నిజామాబాద్

‘మహా’ జోరుగా మూడుముక్కలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 6: నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ధర్మాబాద్ శివారులో పెద్దఎత్తున పేకాట జూదం కొనసాగుతోంది. ఆడిటోరియం వంటి భవనాన్ని అధునాతన హంగులతో అనధికార పేకాట క్లబ్‌గా తీర్చిదిద్దడంతో జూదరులతో కళకళలాడుతోంది. పేకాట వ్యసనానికి అలవాటుపడిన అనేక మంది జూదరులు నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి తదితర జిల్లాల నుండి అనునిత్యం తరలివెళ్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని చోట్లా కరెన్సీ కొరత ఇబ్బందులు కనిపిస్తుండగా, సరిహద్దులో బాహాటంగా కొనసాగుతున్న జూదశాల వద్ద మాత్రం కరెన్సీ నోట్ల కట్టలు వెల్లువలా కనిపిస్తున్నాయి. గత మూడు రోజుల క్రితమే ధర్మాబాద్ పోలీసులు ఈ జూదశాలపై మెరుపుదాడి చేసిన సందర్భంగా లక్షా 90వేల రూపాయల పైచిలుకు నగదు లభ్యమవగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన జూదరులే ఎక్కువ సంఖ్యలో పట్టుబడడం విశేషం. వారిలో ఓ మాజీ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. గతంలోనూ పలు పర్యాయాలు ఈ స్థావరంపై పోలీసుల దాడులు జరిగి పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. అయినప్పటికీ అదేచోట తిరిగి పేకాటను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. స్థానికంగా పేకాట స్థావరాలపై పోలీసులు నిఘాను తీవ్రతరం చేయడంతో జూదానికి రుచిమరిగిన వారంతా సరిహద్దులోని జూదశాలను ఎంచుకుంటున్నారు. ఐదారుగురు బృందంగా ఏర్పడి టాటాసుమో ఇతర వాహనాలను అద్దెకు మాట్లాడుకుని బయలుదేరి వెళ్తున్నట్టు తెలిసింది. ఉదయం నుండి సాయంత్రం వరకు వాహన అద్దె రూపంలో వేయి రూపాయలు, వాహనంలో డీజిల్ పోయిస్తున్నారు. అంతేకాకుండా జూదరులను తెచ్చినందుకు జూదశాల నిర్వహకులు వాహన డ్రైవర్‌కు రెండు పూటలా నాన్‌వెజ్‌తో కూడిన పసందైన భోజనం, రెండు వందల రూపాయల భత్యాన్ని అందజేస్తున్నట్టు తెలిసింది. ఇలా ప్రతిరోజు కనీసం పది వాహనాల్లో జూదరులతో కూడిన బృందాలు సరిహద్దు ప్రాంతానికి తరలివెళ్తున్నాయి. నిర్విరామంగా దాడులు నిర్వహించే స్పెషల్ పార్టీలకు చెందిన పలువురు పోలీసులు సైతం జూదానికి అలవాటుపడి శాఖ ప్రతిష్ఠను దిగజార్చిన ఉదంతాలు ఉన్నాయి. సామాన్య ప్రజలు, వ్యాపార వర్గాల వారే కాకుండా ఉద్యోగులు సైతం పేకాటకు బానిసలుగా మారి ఈ వ్యసనంలో మునిగి తేలుతున్నారు. పేకాట వ్యసనానికి బానిసలుగా మారిన అనేక మంది తమ పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకున్నారు. స్థిర, చరాస్థులను సైతం తాకట్టు పెట్టి అలనాటి ధర్మరాజుకు తామేమీ తీసిపోమని నిరూపించుకున్నారు. మరికొంత మంది జూదం మహమ్మారి వల్ల తమ ప్రాణాలనే కోల్పోయిన సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. పేకాటలో సర్వం ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించడంతో మనస్థాపం చెంది పలువురు ఆత్మహత్య చేసుకోగా, మరికొంత మంది హత్య గావించబడ్డారు. జూదంలో పెద్ద మొత్తంలో సొమ్ము గెలిచిన వ్యక్తుల నుండి ఆ మొత్తాన్ని కాజేయాలన్న దురాశతో తోటి జూదరులే పలువురిని హతమార్చారు. దీంతో అనేక కుటుంబాలు దిక్కులేని అనాథలుగా మిగిలాయి. నిజానికి స్థానికంగా కూడా పేకాట జూదం రహస్య ప్రాంతాల్లో గుట్టుగా కొనసాగుతోంది. ఇదివరకటితో పోలిస్తే ఇటీవలి కాలంలో కొంతవరకు పోలీసుల నిఘా పెరగడంతో జూదరులు పొరుగునే ఉన్న పేకాట క్లబ్‌ను ఆశ్రయిస్తూ పచ్చని సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో పేకాట మహమ్మారి ఎక్కువగా ఉండడాన్ని గమనించిన కమిషనర్ కార్తికేయ జూదాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల దీపావళి సందర్భంగా పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని గత రెండు రోజుల క్రితమే కౌన్సిలింగ్ నిర్వహించారు. జూదం వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, పచ్చని సంసారాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, ఇకముందు జూదం ఆడుతూ తరుచూ పట్టుబడే వారిపై అవసరమైతే పి.డి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగింది. స్థానికంగా జూదం మహమ్మారిని నిర్మూలించేందుకు ఈ తరహా చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ, ఇక్కడి నుండి పొరుగునే వెలిసిన అనధికారిక పేకాట క్లబ్‌కు అనేక మంది వెళ్తూ రేయింబవళ్లు జూదంలో మునిగి తేలుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పొరుగు జిల్లా పోలీసు అధికారులతో సమన్వయాన్ని ఏర్పర్చుకుని జూదగృహాన్ని శాశ్వతంగా తొలగించే దిశగా స్థానిక పోలీసు అధికారులు చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నగదు రహిత లావాదేవీలతో అవినీతి నిర్మూలన
కలెక్టర్ యోగితారాణా

