నిజామాబాద్

ఇందూర్‌ను ముంచెత్తిన భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 23: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షంతో ఎటుచూసినా ప్రధాన రహదారులు మొదలుకుని పంట పొలాలు, మైదాన ప్రాంతాలు సైతం పెద్దఎత్తున వర్షపు జలాలు నిలిచి తటాకాలను తలపిస్తున్నాయి. మునుముందు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో ఈ వానల ఉద్ధృతి వల్ల ఎక్కడ పెనుముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తుండడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కలెక్టరేట్‌లో అత్యవసరంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో అధికారులను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం వేళలోనే కలెక్టర్ యోగితారాణా ఆయా శాఖల అధికారులతో సమావేశమై వర్షాల పరిస్థితిపై సమీక్ష జరిపారు. బిచ్కుంద మండలం పెద్దతక్కడ్‌పల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోగా, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నదేవాడ, చిన్నదడ్గి, సిర్‌సముందర్, పుల్కల్, హస్గుల్ తదితర గ్రామాలను కూడా వరద జలాలు చుట్టుముట్టడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. కౌలాస్‌నాలా ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోగా, శుక్రవారం 36వేల పైచిలుకు క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుకు చెందిన 7వరద గేట్ల ద్వారా వచ్చిన ఇన్‌ఫ్లోను వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. కౌలాస్ మిగులుజలాలతో పాటు లెండి వాగు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో బాన్సువాడ - బిచ్కుంద ప్రధాన రహదారిపై పెద్దదేవాడ, రాజుల్లా తదితర అనేక చోట్ల లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల పై నుండి నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను పిట్లం మీదుగా దారి మళ్లించారు. పిట్లం మండలంలోని నర్సింగ్‌రావుపల్లి వద్ద కూడా వరద జలాలు రోడ్డు పై నుండి ఉద్ధృతంగా ప్రవహించాయి. రాంపూర్ వద్ద తాత్కాలికంగా వేసిన బ్రిడ్జి వర్షం ధాటికి కొట్టుకుపోయింది. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు వరద జలాలు పోటెత్తాయి. శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లోకి 90వేల క్యూసెక్కుల పైచిలుకు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం నాటికే ప్రాజెక్టులో నీటి మట్టం 1081.80అడుగులకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు చుక్క నీరు రాక ఎడారిలా మారిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో, ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ఆ జలాలన్నీ నిజాంసాగర్‌లోకి వచ్చి చేరనున్నాయి. రామడుగు, సింగీతం, కల్యాణి, అలీసాగర్ రిజర్వాయర్లు కూడా వరద నీటి చేరికతో జలకళను సంతరించుకుంటున్నాయి. గురువారం రాత్రి నుండి ప్రారంభమైన భారీ వర్షం శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఏకధాటిగా కురుస్తూనే ఉంది. జిల్లాలో సగటున 59.1మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా లింగంపేటలో 150.4మి.మీ వర్షం కురిసింది. అదేవింధంగా తాడ్వాయిలో 145.2, ఎల్లారెడ్డిలో 122.6, నాగిరెడ్డిపేటలో 95.2, నిజాంసాగర్‌లో 47.2, డిచ్‌పల్లిలో 58.2, ఎడపల్లిలో 26.4, భిక్కనూరులో 71, గాంధారిలో 128.8, మాక్లూర్‌లో 22.6, దర్పల్లిలో 23.2, బోధన్‌లో 20.6, భీమ్‌గల్‌లో 25.8, పిట్లంలో 135.6, వేల్పూర్‌లో 39, నిజామాబాద్‌లో 37.2, బిచ్కుందలో 38.6, బీర్కూర్‌లో 56, బాన్సువాడలో 102.4, కోటగిరిలో 29.2, కామారెడ్డిలో 82.4, సదాశివనగర్‌లో 132.4, రెంజల్‌లో 25.2, దోమకొండలో 77.4, మోర్తాడ్‌లో 29.8, మాచారెడ్డిలో 46.2, వర్నిలో 81.4, నవీపేటలో 56.2, జుక్కల్‌లో 130.8మి.మీ వర్షం కురిసింది. ఏకబిగిన కురుస్తున్న వర్షాల వల్ల పదుల సంఖ్యలో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దున గల బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ మండలాల్లోని అనేక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి, సోయాబీన్, పప్పు దినుసు, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాల్లోని వందలాది నివాస గృహాల్లోకి వర్షపు జలాలు చొచ్చుకెళ్లాయి. అధికారులు ప్రాథమికంగా సేకరించిన లెక్కల ప్రకారం సుమారు 1200వరకు నివాసాలకు నష్టం వాటిల్లగా, వాటిలో 300 పూర్తిగా, మరో 900గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు. అనేకచోట్ల వాగులు తెగిపోయి, పెద్దఎత్తున రహదారులు, డ్రైనేజీలు ధ్వంసమయ్యాయి.

శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరద నీరు
బాల్కొండ, సెప్టెంబర్ 23: తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన నిజామాబాద్, ఆదిలాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి ప్రాజెక్టు మిగులు జలాలు తోడు కావడంతో శుక్రవారం ఉదయానికి 90వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1081.80అడుగులు 56.99టిఎంసిలకు చేరుకుందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 90టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1053.20అడుగులు 8.33టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌కు చెందిన లక్ష్మికాల్వ ద్వారా 200క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 700క్యూసెక్కులు, వరదకాల్వ ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎఇ వివరించారు. జూన్ మొదటి వారం నుండి నేటి వరకు రిజర్వాయర్‌లోకి 75టిఎంసిల వరదనీరు వచ్చి చేరిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం నుండి శుక్రవారం వరకు 6.2మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని తహశీల్దార్ పండరినాథ్ తెలిపారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం
కౌలాస్‌నాలా 7గేట్లు ఎత్తి నీటి విడుదల
తీరం వెంట పంటలకు అపార నష్టం
వరద ఉద్ధృతితో నిలిచిపోయిన రాకపోకలు
జుక్కల్, సెప్టెంబర్ 22: జుక్కల్ మండలం కౌలాస్‌నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఏడు గేట్లను ఎత్తి 36వేల క్యూసెక్కుల నీటిని దిగువన వాగులోకి విడుదల చేశారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు, గురువారం రాత్రి ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458మీటర్లు కాగా, సామర్థ్యానికి మించి భారీగా వరద జలాలు వస్తుండటంతో అప్రత్తమైన అధికారులు దశల వారిగా గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మండలంలోని సావర్‌గాం గ్రామంతో పాటు బస్టాండ్ ఆవరణ మొత్తం జలమయమైంది. ప్రాజెక్టు దిగువన ఉన్న సావర్‌గాం వద్ద వంతన పైనుండి నీరు ప్రవహిస్తుండటంతో విఠల్‌వాడి, లింగంపల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు పరిసరాల్లో 10సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పాటు ఎగువలోని కర్నాటక, మహారాష్టల్ర నుండి అందిన సమాచారం మేరకు ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ ఇఇ సురేష్‌బాబు, ఎఇ గజానంద్‌లు తెలిపారు.ఇదిలాఉండగా, కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుండి ఒకేసారి 7గేట్లను ఎత్తి భారీగా నీటిని విడుదల చేయడంతో నాలా తీరంలో ఉన్న లింగంపల్లి, సావర్‌గాం, కౌలాస్ తదితర గ్రామ శివార్లలోని పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రాజెక్టు నుండి దిగువకు విడుదల చేసిన నీరు పంట పొలాలను ముంచెత్తుతూ ప్రవహించడంతో పత్తి, మినుపు, సోయాబీన్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కౌలాస్ గ్రామ శివార్లలో దాసరి హన్మాండ్లు అనే రైతు నాలా తీరంలోని ఉంచిన క్వింటాళు మినుములు, క్వింటాలు పెసర్లతో పాటు గుడిసె నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి.
