నిజామాబాద్

ఉసూరుమంటున్న ’ఉపాధి‘ లబ్ధిదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 8: సర్కారీ కొలువులు అత్తెసరు నోటిఫికేషన్లకే పరిమితం అవుతుండగా, కనీసం ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధినైనా ఏర్పాటు చేసుకుందామని ఆశిస్తున్న నిరుద్యోగ యువతకు రుణాల పంపిణీలో మొండిచేయి మిగులుతోంది. స్వయం ఉపాధి కల్పనకై అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు నిధుల లేమితో నీరుగారిపోతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. దీంతో ఉన్నత విద్యావంతులైన యువతీ, యువకులు కూడా స్వయం ఉపాధి అనే్వషణలో నిమగ్నమవుతూ వివిధ పథకాల కింద దరఖాస్తులు చేసుకుని రుణాల కోసం నెలల తరబడి ఎదురుతెన్నులు చూడాల్సి వస్తోంది. గడిచిన ఏడాది కాలంగా వివిధ పథకాల కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు అధికారులు నిధుల లేమి సాకుతో మొండి చేయి చూపుతున్నారు. సంక్షేమ పథకాల అమలుకై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చినా, ప్రభుత్వ నిర్వాకం వల్ల జిల్లాలో నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహల్లోనే కొట్టుమిట్టాడాల్సి వస్తోంది. ప్రభుత్వం బి.సి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా అనేక రకాల సబ్సిడీ రుణ పథకాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో, అదే తరహాలో ప్రత్యేకంగా రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా కూడా ఉపాధి కల్పిస్తున్నామంటూ ప్రచారం చేస్తోంది. అయితే వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు బ్యాంకుల నుండి గతేడాది ఐదు శాతానికి మించి రుణాలు మంజూరు కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల సమావేశాల్లో కలెక్టర్ మొదలుకుని ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తపర్చారు. ఇక డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు కూడా మేడిపండు చందంగా మారాయని నిరుద్యోగ యువత ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ప్రతి మండలానికి ఆయా పథకాల కింద నిర్దేశిత లక్ష్యాన్ని కేటాయించి, అందుకు అనుగుణంగా సబంధిత బ్యాంకు అధికారులతో అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకర్ల సమక్షంలోనే అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉపాధి పథకాల కింద దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగులు బ్యాంకుల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా అధికారులే నేరుగా బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారులుగా ఎంపిక చేసే ప్రక్రియ గత నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఒక్కో పథకం కింద ఒక్కో రకంగా ప్రభుత్వం సబ్సిడీని వర్తింపజేస్తోంది. ఆయా పథకాల కింద 30 నుండి 70శాతం వరకు సబ్సిడీని లబ్ధిదారులు పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిరుద్యోగులు ఈ పథకాలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు అన్ని పథకాలకు వేర్వేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు, ప్రస్తుతం ఫైనాన్స్ సపోర్ట్ స్కీం పేరుతో సింగిల్ విండో విధానం ద్వారా అన్ని పథకాలను ఒకే గొడుగు కిందకు చేర్చి ఎంపిక ప్రక్రియను ఒకేసారి ముగిస్తున్నారు. గ్రూపు రుణాలు, వ్యక్తిగత రుణాలతో పాటు కిరాణ షాపులు వంటి చిన్న చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు, ఆ మేరకు వారికి ఎంపికైనట్టు ధ్రువీకరిస్తూ పత్రాలు కూడా అందజేస్తూ ఆశలు కల్పించారు. బ్యాంకర్లు కూడా అధికారుల సమక్షంలోనే రుణాలు అందిస్తామని సంసిద్ధత చూపడంతో నిరుద్యోగులు ఇక తమకు ఉపాధి లభించినట్టేనని సంబరపడ్డారు. అయితే ఒక్క ఎస్సీ కార్పొరేషన్ మినహాయిస్తే, మిగితా అన్ని కార్పొరేషన్ల పరిధిలో నిధుల కేటాయింపులు నిలిచిపోవడం, బ్యాంకుల నుండి రుణాలు మంజూరీ కాకపోవడంతో లబ్ధిదారులు తమకు అధికారులు అందించిన ధ్రువీకరణ లేఖలు చేత బట్టుకుని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రుణాలు అందించేందుకు తమకు ఇంకనూ అనుమతి లభించలేదని, ష్యూరిటీ తదితర సాకులతో బ్యాంకర్లు మొండిచేయి చూపుతున్నారు.

