నిజామాబాద్

నిజాంసుగర్స్ పై ఎటూ తేల్చని సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, డిసెంబర్ 15: నిజాంసుగర్స్ కర్మాగారం విషయంలో తెలంగాణ సర్కారు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేక పోయింది. ఈ కర్మాగారం భవితవ్యంపై సర్కారు నాన్చుడి ధోరణి అవలంభిస్తుండటం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. గత నెల రోజుల క్రితం చెరకు రైతులు హైదరాబాద్ నగరానికి వెళ్లి ఎంపి కవితతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విన్నవించారు. అంతేకాకుండా కొన్నాళ్లు ప్రభుత్వం నడిపించి ఆ తర్వాత సహకార రంగానికి అప్పగిస్తే ఎటువంటి సమస్య ఉండదని, అలా చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉంటే తాము చెరకు పండించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిజాంసుగర్స్ కర్మాగారం ప్రభుత్వ పరంగా నడిపిస్తే తమకు గిట్టుబాటు ధర వస్తుందని అలాగే కార్మికులు కూడా సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వారు ఎంపీ కవితతో పేర్కొన్నారు. రైతులతో సుధీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ మొదటి నుండీ నిజాంసుగర్స్ విషయంలో తాను గట్టి పట్టుదలతో ఉన్నానని త్వరలోనే రైతులు సర్కారు నుండి తీపి కబురు వింటారని భరోసా ఇచ్చారు. దాంతో ఇక్కడి రైతులు సర్కారు చెరుకు సాగుకు సంబందించి ఏదైనా ప్రకటన ఇస్తుందేమోనని నాటి నుండి నేటి వరకు రైతులు నిలువెల్లా ఎదిరి చూస్తూనే ఉన్నారు. కానీ శాసనసభా సమావేశాలు ముంచుకు వస్తున్నా సర్కారు మాత్రం నిజాంసుగర్స్‌కు సంబంధించి ఎటువంటి ప్రకటనను చేయలేక పోయింది. బోధన్ యూనిట్‌లో ప్రైవేటు యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించి డిసెంబర్ 23 నాటికి ఏడాది కావస్తుంది. ఏడాది కాలంగా కర్మాగారం మూతపడి ఉండటం వలన కార్మికులు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కార్మికుల పక్షాన వివిధ కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం సిఐటియు కార్మిక సంఘం బోధన్‌లో ఒకరోజు పాటు నిరాహార దీక్ష చేపట్టనుంది. తీపి కబురు వస్తుందని స్వయాన ఎంపీ ప్రకటించినప్పటికీ సర్కారు నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఇక్కడి రైతులు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కర్మాగారం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ అనేక సందర్భాలలో బోధన్ పట్టణంలో జరిగిన ఉద్యమ సభలలో నిజాంసుగర్స్ వ్యవహారాన్ని ప్రస్తావనకు తెచ్చారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెరాస అధికారంలోనికి వస్తే నిజాంసుగర్స్‌కు పూర్వ వైభవం తీసుకురావడం ఖాయమని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సభలలో ఎంపీ కవిత సైతం ఇక్కడి కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. దాంతో ఈ సర్కారు పై కార్మిక, కర్షక వర్గాలు అనేక ఆశలు పెట్టుకున్నాయి. ఇదిలా ఉండగా చక్కెర కర్మాగారాల వ్యవహారంలో సర్కారు స్తబ్దంగా ఉండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని బోధన్ నియోజకవర్గంలో పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రజల మద్ధతును కూడగట్టుకుంది. అంతేకాకుండా జరుగబోయే శాసనసభా సమావేశాలలో కూడా నిజాంసుగర్స్ వ్యవహారంపై సర్కారును నిలదీసేందుకు సర్వం సిద్ధమవుతోంది. దీనికి తోడు వామపక్ష పార్టీల నాయకులు కూడా ఈ కర్మాగారం విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. బోధన్ నిజాంసుగర్స్ కర్మాగారంను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయమై సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీల నాయకులు ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెరాస నాయకులు ఈ ఫ్యాక్టరీ విషయంలో ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన వస్తేనే ఒకింత తెరాస నాయకులు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. కనీసం కర్మాగారంలో లే ఆఫ్ ఎత్తివేసే చర్యలు చేపట్టినా ఒకింత తెరాస నాయకులు కార్మికులలో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. కార్మికులకు లే ఆఫ్ కారణంగా ఏడాది కాలంగా వేతనాలు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అధికారపార్టీ నాయకుల పై గుర్రుగా ఉన్నారు. తమ ఆకలి కేకలు సర్కారు దృష్టికి తీసుకుపోరా అని కలిసిన వారినల్లా నిలదీసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ కర్మాగారంలో లే ఆఫ్‌ను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకున్నట్లయితే రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తీపి కబురు కోసం సర్కారు ఎప్పుడు ముహూర్తం నిర్ణయించిందో వేచిచూడాల్సిందే.

అన్ని గ్రామాలు నగదు రహితం కావాలి
శజాయింట్ కలెక్టర్ సత్తయ్య
సదాశివనగర్, డిసెంబర్ 15: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో నగదు రహితం కావాలని జాయింట్ కలెక్టర్ సత్తయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహశీల్‌దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మండలవంలోని ప్రభుత్వ భూములు, సాదాబైనామల వివరాలను తహశీల్‌దార్ అమీన్‌సింగ్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17నుండి అన్ని గ్రామాలలో నగదు రహిత పై ప్రజలకు అవగాహన కల్గించి, పూర్తి స్థాయిలో అమలు అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. వస్తువులు కొనుగోలు చేసినపుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రథమంగా మన జిల్లాలో ఉగ్రవాయి గ్రామన్ని నగదు రహిత గ్రామంగా ఎంపిక చేశామని, నగదు రహితలో ఆదర్శం చేస్తామన్నారు. మండలంలో బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా చేయాలన్నారు. అక్రమంగా రేషన్ సరుకులు తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్‌దార్ అమీన్‌సింగ్, ఎంపిడిఒ చంద్రశేఖర్, డిప్యూటి తహశీల్‌దార్ రంజిత్‌కుమార్, ఆర్‌ఐ సుదీర, సీనియర్ అసిస్టెంట్ తిరుమల్‌రావు, విఆర్‌ఒలు రవి, జ్యోతి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

నీటి విడుదల
బాల్కొండ, డిసెంబర్ 15: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుండి అధికారులు గురువారం యాసంగి పంటల సాగు కోసం నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90టిఎంసిలు కాగా, గురువారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1089.20 అడుగులు 80.85 టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉండగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి పంటల కోసం కాకతీయ కాల్వ ద్వారా 2వేల క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, లక్ష్మి కాల్వ ద్వారా 100క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్‌లో నీటిమట్టం 1050.30అడుగులు 6.57టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి పంట కోసం ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు.
టిప్పర్ ఢీకొని ఒకరి మృతి
వినాయక్‌నగర్, డిసెంబర్ 15: మోపాల్ మండలం ముల్లంగి గ్రామంలో టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడినట్లు మోపాల్ ఎస్‌ఐ సతీష్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మోపాల్ మండలం ముల్లంగి గ్రామానికి చెందిన ఎస్.సతీష్(26)అనే యువకుడు బుధవారం రాత్రి నిజామాబాద్‌లో ఉండే తన అత్తగారి ఇంటికి వెళ్తుండగా, ఎదురుగా అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు. మృతుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని, శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఉప్పు సాయిలును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని రూరల్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు సందర్శించడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు.