నిజామాబాద్

అడుగంటుతున్న భూగర్భ జలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, మార్చి 19: వరుస వర్షాభావ పరిస్థితులు నిజామాబాద్ జిల్లా ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరుణుడి కరుణ లేక ఇప్పటికే సేద్యపు రంగం కుదేలవగా, క్రమక్రమంగా తాగునీటి ఇబ్బందులూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తూ పంటలను సస్యశ్యామలం చేసే శ్రీరాంసాగర్, నిజాంసాగర్ భారీ ప్రాజెక్టులతో పాటు జిల్లాలోని ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలన్నీ నీటి నిల్వలు లేక బోసిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బోరుబావులను నమ్ముకున్న రైతులు, ప్రజలకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. వర్షాభావం వల్ల అడుగంటిన భూగర్భ జలాలు నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత మూడు దశాబ్దాల కాలంలో మునుపెన్నడూ లేనివిధంగా భూగర్భ జలాలు అధఃపాతాళానికి చేరడంతో నీటి కష్టాలు చుట్టుముట్టి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భూగర్భ జల వనరుల శాఖ అధికారులు 2016 సంవత్సరానికి సంబంధించి గత ఫిబ్రవరి నెలాఖరు వరకు వివిధ బేసిన్ల వద్ద లెక్కించిన భూగర్భ జలాల వివరాలను తాజా నివేదికలో పొందుపర్చారు. జిల్లాలో ఎంతటి గడ్డు పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ నివేదికలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో 19.5మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోవడంతో వేలాది బోరుబావులు ఎత్తిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 13.5మీటర్ల వద్ద భూగర్భజలాలు అందుబాటులో ఉండగా, ఈసారి ఏకంగా మరో ఆరు మీటర్ల లోతుకు వెళ్లిపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే జూన్ రెండవ వారం నాటికి భూగర్భ జలాలు 25మీటర్ల లోతుకు పడిపోయే ప్రమాదం లేకపోలేదని సంబంధిత శాఖ నిపుణులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. అంటే వచ్చే సీజన్‌లో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే పరిస్థితి మెరుగుపడనుండగా, మళ్లీ ప్రతీకూల పరిస్థితే ఎదురైతే ప్రజల మనుగడ మరింత దుర్భరంగా మారనుందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. నిజానికి భూగర్భ జలమట్టం 15మీటర్ల లోతుకు చేరితేనే అత్యంత గడ్డు పరిస్థితిగా పరిగణిస్తారు. అలాంటిది ప్రస్తుతం 19.5మీటర్లకంటే దిగువకు పడిపోవడం, మే, జూన్ మాసాల్లోనైతే ఏకంగా 25మీటర్ల లోతుకు చేరుకునే అవకాశాలు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ ఏడాది వేసవి సీజన్ ప్రారంభం కాకముందే జనవరి నెలలోనే జలమట్టం 17మీటర్లకు చేరుకుని సమస్య తీవ్రతను చాటింది. నెలన్నర రోజుల వ్యవదిలోనే ప్రస్తుతం 19.5మీటర్ల లోతుకు చేరుకున్నాయి. ఇదే వేగంతో క్షీణిస్తూ పోతే మండు వేసవిలో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు గుక్కెడు నీటి కోసం పరితపించాల్సిన దుస్థితి తలెత్తనుంది. గడిచిన నాలుగేళ్ల నుండి ఈ తరహా ఆందోళనకర స్థితి ఎదురవలేదు. 2013వ సంవత్సరంతో పోలిస్తే 2014లో జిల్లాలో సగటున 3.31మీటర్ల మేర భూగర్భ జలాలు వృద్ధి చెందగా, 2015లో మాత్రం అందుకు భిన్నంగా దాదాపు 5మీటర్ల మేర మరింత లోతుకు పడిపోయాయి. 2013 మే మాసంలో 12మీటర్ల లోతులో ఉన్న జలమట్టం కాస్త, 2014 మే నాటికి 11మీటర్లకే అందుబాటులోకి వచ్చింది. 2015లో మాత్రం ఏకంగా 15.5మీటర్లకు పడిపోయింది. ఇది మొదలు భూగర్భ జలమట్టం అంతకంతకూ పడిపోతూ అధఃపాతాళం దిశగా శరవేగంగా పరుగులు తీస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు, గణనీయంగా పెరిగిన నీటి వినియోగమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం సగటున 1007మి.మీలు కురియాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 509మి.మీలకే పరిమితమైంది. దాదాపు నలభై శాతానికి పైగా వర్షపాతం లోటు ఏర్పడడంతో భూగర్భ జలాల వినియోగం గణనీయంగా పెరిగి అధఃపాతాళం వైపు పరుగులు తీస్తున్నాయి. తీవ్ర ఎండలు కాచే మే మాసంలోనూ జిల్లాలో ఇదివరకు 13మీటర్లకు మించి నీరు లోతుకు పడిపోలేదు. అందుకు భిన్నంగా ఈసారి ఫిబ్రవరి నెలాఖరుకే 19.5మీటర్లకు చేరుకోవడం మునుముందు మరింత తీవ్ర స్థాయిలో తలెత్తనున్న విపత్కర పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికే వేలాది వ్యవసాయ, గృహావసర బోరుబావులు వట్టిపోయాయి. జిల్లా రైతాంగం పూర్తిగా బోరుబావులపైనే ఆధారపడి సేద్యం సాగిస్తున్న తరుణంలో భూగర్భ జలాలు అడుగంటడం అన్నదాతను మనోవేదనకు గురి చేస్తోంది. ఇక గృహావసరాలకూ సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో నీటి కోసం ఇబ్బడిముబ్బడిగా బోర్లు తవ్విస్తున్నారు.