డేంజర్ జోన్‌ల వద్ద
పోలీసులను నియమించాలి
ఐజి నాగిరెడ్డి
భిక్కనూరు, డిసెంబర్ 8: 44వ జాతీయ రహదారిపై ప్రమాద స్థలాలను డేంజర్ జొన్లుగా గుర్తించి ఆ ప్రాంతంలో పోలీసులను నియమించాలని ఐజి నాగిరెడ్డి పోలీసులను ఆదేశించారు. గురువారం ఆయన భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శే్వతరెడ్డితో కలిసి పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. అంతకు ముందు ఐజి నాగిరెడ్డికి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్‌లో క్రైం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం 40నేరాలు జరగగా ఈ సంవత్సరం 25కు తగ్గడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ఇక్కడి పోలీసుల పనితీరు వల్లే క్రైం రేటు తగ్గించదని ప్రశంసించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

నగదు రహిత లావాదేవిలు బంగారు తెలంగాణకు తొలి మెట్టు
కలెక్టర్ యోగితా రాణా

నిజామాబాద్, డిసెంబర్ 8: బంగారు తెలంగాణ నిర్మాణానికి నగదు రహిత లావాదేవీలే మొదటి మెట్టు అని, దీని ఆవశ్యకతను గుర్తించి ప్రజలందరూ ఈ విధానానికి అలవాటుపడాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని డిఆర్‌డిఎ మీటింగ్ హాల్‌లో రెవెన్యూ, బ్యాంకర్లు, మీసేవా కేంద్రాల నిర్వహకులు, రైతులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంపొందించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలు నగదు రహిత లావాదేవీల కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విధానం సంపూర్ణంగా అమలైతే అవినీతికి ఆస్కారం ఉండదని, ప్రతీ పని పక్కాగా జరుగుతుందన్నారు. వివిధ పద్ధతుల ద్వారా ఎంతో సులభంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చని, ఎటొచ్చీ ఆయా పద్ధతులు, విధానాల గురించి అవగాహనను ఏర్పర్చుకోవాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుందని, నిర్ణీత రుసుము మేరకే ఆన్‌లైన్ విధానంలో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని, ఎవరికి కూడా ముడుపులు, ఇతరాత్ర రూపేణా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు రహిత లావాదేవీలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని, బంగారు తెలంగాణ రూపకల్పనకు ఇది పునాదిగా నిలుస్తోందని భావిస్తోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ నగదు లేకుండానే తమ పనులను చక్కబెట్టుకునేలా క్షేత్ర స్థాయిలోనూ విరివిగా ప్రచారం చేయాలని సూచించారు.
జిల్లా, రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అవినీతి నిర్మూలించబడాలంటే నగదు రహిత లావాదేవీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అంతేకాకుండా ఈ తరహా లావాదేవీల వల్ల డబ్బులు కూడా పొదుపు అవుతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. చిరు వ్యాపారి ఒకరు రోజుకు 500రూపాయలు సంపాదిస్తే, ఆ మొత్తం అతని ఖాతాలోనే ఉంటుందని, చేతిలో నగదు నిల్వలు లేనందున అనవసర ఖర్చులు తగ్గి డబ్బు దుబారా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అన్నింటికి మించి నల్లధనం పోగవడం పూర్తిగా నిలిచిపోతుందని, తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వానికి పన్ను రూపేణా సమకూరే ఆదాయం ఆన్‌లైన్ విధానం ద్వారా పక్కాగా ఉంటుందని, పన్నుల వసూళ్లలో అక్రమాలకు తావుండదని, తద్వారా ఆ నిధులను వెచ్చిస్తూ ప్రజలకు రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పథకాలు వంటి వౌలిక సదుపాయాల కల్పనకు విరివిగా వెచ్చించేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. కరెన్సీ వాడుకలో లేని సమయంలో అప్పటి ప్రజలు వస్తు మార్పిడి విధానాన్ని పాటిస్తూ ఎంతో ఉల్లాసంగా జీవనాలు గడిపారని, ప్రస్తుతం కూడా క్యాష్‌లెస్ సిస్టమ్ ద్వారా ఎంతో ప్రశాంతంగా తమ దైనందిన కార్యకలాపాలు చక్కబెట్టుకోవచ్చని సూచించారు. విదేశాల్లో అత్యధికంగా నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నందున సదరు దేశాలు ఎంతో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అనేక వనరులు కలిగి ఉన్న భారతదేశం కూడా ప్రపంచంలో అగ్ర దేశాల సరసన నిలువాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడాలని సూచించారు. దేశం, సమాజ హితం కోసం ఉద్దేశించిన ఏ కార్యక్రమమైనా విజయవంతం చేసే గురుతర బాధ్యత ప్రజలపైనే ఉంటుందని అన్నారు.

