నిజామాబాద్

వడదెబ్బ నివారణ చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 1: జిల్లాలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా నివారణ చర్యలను ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ వడదెబ్బ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయని, ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా ముందస్తుగానే హెచ్చరికలు చేసిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఏ ఒక్కరు కూడా వడదెబ్బకు లోనవకుండా ముందస్తుగానే నివారణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. వడదెబ్బకు లోనవకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ బారినపడకుండా పని వేళల్లో మార్పులు చేయాలని, కూలీలు పని చేసే చోట టార్పాలిన్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీటి వసతిని తప్పనిసరిగా కల్పించాలని, అవసరమైన పక్షంలో వడదెబ్బ నివారణ కోసం హోమియో మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఎండల తీవ్ర దృష్ట్యా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనకుండా చూడాలన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు మున్సిపల్ పట్టణాల్లో ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, లయన్స్, రోటరీ క్లబ్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి వారిచే చలివేంద్రాలను ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచాలని సూచించారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసే బాధ్యత మున్సిపల్ కమిషనర్లదేనని కలెక్టర్ పేర్కొన్నారు. చలివేంద్రాల వద్ద వడదెబ్బ సోకేందుకు గల కారణాలు, దానిని నివారించేందుకు పాటించాల్సిన పద్ధతులను వివరిస్తూ రూపొందించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన నీటినే చలివేంద్రాల్లో వినియోగించేలా చూడాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, హోమియో మందులను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. భవన నిర్మాణ రంగ, అసంఘటితరంగ కార్మికుల పని వేళలను సైతం మార్చేలా సంబంధిత యజమానులను సంప్రదించాలన్నారు. అన్ని పిహెచ్‌సిలు, హెల్త్ సబ్‌సెంటర్లలో, ఆశ వర్కర్ల వద్ద అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని, 108, 104 వాహనాల్లో ఐస్‌ప్యాక్‌తో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు వడదెబ్బకు గురి కాకుండా అవగాహన కల్పిస్తూ, నీడ ఉన్న ప్రాంతంలోనే వారు మధ్యాహ్న భోజనం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వన్యప్రాణులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, గతేడాది ఈ సమస్య ఉత్పన్నమైనందున ప్రస్తుతం పునరావృతం కాకుండా చూడాలని డిఎఫ్‌ఓ ప్రసాద్‌కు సూచించారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని, ఎండల తీవ్రత వల్ల మూగజీవాలు వ్యాధులకు గురికాకుండా అవసరమైన మందులు అందించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రయాణ ప్రాంగణాలు, ముఖ్య కూడళ్ల వద్ద తప్పనిసరిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఎండల తీవ్రత కారణంగా నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా నెట్‌లను ఏర్పాటు చేసి వాటిని కాపాడాలన్నారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని, కనీసం వారం పది రోజులకోసారైనా తప్పనిసరిగా క్లోరినేషన్ చేసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మాకర్, డిఎఫ్‌ఓ ప్రసాద్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చతుర్వేది, డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్, పశుసంవర్ధక శాఖ జె.డి ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.

నిండు ప్రాణాలను బలిగొంటున్న అక్రమ సంబంధాలు
నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు కుటుంబాలు చిన్నాభిన్నం
బాధితులిద్దరూ గల్ఫ్‌కు వలసవెళ్లి తిరిగివచ్చిన వారే

