నిజామాబాద్

కొన‘సాగు’తున్న మిషన్ కాకతీయ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 23: బంగారు తెలంగాణ నిర్మాణానికి దోహదపడుతూ పల్లెల ప్రగతికి తోడ్పాటు లభిస్తుందనే ఉద్దేశ్యంతో తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, పనుల్లో ఆశించిన ప్రగతి కనిపించకపోవడం ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండేళ్ల క్రితం తొలివిడతలో ఎంపిక చేసిన చెరువులకు సంబంధించి పునరుద్ధరణ పనులు సైతం ఇప్పటికీ పెండింగ్‌లో ఉండడం మిషన్ కాకతీయ ప్రగతి ఎంత మందకొడిగా ఉందో తేటతెల్లం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 654 చెరువులను ఎంపిక చేయగా, మరో ఐదు చెరువుల పునరుద్ధరణ పనులు మిగిలే ఉన్నాయి. ఇక రెండు, మూడవ విడతల్లో ఎంపిక చేసిన చెరువులకు సంబంధించి అయితే 80శాతానికి పైగా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ పనులు పూర్తి కానప్పటికీ ఇరిగేషన్ అధికారులు మాత్రం నాల్గవ విడత కింద కూడా 71చెరువులను ఎంపిక చేయడం విశేషం. రెండవ దశలో 645చెరువులను ఎంపిక చేయగా, ఇప్పటివరకు కేవలం 396చెరువుల పునరుద్ధరణ పనులను మాత్రమే అతికష్టం మీద పూర్తి చేయగలిగారు. మరో 249పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మూడవ విడతలో 377చెరువులకు గాను 63పనులే పూర్తవగా, 314పనులు పూర్తి కావాల్సి ఉంది. నిజానికి చెరువుల సామర్థ్యాన్ని బట్టి మూడు నెలలు మొదలుకుని ఆరు మాసాల్లోపే ఈ పనులను పూర్తి చేయాలని నిబంధన విధించినప్పటికీ, ఎనలేని జాప్యం చోటుచేసుకుంటోంది. మిషన్ కాకతీయ ఔన్నత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం దశల వారీగా నిధులను కేటాయిస్తున్నప్పటికీ, పనులు వేగం పుంజుకోలేకపోతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిజామాబాద్ జిల్లా నుండే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ, స్థానికంగా కేవలం అతికొద్ది చెరువుల వద్దే కాస్తంత హడావుడి కనిపిస్తోంది తప్ప, మిగతా చోట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే మరో ఏడాది కాలం వరకు కూడా మెజార్టీ చెరువుల్లో పూడికతీత, కట్టల బలోపేతం వంటి పనులు పెండింగ్‌లోనే ఉండిపోయే ప్రమాదం వెంటాడుతోంది. ఎంపిక చేసిన చెరువులకు సంబంధించి జిల్లా నీటి పారుదల శాఖ అధికారుల నుండి ప్రతిపాదనలు అందడమే తరువాయి దశల వారీగా నిధులను మంజూరు చేస్తున్నారు. ఇలా నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులను నిర్ణీత ప్రణాళికకు అనుగుణంగా చేపట్టలేకపోతున్నారు. పలుచోట్ల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు పర్సంటేజీల వేటలో నిమగ్నమై ఉండడంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు జంకుతున్నారని తెలిసింది. అంతేకాకుండా జిల్లాలో సగానికి పైగా చెరువుల శిఖం భూములు కబ్జాలకు గురయ్యాయి. ఆక్రమణదారులంతా రాజకీయ నేతల అండదండలున్న వారు, పలుకుబడి గల పెద్దలుగా చెలామణి అవుతున్న వారుండడంతో కబ్జాలను తొలగించి పనులను చేపట్టడం అధికారులకు సవాలుగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెరువుల పునరుద్ధరణ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తయినట్టు రికార్డుల్లో నమోదు చేసిన కొన్ని చెరువులకు సంబంధించి కూడా నిధులు కైంకర్యమైనట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అసలు చెరువు, కుంటలు లేనిచోట పునరుద్ధరణ పనులు జరిపించినట్టు రికార్డులు సృష్టించిన వైనాలు బయటపడ్డాయి. మొదటి, రెండవ విడతగా చేపట్టిన పనులను నాసిరకంగా జరిపించడంతో గతేడాది కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్లు చెరువు కట్టలు తెగిపోయాయి. ఈ అక్రమాల విషయం ఎలా ఉన్నప్పటికీ, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయించే విషయంలోనూ తీవ్ర అలసత్వం చోటుచేసుకుంటోంది. అనేక ప్రయోజనాలను ఆశిస్తూ వందల కోట్ల రూపాయలను వెచ్చించి చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు సజావుగా సాగాలంటే ప్రజాప్రతినిధుల జోక్యానికి తలొగ్గకుండా అధికారులు పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.