నిజామాబాద్, డిసెంబర్ 6: ఆయా స్థాయిలలో జరిగే అవినీతిని నిర్మూలించేందుకు నగదు రహిత లావాదేవీలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. ఈ విధానంపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకుని నగదు రహితంగా క్రయవిక్రయాలు జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగదు రహిత లావాదేవీలపై అన్ని వర్గాల వారిని చైతన్యపర్చేందుకు విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం నగరంలోని లలితామహల్ థియేటర్ ప్రాంతంలో గల మీ సేవా కేంద్రంతో పాటు గాంధీ గంజ్ కూరగాయల మార్కెట్, వినాయక్‌నగర్‌లోని ఎస్‌బిహెచ్ బ్యాంక్, మీ సేవా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మీసేవా సెంటర్ల నిర్వహకులు, బ్యాంకుల్లో అధికారులు, ఖాతాదారులను కలిసి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగదు రహిత లావాదేవీలు ఏమేరకు కొనసాగుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీ-సేవా కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కేంద్రాల ద్వారా నిర్వర్తించే పనులను పూర్తిగా నగదు రహితంగానే జరపాలన్నారు. వివిధ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల ఇంటి వద్ద నుండే వివిధ పనులను చక్కబెట్టుకోవచ్చనే విషయాన్ని వినియోగదారులకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలన్నారు. క్షేత్ర స్థాయిలో జరిగే ప్రచారంతోనే ప్రజలు త్వరితగతిన ఈ విధానానికి అలవాటుపడి సంతృప్తికర ఫలితాలు వస్తాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కాగా, కూరగాయల మార్కెట్‌లో మైక్రో ఎటిఎంలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు అందరూ తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్నారు. ఇంతవరకు ఖాతాలు లేని వారు సంబంధిత బ్యాంకులను సంప్రదించి ఖాతాలు తీసుకోవాలని హితవు పలికారు. మునుముందు నగదు రహిత లావాదేవీలే కీలకంగా ఉండనున్న దృష్ట్యా ప్రజలు కూడా ఈ విధానానికి సాధ్యమైనంత త్వరగా అలవాటుపడాలన్నారు. ఆన్‌లైన్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీల వల్ల అక్రమాలకు చాలావరకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. త్వరలోనే మార్కెట్ కూపన్ సిస్టమ్ ప్రవేశపెడతామని, తద్వారా వ్యాపారులకు, రైతులకు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా తమ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని, ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే కొనసాగుతుందన్నారు. కాగా, బ్యాంకుల్లో లావాదేవీలన్నీ నగదు రహితంగా జరిగేలా అధికారులు, సిబ్బంది ఖాతాదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి దుకాణదారుడు ఎంఎంఐడి నెంబర్‌ను తన దుకాణం ఎదుట పెట్టాలని సూచించారు.

