నిజామాబాద్

దత్తత గ్రామాల్లో పర్యాటక సొబగులేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 20: ఎంతో ప్రాచీన, చారిత్రక సంపద కలిగి ఉండి, అనేక విశిష్టతల సమాహారంగా విలసిల్లుతున్న ప్రదేశాలను సంసద్ గ్రామీణ యోజన పథకం కింద పార్లమెంటు సభ్యులు ఏరికోరి ఎంపిక చేసుకున్నప్పటికీ, సదరు ప్రాంతాలు నిరాదరణ నీడలోనే మగ్గిపోతున్నాయి. ఎంపిలు దత్తత తీసుకోవడంతో తమ ప్రాంతాలకు ఇక మహర్దశ పడుతుందని, ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా విరాజిల్లుతాయని ఆశించిన స్థానికులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. సంసద్ యోజన పథకం కింద నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత రెంజల్ మండలం కందకుర్తిని, జహీరాబాద్ ఎంపి బిబి.పాటిల్ జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామాలను దత్తత తీసుకున్నారు. పై రెండు గ్రామాలు కూడా రాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఎంతో చారిత్రక ప్రాధాన్యతలు కలిగినవి కావడం విశేషం. కానీ పర్యాటక పరంగా ఇసుమంతైనా అభివృద్ధికి నోచుకోవడం లేదు. నామమాత్రంగా తాగునీటి పథకాల పనులు, రోడ్లు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు, విద్యుత్ లైన్లను సరిజేయడం, పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధుల మంజూరు వంటి పనులు చేపట్టినప్పటికీ, ఈ ప్రాంతాలకు ఉన్న విశిష్టతలకు అనుగుణంగా పర్యాటకపరంగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచనలు చేయడం లేదనే అసంతృప్తి స్థానికుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత దత్తత తీసుకున్న రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామం త్రివేణి సంగమంగా విరాజిల్లుతోంది. గోదావరి, మంజీరా, హరిద్ర నదులు ఇక్కడ కలుస్తుండడంతో త్రివేణి సంగమంగా పేరుగాంచింది. మహారాష్ట్ర నుండి బిరబిరా పరుగులిడుతూ గోదావరి నది తొట్టతొలిగా తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టేది కూడా కందకుర్తి వద్దే కావడం విశేషం. ఈ ప్రాంత ఔన్నత్యాన్ని గుర్తించి గత గోదావరి పుష్కరాల సమయంలో నీటి లభ్యత సరిపడా లేనప్పటికీ అరకొర వసతుల నడుమే సుదూర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి కందకుర్తి పుష్కర ఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించి పునీతులయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ కేశవరావు బలిరాంపంత్ హెగ్డేవార్ పూర్వీకుల గ్రామం కావడంతో కందకుర్తికి దేశ స్థాయిలో గుర్తింపు లభించింది. వివిధ రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి స్వయం సేవకులు, ప్రముఖులుగా ఎదిగిన నాయకులు నేటికీ ఈ గ్రామ సందర్శనకు వస్తుంటారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె.అద్వానీ, ప్రస్తుత కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు బాలాసాహెబ్ దేవరాజ్ వంటి ఎందరో ప్రముఖులు కందకుర్తిని దర్శించిన వారిలో ఉన్నారు. త్రివేణి సంగమం, రామాలయం, హెగ్డేవార్ కేశవాస్మృతి మందిరం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంతటి విశిష్టతలతో కూడిన ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మాత్రం రూపుదిద్దుకోలేకపోతోంది. పుష్కరాల సమయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వసతులకూ భద్రత కరువవడంతో అందుబాటులోకి వచ్చిన అరకొర సదుపాయాలు కూడా ఛిద్రమవుతున్నాయి. ఇప్పటికీ వారానికి రెండుమూడు రోజులు అనేక మంది తమ మొక్కులను తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ సౌకర్యాలను మెరుగుపరిస్తే కందకుర్తి గొప్ప టూరిజం స్పాట్‌గా విలసిల్లే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ దిశగా చొరవ చూపడం లేదనే అసంతృప్తి స్థానికుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఇక జహీరాబాద్ ఎంపి బిబి.పాటిల్ దత్తత తీసుకున్న కౌలాస్ గ్రామం కూడా పర్యాటక ప్రగతికి ఆమడదూరంలోనే ఉండిపోతోంది. గ్రామానికి ఆనుకుని 1544వ సంవత్సరంలో నిర్మించిన కౌలాస్ ఖిల్లా ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇదివరకు ఈ ఖిల్లా పరిధిలోనే కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బిచ్కుందతో పాటు మహారాష్టల్రోని నాందేడ్, ముథ్కేడ్ ప్రాంతాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, బరువు కలిగిన ఫిరంగి ఈ కౌలాస్ కోటలో ఇప్పటికీ నిలిచి ఉంటూ తన దర్పాన్ని చాటుకుంటోంది. ఈ ఫిరంగిని ‘జగదాంబ భవాని తోప్’గా వ్యవహరిస్తారు. 23అడుగుల పొడవు, 70 టన్నుల బరువు, 16అంగులాల వెడల్పు కలిగిన ఈ ఫిరంగిలో 150 కిలోల పేలుడు పదార్థాన్ని ఉంచి పేల్చేలా దీనిని తయారు చేయించారు. ఈ తరహా ఫిరంగి ప్రపంచంలోనే మరెక్కడా లేదని చరిత్రకారులు చెబుతారు. ఖిల్లా లోపల ఆనాటి శిల్పకళా వైభవాన్ని చాటేలా అనేక రాతికట్టడాలే కాకుండా రాతితో నిర్మించిన భవానిమాత మందిరం, శివుని మందిరాలు ఉన్నాయి. మహారాజు, మహారాణిల కోసం నిర్మించిన బంగ్లాలు ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంతటి చారిత్రక విశిష్టతలు కలిగిన ఈ ఖిల్లాను పట్టించుకునే వారు లేకపోవడంతో క్రమేణా శిథిలావస్థకు చేరుకుంటోంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ప్రాచీన సంపదను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఖిల్లాకు ఐదు కిలోమీటర్ల దూరంలోనే కౌలాస్‌నాలా ప్రాజెక్టు ఉంది. సంసద్ యోజన కింద దత్తత తీసుకున్న దరిమిలా కౌలాస్ కోటకు అన్ని హంగులను సంతరింపజేస్తే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విలసిల్లుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కూలి పని చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల
కంఠేశ్వర్, ఏప్రిల్ 20: నగరంలోని రవీంద్ర మెడికల్ ఏజెన్సీలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా గురువారం కూలి పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వరంగల్‌లో ఈ నెల 27న జరిగే తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు తరలివచ్చే శ్రేణులకు దారి ఖర్చుల నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు కూలి పని చేస్తున్నారని, ఇందులో భాగంగానే తాను కూడా శ్రమించడం జరిగిందన్నారు. తెరాస పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న వారు దారి ఖర్చుల కోసం నిధులు అందించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు కుమార్‌గల్లీలోని జ్యువెల్లరీ షాపుల్లో అర్బన్ ఎమ్మెల్యే కూలి పని చేశారు. వినియోగదారులకు బంగారు, వెండి ఆభరణాలను చూపుతూ వాటి నాణ్యత గురించి వివరిస్తూ అమ్మకాలు జరిపారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ ఆకుల సుజాత, నెడ్‌క్యాప్ చైర్మన్ ఎస్‌ఎ.అలీం, కార్పొరేటర్లు, తెరాస నాయకులు ఉన్నారు.