నిజామాబాద్

బయోమెట్రిక్ అమలులో ఇందూరు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 22: ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరయ్యేందుకు, వారిలో జవాబుదారితనం పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు పద్ధతిని సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న నిజామాబాద్ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఐటిఐలలో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని మోడల్‌గా తీసుకుని, రాష్ట్రంలోని అన్ని ఐటిఐలలో ఈ పద్ధతిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం నిర్ణయించడం గమనార్హం. సర్కారీ దఫ్తర్ల పనితీరును మెరుగుపర్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలనే ఆశయంతో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. జిల్లాలో బాధ్యతలు చేపట్టిన మూడు మాసాల్లోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. గత 2015 నవంబర్ 2వ తేదీన జిల్లా పరిపాలనకు కేంద్రంగా ఉండే కలెక్టరేట్ కార్యాలయంలో మొట్టమొదటగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుండి దశల వారీగా జిల్లా స్థాయి నుండి డివిజన్, మండల స్థాయి వరకు సుమారు 40 శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులను బయోమెట్రిక్ హాజరు పద్ధతికి అనుసంధానం చేశారు. ప్రస్తుతం 34శాఖలకు చెందిన 5784మంది ఉద్యోగులు ఈ విధానంలోనే తమ హాజరును నమోదు చేస్తుండడం విశేషం. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ, తహశీల్దార్, జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్, వైద్యారోగ్య శాఖకు చెందిన పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. చివరకు కొంతమంది వైద్యులు మొదట్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కలెక్టర్ పట్టుదలను ప్రదర్శించడంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలోనూ బయోమెట్రిక్ హాజరుకు వైద్యులు అంగీకారం తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విధానం అమలు తీరును పరిశీలిస్తే, ఉద్యోగి ఫొటోను అప్‌లోడ్ చేసి, వేలిముద్ర, ఆధార్ కార్డు నెంబర్‌ను బయోమెట్రిక్‌తో అనుసంధానం చేస్తారు. ప్రతి ఉద్యోగి హాజరు నమోదు కోసం కోడ్ నెంబరును కేటాయిస్తారు. ఒక్కో శాఖకు ఒక డొమైన్ ఇస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను న్యూఢిల్లీలోని నేష్నల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వారు రూపొందించగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల నిజామాబాద్ ఎన్‌ఐసి అధికారులు ఈ విధానాన్ని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోని డాటాబేస్ పూర్తి భద్రత, నిఘాలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ హాజరును రోజువారీగా పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించారు. సదరు అధికారి కూడా హాజరు నమోదులో మార్పులు, చేర్పులు చేసే వీలు లేకుండా సర్వర్, డాటాబేస్ మొత్తం క్లౌడ్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డాటాబేస్‌ను టచ్ చేస్తే, ఎవరెక్కడ టచ్ చేశారనే వివరాలు రికార్డు అవుతాయి. ఫలితంగా హాజరు నమోదులో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించే వారిని ఇట్టే సులభంగా పసిగట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలా పకడ్బందీ విధానంతో అమలు చేస్తున్న బయోమెట్రిక్ పద్ధతి వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల విధుల్లో ఎంతో మార్పు వచ్చిందని ఆయా పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరును గాడిలో పెట్టేందుకు కలెక్టర్ యోగితారాణా కార్పొరేట్ సంస్థలు అవలంభించే రీతిలో ఆధునిక పద్ధతులను చేపడుతుండడం సత్ఫలితాలు ఇస్తోంది. బయోమెట్రిక్ తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా గతేడాది విద్యా సంవత్సరం నుండి అమల్లోకి తెచ్చిన ‘ఎస్‌ఎంఎస్’ విధానాన్ని 2016-17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండడం విశేషం.