నిజామాబాద్

ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పయనమెటు...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 14: నిజామాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి సభ్యుడు డాక్టర్ ఆర్.్భపతిరెడ్డి రాజకీయ భవితవ్యం సందిగ్ధంలో చిక్కుకోవడంతో, ప్రస్తుతం ఆయన పయనం ఏ వైపున సాగిస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని తీర్మానిస్తూ, అధిష్ఠానానికి లేఖ ద్వారా సిఫార్సు చేసిన విషయం విదితమే. దీనిపై టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి గత కొనే్నళ్లుగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతూ అవి రచ్చకెక్కిన నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను మందలించడం, ఆ తరువాత కూడా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో సస్పెన్షన్ వేటుకు సిఫార్సు చేయడంతో కేసీఆర్ కూడా ‘బహిష్కరణ’ వేటు వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునేందుకు ఏదైనా ఇతర పార్టీలో చేరడం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆయన కాంగ్రెస్‌కు చేరువవుతారా? లేక బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? అనేది తేలాల్సి ఉంటుంది. ఇప్పటికే పై రెండు పార్టీలకు చెందిన పలువురు నాయకులకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కాంట్రాక్ట్ పనులను అప్పగించారనే ఆరోపణలను ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఎదుర్కొంటున్నారు. పార్టీ ఫిరాయింపు కోసం గుట్టుగా ఆయన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారనే సంకేతాలు వెలువడడం వల్లే ఆయనపై సస్పెన్షన్ వేటుకు మూకుమ్మడిగా జిల్లా ప్రజాప్రతినిధులంతా సిఫార్సు చేశారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. భూపతిరెడ్డిపై బహిష్కరణ వేటుకు రంగం సిద్ధమైనట్టు ప్రముఖంగా వార్తా కథనాలు వెలువడడంతో ఆయన అనుచరులు ఒకింత ఆందోళనకు గురై గురువారం ఉదయమే హైదరాబాద్ బాట పట్టారు. నిజామాబాద్ రూరల్‌తో పాటు బోధన్ తదితర సెగ్మెంట్లకు చెందిన అనుచరులు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని ఆయన నివాసం వద్ద కలుసుకుని తాజా పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే, అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై భూపతిరెడ్డి తన ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఒకవేళ టీఆర్‌ఎస్ నుండి బలవంతంగా బయటకు సాగనంపితే, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలో చేరడమే శ్రేయస్కరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం మరికొంతకాలం పాటు వేచిచూసే ధోరణినే అవలంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి పార్టీని అంటిపెట్టుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, ఈ విషయం అధినేత కేసీఆర్‌కు తెలుసునని, తనకు న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకం ఉందని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అనుచరులతో పేర్కొన్నట్టు తెలిసింది. తన రాజకీయ ఎగుదలను జీర్ణించుకోలేక కొంతమంది పనిగట్టుకుని తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, పార్టీ పట్ల తన నిబద్ధతను గుర్తించి అధినేత సస్పెన్షన్ నిర్ణయం తీసుకోకపోవచ్చని అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ విషయమై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి పోచారం, ఎంపీలు కవిత, బీబీ.పాటిల్ సహా మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఏకమై భూపతిరెడ్డిని ఏకాకిని చేస్తూ సస్పెన్షన్ వేటుకు ముక్తకంఠంతో తీర్మానం చేసిన దరిమిలా, అధినేత కేసీఆర్ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా అందరి దృష్టి కేంద్రీకృతమైంది.