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, మార్చి 19: జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌తో పాటు బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణాల్లో తాగునీటి సరఫరాపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ నగర పాలక సంస్థ అధికారులతో జిల్లా కేంద్రంలో తాగునీటి సరఫరా తీరుతెన్నులపై సమీక్ష జరిపిన కలెక్టర్, శనివారం కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీల అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులతో తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తాగునీటి పథకాల నిర్వహణ గాడితప్పడం, సాంకేతిక లోపాలు తలెత్తడాన్ని ప్రస్తావిస్తూ కలెక్టర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన పథకంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోపు వాటిని సరి చేయించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక లోపాల కారణంగా ప్రజలకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడం లేదని, ఫలితంగా కామారెడ్డి పట్టణంలోని ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, దీని నిర్వహణ బాధ్యతలను రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ కంపెనీయే చూడాల్సి ఉన్నందున సదరు నిర్మాణ కంపెనీచే సాంకేతిక సమస్యలను సరి చేయించాలని మున్సిపల్ కమిషనర్ పట్ట్భాని ఆదేశించారు. అయితే ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు కాంట్రాక్ట్ కంపెనీకి సూచించినా స్పందించడం లేదని కమిషనర్ తెలుపగా, కలెక్టర్ అసహనం వెలిబుచ్చారు. ఒప్పందానికి అనుగుణంగా రెండేళ్ల నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్ట్ కంపెనీయే చూసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు చేపట్టేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రతి విభాగాన్ని పరిశీలించాలని, కామారెడ్డి తాగునీటి పథకం లోపాలను గుర్తించి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలతో ముడిపడి ఉన్న పథకాల నిర్వహణ విషయంలో ఎంతమాత్రం రాజీపడబోమని తేల్చి చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సాంకేతిక సమస్యలను సరి చేయించి ప్రజలకు సరిపడా నీరందేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కాగా, ఆర్మూర్ పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు 114కోట్ల రూపాయలతో చేపట్టిన పథకం పనులను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎజిఎం యువరాజ్‌కు కలెక్టర్ సూచించారు. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్ పనులతో పాటు నాలుగు రిజర్వాయర్ల పనులను నిర్దేశిత గడువుకంటే ముందుగానే పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని, అధునాతన యంత్ర పరికరాలను వినియోగించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఇ.ఇ శ్రీనివాస్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీల కమిషనర్‌లు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డెక్కిన నల్ల బెల్లం రైతులు
అరగంట పాటు రాస్తారోకో
అడ్డుకున్న పోలీసులు
భిక్కనూరు, మార్చి 19: రైతులు పండించిన నల్ల బెల్లాన్ని ఆంక్షల పేరుతో కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తు నల్లబెల్లం రైతులు శనివారం భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. డివిజన్ స్థాయిలో నల్లబెల్లం రైతులు వస్తారన్న ఉద్దేశ్యంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ పోలీస్ బలగాలను మోహరించడమే కాకుండా దోమకొండ, మాచారెడ్డి, కామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్, భిక్కనూరు మండలాలతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికి నల్లం బెల్లం రైతులు పెద్ద ఎత్తున బిటిఎస్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అనుమతించలేదు. దీంతో జంగంపల్లి గ్రామ శివారులోని సాయిబాబా ద్వారాకమయి వద్ద రోడ్డుపై బైఠాయించి 15నిమిషాల పాటు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోవడం లేదని, ఆరుగాలం శ్రమించి పండించిన బెల్లాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల బెల్లం ముద్దల నిల్వలు రైతుల వద్ద పెరుకుపోయాయని, తద్వారా ఆరుగాలం శ్రమించిన కష్టంతో పాటు పెట్టిన పెట్టుబడులు కొల్పోయి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల బెల్లం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుకు ఎక్కితే కేసులు చేస్తామని పోలీసులు బెదిరించడంతో చావుకు సిద్ధంగా ఉన్న తమకు కేసులు పెడితే ఏమవుతుందని కడుపు మంటతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. బెల్లాన్ని కొనుగోలు చేసే వరకు ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. అనంతరం సిఐ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ రాంబాబుల ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన వద్దకు చేరుకోని రాస్తారోకో చేస్తున్న రైతులను సముదాయించి రాస్తారోకో విరమింపచేశారు. చెరుకు గడలు, బెల్లం ముద్దాలతో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.

