నిజామాబాద్

రైతు చైతన్య యాత్రలకు భానుడి సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 2: ఖరీఫ్ సాగుకు అన్నదాతను అన్ని విధాలా సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో ‘మన తెలంగాణ - మన వ్యవసాయం’ పేరిట ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రలు జిల్లాలో మొక్కుబడిగానే కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే కరవు తీవ్రత దృష్ట్యా సేద్యపు రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని పంటల సాగుకు రైతులు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో రైతు చైతన్య యాత్రలో భాగస్వాములయ్యేందుకు కూడా అంతగా ఆసక్తి చూపలేకపోతున్నారు. అన్నింటికి మించి మండుతున్న ఎండలు రైతు చైతన్య యాత్రల సదస్సులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలో గత పక్షం రోజుల నుండి 43 నుండి 45డిగ్రీలకు చేరువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్లను వీడి బయటకు వచ్చేందుకు ఏమాత్రం సాహసించడం లేదు. వడదెబ్బ ధాటికి జిల్లాలో ఇప్పటికే 35మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఆదివారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురిని వడదెబ్బ కబళించింది. ఇంతటి ఊష్ణ తీవ్రతలో చైతన్య యాత్రలకు హాజరయ్యేందుకు రైతులు సైతం జంకుతున్నారు. నిప్పులు కురిపిస్తున్న భానుడి భగభగలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకే చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నప్పటికీ, ఉదయం 9గంటల నుండే ఎండ తీవ్రత తన ప్రతాపం చూపిస్తోంది. వ్యవసాయ శాఖతో పాటు ఇతర అనుబంధ శాఖల అధికారులంతా ఈ యాత్రల్లో పాల్గొని పంటల సాగులో మెళకువలు, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు గురించి వివరిస్తారని, రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ వారికి విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నందున అన్నదాతలు రైతు చైతన్య యాత్రలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నప్పటికీ, సదస్సుల్లో పాల్గొంటున్న రైతుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. హాజరవుతున్న అరకొర మంది రైతులు కూడా గత ఖరీఫ్‌లో పంట నష్టం జాబితాను సక్రమంగా రూపొందించలేదని, ఎవరెవరికి నష్టపరిహారం మంజూరయ్యేందనే వివరాలను వెల్లడించడం లేదని, యంత్రలక్ష్మి పథకం కింద సబ్సిడీ ట్రాక్టర్లు, ఇతర పరికరాలను అర్హులైన వారికి కాకుండా అధికార పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వారికే పంపిణీ చేశారంటూ పలుచోట్ల అధికారులను నిలదీస్తున్నారు. ఇలా రైతుల నుండి ఒకింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నప్పటికీ, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో స్థానిక అధికారులు రైతు చైతన్య యాత్రలను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, ఎలాగోలా వీటిని నిర్వహించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఎటొచ్చీ రైతుల నుండి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలైన పశుసంవర్ధక, ఉద్యానవ, మార్కెటింగ్, మత్స్యశాఖ, సెరికల్చర్, వన సంరక్షణ, చక్కెర, విద్యుత్, ఇరిగేషన్, బ్యాంకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తలు పాల్గొనాలని నిర్దేశించినప్పటికీ, సగానికి పైగా శాఖలకు చెందిన అధికారులు కూడా గైర్హాజర్ అవుతున్నారు. మరోవైపు మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతు చైతన్య యాత్రల పట్ల మాత్రం ముఖం చాటేస్తున్నారు. నామ్‌కేవాస్తేగా పలుచోట్ల సర్పంచ్‌లు, ఎంపిపిలు, ఎంపిటిసిలు మాత్రమే పాల్గొంటున్నారు. రైతుల ప్రయోజనార్థమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అధికారులు పదేపదే చెబుతున్నప్పటికీ, అన్నదాతల నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో అధికారులు మొక్కుబడి తంతుగా సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యంతో పంటలు కోల్పోయినప్పటికీ, తమకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం ఇప్పించడం లేదంటూ రైతుల నుండి ఈసారి నిరసనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

