నిజామాబాద్

ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, నవంబర్ 13: గ్రూప్-2 పరీక్షలు ఆదివారం నాటితో ప్రశాంతంగా ముగిశాయి. గత శుక్రవారం మొదటి, రెండవ పేపర్ల పరీక్షలు జరుగగా, మలివిడతగా ఆదివారం మూడు, నాల్గవ పేపర్ల పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 100 కేంద్రాలలో పరీక్షలు కొనసాగాయి. మొత్తం 34,254మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 25వేల మంది వరకు మాత్రమే పరీక్షలు రాశారని, దాదాపు 9వేల మంది గైర్హాజర్ అయినట్టు అధికారులు తెలిపారు. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి గ్రూప్-2 పరీక్షలను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కొనసాగించారు. టిఎస్‌పిఎస్సీ నిబంధనలను అనుసరిస్తూ అభ్యర్థులను క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి, ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలను అనుమతించలేదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ముందుగానే స్పష్టం చేయడంతో అభ్యర్థులంతా నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు బయోమెట్రిక్ హాజరు పద్ధతిని పాటిస్తూ అభ్యర్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించారు. జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. సుదూర గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణాల్లోని తమ బంధువుల ఇళ్ల వద్దే ఉంటూ పరీక్షలు రాసిన మీదట సాయంత్రం సమయంలో తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఒకింత రద్దీ కనిపించింది. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపించామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

కరవుపై ఫొటో ఎగ్జిబిషన్
తిలకించిన కేంద్ర బృందం
పిట్లం, నవంబర్ 13: ఇటీవల కురిసిన వర్షానికి వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు పిట్లం మార్కెట్ కమిటీకి ఆదివారం వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్ ఆధ్వర్యంలో కేంద్ర కరవు బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా యంత్రాంగం మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను వారు ఎంతో శ్రద్ధగా తిలకించారు. ఫొటోలను చూపిస్తూ వివిధ శాఖల అధికారులు జరిగిన నష్టాన్ని కేంద్ర కరవు బృందానికి వివరించారు. పిట్లం మండలం కారేగాం సమీపంలో బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహించి అందులో కారు కొట్టుకుపోయి మెదక్ జిల్లా తడ్కల్ మండలానికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి చెందిన సంఘటనకు సంబంధించిన ఫొటోలను చూసి కరవు బృందం అధికారులకు వివరాలు అడిగింది. రైతులకు నష్టపరిహారం అందించారా? లేదా? అని ఆరా తీశారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో జరిగిన నష్టం గురించి ఆయా శాఖల వారీగా అధికారులు కరవు బృందానికి వివరించారు. ఆర్ అండ్ బికి చెందిన 46రోడ్లు ధ్వంసం కావడంతో 106కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కామారెడ్డి ఆర్ అండ్ బి ఇ.ఇ నిరంజన్ తెలిపారు. పిట్లం మండలంలో 12చెరువులు, కుంటలు తెగిపోయి 14.5లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఐ.బి ఎ.ఇ బాసిత్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 64,425ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని, ఇందులో 53,990ఎకరాలు సోయాబీన్ పంట ఉందని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌కుమార్ కరవు బృందానికి వివరించారు.
కలెక్టర్ సత్యనారాయణ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కేంద్ర కరవు బృందం రావడానికి ఒక రోజు ముందే అధికారులను సన్నద్ధం చేయడంతో ఆయా శాఖల అధికారులంతా కేంద్ర కరవు బృందానికి అతివృష్టి వల్ల ఏర్పడిన నష్టాన్ని పూర్తిస్థాయిలో వివరించడంలో సఫలీకృతులయ్యారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన పంట నష్టం, ప్రాణ నష్టం, రోడ్ల ధ్వంసం, ఇళ్లకు వాటిల్లిన నష్టం తదితర వివరాలను పూర్తిస్థాయిలో సేకరించామని కేంద్ర కరవు బృందం ప్రతినిధులు విలేఖరులకు పేర్కొన్నారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి బాధితులను ఆదుకోవాలని కోరతామన్నారు. వీరి వెంట ఇంచార్జ్ తహశీల్దార్ సాయాగౌడ్, ఎంపిడిఓ పర్బన్న, జడ్పీటిసి ప్రతాప్‌రెడ్డి, ఎఓ కిషన్, కామారెడ్డి ఐ.బి ఇ.ఇ మధుసూదన్, నిజామాబాద్ ఐ.బి ఎస్‌ఇ సి.గంగాధర్ తదితరులు ఉన్నారు.