సౌకర్యాలు మెరుగుపర్చాలి
కలెక్టర్ యోగితా రాణా
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, మార్చి 19: ఈ నెల 21 నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న దృష్ట్యా, అన్ని పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి చేంజ్ ఏజెంట్లు తమతమ పరిధిలో గల పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను నిశితంగా పరిశీలన జరపాలని, ఎక్కడైనా లోటుపాట్లు కనిపిస్తే యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాలను సమకూర్చాలని సూచించారు. శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో చేంజ్ ఏజెంట్లు, ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సెస్సీ పరీక్షలు కొనసాగుతున్న తీరు గురించి చేంజ్ ఏజెంట్లు పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, వైద్య సదుపాయం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎక్కడైనా పరీక్షా కేంద్రాల గదుల్లో తగినంతగా వెలుతురు లేకపోతే విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 206 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 39వేల మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. ప్రతిరోజు ఉదయం 9.30గంటల నుండి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించడంతో పాటు అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా ఆదేశాలు జారీ చేయాలని, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని సూచించారు. ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున సి.సి కెమెరాలను ఏర్పాటు చేయిస్తోందని, మన జిల్లాకు సంబంధించి బాన్సువాడ మండలం బోర్లం పరీక్షా కేంద్రంలో సి.సి కెమెరా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఐదు నిమిషాలు దాటితే అభ్యర్థులను లోనికి అనుమతించబోమని, ఈ విషయమై విద్యార్థులకు ముందుగానే అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కాగా, జిల్లాలో తాగునీటి సమస్య నెలకొనేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి గత నాలుగు నెలల నుండి చేపడుతున్న చర్యల వల్ల చాలావరకు నీటి ఎద్దడి సమస్యలను అధిగమించగల్గుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. తాగునీటి పథకాల పనుల కోసం 4.96కోట్ల రూపాయలు సిఆర్‌ఎఫ్ కింద మంజూరు చేశామని, మరో 4.50కోట్ల రూపాయల నిధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. 936 బోరుబావులను డీపెనింగ్ చేయించగా, 583బోర్లలో నీరు వచ్చిందన్నారు. అవసరమైన చోట వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నామని, ఎలాంటి ప్రత్యామ్నాయం లేని ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద 343 గ్రామ పంచాయతీల్లో మెటీరియల్ కాంపొనెంట్ కింద ఖర్చు వివరాలను నమోదు చేయాలని, ఈ నెలాఖరు నాటికి 120కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉందన్నారు. లేనిపక్షంలో గడువు ముగిసిన అనంతరం నిధులు మళ్లీ రావాలంటే నవంబర్ మాసం వరకు వేచి చూడాల్సి వస్తుందన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం కింద 2.15లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే లక్షా 10వేల యూనిట్లను మంజూరు చేశామన్నారు. అయితే పనులు ఆశించిన స్థాయిలో పురోగతిలో ఉండడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు మంజూరీ ఇచ్చిన అన్ని యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు షెడ్డు వేసుకునేందుకు సబ్సిడీ అందించనున్నారని, పశుగ్రాసానికి కూడా సబ్సిడీ వర్తింపజేస్తున్నామని తెలిపారు. వీటిని పశు పెంపకందార్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. స్వయం ఉపాధి పథకాల కింద లబ్ధిదారులను వెంటనే ఎంపిక చేసి ఈ నెలాఖరు వరకు రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి, అదనపు జె.సి రాజారాం, డ్వామా పి.డి వెంకటేశ్వర్లు, డిఇఓ లింగయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ సిటిజన్లతో మాట్లాడేందుకు
సమయం కేటాయించాలి
