నిజామాబాద్

ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, డిసెంబర్ 16: ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ఈ దశలో విద్యార్థులు కష్టమని భావించకుండా ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తును అందుకోవచ్చని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా హితవు పలికారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో గల బి.సి హాస్టల్‌లో వసతి పొందుతున్న పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ విద్యార్థులనుద్దేశించి కీలక సూచనలు చేశారు. పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు పాటించాల్సిన పద్ధతుల గురించి వారికి వివరించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వరిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకే చదువు వ్యాపకం ఎంతో కీలకమైనందున చదువును ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదని ఉద్బోధించారు. తమ పిల్లలు ఉన్నత స్థానాలు అధిరోహించాలని ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఆశిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మనకంటూ ఓ గమ్యాన్ని ఏర్పర్చుకుని ముందుకెళ్తున్న క్రమంలో కొన్ని అవరోధాలు ఎదురవుతాయని, అంతమాత్రాన వాటిని చూసి కుంగిపోకుండా మరింత పట్టుదల, ఆత్మస్థైర్యంతో కృషిని కొనసాగించి విజయాలను ఒడిసిపట్టుకోవాలని అన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. ఐఎఎస్ కావాలనే లక్ష్యం ఏర్పర్చుకుంటే కనీసం ఐపిఎస్, ఐఇఎస్, ఐఆర్‌ఎస్‌లు అయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. సివిల్స్‌లో కాకపోయినా కనీసం గ్రూప్-1 ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించవచ్చని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవడంతోనే సరిపెట్టుకోకుండా ఆ లక్ష్యాలను అందుకునే దిశగా కఠోర పరిశ్రమతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని విస్మరించరాదని అన్నారు. విద్యార్థి దశలో చదువును నిర్లక్ష్యం చేసి ఇతర వ్యాపకాల వైపు దృష్టిని మళ్లిస్తే, భవిష్యత్తు అంధకారంగా మారి జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. బాలికలు కూడా సమాజంలో తాము ఉన్నత స్థానంలో రాణించాలనే పట్టుదలతో మరింత ఏకాగ్రతతో చదవాలని హితవు పలికారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు ఎంతో కీలకమైనందున ఏమాత్రం సమయం వృధా చేయకుండా అన్ని పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవాలని, బట్టీ విధానం అనుసరించవద్దని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిణి విమలాదేవి, డిఇఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు
30న మోర్తాడ్‌కు రైలు రాక
మోర్తాడ్, డిసెంబర్ 16: మోర్తాడ్ ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైలు రాక ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. డిసెంబర్ 30న కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆన్‌లైన్ ద్వారా మోర్తాడ్‌లో రైలు ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులకు సమాచారం అందడంతో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాం పాలనలో సర్వేకు నోచుకున్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ నిర్మాణం అనేక అవరోధాలను దాటుకున్న మీదట ఆరు దశాబ్దాలుగా కొన‘సాగు’తూ వస్తోంది. ప్రస్తుతం ఆర్మూర్ - నిజామాబాద్‌ల మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు ఆర్‌ఓబిల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి 2013జూన్ మాసం నాటి నుండే మోర్తాడ్ వరకు రైలు నడుపుతామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. అలా వాయిదాపడుతూ వస్తున్న రైలు రాక ఆరు మాసాలకోసారి ముహూర్తాన్ని మార్చుకుంటూ వస్తోంది. రైల్వే ఉన్నతాధికారుల బృందంతో పాటు సేఫ్టీ బృందం కూడా గడిచిన వేసవి కంటే ముందుగానే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమతిని మంజూరు చేసింది. ఆ సమయంలోనే ఏప్రిల్‌లో రైలు రాకపోకలను ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. ఆ తరువాత జూన్‌కు మారిన ముహూర్తం కాస్తా, నెల రోజుల క్రితం ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తారని ప్రకటించారు. ఆ సమయంలో అధికారులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు రైలు రాక కోసం సర్వం సిద్ధం చేశారు. చివరి క్షణంలో ఆ కార్యక్రమం వాయిదాపడడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. ఇటీవలే రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన ఉన్నతాధికారుల బృందం ఆర్మూర్ వరకు రైలును పొడిగిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కరీంనగర్-జగిత్యాల మధ్య తిరుగుతున్న డెమో ట్రైన్‌ను ఆర్మూర్ వరకు పొడిగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే మార్చి నాటికల్లా నిజామాబాద్ వరకు రైల్వే నిర్మాణం పనులు పూర్తవుతాయని, నిజామాబాద్ - కరీంనగర్‌ల మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయని చెప్పడం జరిగింది. ఇలా రైలు రాక కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ప్రతీసారి రైలు కూత ఎండమావిలా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29, 30వ తేదీలలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు హాజరవుతున్నట్టు అధికార వర్గాలకు సమాచారం అందింది. ఇందులో భాగంగానే కరీంనగర్-లింగంపేట్-జగిత్యాల మధ్య తిరుగుతున్న డెమో రైలును రిమోట్ వీడియో లింకు ద్వారా మోర్తాడ్ వరకు ప్రారంభిస్తారని సమాచారం. దీనికి సంబంధించి రైల్వే శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అన్ని హంగులతో సిద్ధమైన రైల్వే స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తొలిసారిగా ప్యాసింజర్ రైలు వస్తున్న నేపథ్యంలో తొలి ప్రయాణం చేసి ఆ అనుభూతిని పదిలపర్చుకునేందుకు చాలామంది యువకులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మొత్తానికి ఆరు దశాబ్దాల రైలు రాక కల ఈ నెల 30న సాక్షాత్కరిస్తుండడంతో రైలు కూత కోసం మోర్తాడ్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి
విద్యార్థులకు సీనియర్ సివిల్ జడ్జి జయరాజ్ పిలుపు