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, ఏప్రిల్ 1: అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో కలతలు సృష్టిస్తూ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఉపాధిని అనే్వషిస్తూ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి కుటుంబాల్లోనే ఎక్కువగా ఈ తరహా ఉదంతాలు చోటుచేసుకుంటుండడం విషాదాన్ని మిగులుస్తోంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ తరహా కారణాల వల్ల రెండు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. రెండు నిండు ప్రాణాలు బలవడంతో ఆ కుటుంబాలకు చెందిన చిన్నారులు అనాథలుగా మారారు. కుటుంబ పోషణ కోసం భర్త గల్ఫ్‌కు వెళ్లగా, భార్య అక్రమ సంబంధం కలిగి ఉండడం ఆమె హత్యకు దారితీసింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి వర్ని మండలం జాకోరా గ్రామంలో చోటుచేసుకుంది. జాకోరాకు చెందిన నాగయ్య బ్రతుకుదెరువు కోసం గత కొనే్నళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. ఈ క్రమంలోనే నాగయ్య భార్య సాయవ్వ జాకోరా గ్రామానికే చెందిన సాయిలు అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకుంది. అయితే నాగయ్య ఇటీవలే స్వస్థలానికి తిరిగిరావడంతో సాయవ్వ అక్రమ సంబంధం నెరపిన సాయిలును దూరంగా ఉంచుతోంది. దీనిని జీర్ణించుకోలేకపోయిన సాయిలు శుక్రవారం అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న సాయవ్వ, ఆమె భర్త నాగయ్యపై గొడ్డలితో పాశావికంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సాయవ్వ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన నాగయ్య జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఓ దారుణానికి ఒడిగట్టిన అనంతరం సాయిలు పారిపోగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న వర్ని పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. దీనికి నాలుగు రోజుల ముందు ఇదే తరహా అమానుష సంఘటన మోపాల్ మండలం తానాకుర్దు గ్రామంలో చోటుచేసుకుంది.
కుటుంబ పోషణ కోసం భర్త దుబాయికు వెళ్లడాన్ని ఆసరాగా చేసుకుని, మరో వ్యక్తితో అనైతిక సంబంధం ఏర్పర్చుకున్న భార్య, తన ప్రియుడితో కలిసి దుబాయి నుండి తిరిగి వచ్చిన భర్తను ఏకంగా సజీవ దహనం చేసింది. తానాకుర్దుకు చెందిన వేల్పూర్ సాయిలు (33), నీలవేణి దంపతులకు ఇద్దరు ఐదేళ్ల లోపు కుమార్తెలు. బతుకుదెరువు కోసం సాయిలు మూడేళ్ల క్రితం దుబాయికి వెళ్లగా, నీలవేణి తానాకుర్దు గ్రామానికే చెందిన తిరుపతి రమేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది. ఈ క్రమంలోనే గత పక్షం రోజుల క్రితం సాయిలు స్వస్థలానికి వచ్చాడు. అయినప్పటికీ తిరుపతి రమేష్‌తో నీలవేణి అక్రమ సంబంధం కొనసాగిస్తుండడాన్ని చూసి తీవ్రంగా మందలించాడు. దీంతో సాయిలును అంతమొందించాలని నిర్ణయించుకున్న నీలవేణి, రమేష్ మంగళవారం తెల్లవారుజామున సాయిలును ఫుల్లుగా మద్యం తాగించి, ఆ మత్తులో అతను పడుకున్న మంచానికి నిప్పంటించి సజీవ దహనం చేశారు. పై రెండు ఘటనల్లోనూ బాధిత కుటుంబాలు గల్ఫ్ వలసలతో ముడిపడి ఉండడం అక్రమ సంబంధాలకు దారితీసినట్టు తెలుస్తుండగా, ఈ పరిణామం కాస్తా హత్యలకు పురిగొల్పుతూ రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మానవీయ సంబంధాలు మంట గలుస్తూ, నైతిక విలువలు దిగజారుస్తూ అనైతిక మార్గంలో వేస్తున్న తప్పటడుగులు వందలాది కాపురాల్లో కలతలు రేపడమే కాకుండా, పలు సందర్భాల్లో హత్యలకు దారి తీస్తున్నాయి. గల్ఫ్ వలస వెళ్లిన అనేక కుటుంబాల్లో అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యను దారుణంగా హతమారుస్తున్నవారు కొందరైతే, భార్యపై అనుమానంతో తమ రక్తం పంచుకు పుట్టిన సొంత బిడ్డలను కూడా కసాయిలుగా మారి కడదేరుస్తున్న ఉదంతాలు అడపాదడపా చోటుచేసుకుంటున్నాయి. కొన్నాళ్ల క్రితమే భార్యపై అనుమానంతో అలీసాగర్ ఫిల్టర్‌బెడ్ సమీపంలో ఇద్దరు చిన్నారులను స్వయానా తండ్రే హత్య చేసిన ఉదంతం పాషాణ హృదయులను సైతం కదిలించింది. ఇక అక్రమ సంబంధాల తంతులో ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తున్న ఘటనలు కూడా వివాహ బంధానికి మచ్చతెచ్చేలా మారుతున్నాయి.