నిజామాబాద్

అందరి దృష్టీ సిఎం నిర్ణయం పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 28: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా బదిలీ వ్యవహారానికి సంబంధించి గత కొన్నాళ్ల నుండి విస్తృత ప్రచారం కొనసాగుతుండగా, ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలా స్పందిస్తారనే దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కలెక్టర్ బదిలీ అనివార్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ మేరకు జిల్లా పాలనాధికారిణికి కూడా సంకేతాలు అందినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ అంశాన్ని ఆమె ఒకరిద్దరు ఆప్తుల వద్ద ప్రస్తావిస్తూ, త్వరలోనే తాను ముఖ్యమంత్రి కార్యాలయానికి(సిఎంఓ) బదిలీ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నట్టు సమాచారం. మరికొందరు మాత్రం కలెక్టర్‌కు పదోన్నతి కల్పిస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమించవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కలెక్టర్ బదిలీకి సంబంధించి త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడడం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ వైఖరిని జీర్ణించుకోలేక, ఆమె పనితీరును ఆక్షేపిస్తూ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజుల క్రితం రాజధానిలో సిఎంతో జరిపిన భేటీ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులంతా కలెక్టర్ వ్యవహారశైలి సక్రమంగా లేదని, తమకు తగిన గౌరవం ఇవ్వకుండా సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతుండడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని వాపోయినట్టు తెలిసింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు వంతపాడడంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సైతం కలెక్టర్ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోక తప్పని అనివార్య పరిస్థితి కల్పించినట్లయ్యింది. నిజానికి సిఎం వద్ద ఈ పంచాయతీ చేరకమునుపే సుమారు ఆరు మాసాల పైచిలుకు కాలం నుండి అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే కలెక్టర్‌పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ వంటి వాటిని వేదికగా మల్చుకుని కలెక్టర్ యోగితారాణాను టార్గెట్‌గా చేసుకుని మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఎంపి కవిత సమక్షంలోనూ కలెక్టర్‌పై తమ రుసరుసలు ప్రదర్శించారు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలోనైతే కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గత వేసవిలో సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను అనుమతులు లేవనే సాకుతో నిలిపివేశారంటూ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డి తదితరులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకుముందు ఇసుక రవాణాపై లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారని, ఫలితంగా ప్రభుత్వ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని, దీనికి అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ సస్పెన్షన్‌లు చేస్తున్నారని కలెక్టర్ తీరును ఆక్షేపించారు. ఇలా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు, కలెక్టర్‌కు మధ్య గత చాలాకాలం నుండే ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా, ఇటీవలి కాలంలో ప్రజాప్రతినిధులు ఆమె తీరుపై మరింత అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. తాను నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నానని పేర్కొంటున్న కలెక్టర్, ప్రభుత్వ ప్రాధామ్యాలైన హరితహారం, ఉపాధి హామీ పథకం తదితర వాటిని పక్కాగా అమలు చేయిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు స్వతహాగానే వైద్యురాలు అయినందున ప్రభుత్వాసుపత్రుల పనితీరును మెరుగుపర్చేందుకు తనదైన శైలిలో కృషి చేసి ఒకింత సత్ఫలితాలు సాధించగలిగారు. గాడి తప్పిన జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనితీరును చక్కదిద్దడంతో పాటు మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను గణనీయంగా పెంచడంలో కలెక్టర్ కనబర్చిన చొరవ అందరి మన్ననలు అందుకుంది. ఒక్క ఆర్మూర్ ఆసుపత్రిలోనే నెల రోజుల వ్యవధిలో 200 పైచిలుకు కాన్పులు చేసి రికార్డు సృష్టించారు. అన్నింటికీ మించి నిజామాబాద్ మార్కెట్ యార్డులో దళారుల దందాకు అడ్డుకట్ట వేసేందుకు డైరెక్ట్ పర్చేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చగా, ఇది ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లకు ఎంతమాత్రం రుచించకపోవడంతో వారు సైతం రాజకీయ శరణుజొచ్చి కలెక్టర్ బదిలీ కోసం తమవంతు పావులు కదిపారు. మొత్తానికి జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యోగితారాణా బాధ్యతలు చేపట్టి 19నెలలు కూడా పూర్తికాక ముందే ఆమెకు స్థానచలనం కల్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ యార్డు వ్యాపార వర్గాల వారు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో బదిలీ వ్యవహారంపై సిఎం కెసిఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే షకీల్ అనుచరుడిపై చర్యలు
* కమిషనర్‌కు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

నిజామాబాద్, మార్చి 28: నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడు, తెరాస నాయకుడు ఆబిద్ సోఫిపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయను కలిసి ఫిర్యాదు చేశారు. కందకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదల శాఖ, ట్రాన్స్‌కో అధికారులు ఆబిద్ సోఫి దౌర్జన్యానికి పాల్పడ్డాడని, వారిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో క్లిప్పింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయని పేర్కొన్నారు. బోధన్ రూరల్ సిఐ, రెంజల్ ఎస్‌ఐల సమక్షంలోనే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి అశ్లీల పదజాలంతో తిడుతూ, వారిని హతమారుస్తానంటూ హెచ్చరించినప్పటికీ పోలీసు అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఈ పరిణామం వల్ల ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, తమ పార్టీ కార్యకర్తలు కూడా తెరాస నాయకుల ఈ తరహా గూండాయిజం ప్రవర్తన వల్ల తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని భయాందోళన చెందుతున్నారని అన్నారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆబిద్ సోఫిని తక్షణమే అరెస్టు చేయాలని, తమ కళ్లెదుటే అధికారులపై దౌర్జన్యంగా వ్యవహరించినప్పటికీ మిన్నకుండిపోయిన సిఐ, ఎస్‌ఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సి.పిని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, కాంగ్రెస్ జడ్పీటిసిలు శ్రీనివాస్‌గౌడ్, బిల్ల సరోజిని, అల్లె లావణ్య, నాగభూషణ్‌రెడ్డి, ఎంపిపిలు మొబిన్‌ఖాన్, గంగాశంకర్, రజిత తదితరులు ఉన్నారు.