కంఠేశ్వర్, మార్చి 19: పిల్లలు సీనియర్ సిటిజన్లతో మాట్లాడేందుకు సమయం కేటాయించాలని, అప్పుడే వారికి సంతోషాన్ని అందించినవారము అవుతామని కలెక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. శనివారం నగరంలోని మెడికల్ కళాశాలలో బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌కు చెందిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సు జరుగగా, ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు తమ వారసులకు ఆస్తిపాస్తులు రాసివ్వగానే, వారి ఆలనాపాలన గురించి పట్టించుకోవడం లేదన్నారు. భారతదేశంలో వృద్ధాప్యంలోకి చేరుకున్న తల్లిదండ్రుల గురించి వారి సంతానం పట్టించుకోవడం లేదని, ఇదేమని ప్రశ్నిస్తే తాము బిజీగా ఉన్నామని, మీతో మాట్లాడేందుకు సమయం లేదంటూ సమాధానం ఇస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. సీనియర్ సిటిజన్స్ వృత్తిలో ఉన్నప్పుడు పిల్లల కోసం ఆస్తులను కూడబెట్టి, ఉద్యోగ విరమణ పొందుతారని, ఆ తర్వాత ఆరోగ్యం కోసం మైదానాల్లో వ్యాయామం, యోగా చేస్తుంటారని, ఇలాంటి దృశ్యాలను తాను అనేక పర్యాయాలు చూడటం జరిగిందన్నారు. అందువల్ల సీనియర్ సిటిజన్స్ కోసం 25లక్షల రూపాయలతో ఒక యోగా సెంటర్‌ను నెలకొల్పనున్నామని అన్నారు. కోటి 28లక్షల రూపాయలతో నగరంలో మరో 8పార్కులను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వీరి కోసం ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందిస్తామని, సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై వారంతా సమావేశమై, కావాల్సిన సదుపాయాలపై చర్చించుకుని తీర్మాణం చేసుకుని తనవద్దకు రావాలని కలెక్టర్ సూచించారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ వృద్ధులము అయిపోయామని బాధపడవద్దని, ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తూ మానసిక ఉల్లాసాన్ని పొందాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్‌కు 90శాతం సదుపాయాలను అందిస్తోందన్నారు. పిల్లల విషయానికి వస్తే ఈ యాంత్రీక ప్రపంచంలో వారు చదువు రీత్యానో, ఉద్యోగ రీత్యానో బిజీగా మారిపోతున్నారని అన్నారు. పిల్లలలు సీనియర్ సిటిజన్స్‌ను గుర్తించాలని, సమయం దొరికినప్పుడల్లా వారితో కనీసం 5నిమిషాల పాటు మాట్లాడేందుకు సమయం వెచ్చించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం సుమారు 90మంది అవయవదానం చేసేందుకు ముందుకు రాగా, ఆ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు రాంచందర్‌రెడ్డి, డాక్టర్ రవీందర్‌నాథ్ సోరితో పాటు సీనియర్ సిటిజన్, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
మోర్తాడ్, మార్చి 19: పదవ తరగతి విద్యార్థులు ఈ నెల 21నుండి వార్షిక పరీక్షలు రాయనున్నందున మోర్తాడ్ మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. మండలంలోని పాలెం, ఏర్గట్ల, రామన్నపేట్, మోర్తాడ్ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాల్లో 708మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఏర్గట్ల పరీక్షా కేంద్రంలో ఏర్గట్ల, తాళ్లరాంపూర్, గుమ్మిర్యాల్ పాఠశాలలకు చెందిన 203మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు గాను ఈ కేంద్రంలో 11మంది ఇన్విజలేటర్లను నియమించడం జరిగిందన్నారు. తిమ్మాపూర్, పాలెం, తొర్తి పాఠశాలలకు చెందిన 120మంది పాలెం పరీక్షా కేంద్రంలోనూ, సుంకెట్, జాగిర్యాల్, రామన్నపేటలకు చెందిన 81మంది విద్యార్థులు రామన్నపేట కేంద్రంలోనూ, దొన్కల్‌తో పాటు మోర్తాడ్‌లోని బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూమీడియం పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలలకు చెందిన 249మంది విద్యార్థులు మోర్తాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. మండలంలోని శెట్పల్లి, ధర్మోరా ఉన్నత పాఠశాల విద్యార్థులు బాల్కొండ మండలం రెంజర్ల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షల నిర్వాహణను పకడ్బందీగా చేపట్టేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేశామని, పరీక్షా కేంద్రాల సమీపంలో పోలీసులు 144సెక్షన్‌ను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పరీక్షా సమయాల్లో ఆయా గ్రామాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించామని ఎంఇఓ రాజేశ్వర్ తెలిపారు. ఎలాంటి మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎంఇఓ రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయడం జరిగిందని తెలిపారు.