బ్లాక్ డే సందర్భంగా ర్యాలీ
భారీ పోలీసు బందోబస్తు

నిజామాబాద్, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు కూల్చివేత దినాన్ని నిరసిస్తూ ముస్లింలు మంగళవారం బ్లాక్‌డే పాటించారు. నిజామాబాద్ నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన వీధుల గుండా ప్రదర్శనలు జరిపారు. మైనార్టీ ఏరియాల్లో పలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు అహ్మదీబజార్, అహ్మద్‌పురా కాలనీ, ఖిల్లారోడ్, బోధన్ రోడ్, ఆజంరోడ్ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అహ్మదీబజార్‌లోని వీక్లీ మార్కెట్‌లో కూరగాయలు, ఫ్రూట్ మార్కెట్ పూర్తిగా మూతబడింది. కొందరు వ్యాపారులు ప్రధాన కూడళ్లతో పాటు తమతమ దుకాణాలపై నల్ల జెండాలను ఎగురవేశారు. ఎంఐఎం ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ఎంఎ.్ఫహీమ్ నేతృత్వంలో నెహ్రూపార్క్ నుండి బైక్ ర్యాలీని చేపట్టి గాంధీచౌక్, రాష్టప్రతిరోడ్, బస్టాండ్‌ల మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. బాబ్రీ మసీదును కూల్చివేయడం ద్వారా ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయపర్చారని, కూల్చిన చోటనే తిరిగి మసీదును నిర్మింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ యోగితారాణాకు మెమోరాండం అందజేశారు. అదేవిధంగా ముస్లిం పర్సనల్ లా కమిటీ, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ జమైతుల్ ఉలెమా, మజ్లిస్ బచావో తహ్‌రీక్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మైనార్టీ విభాగాల ఆధ్వర్యంలోనూ ప్రతినిధులు వేర్వేరుగా కలెక్టరేట్‌కు తరలివచ్చి వినతిపత్రాలు సమర్పించారు. బ్లాక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిజామాబాద్ ఎసిపి డి.ఆనంద్‌కుమార్ నేతృత్వంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ముస్లిం సంఘాల బాధ్యులు, మత పెద్దలు వౌలానా వలిఉల్లా ఖాస్మీ, ఎంఎ.ఖాదర్, జఫర్, హబీబ్‌అహ్మద్, నవీద్‌ఇక్బాల్, యాసిన్ సాబ్రి, తారిక్ అన్సారీ, ఎంఎ.షుకూర్, మన్జూర్‌అహ్మద్, ఎంఎ.జలీల్, ఫయాజుద్దీన్, కరీముద్దీన్ కమాల్, సుమేర్‌అహ్మద్, హాఫిజ్ లాయక్‌అలీ, ఎండి.అబ్దుల్‌బాసిత్, ఫహీంఖురేషీ, షఫీక్‌ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.

