నిజామాబాద్

పంచాయతీ పోరుతో పల్లెల్లో వేడెక్కనున్న కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 22: ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ కోలాహలం వేడెక్కనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తారో లేదోననే సంశయాల నడుమే అనేక మంది ఆశావహులు ఈసారి పంచాయతీ ఎన్నికల బరిలో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సన్నాహాలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకటి రిజర్వేషన్లను బట్టి ఈసారి ఏ స్థానం ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో ముందుగానే అంచనాకు వస్తూ పంచాయతీ ఎన్నికల్లో తలపడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా క్రితంసారి లాగే ఈసారి కూడా ముందుగా గ్రామ పంచాయతీల సమరంతో ఎన్నికల పోరుకు శ్రీకారం చుడుతోంది. పంచాయతీ పోరుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఖరారు చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. పోలీస్ కమిషనర్ కార్తికేయతో కలిసి కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సంబంధిత అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమై ఉండాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 530 గ్రామ పంచాయతీలు, 4932వార్డు స్థానాలు ఉండగా, మొదటి విడతలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 177సర్పంచ్‌లు, 1746వార్డు స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 3వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 7వ తేదీన ఉపసంహరణ అనంతరం 15వ తేదీన పోలింగ్, అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. రెండవ విడతగా బోధన్ డివిజన్‌లోని 142 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, 1296 వార్డు స్థానాలకు జూన్ 5వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. 7వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11వ తేదీన ఉపసంహరణ పర్వం ముగిసిన మీదట జూన్ 19వ తేదీన పోలింగ్ జరిపి, అదే రోజున కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. చివరి విడతగా నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 211 గ్రామ పంచాయతీలు, 1890 వార్డు స్థానాలకు జూన్ 9వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా, 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ తంతు పూర్తయ్యాక 23వ తేదీన పోలింగ్, కౌంటింగ్‌ల పర్వంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు తెరపడనుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ పోరుకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల నియామకం, బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేసుకోవడం, ఓటరు జాబితా పరిశీలన తదితర అంశాలకు సంబంధించి జిల్లా యంత్రాంగాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలా అధికార గణం ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండగా, ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు కూడా తాము కోరుకున్నట్టుగానే అనుకూలంగా రిజర్వేషన్లు వస్తే తామే నేరుగా పోటీ చేయాలని, మహిళలకు కేటాయించబడితే తమ కుటుంబ సభ్యులను బరిలో నిలుపాలని భావిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ వారికి శిక్షణా తరగతులు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవడం తదితర ఏర్పాట్లన్నీ పూర్తిస్థాయిలో చక్కబెట్టుకోనున్నారు. మరోవైపు ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నడుమ నిర్వహించేందుకు వీలుగా పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో పోలీసులను మోహరించనున్నారు. ఇదిలాఉండగా, పంచాయితీ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నప్పటికీ, ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పకడ్బందీగా పావులు కదుపుతున్నాయి. తమతమ పార్టీల మద్దతుదారులను బరిలోకి దించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శించనున్నాయి. స్థానిక సంస్థల్లో అనుకూల వర్గానికి చెందిన వారు పదవుల్లో ఉంటే, సార్వత్రిక ఎన్నికల్లో వారి తోడ్పాటుతో పరిస్థితులను అనుకూలంగా మల్చుకోవచ్చనే ఉద్దేశ్యంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విషయమై కసరత్తులను ముమ్మరం చేయనున్నారు.