నేర చరిత్రను తెలుసుకునేందుకు
సాఫ్ట్‌వేర్ దోహదం
ఇందూర్, మే 2: నిందితుల నేర చరిత్రను తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న సాఫ్ట్‌వేర్ కేసుల దర్యాప్తులో ఎంతగానో సహకరిస్తుందని ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కల్పించేందుకు పోలీసు అధికారులకు ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులను వెంటనే ఆన్‌లైన్ చేస్తే నిందితుల నేర చరిత్రను తెలుసుకునే నూతన సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చిందని, దాని ద్వారా అనుమానితుల వివరాలను తెసుకుని దర్యాప్తులో ముందడుగు వేయవచ్చని అన్నారు.
అంతేకాకుండా పాస్‌పోర్టు వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్‌లకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇటీవలే ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్త్ఫురాలను పొందుపర్చి నేర చరిత్రను తెలుసుకోగలిగారని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వాల్యూపిచ్ సంస్థ రీజినల్ మేనేజర్ నీలకంఠంరాజు మాట్లాడుతూ, తమ సంస్థ దేశంలోని 19వేల న్యాయస్థానాల్లోని 12కోట్ల కేసులకు సంబంధించిన డేటాబేస్ ద్వారా నిందితుల నేర చరిత్రను బయటపెట్టవచ్చని అన్నారు. పోలీస్ శాఖకు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నేరాలు చేసిన నిందితులను వెంటనే గుర్తించి, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో నిజామాబాద్ డిఎస్పీ డి.ఆనంద్‌కుమార్, సిఐలు నర్సింగ్ యాదయ్య, ఎన్.నరేందర్, జి.వెంకటేశ్వరరావు, మునినాయక్, హెచ్.వెంకటేశ్వర్లు, నర్సింహస్వామి, పి.రమణారెడ్డి, ఎస్‌బి ఎస్‌ఐ రవీందర్‌తో పాటు నిజామాబాద్ సబ్ డివిజన్‌కు చెందిన ఎస్‌ఐలు, ఐ.టి కోర్ టీమ్ సిబ్బంది గంగాధర్, అల్త్ఫా బేగ్, సంజీవ్‌కుమార్, కృష్ణకుమార్‌గౌడ్, శ్రీనివాస్, ఉమామహేశ్వర్‌రావు, నరుూం, సిద్దీఖ్, రఘువీర్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

‘కమ్యూనిస్టులపై ఎంపి కవిత వ్యాఖ్యలు దురహంకారమే’
కంఠేశ్వర్, మే 2: అసమాన త్యాగాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టులపై నిజామాబాద్ ఎంపి కవిత హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చసిన వ్యాఖ్యలు ఫ్యూడల్ దురహంకారానికి నిదర్శనమని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్ అన్నారు. సోమవారం నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, ఎంబిసి, మైనార్టీలు 92శాతం భూమి, ఉద్యోగాలు, సామాజిక రంగాల్లో ఎవరి వాటా ఎంతో తేల్చకుండానే తెలంగాణలో సిఎం కెసిఆర్ ద్వారా విప్లవం వస్తుందా? అని ప్రశ్నించారు. ఎంపి కవిత, ఆమె తండ్రి కెసిఆర్ పుట్టక ముందే కమ్యూనిస్టులు స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మంది త్యాగాలు చేసిన చరిత్రను తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, రాజకీయ పదవులు స్వయం పాలన తెలంగాణ వారికే సొంతమవుతాయన్న కవిత, కెసిఆర్‌లు తెలంగాణ మొత్తాన్ని కుటుంబ పాలనగా మార్చివేశారని ఆరోపించారు. దళితుడిని సిఎం చేస్తానని చెప్పి తానే సిఎం అయ్యారని, అలాంటప్పుడు కెసిఆర్ ఎలా విప్లవకారకుడవుతారని ప్రశ్నించారు. ప్రజల విముక్తి కోసం సర్వం ధారపోసి నిర్మించిన కమ్యూనిస్టు పార్టీలపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదన్నారు. ఆశా వర్కర్లు, మున్సిపల్, పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచమంటే పోలీసులతో అక్రమ కేసులు బనాయించడమేనా సిఎం కెసిఆర్ తెచ్చిన విప్లవం అని నిలదీశారు. వరంగల్ జిల్లాలో విప్లవ పార్టీ కార్యకర్త, ఎంబిసి అయిన శృతిని మానభంగం చేసి చంపడమే విప్లవమా అని ప్రవ్నించారు. విలేఖరుల సమావేశంలో సిపిఎం నాయకుడు పెద్ద వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం
కంఠేశ్వర్, మే 2: మిషన్ కాకతీయ పనులతో చెరువులకు పూర్వ వైభవం చేకూరుతుందని, రానున్న వర్షాకాలంలో జలకళను సంతరించుకోనున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం నగర శివారులోని అర్సపల్లి చెరువులో మిషన్ కాకతీయ రెండవ దశ కింద పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని అన్నారు. తొలి దశ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం రెండవ దశ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇందులో భాగంగానే అర్సపల్లి చెరువును 56.68లక్షల రూపాయల నిధులతో పూడికతీత పనులు చేపడుతున్నామని చెప్పారు. నగరానికి తాగునీటిని అందించే జలాశయాలైన రఘునాథ చెరువు, అలీసాగర్, మంచిప్పలలో ఇప్పటికే మంచిప్ప, రఘునాథ చెరువులు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేవలం అలీసాగర్ ద్వారా మాత్రమే ప్రజల దాహార్తి తీరుస్తున్నామని, దీనిని గుర్తించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రఘునాథ చెరువుకు ప్రభుత్వం 6.28కోట్ల రూపాయలను విడుదల చేసిందని, దీనిని త్వరలోనే మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చనున్నామని తెలిపారు. రైతులు మిషన్ కాకతీయ పనుల్లో పాల్గొని పూడిక మట్టిని పంట పొలాలకు తరలించుకోవాలని సూచించారు. అనంతరం హైమద్‌పురా కాలనీలో 42లక్షల రూపాయలతో సి.సి డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 7వ డివిజన్‌లో గల వినాయక్‌నగర్‌లోని బైపాస్ రోడ్డు పక్కన ఇంకుడు గుంతల నిర్మాణాలను ప్రారంభించారు. శివాలయానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఎంఎ.్ఫహీమ్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
రఘునాథ చెరువును సందర్శించిన ఎమ్మెల్యే
కాగా, నగరంలోని ఖిల్లా ప్రాంతంలో గల రఘునాథ చెరువును సోమవారం సాయంత్రం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా సందర్శించారు. ప్రస్తుతం ఈ చెరువులో మిషన్ కాకతీయ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రఘునాథ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం 6.50కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పూడికతీత పనులు పూర్తయ్యాక చెరువును అన్ని విధాలుగా సుందరీకరించి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మల్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు వీలుగా ఆయా డివిజన్‌లలో పార్కులను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట మేయర్ సుజాత, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.