బంగారు భవిష్యత్తు కోసమే పెద్దనోట్ల రద్దు
బిజెపి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి
దోమకొండ, డిసెంబర్ 8: దేశ బంగారు భవిష్యత్తు కోసం టెర్రరెస్టులు, నక్సలైట్ల కార్యకలాపాలకు అడ్డుకట్టవేసే ముఖ్య ఉద్దెశ్యంతో దేశ ప్రధాని నరేంద్ర మోడి 500, 1000రూపాయల నోట్లను రద్దు చేశారని బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నోట్ల రద్దుతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడ్తున్నాయని అన్నారు. దేశంలో నగదు లావాదేవిలు తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం కోసమే పెద్దనోట్లను రద్దు చేశారని అన్నారు. దేశానికి స్వతంత్ర వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయాలు తప్ప దేశాన్ని బాగు చేయాలన్న ఆలోచనలో లేదని అన్నారు. ఓటు రాజకీయాలు చేస్తూ కుంభాకోణాలకు పాల్పడుతూ, దేశ భవిష్యత్తును అంధాకారంలో నెట్టేశారని ఆరోపించారు. ఇప్పుడు మోడి సర్కార్ పాలనలో కాంగ్రెస్ కుంభకోణాలు వెలుగు చూస్తాయన్న భయంతో బిజెపి పాలనపై దుమ్మెతి పోయడం పెట్టుకున్నారే తప్ప ప్రజలకు న్యాయం చేసే నోట్ల రద్దుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయం అన్ని ఆలోచించి తీసుకున్నారని, ప్రజలందరు కూడా మోడి నిర్ణయానికి ఏకీభవిస్తున్నారని అన్నారు. కేవలం కాంగ్రెస్‌తో పాటు కోట్లు గడించిన పార్టీలే దీన్ని రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో కాంగ్రెస్ నేతలు ఏం ఆందోళన చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కమిటీ చైర్మెన్ డాక్టర్. మురళీధర్‌గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో కల్లబొల్లి వాగ్ధానాలు చేసి ఇప్పుడు అధికారంలో చేతిలో వచ్చాక వాటిని మరిచిపోయిందని ఆరోపించారు. ప్రజలను కెసిఆర్ పాలనను గమిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల్లో ప్రధానమైన కల్యాణలక్ష్మీ, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, డబుల్‌బెడ్‌రూం, తాండాలు జిపిలుగా మార్చే హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దాదాపు టిఆర్‌ఎస్ సర్కార్ అధికారంలో వచ్చి రెండున్నర ఏళ్లు దాటిపోతున్న ఏ పథకలు అమలుకు నోచుకుంటున్నాయని ఆయన ప్రశ్నించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కేవలం కేంద్రం పంపించిన నిధులతోనే చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు సొమ్ము ఒకడిది సోకు ఒకటిది అన్న తీరుగా ఉందని ఆరోపించారు. దేశ ప్రధాని పెద్దనోట్ల రద్దుకు తామ సమావేశంలో మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. పేద వాళ్లు తలెత్తుకుని గర్వంగా జీవించేందుకు మోడి నిర్ణయం ఉపయోగపడ్తుందని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఆందోళ పడాల్సిన పనిలేదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నీలంరాజు, బాపురెడ్డి, రవీకుమార్, మండల ప్రధాన కార్యదర్శి రాజేశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి పోరాడుతాం
తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కంఠేశ్వర్, డిసెంబర్ 8: ప్రజల విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్యలపై సిపిఎం పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. గురువారం నగర శివారులోని సారంగపూర్‌కు సిపిఎం మహాపాదయాత్ర చేరుకోగా, అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయ్యిందని, అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సిఎం కెసిఆర్ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. అసంఘటితరంగ కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అలాగే అంగన్‌వాడీలు, ఆశవర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. మధ్యాహ్న భోజన ఎజెన్సీల నిర్వాహకులకు సకాలంలో బిల్లు చెల్లించకుండా ప్రభుత్వాలు వారిని వేధింపులకు గురి చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సిఎం కెసిఆర్ పూర్తిగా విస్మరిస్తున్నారని, దళిత, బడుగు, బలహీనవర్గాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందని ఆయన విమర్శించారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి హామీలను సిఎం కెసిఆర్ తుంగలో తొక్కుతూ పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015-16సంవత్సరం నవంబర్‌లో రుణాలు అందిస్తామని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసినా, ఇంతవరకు రుణాలు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఇక అటు దేశంలో బిజెపి, ఇటు రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని, దాడులను నియంత్రించడంలో పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక చదువులను మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి నెలకొందని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల వల్ల రైతులు, ప్రజల కంటే, టిఆర్‌ఎస్ నాయకులకు, కాంట్రాక్టర్లకే అధిక ప్రయోజనం చేకూరుతోందన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ పథకంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టిఆర్‌ఎస్, ఇంతవరకు ఏ ఒక్కరికి రెండు పడకల ఇల్లుని నిర్మించి ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఏర్పడితే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ప్రజలు కలలు కంటే, రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

