నిజామాబాద్

దెగ్లూర్ మున్సిపాల్టీ కాంగ్రెస్ కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్రానికి సరిహద్దులో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలాన్ని ఆనుకుని ఉన్న మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దెగ్లూర్ మున్సిపాల్టీకి మొత్తం 25 కౌన్సిలర్లు ఉండగా, అందులో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. అదే విధంగా మరో 11స్థానాలను రాష్టవ్రాది కాంగ్రెస్ దక్కించుకోగా, మరో రెండు స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. అయితే చైర్మన్ పదవికి సైతం ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగడంతో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా సిరిశెట్టివార్ మొగులాజీ బరిలో నిలిచారు. ఇతనికి మొత్తం 11,093 ఓట్లు రాగా, ప్రత్యర్థికి అభ్యర్థికి 10,630 ఓట్లు, బిజెపికి 5,790, ఎంఐఎం అభ్యర్థికి 309 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా మొగులాజీ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో దెగ్లూర్ మున్సిపాల్టీ చైర్మన్‌గా గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

మిషన్ భగీరథ పనులు వేగవంతం
అధికారులకు కలెక్టర్ సత్యనారాయణ ఆదేశం

కామారెడ్డి, డిసెంబర్ 19: మిషన్ భగీరథ కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి నిర్దేశించిన తేదీలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గ్రిడ్ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ కింద 244కిలోమీటర్ల పైప్‌లైన్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 143పైప్‌లైన్ వేయడం జరిగిందన్నారు. జనవరి 7వ తేదిలోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి పనుల్లో అలసత్వం వహించకుండా చూడాలన్నారు. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చేందుకు ఇందిరా కనెక్షన్ పనులను పూర్తి చేయాలన్నారు. గ్రిడ్ కింద నిర్మిస్తున్న మంచినీటి ట్యాంకు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. నల్లా కనెక్షన్లు ఈనెల 30వ తేదిలోగా ఇవ్వాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రిడ్ ఇంజనీర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, రామారావు, రాకేశ్‌లున్నారు.
నగదురహిత లావాదేవీలు జరగాలి
నగదురహిత లావాదేవీలు జరిగేలా అధికారులు చూడాలని, ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపుల ద్వారా కనీస రెండు లావాదేవీలు జరిపే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగులు కృషి చేయాల్సి ఉందన్నారు. జనవరి 1 2017వ తేది నుండి కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు, ప్రైవెట్ పాఠశాలలు, ఆసుపత్రులు, తదితర సంస్థలకు బ్యాంకర్లు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించాలన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై దృష్టి సారించి పనులను నిర్దేశించిన తేదిల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఫీడర్ ఛానల్స్, చెరువు మరమ్మత్తు పనులను ఉపాధిహామీ పథకం కింద చేపట్టాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పేకాట, గుడుంబాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి జిపికి 3చక్రాల రిక్షాలను వాడుకంలోకి వచ్చే విధంగా డిపిఓ చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి సత్తయ్య, పిడి చంద్రమోహన్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రైవేటు వర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ
మంత్రి ఇంటి ముట్టడికి యత్నం

*అడ్డుకున్న పోలీసులు * తోపులాటలో ఇద్దరికి గాయాలు
బాన్సువాడ, డిసెంబర్ 19: పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేలా ప్రైవేటు వర్సిటీలకు అనుమతులు ఇచ్చేందుకు తీసుకవస్తున్న బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అంబేద్కర్ చౌరస్తా నుండి మంత్రి ఇంటికి వామపక్ష విద్యార్థి నాయకులు, విద్యార్థులు ర్యాలీగా బయలుదేరగా, విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి వారిని మార్గమధ్యంలో అడ్డుకున్నారు. సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలపాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరుగగా ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుప్రసాద్, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సుధాకర్‌లు మాట్లాడుతూ, తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులను కేటాయించి అభివృద్ధి చేయాల్సిన తెరాస సర్కార్, అందుకు విరుద్ధంగా ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు, యువకుల త్యాగాల పునాదులపై అధికారాన్ని చెలాయిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం, విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఉన్నత విద్యను ప్రైవేటుపరం చేసేందుకు ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును తీసుకరాగా, అందుకు మంత్రివర్గ ఉప సంఘం అందుకు అంగీకరించడం దారుణమన్నారు. ఇందుకోసం తీసుకవచ్చిన ఉప సంఘంలో సిఎం కెసిఆర్, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని నియమించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేటు వర్సిటీల బిల్లును వెంటనే ఉప సంహరించుకోవాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి సైతం వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, పిడిఎస్‌యు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, ఆజాద్, బాల్‌రాజ్, సుమన్, నాయకులు శివప్రకాష్, వినోద్, నరేందర్, సాయితేజ తదితరులు ఉన్నారు.

