నిజామాబాద్

మార్చి నెలాఖరుకల్లా ఇళ్ల నిర్మాణాలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి స్థానిక ప్రగతిభవన్‌లో శనివారం జిల్లా అభివృద్ధిపై ఆయా శాఖల అధికారులతో మంత్రి పోచారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల పథకం కింద జిల్లాకు 6950 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వీటిని 111గ్రామాల్లో నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 82గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలు అందుబాటులో ఉన్నాయని, మరో 29 గ్రామాల్లో 85ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉందని వివరించారు. స్థలాలు అందుబాటులో ఉన్న చోట వెంటనే టెండరు ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల పథకం కింద ఇదివరకు పక్కా గృహాలు నిర్మించుకున్న 16,818మందికి గాను, 1800మందికి బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని, మిగతా లబ్ధిదారులకు కూడా త్వరలోనే చెల్లింపులు జరిగేలా చూస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డబుల్ బెడ్‌రూమ్ పథకంలో అర్హులైన వారికే లబ్ధి చేకూరేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ తరహాలోనే బోధన్, కామారెడ్డి నియోజకవర్గాలకు కూడా అదనంగా మరో 500చొప్పున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయించాలని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ కోరారు. పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యతతో డబుల్ బెడ్‌రూమ్‌లను మంజూరు చేస్తూ, అర్హులైన వారికే కేటాయించేలా చూడాలని ఎమ్మెల్సీ ఆకుల లలిత సూచించారు. కాగా, ఎర్రవల్లి, నర్సన్నపేటలలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిన జనసిస్ కంపెనీకే జిల్లాలోనూ నిర్మాణ బాధ్యతలు అప్పగించామని ఈ సందర్భంగా కలెక్టర్ యోగితారాణా వివరించారు. నిజామాబాద్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఆర్ అండ్ బి శాఖ, ఇతర సెగ్మెంట్లలో హౌసింగ్ కార్పొరేషన్‌లు ఇళ్ల నిర్మాణాలకు ఏజెన్సీలుగా పని చేస్తాయని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చ నిర్వహిస్తున్న సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, ప్రాణహిత పథకంలోని 22వ ప్యాకేజీ పనులను సైతం యథాతథంగా చేపట్టాలని సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి పోచారం వివరణ ఇస్తూ, నీటి లభ్యత, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని 22వ ప్యాకేజీ పనులకు బదులు కామారెడ్డి డివిజన్‌కు కాళేశ్వరం ద్వారా నీరందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. దీని విషయమై షబ్బీర్‌అలీకి, తెరాస ఎమ్మెల్యేలకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా కామారెడ్డి ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగు జలాలు అందించవచ్చని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ రాజు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్‌సింధే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు విజి.గౌడ్, భూపతిరెడ్డి, నగర మేయర్ ఆకుల లలిత, డిసిసిబి చెర్మన్ గంగాధర్‌రావు , జెసి రవీందర్‌రెడ్డి, అదనపు జె.సి రాజారాంతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు చర్యలు : ఎస్పీ
ఇందూర్, డిసెంబర్ 19: ఈ నెలలో జరిగే వివిధ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు గాను ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయా సబ్‌డివిజన్ల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాబోయే 10రోజుల వ్యవధిలో ఈద్ మిలాదున్ నబీ, క్రిస్మస్ తదితర పండుగ పర్వదినాలు ఉన్నందువల్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆయా సబ్ డివిజన్ల డిఎస్పీలను, పోలీసు అధికారులను ఆదేశించారు. అదే విధంగా నిజామాబాద్‌తో పాటు మెదక్ జిల్లాలో వరుసగా ఎటిఎంల చోరీలు జరిగినందున, భద్రత పెంచాలన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించే వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి, డిఎస్పీలు ప్రసాద్‌రావు, ఆనంద్‌కుమార్, ఎ.్భస్కర్, ఆకుల రాంరెడ్డి, సయ్యద్ అన్వర్ హుస్సేన్, అన్నిసాబ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్డీయే హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు
ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, డిసెంబర్ 19: నేషనల్ హెరాల్డ్ కేసు వెనుక ప్రధాని నరేంద్రమోదీ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ తదితర పట్టణాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో శాసన మండలి విపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీ, జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకుల లలిత, టి.పిసిసి అధికార ప్రతినిధి మహేష్‌కుమార్ గౌడ్, డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ భవన్ నుండి ధర్నా చౌక్ వరకు ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో ఊరేగింపు జరిపారు. మోదీ డౌన్..డౌన్ అని నినాదాలు చేస్తూ, ప్రధాని మతోన్మాద జులుం నశించాలి అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ధర్నా చౌక్ వద్ద మోదీ దిష్టిబొమ్మకు నిప్పంటించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, ప్రధాని మోదీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకునే బిజెపి నేతలు ఈ కుట్రకు తెర లేపారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ అంశంలో కాంగ్రెస్ అధినేతలు ఏ ఒక్కరిని కూడా మోసం చేయలేదని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ప్రజల వాణిని బలంగా వినిపించాలనే ఉద్దేశంతో 1937లో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారని, ఆ సమయంలో దీంతో పాటు ఖౌమీ ఆవాజ్ ఉర్దూ దిన పత్రిక నడిచేదని గుర్తు చేశారు. అప్పటి బ్రిటీష్ పాలకులు పదేళ్ల పాటు నిషేధం విధించిన మీదట 1947లో తిరిగి నేషనల్ హెరాల్డ్ పునః ప్రారంభం అయ్యిందన్నారు. ఈ పత్రిక నష్టాల్లో కూరుకుపోవడంతో నేషనల్ హెరాల్డ్ పేరిట ఉన్న షేర్లను యంగ్ ఇండియా సంస్థకు బదిలీ చేశారని, అంతమాత్రాన సోనియా, రాహుల్‌గాంధీలకు ఈ వ్యవహారంలో నయా పైసా లాభం చేకూరలేదని షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ స్వయంగా విచారణ జరిపి మరీ వెల్లడించిందని, ఎలాంటి మనీ ల్యాండరింగ్ జరుగలేదని తేల్చి చెప్పిందన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు లక్నోలో మాత్రమే సొంత భవనం ఉందని, మిగతా అన్ని చోట్లా లీజ్‌పై తీసుకున్న భవనాల్లోనే దీనిని నిర్వహించారని అన్నారు. అయినప్పటికీ కేవలం సోనియా, రాహుల్‌గాంధీలను ఎలాగైనా బద్‌నాం చేయాలనే దురుద్దేశంతో ప్రధాని మోడీ, ఇతర బిజెపి నాయకులు నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టించారని ఆరోపించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను మంట గలపాలనే దురుద్దేశ్యంతోనే ఈ తరహా కుట్రలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ ఎన్ని కుతంత్రాలు పన్నినా, న్యాయ వ్యవస్థపై అచంచల విశ్వాసంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర నాయకులు ఏమాత్రం అహంభావం ప్రదర్శించకుండా కోర్టు ఎదుట హాజరయ్యారని అన్నారు. కాగా, సోనియా, రాహుల్ తదితరులకు కోర్టులో బెయిల్ మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కాంగ్రెస్ భవన్ ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణసంచా పేల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, ప్రేమలత అగర్వాల్, గంగాధర్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్‌అహ్మద్, మోహన్‌రెడ్డి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.