రూ.154కోట్ల ధాన్యం కొనుగోలు
కలెక్టర్ సత్యనారాయణ

కామారెడ్డి, డిసెంబర్ 8: జిల్లాలోని రైతులందరికి బ్యాంకు ఖాతాలను వారంలోపు తెరిపించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో నిర్వహించిన జిల్లా సహకార శాఖ కార్యదర్శులకు, క్రిషక్ భారతి సంస్థ సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు జరిగేలా సహకార సంఘాలపై ఉందన్నారు. జిల్లాలో 89వేల మంది రైతులకు బ్యాంకు ఖాతా తెరిపించి వాటిని వాడకంలోకి తీసుకురావాలని సూచించారు. నగదురహిత, ఆన్‌లైన్ పద్దతిలో బ్యాంకు లావాదేవీలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ బ్యాంకుల్లో ఇంటర్నెట్ ద్వారా నెట్ బ్యాంకింగ్, యుపిఐ, యుఎస్‌ఎస్‌డి, సెల్‌ఫోన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, తదితర వాటిపై రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఖరీప్ కాలానికి వరి మద్దతు ధర చెల్లింపులపై ఎక్కడ రైతులకు ఇబ్బందులు కల్గకుండా చెల్లింపులు చేయాలన్నారు. ఇప్పటి వరకు 154కోట్ల వరి ధాన్యం కొనుగోలు చేయగా 71కోట్ల చెల్లింపులు ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేసి రైతుల ఖాతాల్లో జమా చేయడం జరిగిందన్నారు. ఈనెల 19వ తేదిలోగా మండల, గ్రామస్థాయిలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
ఆర్మూర్, డిసెంబర్ 8: ఆర్మూర్ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహంనాయుడు చెప్పారు. గురువారం ఆర్మూర్ మండలం ఆలూర్, ఇస్సాపల్లి గ్రామాల్లో పసుపు గిట్టుబాటు ధర సాధించే అంశంపై పసుపు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆర్మూర్ ప్రాంతంలో అత్యధికంగా పసుపు పంటను పండించే రైతులు ఉన్నారని అన్నారు. ఆర్మూర్ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులకు ఆర్మూర్ కేంద్రంగా ఉంటుందని అన్నారు. పసుపు పంట పండించడానికి రైతులు ఎక్కువగా ఖర్చు పెడుతుండగా, మద్దతు ధర మాత్రం చాలా తక్కువగా వస్తోందని అన్నారు. పసుపుకు క్వింటాల్‌కు 15 వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సిందేనని ఆయన కోరారు. అనంతరం ఈ నెల 25వ తేదిలోపు వెయ్యి ఉత్తరాలు, ఇస్సాపల్లి నుంచి 500 ఉత్తరాలు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి పాపాలని నిర్ణయించారు. పసుపు బోర్డును ఆర్మూర్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, పసుపుకు 15 వేల రూపాయల మద్దతు ధర నిర్ణయించాలని కార్డుల్లో రాసి పంపాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, ఆలూర్ గురడిరెడ్డి సంఘం పెద్దలు, ఇస్సాపల్లి రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.