నిజామాబాద్

నేటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 14: పదవ తరగతి వార్షిక పరీక్షలు గురువారం నుండి ప్రారంభం కానుండగా, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 24,645మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఎస్సెస్సీ పరీక్షలు ఇదివరకటి తరహాలోనే ప్రతిరోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదనే నిబంధన అమలులోఉన్నందున, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు హితవు పలుకుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల సెంటర్లలో పెద్దఎత్తున చూచిరాతల పర్వం కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్న దరిమిలా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తూ, స్వల్ప సంఖ్యలోనే ప్రైవేట్ స్కూళ్లలో ఎగ్జామినేషన్ సెంటర్లకు అనుమతించారు. గతేడాదిలాగే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు పరీక్షా కేంద్రాల్లో చరవాణిలను అనుమతించకూడదని పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌తో పాటు 11మంది ఇన్విజిలేటర్ల చొప్పున సిబ్బందిని నియమించారు. గతేడాది ప్రయోగాత్మకంగా అమలు చేసిన పలు కేంద్రాలతో పాటు మోడల్ స్కూళ్లలోనూ ఈసారి సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, జే.సీ ఏ.రవీందర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వినోద్‌కుమార్ ఇతర ఉన్నతాధికారులు ఎస్సెస్సీ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై పలు దఫాలుగా సమీక్షలు జరిపి, నిర్వహణాపరంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సెస్సీ పరీక్షల్లో జిల్లాలో ప్రతిఏటా మాస్ కాపీయింగ్ జోరుగా జరుగుతోందనే అపవాదును అధికార యంత్రాంగం మూటగట్టుకోవాల్సి వస్తోంది. వాస్తవంగానే జిల్లాకు చెందిన పలు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అప్రతిహతంగా ర్యాంకుల వేటను కొనసాగిస్తున్నాయి. గడిచిన ఆరేళ్లను మినహాయిస్తే నిజామాబాద్ జిల్లా 2008, 2009, 2010వ సంవత్సరాల్లో వరుసగా అత్యధిక ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా నిలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. అయితే 2011లో 16వ స్థానానికి, అనంతరం వరుసగా మూడేళ్లు 18వ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకే దక్కుతున్నాయి. ఈ పరిణామం కాపీయింగ్ ఆరోపణలు వెల్లువెత్తేలా చేస్తోంది. విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులను అమ్యామ్యాలతో సంతృప్తిపరుస్తూ, తాయిలాల ఆశచూపి తమకు అనుకూలమైన వారిని సీఎస్‌లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లుగా నియమించుకోవడంలో ఇప్పటికే సఫలీకృతమైనట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావు కల్పించినా సహించేది లేదని, కాపీయింగ్ జరిగితే అందుకు ఇన్విజిలేటర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈసారి ఒకింత పకడ్బందీగానే పరీక్షలు కొనసాగే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా యంత్రాంగం కూడా భరోసా కల్పిస్తున్నప్పటికీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన దూరం కాలేకపోతోంది. కాగా, పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను అమలు చేస్తూ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని డీఈఓ రాజేష్ తెలిపారు. పరీక్షలు కొనసాగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్‌లను మూసివేయిస్తామని, ప్రతి కేంద్రంలోనూ విద్యార్థులకు అవసరమైన బెంచీలు, టేబుళ్లు, తాగునీటి సదుపాయంతో పాటు ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచామని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరుకునేలా అన్ని ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు సమయానుకూలంగా నడిపించాల్సిందిగా ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.