నిజామాబాద్

ప్రత్యేక రాష్ట్రంలోనూ పునరావాసం కోసం ’మాజీ‘ల పడిగాపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 3: గత దశాబ్ద కాలం క్రితం వరకు కూడా నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల జాబితాలో ముందువరుసలో నిలుస్తూ వచ్చిన నిజామాబాద్ జిల్లాలో మాజీ నక్సలైట్లు దైన్య స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నారు. సర్కారు పిలుపునందుకుని జనజీవన స్రవంతిలో కలిసినా, ప్రభుత్వం తరఫున ఎలాంటి తోడ్పాటు లభించక వందలాది మంది ఉపాధి అనే్వషణలోనే కాలం వెళ్లదీస్తూ చిక్కిశల్యమవుతున్నారు. ‘లొంగుబాట’ను ఎంచుకుని సంవత్సరాల కాలం గడుస్తున్నా, సర్కారు సాయం కరువవడంతో తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ అనునిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా తమకు మంచి జరుగుతుందని ఆశించిన మాజీలకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. మావోయిస్టు(అప్పటి పీపుల్స్‌వార్), జనశక్తి పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సమయంలో వారి ప్రాభవాన్ని తగ్గించేందుకు అజ్ఞాతంలో కొనసాగుతున్న వారిని ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలువాలంటూ ప్రభుత్వం పదేపదే పిలుపునిచ్చేది. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధికి మార్గాలు చూపిస్తామని తాయిలాలు ప్రకటించేది. ఈ దిశగా పోలీసులు కూడా లొంగుబాట్లను ప్రోత్సహించేవారు. మొదట్లో ‘మాజీ’ల కోసం పునరావాస మేళాలు నిర్వహించి ఆటోరిక్షాలు, టైలరింగ్, కిరాణకొట్టు తదితర వాటిని నెలకొల్పుకునేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా సన్నగిల్లిన తరుణంలో గడిచిన దశాబ్ద కాలం నుండి ఈ తరహా కార్యక్రమాలను ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించేసింది. లొంగిపోతే తమ జీవితాలు బాగుపడతాయని భావించి జనజీవన స్రవంతిలో కలిసిన అనేక మందికి ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఎలాంటి తోడ్పాటు లభించక భారంగా జీవనాలు వెళ్లదీస్తున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 650మందికి పైగా మాజీ నక్సలైట్లు పునరావాసం కింద సర్కారు తోడ్పాటుకై చకోర పక్షుల్లా ఎదురుతెన్నులు చూస్తున్నారు.
ఎన్ని విజ్ఞాపలు సమర్పించినా, ఎంతమంది అధికారులను ప్రాధేయపడినా ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రపడిన వారి నుండి మొదలుకుని ఉత్తర తెలంగాణ జిల్లాల కార్యదర్శి స్థాయి వరకు వివిధ క్యాడర్లలో పని చేసిన వందలాది మంది మాజీ నక్సలైట్లు పునరావాసం కోసం ఏళ్ల తరబడి ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఓ వైపు ఉద్యమంలో కొనసాగిన సమయంలో పోలీసులు బనాయించిన లెక్కకు మిక్కిలి కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరగడం, మరోవైపు ప్రభుత్వ పరంగా ఉపాధి లభించక మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో అనేక వ్యయప్రయాసాలకు లోనుకావాల్సి వస్తోందని మాజీ నక్సలైట్లు వాపోతున్నారు. అంతేకాకుండా ఎక్కడైనా ఏ చిన్న సంఘటన జరిగినా, ఎక్కడైనా వాల్‌పోస్టర్లు వెలిసినా, ఎర్రజెండాలు ఎగిరినా పోలీసులు ముందుగా తమనే అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని, ఫలితంగా సమాజంలో తాము గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. జిల్లాలో 80వ దశకంలో మావోయిస్టు ఉద్యమం మొదలై అంతకంతకూ విస్తరించింది.
ఒకవిధంగా చెప్పాలంటే జిల్లాలో మావోయిస్టులు ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతర పాలన కొనసాగించారు. కమ్మర్‌పల్లి, మాచారెడ్డి, భీమ్‌గల్, మోర్తాడ్, సిరికొండ, దర్పల్లి, డిచ్‌పల్లి, సదాశివనగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, గాంధారి తదితర మండలాల్లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండేది. దీంతో ‘వార్’ పట్ల ఆకర్షితులై అనేక మంది యువతీ, యువకులు మావోయిస్టు ఉద్యమంలో చేరి ఆయా దళాల్లో తుపాకులు చేతబూని అజ్ఞాతంలో గడిపారు. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు వేయి మంది వరకు నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నట్టు ఎన్‌ఐబి(నక్సల్స్ ఇనె్వస్టిగేషన్ బ్యూరో) రికార్డులు చెబుతున్నాయి. అయితే 1990 అనంతరం పోలీసులు నక్సల్స్ కోసం వేటను ముమ్మరం చేస్తూ, ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టపర్చుకోవడం ద్వారా వరుస ఎన్‌కౌంటర్లకు పాల్పడుతూ కీలక నేతలను మట్టుబెట్టారు. మరోవైపు అజ్ఞాతంలో కొనసాగుతున్న నక్సలైట్లు జన జీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న కేసులను ఎత్తివేయడంతోపాటు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లా కార్యదర్శి స్థాయిలో పని చేసిన దర్పల్లికి చెందిన గంగాధర్ అలియాస్ రసూల్‌తో పాటు జిల్లా కార్యదర్శిగా కొనసాగిన హరిభూషణ్ అలియాస్ షామిర్‌పాషా వంటి అనేక మంది మావోయిస్టు నేతలు, దళ సభ్యులు, వందల సంఖ్యలో సానుభూతిపరులు లొంగుబాటును ఎంచుకున్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 375మందికి మాత్రమే ప్రభుత్వ తోడ్పాటు అందగా, మరో 650మంది వరకు మాజీ నక్సలైట్లు పునరావాసం కోసం సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్నారు.