నిజామాబాద్

బాల్కొండ సెగ్మెంట్‌లో ‘ఆన్‌లైన్’ ఓటింగ్ హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 2: ‘బాల్కొండ శాసనసభా నియోజకవర్గానికి తదుపరి ఎమ్మెల్యే ఎవరు?’ అంటూ సామాజిక మాధ్యమం (వాట్సప్)లో ఓ లింక్ హల్‌చల్ సృష్టిస్తోంది. ‘మీ ఓటు ఆన్‌లైన్‌లో వెంటనే వేయండి’ అంటూ ఆ లింక్‌లో పేర్కొనడంతో తమ నేతకే ఓటెయ్యాలంటూ ఆయా పార్టీలకు చెందిన నాయకుల అనుచరులు, కార్యకర్తలు ఈ మెసేజ్‌ను శరవేగంగా ఆయా గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే ముందస్తుగానే ఈ అంతర్యుద్ధం ఇప్పుడు అవసరమా? అంటూ కొన్ని గ్రూపులలో పలువురు తమ ఆక్షేపణ తెలుపుతున్నప్పటికీ, ఆన్‌లైన్ ఓటింగ్ జోరు మాత్రం కొనసాగుతూనే వుంది. సోషల్ మీడియాను నాయకులు విపరీతంగా వాడుకోవడం ఇటీవలి కాలంలో పెచ్చుమీరిపోయిన విషయం విధితమే. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తమ నేత గొప్పతనాన్ని చాటుతూ సామాజిక మాధ్యమాల్లో ఇబ్బడిముబ్బడిగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. అధికార పార్టీ అనే కాకుండా ప్రతిపక్ష పార్టీల్లో కూడా గ్రూపులు ఉండడంతో కార్యకర్తలు ఎవరికి వారు ఆధిపత్యం కోసం సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. తమ నాయకుడి పర్యటన జరిగిందంటే చాలు, సదరు నాయకుడు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని వెనువెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధానంగా వాట్సప్‌లో ప్రత్యేక గ్రూప్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూప్‌లలో వారు అభిమానించే నేతలను కూడా చేర్చారు. దీంతో నేతల మెప్పును పొందేందుకు నాయకులు, కార్యకర్తలు ఎవరికివారు పోస్టింగ్‌లు పెడుతూ నేతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తమ నేత గొప్ప అంటే, తమ నేతదే ఘనత అని నేరుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాల మధ్యనే కాకుండా, ఆయా పార్టీలకు చెందిన నాయకుల మధ్య కూడా గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వాట్సప్‌ను వినియోగిస్తూ ఆన్‌లైన్ పోల్ లింక్‌ను సృష్టించి తీవ్ర హల్‌చల్ చేస్తున్నారు. రెండు రోజులుగా వాట్సప్ గ్రూప్‌లలో బాల్కొండ తదుపరి ఎమ్మెల్యే ఎవరు? అంటూ వచ్చి పడుతున్న పోస్టింగ్‌లు అన్ని వర్గాల వారిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాట్సప్‌లో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేయగానే అన్ని పార్టీలకు చెందిన నాయకుల పేర్లు కనిపిస్తూ, మీరు ఎవరికి ఓటేస్తారో తెలుపాలంటూ ప్రశ్నలు సంధించి వదిలారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకునే అవకాశాన్ని కూడా ఆ లింక్‌లోనే ఏర్పాటు చేయడంతో నేతల అనుచరులు, కార్యకర్తలు జోరుగా తమ నేతకే ఓటు వేయాలని అభ్యర్థిస్తూ వాట్సప్‌లో వారి మొబైల్‌లోని అన్ని గ్రూపులలో పోస్టింగ్ చేస్తున్నారు. వాట్సప్‌ను వేదికగా చేసుకుని సృష్టించిన ఈ ఆన్‌లైన్ పోల్‌లో ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకే ఎక్కువగా పోల్ అవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు కూడా తమ నేతకే ఓటు వేయాలంటూ ప్రత్యేకంగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి పరిస్థితిని గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ మాజీ విప్ అనీల్‌ఈరవత్రి ఆధిపత్యంలో వుండగా, ఆ తరువాత స్థానాన్ని తెరాస రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్‌రెడ్డి దక్కించుకున్నట్లు ఆన్‌లైన్ పోల్ కోసం సృష్టించిన లింక్‌లో ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బాల్కొండ నుండి తెరాస తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ ఆన్‌లైన్ ఓటింగ్‌లో వెనుకంజలో ఉండిపోవడం, తెలుగుదేశం పార్టీకి కనీసం రెండంకెల ఓట్లు కూడా రాకపోవడం చర్చనీయాంశమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పరిస్థితి కూడా ఇంచుమించు టిడిపి తరహాలోనే ఉంది. అయితే ఈ పోస్టింగ్‌ను రూపొందించిన వారెవరనే విషయమై కూడా అన్ని పార్టీల నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇదే పోస్టింగ్‌ను ఫేస్‌బుక్‌లో కూడా చేరుస్తున్నారు. ఈ ఆన్‌లైన్ పోల్ హల్‌చల్ సృష్టిస్తుండడంతో కొందరు కార్యకర్తలు దీని విషయమై తమతమ నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున ఎవరికి అభ్యర్థిత్వం దక్కుతుందో, ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలు నిర్ణయించాల్సి ఉండగా, వారి అభిప్రాయాల మాటేమో గానీ సామాజిక మాధ్యమాన్ని అనుకూలంగా మల్చుకుని ఆన్‌లైన్ పోల్ అంటూ ముందస్తుగానే ఎన్నికల వేడిని రాజేస్తుండడం బాల్కొండ నియోజకవర్గంలో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
బాల్కొండ, మే 2: ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్సాపూర్ గ్రామ శివార్లలో 7వ నెంబర్ పాత జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముప్కాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. అబ్దుల్ రవూఫ్, శేక్ అర్బాస్, గౌస్‌లు ద్విచక్ర వాహనంపై ముప్కాల్ నుండి కిసాన్‌నగర్ వైపు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ప్రమాదంలో ముప్కాల్‌కు చెందిన అబ్దుల్ రవూఫ్(22), కిసాన్‌నగర్‌కు చెందిన శేక్ అర్బాస్(18)లు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాల్కొండకు చెందిన గౌస్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ముప్కాల్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ రూరల్ సిఐ నర్సింహాస్వామి సందర్శించి పరిశీలించారు.

20న సిఎం పర్యటన
* మిషన్ భగీరథ పనుల ప్రారంభోత్సవం
ఆర్మూర్, మే 2: మిషన్ భగీరథ కింద చేపట్టిన తాగునీటి పథకం పనులను ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 20వ తేదిన ఆర్మూర్ పట్టణానికి రానున్నారని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్మూర్ పర్యటన ఖరారైనట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. కాగా ఈ నెల 13వ తేదిన తాగునీటి పథకానికి సంబంధించి ట్రయల్ రన్ చేపడుతున్నారు. ఆర్మూర్ పట్టణానికి తాగునీటి అందించే పథకానికి 2014 సంవత్సరం ఆగస్టు 7వ తేదిన ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేశారు. శ్రీరాంసాగర్ ఎగువ భాగం నుంచి ఆర్మూర్ పట్టణానికి శుద్ధి నీటిని అందించడానికి 152 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి ప్రపంచ బ్యాంకు 114 కోట్లు రుణం అందించగా, మిగతా 41 కోట్లు గ్రిడ్ ద్వారా సమకూర్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో ఇన్‌టెక్ వెల్‌ను నిర్మించారు. ఇన్‌టెక్ వెల్ నుంచి బాల్కొండ గుట్టపై వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. అక్కడి నుంచి ఆర్మూర్ పట్టణానికి పైప్‌లైన్లు వేసి పట్టణంలో రాజుల గుట్ట, జిరాయత్‌నగర్, సిద్ధుల గుట్ట వెనుక రెండు వాటర్ ట్యాంక్‌లను నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగం నుంచి ఆర్మూర్ వరకు 95 కిలో మీటర్ల పైప్‌లైన్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పట్టణంలో ఇప్పటికే 8 వేల కుళాయి కనెక్షన్లను ఇచ్చారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు, వీధులలో పైప్‌లైన్ వేసే పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మిగిలిన పైప్‌లైన్, ఇతర పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మిగతా కుళాయి కనెక్షన్లను ఇవ్వడం తొందరలో పూర్తి చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నీటి శుద్ధి పథకానికి శంకుస్థాపన చేసి రెండేళ్లలో పనులు పూర్తిచేయాలని లక్ష్యం నిర్ణయించారు. లక్ష్యం మేరకు ఈ పథకం పనులు పూర్తి కాకున్నప్పటికి మూడేళ్ల వ్యవధిలో పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ పథకానికి శంకుస్థాపన చేసిన చేయడం కోసం ఈ నెల 20వ తేదిన ఆర్మూర్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తున్నారు.