నిజామాబాద్

తాగునీటి పథకం పనుల పరిశీలన పేరిట ఎంజాయ్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మే 17: ఆర్మూర్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు 114 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న తాగునీటి పథకం పనుల పరిశీలన పేరిట మంగళవారం ఎంజయ్ చేశారు. ఇంటెక్ వెల్ పనుల పరిశీలన సాకుతో మెగా కంపెనీ ఆధ్వర్యంలో విందు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. వంద కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపడుతున్న తాగునీటి పథకం పనుల్లో తమకు ఇప్పటివరకు ఎలాంటి మర్యాదలు చేయలేదని, కనీసం జేబుకు కూడా ఏమి ఇవ్వలేదంటూ మెగా కంపెనీ వారితో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు వాదనకు దిగినట్లు సమాచారం. 114 కోట్ల తాగునీటి పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని కౌన్సిలర్లు పలుసార్లు మెగా కంపెనీ మేనేజర్‌కు చెప్పడం గమనార్హం. గడిచిన ఆరు నెలలుగా ఇంటెక్ వెల్ పనులను పరిశీలించడానికి పాలకవర్గ సభ్యులతో పాటు పత్రికా ప్రతినిధులు వస్తారని ప్రచారం చేసుకొని మరీ మంగళవారం పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసుకోవడం ఆర్మూర్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ అధికారులతో పాటు పాలకవర్గ సభ్యులు కుటుంబ సభ్యులతో సహా ఇంటెక్ వెల్ వద్ద మద్య సేవనంతో పాటు విందు భోజనం చేశారు. ఇంటెక్ వెల్ పనులు పరిశీలించడానికి వస్తున్నామని, పనులు జరిగే చోట విందు ఏర్పాటు చేయాలని మెగా కంపెనీ మేనేజర్‌కు ఆదేశించి మరీ విందు పెట్టుకోవడం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఒకవైపు నీటి గోస...
మరోవైపు పాలకవర్గ సభ్యుల విందు
ఒకవైపు ఆర్మూర్ పట్టణ ప్రజలు నీటి గోసతో అల్లాడుతుంటే మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మాత్రం తాగునీటి పథకం పనుల పరిశీలన పేరిట విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విస్తృతంగా పర్యటించి వెళ్లిన మరుసటి రోజునే మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఇంటెక్ వెల్ వద్ద విందు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యతో సంబంధం లేకుండా పాలకవర్గ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎంతసేపు తమ ధ్యాసే తప్ప ప్రజల గోడు పట్టని విధంగా వ్యవహరించడం వివాదానికి దారి తీస్తోందని పలువురు అంటున్నారు. మరోవైపు 114 కోట్లతో తాగునీటి పథకం పనులు చేపడుతున్నందున కౌన్సిలర్లమైన తమకు కొంతమొత్తం ఇవ్వాలని మెగా కంపెనీ వారితో బేరసారాలు కొనసాగించినట్లు సమాచారం. మంగళవారం బాల్కొండ మండలం జలాల్‌పూర్ ఇంటెక్ వెల్ వద్ద జరిగిన విందులో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, కో ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.