అడుగడుగునా నిరాశే
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
బాన్సువాడ, డిసెంబర్ 6: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన ప్రజానీకానికి అడుగడుగునా నిరాశే ఎదురవుతుండడంతో తెరాస ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆక్షేపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం బాన్సువాడకు చేరుకుంది. కొయ్యగుట్ట నుండి బాన్సువాడ పట్టణం వరకు భారీ ర్యాలీ చేపట్టి అంబేద్కర్ చౌరస్తా వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, గడిచిన 51రోజుల నుండి ఈ యాత్ర కొనసాగుతోందని, ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజల్లో కెసిఆర్ పాలన తీరు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామంటూ కబుర్లతోనే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి అట్టడుగు వర్గాల ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే, తెరాస ప్రభుత్వం ఇప్పటికీ ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పిస్తూ వాటిని ఆచరణలో అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 93శాతం వరకు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని, కేవలం 7శాతానికే పరిమితమైన ఉన్నత వర్గాల వారే అధికారం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తూ టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్, గడిచిన రెండున్నరేళ్లలో ఒక్క పర్యాయం కూడా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరించలేదని ఆక్షేపించారు. ఉద్యోగాలు దక్కక ఉన్నత విద్యను అభ్యసించిన లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, నామమాత్రంగా కొన్ని పోస్టులను భర్తీ చేస్తూ తెరాస సర్కార్ చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. దళితులకు మూడెకరాల సాగు భూమి పంపిణీ, పేదలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. కెజి టు పిజి ఉచిత విద్య, కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం వంటి వాగ్దానాలన్నీ హామీలకే పరిమితం అయ్యాయని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా పల్లెలు అభివృద్ధికి నోచుకోక బోసిపోయి కనిపిస్తున్నాయని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70సంవత్సరాలు గడిచినా, పేదలకు మాత్రం ఇప్పటికీ స్వాతంత్య్రం రాలేకపోతోందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల వారికి లబ్ధి చేకూర్చే విషయంలో పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారని అన్నారు.
ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం నిస్తేజ వైఖరిని విడనాడి, ప్రజా సమస్యల పరిష్కారానికి, వారి అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. బంగారు తెలంగాణ కాదని, ప్రజల బతుకులు బాగుపడే తెలంగాణ కోసం ప్రస్తుతం కృషి జరుగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాదయాత్ర ముగిసిన మీదట ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నామని చెప్పారు. కాగా, సొంత పార్టీకి చెందిన నేతలతో పాటు సిపిఐ నాయకుడు దుబాస్ రాములు, కాంగ్రెస్‌కు చెందిన ఉప సర్పంచ్ ఖాలిక్, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు.

బిసి విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి
విద్యార్థి నాయకుల అరెస్ట్
కంఠేశ్వర్, డిసెంబర్ 6: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కలెక్టరేట్‌కు చేరుకున్న బిసి విద్యార్థి నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధియే ధ్యేయంగా పని చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని, అయితే ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల ఉద్యమాలతో గద్దెనెక్కిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2015-16 సంవత్సరానికి బోధన ఫీజులను 2090కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్పా, ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదన్నారు. కమీషన్లు వచ్చే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు మాత్రం వేల కోట్లు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీ చదువులను పూర్తి చేసుకుని, ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు సర్ట్ఫికేట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు అంగీకరించడం లేదని, ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామంటూ మొండికేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సిఎం కెసిఆర్ 3500కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి, కేవలం 1400కోట్లు మాత్రమే విడుదల చేయడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని, లేదంటే బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ముట్టడిలో బిసి విద్యార్థి సంఘం నాయకులు గంగాధర్, యోగేష్, సంతోష్, రాకేశ్, బాలాజీ, రమేష్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

డబ్బుల కోసం ఖాతాదారుల పాట్లు
భిక్కనూరు, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు ఎటిఎంలో డబ్బులు డబ్బులేక ఖాతాల నుండి డబ్బులు విడుదల కాక ఖాతాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం స్థానిక భిక్కనూరు సిండికేట్ బ్యాంకు ముందు ఉదయం నుండి ఖాతాదారులు డబ్బుల కోసం క్యూ కట్టారు. క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి 2వేల రూపాయలు చెల్లించడంతో అత్యావసరంగా డబ్బులు అవసరం ఉన్న వారు బ్యాంకు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. వచ్చిన డబ్బులను అందరికి అందిస్తున్నట్లు మేనెజర్ తెలిపారు. పెండ్లి ఉందని కొందరు, ఆసుపత్రికి వెళ్లాలని మరికొందరు ఖాతాదారులు బ్యాంకు మేనెజర్‌తో గొడవ పడినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అదే విధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ హైద్రబాద్, దక్కన్ గ్రామీణ బ్యాంకు, డిసిసిబి బ్యాంకు, తదితర బ్యాంకులలో ఖాతాదారులు డబ్బుల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూలో నిల్చున్నారు.