కామారెడ్డి, డిసెంబర్ 16: చట్టాలపై ప్రతి విద్యార్థి అవగాహన కల్గి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి జయరాజు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కోర్టులో జరిగే వాద ప్రతిపాదనలు, క్రాస్ ఎగ్జమినేషన్ల, తదితర విషయాలపై ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జూనియర్, సివిల్ కోర్టుల పనితీరు గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం కోర్టు ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శీతల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు క్యాతం సిద్దిరాములు, ప్రభుత్వ న్యాయవాది గజ్జెల భిక్షపతి, కోమలత, సినియర్ న్యాయవాదులు జగన్నాథం, శంకర్‌రెడ్డి, రమేశ్‌చంద్, సురేందర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, దేవరాజు, డిగ్రీ కళాశాల లైబ్రెరీయన్ రంజిత్‌మోహన్, రాజ్‌గంభీర్‌రావు, వందమంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

బడా బాబుల్లో ఐటి దడ

నగదు లావాదేవీలపై కూపీ లాగుతున్న అధికారులు

నోటీసులు జారీ చేస్తున్న ఐటి శాఖ

కంఠేశ్వర్, డిసెంబర్ 16: పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కూపీ లాగుతోంది. బ్యాంకు, తపాలా శాఖ అధికారులతో తెరచాటున జరిగిన నగదు మార్పిడిపై ఐటి శాఖ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడమే కాకుండా నోటీసులు సైతం జారీ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎవరైతే నవంబర్ 8వ తేదీ తరువాత బ్యాంకులలో రెండున్నర లక్షల రూపాయలకు పైగా నగదును జమ చేశారో వారికి ఐ.టి నుండి నోటీసులు జారీ అవుతున్నట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా పెద్ద నగరాల్లో ఐ.టి అధికారులు విస్తృతంగా దాడులు కొనసాగిస్తున్న విషయం విధితమే. ఈ దాడుల్లో కోట్లాది రూపాయల కొత్త 2000 నోట్లు పట్టుబడడం వెనుక బ్యాంకర్లు, తపాలా శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని బడాబాబుల పైనా ఐ.టి అధికారులు దృష్టిసారించారని స్పష్టమవుతోంది. ఐ.టి నిఘా పెట్టి నోటీసులు జారీ చేస్తుండడంతో పెద్ద ఎత్తున నగదు జమ చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపైన ఏ క్షణమైనా దాడులు జరుగవచ్చనే భయం వారిలో నెలకొంది. ఐ.టి శాఖకు సంబంధించిన ప్రత్యేక బృందాలు రెండు జిల్లాలోనే మకాం వేసి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా నవంబర్ 8 తరువాత బంగారం కొనుగోళ్లు చేసిన వారిపై కూడా నిఘా పెట్టారు. అత్యంత రహస్యంగా జరుగుతున్న విచారణలో బడాబాబుల బండారం ఐ.టి అధికారుల చేతికి చేరినట్టు తెలుస్తోంది. ఐ.టి దాడులను ముందుగానే పసిగట్టిన నల్ల కుబేరులు కొందరు రహస్య స్థావరాలకు వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే బ్యాంకుల ద్వారా బడాబాబులు జరిపిన లావాదేవీలను నిఘా అధికారులు పరిశీలించి నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఆరుగురు వైద్యులు పాత నోట్లను మార్పిడి చేసేందుకు కొందరు కమీషన్ ఏజెంట్లకు 11కోట్లు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. సదరు కమీషన్ ఏజెంట్ ఆ మొత్తాన్ని స్వాహా చేయగా, సదరు వైద్యుల ఆర్థిక లావాదేవీలు, వాస్తవ పరిస్థితుల గురించి ఐ.టి శాఖ అధికారులు కూపీ లాగుతున్నారని తెలిసింది. కొత్త నోట్లు ఇప్పటికే పెద్ద మొత్తంలో బడాబాబుల చేతికి చేరడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించిన బ్యాంకర్లు, తపాలా శాఖ అధికారుల వివరాలు సేకరించి సమగ్ర నివేదికను ఆర్‌బిఐ వర్గాలకు అందజేయనున్నట్టు తెలిసింది.

