నిజామాబాద్

రవీందర్‌కు బుగ్గ కారు యోగం దక్కేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 28: ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏనుగు రవీందర్‌రెడ్డికి బుగ్గ కారు యోగం దక్కుతుందా? అనేది సందిగ్ధంగానే మారింది. తెరాస పార్టీ పరంగా చూస్తే జిల్లాలో ఏనుగు రవీందర్‌రెడ్డి అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో సహజంగానే ఆయన తెరాస పార్టీ అధికారం చేపట్టిన సందర్భంలో మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తూ తుదికంటా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. రెడ్డి సామాజిక వర్గానికే చెందిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తొలి దఫాలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ కేబినెట్‌లో బెర్తు ఖరారు చేస్తూ కీలకమైన వ్యవసాయ శాఖను కేటాయించారు. ఆ తరువాత చేపట్టిన మంత్రివర్గ మార్పుల సమయంలోనూ ఏనుగు రవీందర్‌రెడ్డి భారీగానే ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. అదే సమయంలో కామారెడ్డి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న గంప గోవర్ధన్‌ను ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ బుగ్గ కారు యోగం కల్పించారు. తాజాగా నామినేటెడ్ పదవులపై దృష్టిసారించిన తెరాస అధిష్ఠానం కీలక పదవులను ఒక్కోటిగా భర్తీ చేస్తుండగా, ఈసారైనా ఏనుగు రవీందర్‌రెడ్డికి అవకాశం వరిస్తుందని ఆయన అనుచరులు ఆశించారు. వారి అంచనాలకు భిన్నంగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మెన్‌గా కేబినెట్ హోదాతో కూడిన పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామంతో ఏనుగు రవీందర్‌రెడ్డికి మరోమారు నిరాశే ఎదురైనట్లయ్యింది. ప్రస్తుతం జిల్లాకు మరో కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవిని కట్టబెట్టాలని అధినేత కెసిఆర్ యోచిస్తే తప్ప, ఏనుగు రవీందర్‌రెడ్డికి బుగ్గ కారు యోగం దక్కే అవకాశాలు లేవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అసలే కీలకమైన నామినేటెడ్ పోస్టులకు ఇతర జిల్లాల నుండి తీవ్రమైన పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో జిల్లాకు మరో పదవిని కేటాయిస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. నిజానికి చట్టసభలకు తెరాస పోటీ చేయడం ప్రారంభించిన నాటి నుండే ఆ పార్టీ తరఫున ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రతీసారి పోటీ చేస్తూ వస్తున్నారు. 2004లో ఆయన తొలిసారిగా పోటీ చేసి తెరాస ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా టిఆర్‌ఎస్ అధిష్ఠానం ఉద్యమ సమయంలో ఇచ్చిన పిలుపులను అందుకుని ప్రతీసారి తన పదవులకు రాజీనామాలు చేస్తూ, తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2008 ఉప ఎన్నిక సమయంలో ఒక పర్యాయం ఆయన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని మినహాయిస్తే ఇప్పటివరకు ఐదు పర్యాయాలు పోటీ చేసి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత ఏనుగు రవీందర్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు కేబినెట్‌లో కానీ, ఆ హోదాతో కూడిన పదవులు కానీ వరించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం బుగ్గ కారు యోగం దక్కిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్‌లు ఇదివరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగి, తెరాసలో చేరిన వారు కావడం గమనార్హం. మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మెన్‌గా నియమితులైన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా గత ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటికీ, తొలిదఫాలోనే ఆయనకు బుగ్గకారు యోగం దక్కింది. అలాంటిది తెరాస తరఫున సీనియర్ ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం కాలేకపోతుండడం ఆయన అనుచర వర్గాన్ని ఒకింత అసంతృప్తికి గురి చేస్తున్నాయి. అయితే పార్టీకి విధేయులుగా ఉన్న వారికి, ప్రజల్లో పలుకుబడి పెంపొందించుకుని పాలనానుభవం కలిగిన వారికి తెరాస అధినేత కెసిఆర్ పదవుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తుండడంతో ఏనుగు రవీందర్‌రెడ్డికి అవకాశం వరించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గతంలో ఆయన పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే అభియోగంపై కొన్నాళ్ల పాటు ఏనుగు రవీందర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు సైతం వేశారు. ఈ తరహా పరిణామాలు కాస్త రవీందర్‌రెడ్డికి బుగ్గ కారు యోగం రాకుండా అడ్డుగా నిలుస్తుండవచ్చని పరిశీలకులు విశే్లషిస్తున్నారు.