నిజామాబాద్

తెరాస హాయంలో మైనార్టీలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూన్ 16:తెరాస ప్రభుత్వ హాయంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో అన్ని విధాలుగా న్యాయం జరుగుతోందని రాష్ట్ర డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం బోధన్ శాసనసభ్యుడు షకీల్ అహ్మద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి రమాకాంత్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో డిప్యూటీ సిఎం ప్రత్యేక ప్రార్థనలు చేసి సాయంత్రం ఏడు గంటలకు ఉపవాస దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ముస్లింలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రంజాన్ పండుగ గురించి పట్టించుకోలేదని కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందన్నారు. నాలుగు లక్షల మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఉచితంగా బట్టలను పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాపితంగా 800 ప్రార్థనా మందిరాలలో 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసిందన్నారు. అలాగే ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని షాదీముబారక్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వివరించారు. అలాగే ఐఎఎస్, ఐపిఎస్ ఉద్యోగాలకు సంబంధించి ముస్లీం అభ్యర్ధులకు ఉచిత శిక్షణ నివ్వడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభ్యుడు రవీందర్‌రెడ్డి, లిడ్‌క్యాప్ చైర్మన్ ఎస్‌ఎ అలీ, తెరాస జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర అద్యక్షుడు ముజీబుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బరుద్దీన్, నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, స్థానిక నాయకులు ఆబిద్‌సోఫి, బుద్దె రాజేశ్వర్, వెంకటేశ్వర్‌రావ్ దేశాయ్, ఎత్తేశ్యాం, మహెమూద్, షకీల్, ధూప్‌సింగ్, ముత్తన్న, గుండేటి రాములు, శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
*ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్, జూన్ 16: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్‌గల్ మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో ముస్లిం మైనార్టీలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అందిస్తున్న ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సుమారు ఐదు వందల మంది నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ వినూత్న ప్రణాళికతో ముందుకెళ్తున్నారని అన్నారు. ఆ దిశగా దేశంలోనే మరెక్కడా లేనివిధంగా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. ఇదివరకటి ప్రభుత్వాలు ఈ తరహా సంక్షేమ పథకాలను కనీసం ఊహించనైనా ఊహించలేకపోయాయని పేర్కొన్నారు. మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో నెలకొని ఉన్న పేదరికాన్ని పారదోలి, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సబ్సిడీపై బియ్యం అందిస్తున్నామని అన్నారు. మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం 116 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్, బాల్కొండ మండలాలకు కూడా ఇవి మంజూరవడంతో వాటిని ప్రారంభించుకున్నామని తెలిపారు. ఈ గురుకుల పాఠశాలల్లో ముస్లిం పేద విద్యార్థులు ప్రవేశాలు పొందాలని సూచించారు. ఈ విషయమై మైనార్టీ పెద్దలు గ్రామాల్లోని ముస్లింలను చైతన్యపర్చాలని కోరారు. ముస్లింల అభివృద్ధికి కెసిఆర్ సంక్షేమ పథకాలు చేపట్టడమే కాకుండా ముస్లిం బాలికల వివాహం కోసం షాదీముబారక్ కార్యక్రమం చేపట్టి 75వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు. పేద కుటుంబాల వారికి ఏం కావాలో వాటిన్నింటి సమకూర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కెసిఆర్ కిట్‌తో పాటు గర్భిణులకు 12వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. భీమ్‌గల్ మండల కేంద్రంలో మైనార్టీ మహిళల కోసం కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేస్తానని చెప్పారు. బాబాపూర్ గ్రామంలో షాదీఖానా ప్రహరీగోడ నిర్మాణం కోసం 9లక్షల రూపాయలు, షాదీఖానా నిర్మాణం కోసం 12లక్షల రూపాయలు మంజూరు చేశామని వివరించారు. భీమ్‌గల్‌లో త్వరలోనే మరో షాదీఖానా నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇదివరకు ఎలాగైతే తమను దీవించారో, రానున్న రోజుల్లోనూ అదే తరహాలో తమ ప్రభుత్వాన్ని దీవించాలని ఆయన ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, భీమ్‌గల్ ఎంపిపి అధ్యక్షురాలు కె.గోదావరి ప్రకాశ్‌గౌడ్, జడ్పీటిసి సభ్యురాలు లక్ష్మిశర్మ నాయక్, ఎంపిపి ఉపాధ్యక్షుడు నర్సయ్య, భీమ్‌గల్ సర్పంచ్ రవినాయక్, ఉప సర్పంచ్ మల్లెల లక్ష్మణ్, కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ దొన్కంటి నర్సయ్య, భీమ్‌గల్ సొసైటీ చైర్మెన్ చౌట్‌పల్లి రవి, తహశీల్దార్ బావయ్య, ఎంపిడిఓ లింగయ్య, బాబాపూర్ ఎంపిటిసి సభ్యుడు మోయిజ్, భీమ్‌గల్ కోఆప్షన్ సభ్యుడు రజాక్‌తో పాటు ముస్లిం మైనార్టీ ప్రతినిధులు అఫ్సర్, కలీం, తెరాస మండల కన్వీనర్ గుణ్‌వీర్‌రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.