కలెక్టరేట్ ముట్టడి
సమస్యలను పరిష్కరించాలని ర్యాలీగా తరలివచ్చిన బీడీ కార్మికులు

కామారెడ్డి, డిసెంబర్ 16: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు శుక్రవారం కలెక్టరేట్‌ను బీడీ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించారు. శుక్రవారం ది తెలంగాణ బీడీ రోలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు నిజాంసాగర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు ఉప్పు లక్ష్మణ్ మాట్లాడుతూ, బీడీ కార్మికుల బట్వాడాలను బ్యాంకుల్లో వేసే పద్దతిని వెంటనే రద్దు చేయాలన్నారు. బీడీ కార్మికులకు బీడీ యాజమాన్యాల ద్వారానే బట్వాడాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నాణ్యమై తునికి ఆకు ఇవ్వాలన్నారు. పిఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికి వెయ్యి రూపాయల జీవనభృతి కల్పించాలన్నారు. వెయ్యి బీడీలు చేసిన కూలీలందరికి 200రూపాయలు చెల్లించాలన్నారు. బీడి కంపెనీలో పనిచేసే నెలసరి ఉద్యోగులకు కనీస వేతనం 15వేల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలోని తహశీల్దార్ అనిల్‌కుమార్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పర్వవ్వ, శివంగి సత్యం, గంగాధర్, లింగం, వెంకటి, రాములు, యాదగిరిగౌడ్, సిద్దయ్య, రమేశ, రవిందర్, కిషన్, మల్లేశం, కోటయ్య, శ్రీనివాస్, రాజేందర్, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ప్రయాణికులపై
తేనెటీగల దాడి
మద్నూర్, డిసెంబర్ 16: ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులపై తేనెటీగలు దాడి చేయడంతో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన మద్నూర్ మండలం రుషేగాం గేట్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం ప్రయాణికులతో బాన్సువాడ నుండి దెగ్లూర్‌కు బయలుదేరింది. అయితే బస్సు రుషేగాం గేట్ సమీపంలోకి చేరుకోగానే డీజిల్ ట్యాంకు పైప్ ఊడిపోవడంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి పైప్‌ను సరిచేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో తేనెపట్టు ఉన్న చెట్టుపై నుండి వందలాదిగా తేనెటీగలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ప్రయాణికులు తేరుకునే లోపే కిటికీల గుండా బస్సు లోపలికి దూరి ప్రయాణికులను కాటేశాయి. తేనెటీగల దాడిలో బస్సు డ్రైవర్, కండక్టర్లు కూడా గాయపడ్డారు. ఒక్కసారిగా వందలు, వేల సంఖ్యలో తేనెటీగలు దాడి చేయడంతో ప్రయాణికులు బస్సు దిగి తలోదిక్కున పరుగులు పెట్టారు. కొద్దిదూరం వరకు వారిని వెంటాడిన తేనెటీగలు శాంతించి వెనుదిరగడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికే 14మంది తేనెటీగల కాటుకు గురయ్యారు. వారంతా మద్నూర్‌కు చేరుకుని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్నారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని దెగ్లూర్, బాన్సువాడ ఆసుపత్రులకు రెఫర్ చేశారు. ఆర్టీసీ బస్సు మొరాయించడం వల్లే తాము తేనెటీగల దాడికి గురి కావాల్సి వచ్చిందని, కాలం చెల్లిన బస్సులు నడుపుతూ ఆర్టీసీ అధికారులు తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు శాపనార్థాలు పెట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలి
కలెక్టర్ సత్యనారాయణ
గాంధారి, డిసెంబర్ 16: గ్రామీణ ప్రాంత మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని కరక్‌వాడి గ్రామంలో జరిగిన పౌష్టికాహారం, ఆరోగ్య శిబిరం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద గర్భిణిలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సలతో పాటు కాన్పులు చేయించుకోవాలని తెలిపారు. ఇప్పటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70శాతం కాన్పులు జరుగుతున్నాయని, దీనిని వందశాతానికి చేరుకునేలా సంబంధిత సిబ్బంది తగిన కృషి చేయాలని సూచించారు. దీంతో పాటు ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఆయన ప్రజలకు తెలియచేశారు. మరుగుదొడ్లు నిర్మించుకుంటే కలిగే లాభాలను ఆయన ప్రజలకు వివరించారు. అనంతరం ఈ ఆరోగ్య శిబిరంలో 200మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందచేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ పిడి చంద్రమోహన్‌రెడ్డి, జెడిఎ విజయ్‌కుమార్, ఇంచార్జి ఎడిఎ యాదగిరి, జడ్పిటిసి తానాజీరావు, సర్పంచ్ రవి, సిడిపిఓ సునంద, తహశీల్దార్ లక్ష్మణ్, ఎంపిడిఓ సాయాగౌడ్, వైద్యులు షాహెద్‌అలీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పంటను దళారులకు విక్రయించి నష్టపోవద్దు
రైతు బంధు పథకం చెక్కులు పంపిణీలో కలెక్టర్
కంఠేశ్వర్, డిసెంబర్ 16: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగులలో రైతు బంధు పథకం కింద పంట ఉత్పత్తులను నిల్వ చేసుకున్న రైతులకు కలెక్టర్ డాక్టర్ యోగితారాణా శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీలోని రైతు సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులు వాటిని కమీషన్ ఏజెంట్లు, దళారులకు విక్రయించి నష్టపోవద్దని హితవు పలికారు. మార్కెట్‌లో సరైన ధర లభించని పక్షంలో రైతులు తమ పంటను రైతు బంధు పథకం కింద గిడ్డంగులలో నిలువ చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. ఇలా నిల్వ చేసుకున్న సరుకుపై ఎలాంటి వడ్డీ లేకుండా నిర్ణీత కాల పరిమితి వరకు ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కూడా వర్తింపజేస్తోందని తెలిపారు. రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, అయితే సరైన అవగాహన లేని కారణంగా పలుచోట్ల రైతుల పేరుతో బినామీలు సరుకులను నిలువ చేసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పక్కాగా రైతులే లబ్ధి పొందేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పంట ఉత్పత్తుల అమ్మకాల్లో రైతులు మోసపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇ-నామ్ విధానం ద్వారా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నదాతకు నష్టం కలుగకూడదనే కృతనిశ్చయంతో కొన్ని కఠిన నిర్ణయాలను సైతం అమలు చేసేందుకు వెనుకాడడం లేదన్నారు. ఈ విషయాన్ని గ్రహించి రైతులు తమ పంటను మార్కెట్ యార్డుకు తరలించి ఇ-నామ్ విధానం ద్వారా నేరుగా అమ్మకాలు జరుపుకోవాలని, తద్వారా పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందవచ్చని అన్నారు. రైతులు ముందుగానే పంటను శుభ్రపర్చుకుని వస్తే కూలీల చార్జీలు కూడా గిట్టుబాటు అవుతాయని సూచించారు. ఒకవేళ సరైన ధర లభించడం లేదని భావిస్తే తమ పంటను రైతు బంధు పథకం కింద మార్కెట్ యార్డు గిడ్డంగులలో నిలువ చేసుకోవచ్చని, దీనికి రైతుల నుండి నిర్ణీత కాల పరిమితి వరకు ఎలాంటి రుసుము వసూలు చేయబడదని పేర్కొన్నారు. ఈ పథకం కింద పంటను నిల్వ చేసుకున్న 182మంది రైతులకు పంట విలువను అనుసరిస్తూ 2.35కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి సునంద, మార్కెటింగ్ జిల్లా అధికారి మహ్మద్ రియాజ్, డిసిఓ శ్రీనివాస్‌రెడ్డి, డిఎఓ మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు.

