నిజామాబాద్

పేకాటకు గుట్టుగా ఏర్పాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 17: పేకాట జూదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నిజామాబాద్ జిల్లాలో దీపావళి వేడుక మూడుముక్కలాటకు మరింత ఊపునందించనుంది. ఇక్కడ పేకాట మహమ్మారి వేళ్లూనుకుపోయిన విషయం గురించి సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలు కూడా పూసగుచ్చినట్టు వివరిస్తారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. సాధారణ సమయాల్లోనే విచ్చలవిడిగా కొనసాగే పేకాట జూదం, దీపావళి పర్వదినాల సందర్భంగానైతే అడ్డూఅదుపూ లేకుండా సాగుతుంది. ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు చేతులు మారుతాయి. పలు నివాస ప్రాంతాలు మొదలుకుని దుకాణాలు, లాడ్జిలు, ఫాంహౌస్‌లు ఇలా కాదేదీ జూదానికి అనర్హం అన్న చందంగా విలసిల్లుతాయి. ప్రతిఏటా వస్తున్న ఆనవాయితీని పురస్కరించుకుని ఈసారి కూడా జూదం నిర్వహకులు పెద్దఎత్తున ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. పండగ సమీపించడానికి ముందునుండే ఏర్పాట్లను ముమ్మరం చేసినట్టు తెలిసింది. జిల్లాలోని నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్, వంటి పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా దీపావళి పేకాట స్థావరాలు వెలుస్తాయి. రెండు రోజుల పాటు పగలు, రాత్రి తేడాలేకుండా పత్తాలాటలోనే జూదప్రియులు నిమగ్నమైపోతారు. సాధారణ సమయాల్లోనే పేకాట స్థావరాలపై అంతంతమాత్రంగా నిఘా కొనసాగిస్తున్న పోలీసులు, దీపావళి సందర్భంగా పేకాట జూదాన్ని నియంత్రిస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని జూదం నిర్వహకులు కేటీ రూపంలో పెద్దఎత్తున డబ్బులు సంపాదించేందుకు సన్నద్ధమయ్యారు. జూదరులకు తమతమ అడ్డాల వద్ద ఆకర్షించేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు నివాస ప్రాంతాలకు ప్రత్యేక హంగులు సమకూరుస్తూ అధునాతన పేకాట స్థావరాలుగా తీర్చిదిద్దుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మార్కెట్ యార్డు, ఫైనాన్స్ షాపులు, ఇతర దుకాణాల్లోనూ ఎవరికివారు పేకాట జూదం ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. గంజ్ ప్రాంతంలో బడా వ్యాపారులు పెద్దమొత్తంలో జూదం ఆడనుండగా, లక్షలాది రూపాయలు చేతులు మారనున్నాయి. దీపావళి సందర్భంగా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతిఏటా హెచ్చరిస్తున్నప్పటికీ, జూదం నిర్వహణను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కొంతమంది పోలీసు అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్వహకుల నుండి పెద్దఎత్తున ముడుపులు పుచ్చుకుని పేకాట వైపు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ జోక్యం సైతం మితిమీరడంతో అధికారులు మిన్నకుండిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పేకాట క్లబ్బులు, అడ్డాల వైపు వెళ్లకూడదంటూ రాజకీయ నేతలు హుకుం జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా జూదాన్ని నియంత్రించే సాహసాన్ని పోలీసులు కనబర్చడం లేదు. ఈ ఒత్తిళ్లను తాళలేక పలువురు అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పేకాట జూదంలో అదృష్టం కలిసివచ్చి రాత్రికి రాత్రే కొంతమంది లక్షాధికారులుగా మారుతుండగా, మరికొంత మంది బికారులవుతున్నారు. చేతిలో డబ్బులు లేని సమయంలో స్థిరాస్తుల దస్తావేజులను సైతం కుదువ పెట్టేందుకు వెనుకాడడం లేదు. గతంలో జిల్లా ఎస్పీలుగా కొనసాగిన మహేష్‌చంద్ర లడ్హా, రాజేష్‌కుమార్‌ల హయాంలో పేకాట జూదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడంలో చాలావరకు సఫలీకృతులయ్యారు. ఎస్పీ ఆధీనంలో పనిచేసే స్పెషల్ టీమ్ పోలీసులు నిరవధికంగా దాడులు నిర్వహిస్తూ జూదం మహమ్మారిని పారద్రోలేందుకు కృషి చేశారు. అనంతరం వచ్చిన జిల్లా పోలీసు అధికారులు పేకాట జూదం గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో జిల్లాలో క్లబ్బులు విస్తరించడంతో పాటు, అనేక చోట్ల ప్రత్యేకంగా పేకాట స్థావరాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దీపావళి సందర్భంగా జూదం నిర్వహణకు మరింత పెద్దఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు, వ్యాపార వర్గాల వారే కాకుండా ఉద్యోగులు సైతం పేకాటకు బానిసలుగా మారి ఈ వ్యసనంలో మునిగి తేలనున్నారు.