కౌలాస్‌నాలా ప్రాజెక్టు నీటి విడుదలతో పాటు మండలంలోని పలు వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌలాస్ గ్రామ సమీపంలో వాగు వంతెనపై నీరు నిలిచిపోవడంతో రెండు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు ఎగువన శక్తినగర్, సోపూర్ వంతెనలు సైతం నీటి మునిగిపోవడంతో పై రెండు గ్రామాలతో పాటు పలు గిరిజన తండాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దఎడ్గి వాగు పొంగి ప్రవహించడంతో జుక్కల్, మద్నూర్ మధ్యన 3గంటల పాటు రవాణా స్తంభించి, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోత దశలో ఉన్న మినుములు, పెసర పంటలకు అపార నష్టం వాటిల్లింది. పంట చేలల్లో నీరు నిలిచిపోవడం వల్ల పైర్లు వాడిపోయే పరిస్థితి నెలకొంది. కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుండి భారీగా నీటిని విడుదల చేస్తున్నందున తహశీల్దార్ శంకర్‌సింగ్, ఎంపిడిఓ లక్ష్మినారాయణలు ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్షించారు. మండలంలోని మహ్మదాబాద్, కేంరాజ్‌కల్లాలి, ఖండేబల్లూర్, పెద్దఎడ్గి చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగుల పైనుండి నీరు ప్రవహిస్తోంది.

అప్రమత్తంగా ఉండాలి
అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన కలెక్టర్
కలెక్టరేట్, బోధన్ ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు

నిజామాబాద్, సెప్టెంబర్ 23: జిల్లాలో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తూ ఎగువ ప్రాంతాల నుండి వరద జలాలు ఉద్ధృతంగా వస్తున్నందున అన్ని శాఖల అధికారులను కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, వరద ఉద్ధృతి నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తో పాటు బోధన్‌లోని ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు టోల్ ఫ్రీ నెంబరు 18004256644 ద్వారా, బోధన్‌లోని కంట్రోల్ రూమ్‌కు 08467-222001లకు ఫోన్‌చేసి సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. శుక్రవారం ఉదయం తన చాంబర్‌లో అధికారులతో అత్యవసరంగా సమావేశమై సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరుగుతున్నాయని అన్నారు. కౌలాస్‌నాలా ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండినందున ఎగువ నుండి వస్తున్న 37వేల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో బిచ్కుంద మండలం పెద్దతక్కడ్‌పల్లి గ్రామాన్ని వరద జలాలు చుట్టుముట్టినందున అక్కడ ప్రత్యేక పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలు అందించేందుకు వైద్య శిబిరంతో పాటు ఒక పడవను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. వరద నీటి ప్రవాహం వల్ల బాన్సువాడ - బిచ్కుంద ఆర్ అండ్ బి రోడ్డుపై పెద్దదేవాడ వద్ద ఉన్న లోలెవల్ కాజ్‌వే మునిగిపోయిందని, ఈ మార్గంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తూ పిట్లం మీదుగా వాహనాలను దారి మళ్లించాలన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వరద జలాలు ప్రవహిస్తున్న మార్గాల మీదుగా ప్రజలు ప్రయాణాలు చేయకుండా నిరోధించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క ప్రైవేట్ వాహనం కూడా సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని రాకపోకలు సాగించకుండా కట్టదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. ముంపు గ్రామాలను బస్సు సర్వీసులను రద్దు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కాగా, వర్షాల తాకిడితో ఇండ్లు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, బాధిత కుటుంబాలకు 23గంటల్లోపు ఎక్స్‌గ్రేషియాను అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా కూలిపోయిన, దెబ్బతిన్న పక్కా ఇళ్లకు 95,100రూపాయల చొప్పున, పాక్షికంగా ధ్వంసమైన ఇళ్లకు 5200రూపాయల చొప్పున, కూలిపోయిన గుడిసెలకు 4100రూపాయల, పశువుల కొట్టాలు కూలిపోతే 2100రూపాయల చొప్పున పరిహారం అందించాలని సూచించారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల ప్రజలకు నిత్యవసర వస్తువులను అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి సమగ్ర సర్వే జరిపించాలని వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖల అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని వెంటదివెంట తొలగించేలా చర్యలు చేపట్టాలని బల్దియాల కమిషనర్లు, పంచాయతీ అధికారులకు సూచించారు. కాగా, చేంజ్ ఏజెంట్లు తమతమ మండలాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. చెరువులు, ప్రాజెక్టుల వద్ద భద్రతను పటిష్టం చేయాలని, ఏ ఒక్క చోట కూడా ప్రాణనష్టం సంభవించకుండా చూడాలన్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్ సహా దాదాపుగా అన్ని రిజర్వాయర్లలోకి గణనీయంగా వరద నీరు వచ్చి చేరుతోందని అన్నారు. జిల్లాలోని మొత్తం 2811 చెరువులకు గాను ఇప్పటికే 87చెరువులు పూర్తిస్థాయిలో నిండి పొంగి ప్రవహిస్తున్నాయని, మరో 419చెరువుల్లో 75 నుండి వంద శాతం వరకు నీరు చేరుకుందని, 617చెరువుల్లో 50 నుండి 75శాతం వరకు, మిగతా 596 చెరువుల్లో 50శాతం వరకు నీటి నిల్వలు వచ్చాయని కలెక్టర్ వివరించారు. ఇంకనూ 1092చెరువుల్లో నీటి నిల్వలు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వచ్చి చేరుతున్న వరద నీటిని కాపాడుకునేందుకు తూములను పటిష్టం చేస్తూ, గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, డిఆర్‌ఓ పద్మాకర్, నీటి పారుదల శాఖ ఎస్‌ఇ గంగాధర్, డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కళాశాలలో వసతులపై
ఎంసిఐ బృందం సంతృప్తి
కంఠేశ్వర్, సెప్టెంబర్ 23: జిల్లా మెడికల్ కళాశాలకు నాల్గవ సంవత్సరానికి సంబంధించిన అనుమతితో పాటు వచ్చే సంవత్సరం అదనపు మెడికల్ సీట్ల మంజూరీ కోసం స్థానికంగా నెలకొని ఉన్న వసతి, సౌకర్యాలను తెలుసుకునేందుకు రెండు రోజుల పరిశీలనకు వచ్చిన ఎంసిఐ బృందం ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంసిఐ బృందం ఇంచార్జ్ అధికారి డాక్టర్ పిపి.జోషి మాట్లాడుతూ, 2012లో ప్రారంభమైన నిజామాబాద్ మెడికల్ కళాశాలలో మెడికో విద్యార్థులకు సౌకర్యాలు, వసతులతో పాటు ప్రొఫెసర్ల పనితీరుపై సంతృప్తికరంగా ఉందన్నారు. 19విభాగాల్లో ఎంసిఐ నిబంధనల ప్రకారంగా ఏర్పాటు చేసిన వసతులు, ఇతర ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా అర్సపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌తో పాటు నవీపేటలోని ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండటమే కాకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. జిల్లా మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 869పోస్టులను త్వరలో భర్తీ చేయాలని సూచిస్తామన్నారు. దీంతో మెడికో విద్యార్థులతో పాటు రోగులకు మరింత మేలు చేకూరనుందన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ, గత సంవత్సరం జిల్లా మెడికల్ కళాశాలను సందర్శించిన ఎంసిఐ బృందం సలహాలు, సూచనల మేరకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలతో పాటు నివేదికలను సిద్ధం చేసి పెట్టడం జరిగిందన్నారు. ఫలితంగా కళాశాలకు చివరి అనుమతి ఖచ్చితంగా వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంసిఐ బృందం పరిశీలనలో శశికాంత్ నికమ్, శాంతితో పాటు మెడికల్ కళాశాల డాక్టర్ బన్సిలాల్, తదితరులు పాల్గొన్నారు.