హామీలను విస్మరించిన ప్రభుత్వాలు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలామల్లేశం
కంఠేశ్వర్, డిసెంబర్ 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని, ఫలితంగా అన్ని వర్గాల అభివృద్ధి కుంటుపడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలా మల్లేశం ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ బిజెపిని గెలిపిస్తే వంద రోజుల్లో విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెస్తామని ప్రకటించారని, ప్రస్తుతం దేశ ప్రజలను నడి రోడ్డున నిల్చోబెట్టారని ఎద్దేవా చేశారు. దేశంలో నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలిస్తామని కేంద్రంలోని బిజెపి సర్కార్ 500, 1000రూపాయల నోట్లను రద్దు చేసి పేద, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. నోట్లను రద్దు చేసి 38రోజులు గడుస్తున్నా ప్రజలు ఇంకా క్యూ లైన్లలో నిలబడలేక అకాల మరణాలు చెందుతున్నారని, వారి చావులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఎన్డీయే సర్కార్ బడాబాబులకు కొమ్ముగాస్తూ, పేదల నడ్డి విరుస్తోందని, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు తొత్తుగా మారిందని ధ్వజమెత్తారు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన 2వేల రూపాయల నోట్లు ఆర్‌బిఐ, బ్యాంకు, పోస్టల్ అధికారుల నిర్వాకం వల్ల నల్ల కుబేరుల చేతుల్లోకి వెళ్తున్నాయని, పేదలు మాత్రం గంటల తరబడి బ్యాంకుల ఎదుట పడిగాపులు పడినా వారికి కనీసం 2వేల రూపాయల నగదు కూడా దొరకడం లేదన్నారు. మోడీ పాలనా తీరును చూస్తే పేదోడికి ఒక న్యాయం, ధనవంతుడికి మరో న్యాయం అన్న చందంగా మారిందని ఆక్షేపించారు. శేఖర్‌రెడ్డి వంటి బడాబాబులు ఏకంగా ముద్రణా కార్యాలయం నుండి వేల కోట్ల రూపాయల కొత్త నోట్లను సమకూర్చుకోవడాన్ని బట్టి చూస్తే దేశంలో అవినీతి ఏమేరకు పెచ్చుమీరిందో తెలుస్తోందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తోందని, అసంఘటిత రంగ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక తెలంగాణలోని తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఆ హామీని అటకెక్కించారని, ఆసరా పింఛన్లను అంతంతమాత్రంగానే అందజేస్తున్నారని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల్లో లెక్కకు మిక్కిలి అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని కెసిఆర్ చెప్పారని, కానీ ప్రభుత్వం ఈ దిశగా చొరవ చూపకుండా అరకొర పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయని అంతా భావించారని, తీరా ఆ నలుగురు మాత్రమే ఇతోధికంగా లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సుధాకర్, ఓమయ్య, బోసుబాబు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

డబ్బుల కోసం రైతుల ధర్నా
బాన్సువాడ, డిసెంబర్ 16: తమ ఖాతాల్లో జమ ఉన్న డబ్బులను అందించకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం బాన్సువాడ పట్టణంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖలో రైతులు తమ ఖాతాలోని డబ్బులను తీసుకుని రబీ పంటల సాగు కోసం వెచ్చించేందుకు బ్యాంకుకు వెళ్తే గత రెండు రోజుల నుండి తమకు డబ్బులు అందించడం లేదని రైతులు వాపోయారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు శుక్రవారం బ్యాంకు ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు పూనుకున్నారు. రెండు రోజులుగా తాము గ్రామాల నుండి వస్తూ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడినా నగదు అందించడం లేదని వాపోయారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ సాయిలును నిలదీస్తూ అతనితో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం రబీ పంటలు సాగు చేసుకునేందుకు తమకు డబ్బులు ఎంతో అవసరం ఉన్నాయని, అయినప్పటికీ తమ ఖాతాలోని నగదును తమకు అందించేందుకు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ఆన్‌లైన్ సర్వర్‌లో ఇబ్బందులు ఉన్నాయంటూ, మరోమారు నగదు నిల్వలు లేవంటూ కుంటిసాకులు చెబుతూ తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. బ్యాంకు మేనేజర్ సాయిలు వారికి నచ్చజెప్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సాంకేతిక లోపాలను సరి చేసుకుని, నగదు నిల్వలను సమకూర్చుకుంటామని, శనివారం రైతులందరికీ నగదును అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇదిలాఉండగా, బాన్సువాడ పట్టణంలోని ఎస్‌బిఐ బ్యాంకు శాఖలోనూ సాంకేతిక లోపాలు తలెత్తడంతో శుక్రవారం పూర్తిగా లావాదేవీలు స్తంభించిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పట్టణంలో పది వరకు ఎటిఎంలు ఉన్నప్పటికీ, వారం రోజులుగా ఏ ఒక్క ఎటిఎం కూడా సక్రమంగా నగదును అందించకపోవడంతో స్థానికులు కరెన్సీ కష్టాలతో సతమతం కావాల్సి వస్తోంది.