నిజామాబాద్

ఉగాది శోభతో ఉట్టిపడిన ఇందూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 18: కొత్త సంవత్సరంలో కష్టాలు, నష్టాలు తొలగిపోయి, సుఖఃశాంతులు, లాభాలు కలగాలని కోరుతూ ప్రజలు విళంబినామ నూతన సంవత్సరాదికి ఆదివారం సాదరంగా స్వాగతం పలికారు. ఈ ఏడాదంతా అన్నీ శుభశకునాలే ఉన్నాయని పంచాంగకర్తలు, ప్రముఖులు పేర్కొనడం ప్రజానికానికి ఊరటనందించింది. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వివిధ ధార్మిక సంస్థలు, ఆయా వేదికల ఆధ్వర్యంలో సమాజ శాంతిని కోరుతూ హోమాలు జరిపించారు. అధికార, అనధికార ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులంతా ఇంచుమించు ఈ విళంబి సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని పంచాంగం వినిపించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని, పాడి సంపద పెరుగుతుందన్నారు. సకల సౌభాగ్యాలు ప్రసాదించే విళంబి నామ సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఐ.టీ రంగం విస్తరించబడి, విరివిగా కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని, జక్రాన్‌పల్లిలో మినీ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని, సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని, మొత్తంగా 90పాళ్ల ఆదాయంతో జిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. కాగా, మహిళలు, యువతులు తమతమ ఇళ్ల వద్ద వాకిలి శుభ్రపర్చి కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేశారు. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. కొత్త సంవత్సరంలో తమ భవిష్యత్తు ఏవిధంగా ఉంటుంది, పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయన్నది తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణంలో పాల్గొనాలని అనేక మంది ఉత్సాహం చూపారు. వివిధ ఆలయాల్లో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని భక్తులకు అందజేశారు. వాడవాడలా పంచాంగ పఠనాలు, భజన కార్యక్రమాలను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి ఉగాది వేడుకలను జరుపుకున్నారు. పురోహితులు పంచాంగ పఠనం జరుపగా, శ్రోతలు శ్రద్ధాసక్తులతో ఆలకించారు. గత చాలాకాలం నుండి వస్తున్న సంప్రాదాయాన్ని పాటిస్తూ జిల్లా కేంద్రంలో కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. విళంబి సంవత్సరంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నిండాలని, సుఖఃసంతోషాలు వెల్లివిరియాలని కవులు తమ కవితాత్మక ధోరణిలో ఆకాంక్షించారు. గడిచిన సంవత్సరంలో జరిగిన మంచిచెడులను విస్మరించి, నూతన సంవత్సరంలో కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడుతూ ప్రగతి దిశగా పయనించేందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. అక్షరాస్యతతోనే సమాజంలో మార్పు సాధ్యమని, సంపూర్ణ అక్షరాస్యత సాధనకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగం తరఫున కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావుతో పాటు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు డీ.శ్రీనివాస్, కల్వకుంట్ల కవిత, బీబీ.పాటిల్, కమిషనర్ కార్తికేయ, జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులతో యాజమాన్యాలు ఉగాది వేడుక పర్వదినం ప్రాశస్త్యాన్ని చాటేలా తమతమ బడులలో ఒకరోజు ముందుగానే సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా పట్టణాలు, మండల కేంద్రాల్లో, మారుమూల పల్లెల్లోనూ ఉగాది పర్వదిన వేడుకలు అలరించాయి.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ పఠనం
ఉగాది వేడుకను పురస్కరించుకుని నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెండా బాలాజీ మందిరం, కంఠేశ్వర్ ఆలయాల్లో పంచాంగ శ్రవణం, భజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందూరు యజ్ఞ సమితి ఆధ్వర్యంలోనూ పంచాంగ పఠనం జరిపించారు. మాధవనగర్‌లోని సాయిబాబా మందిరం, నాగారంలోని నీరుగొండ హనుమాన్ మందిరం, సారంగపూర్‌లోని హనుమాన్ మందిరం, కంఠేశ్వర్‌లోని మురళీకృష్ట ఆలయం, శివాజీనగర్‌లోని శ్రీకృష్ణ మందిరం తదితర ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రజలు పచ్చడితో పాటు తీపి వంటకాలు చేసుకుని, నూతన దుస్తులు ధరించి ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సాహాల నడుమ ఉగాది సంబరాలు జరుపుకున్నారు.