నిజామాబాద్

జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుపై ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 26: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణం కల సాకారం అయ్యే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ ప్రతిపాదనలు గత చాలాకాలం నుండి పరిశీలన దశలోనే ఉండగా, తాజాగా తెలంగాణలో నూతనంగా విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుండడం కలిసొచ్చే అంశంగా మారింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు మినీ ఎయిర్‌పోర్టులను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. నిజామాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లలో విమానాశ్రయ సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.రాంమోహన్‌రావు గురువారం ఎయిర్‌పోర్టు కోసం ఎంపిక చేసిన జక్రాన్‌పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామ శివారులోని స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఎంతమేర స్థలం అందుబాటులో ఉంది, ఎయిర్‌పోర్టు కోసం అవసరమైన పక్షంలో ఇంకెంత భూమిని సేకరించాల్సి ఉంటుంది తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ వినోద్‌కుమార్, ఆర్ అండ్ బీ ఈ.ఈ హన్మంత్‌రెడ్డి, స్థానిక తహశీల్దార్ సతీష్‌రెడ్డి, ఎంపీడీఓ బ్రహ్మానందరెడ్డి తదితరులతో స్థల విస్తీర్ణం తదితర అంశాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఈ స్థలం పై భాగం నుండి హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండడాన్ని గమనించి, ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలకు కేంద్ర పౌరవిమానయాన సంస్థ పచ్చజెండా ఊపితే వాటిని పక్కకు తొలగించాల్సి వస్తుందని పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ స్థల పరిశీలనకు హాజరుకావడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణం ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడినట్లయ్యిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు నిర్మాణం ప్రతిపాదనలకు ఆమోదం తెలుపాల్సిందిగా స్థానిక పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గత జనవరి మాసంలో అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఎయిర్‌పోర్టును నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వీలుగా కేంద్ర కమిటీని పంపాలని కోరారు. అంతకుముందు కొన్నాళ్ల క్రితమే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా మంత్రి కేటీఆర్ కూడా కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి జక్రాన్‌పల్లిలో మినీ ఎయిర్‌పోర్టును నెలకొల్పాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. తాజాగా తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు ఎయిర్‌పోర్టుల నిర్మాణాల కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం, ఆ జాబితాలో జక్రాన్‌పల్లి ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు కూడా ఉండడం ఆశలు రేకెత్తిస్తోంది. నిజానికి జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం నెలకొల్పాలనే ప్రతిపాదన గత పుష్కరకాలం క్రితమే తెరపైకి రాగా, ఈ దిశగా అధికార వర్గాల్లోనే ఆశించిన స్థాయిలో కదలిక కనిపించలేదు. దేశ వ్యాప్తంగా అనువైన ప్రాంతాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించినప్పటికీ, అందులో నిజామాబాద్‌కు స్థానం కల్పించే విషయాన్ని పరిశీలన దశకే పరిమితం చేశారు. ఇదివరకే ఇండియన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీకి చెందిన అప్పటి డిప్యూటీ డైరెక్టర్ డీబీ.సింగ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం జిల్లాకు చేరుకుని విమానాశ్రయం నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులను పరిశీలించింది. 44వ నెంబర్ జాతీయ రహదారికి చేరువలో జక్రాన్‌పల్లి మండలంలోని కొలిప్యాక్, బ్రాహ్మణపల్లి, తొర్లికొండ, మనోహరాబాద్, జక్రాన్‌పల్లి గ్రామాల శివార్లతో కూడిన సుమారు 900 ఎకరాల స్థలం ఇక్కడ అందుబాటులో ఉంది. ఇందులో 600ఎకరాలు అసైన్డ్ భూమి కాగా, మరో 300ఎకరాలను అధికారులు గుర్తించారు. అయితే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 1400ఎకరాల స్థలం అవసరమవుతుందని ఎయిర్‌పోర్టు అథారిటీకి చెందిన అధికారుల బృందం పేర్కొనడంతో మిగతా 600ఎకరాలను సైతం భూసేకరణ జరిపేందుకు ఆ సమయంలో జిల్లా రెవెన్యూ అధికారులు సంసిద్ధత తెలిపారు. మనోహరాబాద్ శివారులో స్థలాన్ని పరిశీలించిన ఎయిర్‌పోర్టు అథారిటీ బృందం పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. కానీ ఈ ప్రక్రియ ఇంతకాలం పాటు పరిశీలన దశకే పరిమితమైంది. తాజాగా మరోమారు దీని ప్రస్తావన రావడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణం కల సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.