఎస్‌ఎన్, ఎసిపి 49, ఎసిపి 78, రాజేంద్ర సోనాలిక, ధృవ, కృష్ణ లాంటి పసుపు రకాలను రైతులకు అందుబాటులో ఉంచుతామని, వాటినే విత్తనాలుగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం రైతులు ఎకరాన 10కిలోల పసుపు విత్తనాలు వినియోగిస్తున్నారని, తాము అందించే విత్తనాలు రెండు కిలోలే సరిపోతాయని అన్నారు. దీని సాగులో ఎలాంటి ఎరువులు అవసరం లేదని, తక్కువ మోతాదులోనే ఎరువులు వినియోగిస్తే సరిపోతుందన్నారు. అధిక దిగుబడులతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పసుపు దిగుబడులు వస్తాయని స్పష్టం చేశారు. దీని విషయంలో స్థానిక అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో స్పైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, దీనివల్ల రైతులకు అనేక లాభాలు సమకూరుతాయని అన్నారు. సంవత్సర కాలంలో దీనిని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్పైసెస్ పార్క్ ద్వారా ఆధునీక యంత్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ధరోరా గ్రామానికి ప్రత్యేకంగా బెడ్‌రైజర్స్, బిందుసేద్యం, విత్తనాలు నాటే యంత్రాలు, పసుపు తవ్వే యంత్రాలు అందజేస్తామని, దీని విషయంలో స్థానిక అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, గ్రామ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు, ఉద్యానవన శాఖ అధికారులు సంధ్యారాణి, విద్యాసాగర్, శశిరేఖ, సునీల్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

మంత్రి ఈటల దిష్టిబొమ్మ దగ్ధం
కంఠేశ్వర్, ఫిబ్రవరి 24: ముదిరాజ్‌లను బిసి-ఎలో చేర్చడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, బిసి కమిషనర్ పేర్కొనడాన్ని నిరసిస్తూ శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎంబిసి, బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మాడవీటి వినోద్‌కుమార్, ఎంబిసి నాయకుడు దండి వెంకట్ మాట్లాడుతూ, బిసిలు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారని, అయితే తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్‌లను బిసి-ఎలో చేర్చితే తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏడున్నర శాతం ఉన్న ముదిరాజ్‌లు బిసి-ఎలోకి వస్తే బిసిలు నిర్వీర్యం కాక తప్పదన్నారు. ఇప్పటికే బిసిలు సంచార జాతులుగా పిలువబడుతున్నారని, ప్రస్తుతం బిసి-ఎ కేటగిరిలో ఉన్నవారంతా సేవా కులాలకు చెందిన వారేనని అన్నారు. ముదిరాజ్‌లను బిసి-ఎలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26న నగరంలోని ఎస్‌ఎస్‌ఆర్ కళాశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిసి, ఎంబిసి నాయకులు రాంచందర్, పెంటయ్య, అనిల్‌కుమార్, సత్యనారాయణ, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.