కాంట్రాక్ట్ పద్ధతిపై వైద్యుల నియామకం
విధుల్లో చేరిన సీనియర్, జూనియర్ డాక్టర్లు
కంఠేశ్వర్, మే 2: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) అనుమతి మేరకు నూతనంగా నియామకమైన సీనియర్, జూనియర్ డాక్టర్లు సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న జిల్లా జనరల్ ఆసుపత్రిలో విధుల్లో చేరారు. గత నెల 25వ తేదీన హైదరాబాద్‌లోని డిఎంఇ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిపై వైద్యుల నియామకాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించగా, 36మంది సీనియర్ డాక్టర్లు, 18మంది జూనియర్ డాక్టర్లు ఎంపికయ్యారని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర తెలిపారు. సీనియర్ డాక్టర్లకు సంబంధించి ఐదుగురు అనస్థీషియా, ఆరుగురు పిల్లల వైద్యులు, నలుగురు స్ర్తి వైద్య నిపుణులు, ఐదుగురు సర్జన్లు, ముగ్గురు ఆర్థోపెడిక్‌లు, ఇద్దరు పలమనేరి మెడిసిన్, ఒకరు ఇఎన్‌టి, ఒకరు జనరల్ మెడిసిన్‌తో పాటు అత్యవసర విభాగాలకు సంబంధించిన ఆరుగురు డాక్టర్లను నియమించడం జరిగిందని వివరించారు. వీరితో పాటు మరో ఇద్దరు ఫిజియోథెరపీ వైద్యులను అదనంగా నియమించారని అన్నారు. కాగా, ఇదివరకు జిల్లా జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన 18మంది జూనియర్ డాక్టర్ల కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయడంలో జాప్యం జరిగినందున వారిని విధుల నుండి తొలగించారని, ప్రస్తుతం వారిని కూడా తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం జరిగిందన్నారు. నూతనంగా నియామకమైన వైద్యులు సోమవారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో రిపోర్ట్ చేయగా, డాక్టర్ ఇందిరతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌కుమార్, నాగరాజు, సంజీవ్, అతిక్, చక్రధర్ తదితరులు వారి ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం వారిని విధుల్లో చేరేందుకు ప్రిన్సిపాల్ ఇందిర, ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్‌కుమార్‌లు అనుమతించారు.

పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదల
డిచ్‌పల్లి రూరల్, మే 2: తెలంగాణ విశ్వవిద్యాలయం గత మార్చి 11న నిర్వహించిన పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రానికి జవాబుల కీ సోమవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తన చాంబర్‌లో విడుదల చేశారు. మొత్తం 16 సబ్జెక్టులలో పిహెచ్‌డి ప్రవేశాలకై నిర్వహించిన అర్హత పరీక్షకు 755మంది పరీక్షలు రాశారు. ఈ కీని తీతీతీ.ఆఖళన్ఘౄఒ.్య వెభ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆయన సూచించారు. అభ్యర్థులకు జవాబుల పట్ల ఏమైనా సందేహాలుంటే ఈ నెల 7వ తేదీలోపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పాత నాగరాజును సంప్రదించవచ్చని అన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన మీదట మే 7వ తేదీ అనంతరం తుది ఫలితాలను కటాఫ్ మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా త్వరలోనే వెల్లడిస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
తెయుకు రూ. 20లక్షల నిధులు
ఎమ్మెల్సీ ఆకుల లలిత తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి తెలంగాణ యూనివర్శిటీ అభివృద్ధి కోసం 20లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రికి అందజేశారు. గత నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు వర్శిటీ అభివృద్ధికి తన కోటా నుండి నిధులను కేటాయించాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన ఆకుల లలిత సోమవారం వర్శిటీ రిజిస్ట్రార్ లింబాద్రిని తన నివాసానికి ఆహ్వానించి 20లక్షల రూపాయల నిధులకు సంబంధించిన అంగీకార పత్రాన్ని అందజేశారు.

వడదెబ్బతో బాలిక మృతి
బిచ్కుంద, మే 2: బిచ్కుంద మండల కేంద్రంలో అర్చన(4) అనే బాలిక వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందింది. మండలంలోని పత్లాపూర్ గ్రామస్థులైన బాలిక కుటుంబీకులు పనులను అనే్వషిస్తూ గత కొన్నాళ్ల క్రితం బిచ్కుంద మండల కేంద్రానికి వచ్చి ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అర్చన సోమవారం ఇంటి బయట ఎండలో ఆడుకుంటూ మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆమె వడదెబ్బకు గురైనట్టు గుర్తించిన కుటుంబీకులు, స్థానికులు హుటాహుటిన బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

రైతులను ఆదుకోవాలని బిజెపి ధర్నా
నందిపేట, మే 2: రైతులు ఎదుర్కొంటున్న కరవు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో సోమవారం నందిపేట తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సాగునీరు కరువై అప్పుసొప్పులు చేసి వేసిన పంటలు కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయినా, ప్రభుత్వం వారికి అండగా నిలువడం లేదని, పశుగ్రాసం కొరత నెలకొని మూగజీవాలు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా బిజెపి నాయకులు తెరాస ప్రభుత్వం తీరును ఆక్షేపించారు. కరవు తీవ్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతుల పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందజేయాలని డిమాండ్ చేశారు. పంటలు కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలన్నారు. ధర్నాలో బిజెపి నాయకులు ఎర్రం ముత్యం, కొందపూర్ బోజన్న, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

సదుపాయాలు కల్పించాలి
జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, మే 2: సమ్మర్ క్యాంపుల్లో అన్ని సదుపాయాలను కల్పిస్తూ ప్రత్యేక శిక్షణ తరగతులకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా చొరవ చూపాలని విద్యాశాఖ అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమ్మర్ క్యాంపుల నిర్వహణపై మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ, వేసవి శిబిరాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తే విద్యార్థులు తప్పనిసరిగా హాజరవుతారని అన్నారు. ఈ దిశగా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో చేరే విద్యార్థులకు ఇప్పటి నుండే శిక్షణను అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులను కూడా సమ్మర్ క్యాంపుల్లో ప్రత్యేక శిక్షణ అందించి వారిని మెరుగుపర్చవచ్చని సూచించారు. తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వౌలిక వసతులు అందుబాటులో ఉన్న గురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. సమ్మర్ క్యాంప్‌ల వల్ల చేకూరే ప్రయోజనాల గురించి వివరిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు అత్యల్పంగా ఉంటోందని, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సదుపాయాల కల్పనకు నిధుల కొరత ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తేవాలన్నారు. ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్‌ల సాగుకు చర్యలు చేపట్టాలని, తద్వారా పాఠశాలల్లో చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనానికి రసాయ ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించని కూరగాయలను పాఠశాలల్లోనే పండించేందుకు వీలవుతుందని అన్నారు.మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే బియ్యం సరైన పద్ధతిలో, సరైన తూకంతో, నాణ్యమైన బియ్యం బడులకు చేరుతున్నాయో లేదో పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఇఓ లింగయ్యతో పాటు ఎంఇఓలు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.