చలి గుప్పిట్లో ఇందూర్ గజగజ
క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఇందూర్, నవంబర్ 13: నిన్నమొన్నటి వరకు ఓ మోస్తారుగా వున్న చలి పులి నేడు మళ్లీ తన ప్రతాపాన్ని చాటుకుంటోంది. గత వారం రోజులుగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో, నిజామాబాద్ నగరంలో సైతం చలి తీవ్రత ఎక్కువయ్యింది. దీంతో పగలు కూడా చలి ప్రభావం, చల్లటి గాలుల తాకిడి ఉంటోంది. ఇక సాయంత్రం 6గంటల నుండి ఉదయం వరకు ప్రజలు ఇళ్లను వీడి బయటకు వచ్చేందుకే సాహించడం లేదు. నవంబర్ మొదటి వారం ముగిసే సమయానికే చలిపులి పంజా విసురుతుండడంతో మునుముందు పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఏకధాటిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో, అదే స్థాయిలో చలి తీవ్రత కూడా ఉంటుందని భావిస్తున్నారు. గత వారం రోజుల క్రితం ఉష్ణోగ్రత సగటున గరిష్టంగా 34డిగ్రీలు, కనిష్టం 20.0డిగ్రీల సెల్సియస్ ఉండగా, ప్రస్తుతం అది 14డిగ్రీలకు పడిపోయింది. ఆదివారం ఏకంగా 13.5డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇలా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా దిగువకు పడిపోతుండడంతో చలి తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతోంది. ప్రజలు చలి గుప్పిట్లో చిక్కుకుని గజగజలాడుతున్నారు.
వృద్ధులు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్థులు పడరానిపాట్లు పడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చిన్నారులు సైతం శ్వాసకోస ఇబ్బందులతో అనారోగ్యాలకు గురవుతుండడంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చలి వణికిస్తోంది. జిల్లాలోని ఏ పల్లె సీమలో చూసినా చలి మంటలు కాస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. నాలుగు గంటలకే మేల్కొని పల్లె ప్రజలు ఆరు దాటితేనే తప్ప వీధుల్లోకి రావడం లేదు. పట్టణాల్లోనే చలి ఈ విధంగా వుంటే పల్లె సీమల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు ఉండటం, తక్కువ స్థలంలోనే ఎక్కువ భవనాలు వుండటంతో చలి తీవ్రత అంతగా వుండదని విశే్లషకులు అంటున్నారు. ఇదే గ్రామాల్లోనైతే గ్రామాలను ఆనుకొని వున్న పచ్చని పంట పొలాలు, ఎటు చూసినా చెట్లు వుండటంతో ఈదురుగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి పల్లె ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. రైతుల ఇళ్ల ముందు చలి మంటలు కాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వేకువ జామున నాలుగు గంటలకు నిద్ర లేచి వంట పనులు ముగించుకొని పంట పొలాలకు వ్యవసాయ పనులకు వెళ్లే రైతుకూలీలు ఉదయం ఎనిమిది అయితే గాని కదలడం లేదంటే పరిస్థితి ఎలా వుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల చలి తీవ్రత పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా మీదుగా వున్న రెండు జాతీయ రహదారులపై పలు వాహనాల డ్రైవర్లు చలితీవ్రత తట్టుకోలేక డ్రైవర్లు తమ వాహనాలు నిలిపివేసుకొని చలి మంటలు కాస్తున్నారు. కాగా, పొగ మంచు వీస్తున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని డ్రైవర్లు అంటున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇంత చలి లేదని, ఈ సంవత్సరం చలి తీవ్రత మరింత ఎక్కువగా వుందని ప్రజలు పేర్కొంటున్నారు. చలితీవ్రత ఎక్కువగా ఉండడాన్ని బట్టి చూస్తే రానున్న వేసవిలో ఎండలు కూడా మండిపోతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, చలి ప్రభావాన్ని తట్టుకునేందుకు ఉన్ని వస్త్రాల వైపు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. నగరంలోని ఖలీల్‌వాడీ ప్రాంతంలో ప్రత్యేకంగా వెలసిన ఉన్ని దుకాణాలు అనునిత్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.
తెరాసపై భ్రమలు తొలగిపోతున్నాయి
మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్
కమ్మర్‌పల్లి, నవంబర్ 13: తెరాస పార్టీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మిగులుతూ, కెసిఆర్ ప్రభుత్వంపై వారిలో భ్రమలు తొలగిపోతున్నాయని ప్రభుత్వ మాజీ విప్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి పేర్కొన్నారు. ఆదివారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి అనిల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే తమకు న్యాయం జరుగుతుందని అన్ని వర్గాల వారు భావించారని అన్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ప్రజలకు సుపరిపాలన అందించడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని ఆక్షేపించారు. దీనిని గమనించి ఇదివరకు తెరాసలో చేరిన వారంతా తిరిగి తమ సొంత గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే కమ్మర్‌పల్లిలో పలు యువజన సంఘాల సభ్యులు తెరాసను వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ వలసల పర్వం మరింత ఉద్ధృతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సుంకెట్ రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి శ్రీను, నాయకులు అశోక్, రాములు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్‌పల్లికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు బండెల రాజు నేతృత్వంలో న్యూరాక్, ఈగల్ స్టార్ట్, చాంపియన్స్, వారియర్స్ సంఘాలకు చెందిన సుమారు 50మంది యువజన సభ్యులు కాంగ్రెస్‌లో చేరారు.