ఎంసిఐ అనుమతులకు ఆది నుండీ అవాంతరాలే!
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల దైన్యం
నాలుగేళ్లు గడుస్తున్నా...అరకొర వసతులతోనే సరి
వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతి నిరాకరణపై సర్వత్రా ఆందోళన

నిజామాబాద్, డిసెంబర్ 19: సుదీర్ఘ కాలం పాటు కొనసాగించిన పోరాటాల ఫలితంగా నిజామాబాద్‌లో నెలకొల్పబడిన ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆది నుండీ ఎంసిఐ అనుమతుల గండం వెంటాడుతూ వస్తోంది. కాలేజీని ఏర్పాటు చేసిన తొలి ఏడాది నుండి మొదలుకుని, ప్రస్తుతం నాలుగేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఈ పరిస్థితిలో మార్పు రావడం లేదు. భారత వైద్య మండలి ప్రతినిధుల బృందం తనిఖీలకు వచ్చే ప్రతిసారి ఈ ప్రాంత విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎక్కడ ఎంసిఐ అనుమతులను నిరాకరిస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. అనుమానించినట్టుగానే 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన అనుమతులను ఇటీవల ఎంసిఐ నిరాకరించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మెడికల్ కాలేజీ వర్గాలు అనుమతుల విషయమై మరోమారు ఎంసిఐకు విన్నవించే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లభించేలా చూస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తదితరులు హామీ ఇచ్చినప్పటికీ, ఇంకనూ అనిశ్చితి దూరం కాలేకపోతోంది. ఒకవేళ సకాలంలో ఎంసిఐ నుండి అనుమతి లభించకపోతే వంద సీట్లను కోల్పోవాల్సి వస్తుందన్న భయం వెంటాడుతోంది. ఈ పరిస్థితికి అడుగడుగునా అసౌకర్యాల లేమి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. 2013-14వ విద్యా సంవత్సరం నుండి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం అవగా, తొలి ఏడాది నుండే ఎంసిఐ అనుమతులు పొందేందుకు నానాతంటాలు పడాల్సి వచ్చింది. నగరం నడిబొడ్డున బస్టాండ్‌ను ఆనుకుని కళాశాలను ఏర్పాటు చేయడం అనేక సమస్యలను తెరపైకి తేగా, బోధకులను నియమించకపోవడం, సదుపాయాల లేమి వల్ల ఎంసిఐ తొలుత అనుమతిని నిరాకరించింది. అప్పటి మంత్రి హోదాలో సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా కొనసాగిన గులాంనబీ ఆజాద్ తోడ్పాటుతో అతికష్టం మీద ఎంసిఐ నుండి అనుమతి సాధించగలిగారు. ప్రతి సంవత్సరం ఇదే తరహా తంతు కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం నాల్గవ సంవత్సరం విద్యా బోధన జరుగుతుండగా, ఐదవ సంవత్సరం అనుమతుల జారీ కోసం గత సెప్టెంబర్ నెలాఖరున ఎంసిఐ ప్రతినిధుల బృందం తనిఖీలు నిర్వహించి వెళ్లింది. ఈ సందర్భంగా అడుగడుగునా అసౌకర్యాలు నెలకొని ఉండడాన్ని గమనించి అనుమతిని నిరాకరిస్తున్నట్టు నవంబర్ మాసం చివరి వారంలో ఎంసిఐ ప్రకటించింది. వైద్య విద్యను బోధించే అధ్యాపకులు, సిబ్బంది కొరతతో పాటు మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఐసియు, ఐఐసియు వార్డులు అందుబాటులో లేకపోవడం, వెంటిలేటర్ సదుపాయాన్ని సమకూర్చుకోకపోవడం, అవుట్ పేషెంట్‌ల సంఖ్య తక్కువగా ఉండడం, ఆసుపత్రిలో సగానికి పైగా స్ట్ఫా నర్సుల పోస్టులు ఖాళీగా ఉండడం, లైబ్రరీలో తగినంతగా పుస్తకాలు లేకపోవడం, పారా మెడికల్ సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వంటి కారణాలను ఎత్తిచూపుతూ ఎంసిఐ ఐదవ సంవత్సరం అనుమతికి నిరాకరించింది. కళాశాల అందుబాటులోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా, ఇప్పటికీ ఆయా విభాగాల భవన నిర్మాణాల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దుతామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు హామీలు ఇస్తున్నారే తప్ప, కనీసం సరిపడా అధ్యాపకులు, వైద్యులు, ఇతర సిబ్బంది ఖాళీలను కూడా భర్తీ చేయడంలో ఎనలేని తాత్సారం చేస్తున్నారు. ఈ తరహా నిర్లిప్తత కారణంగా ఎంసిఐ నుండి అనుమతులు పొందేందుకు ప్రతిఏటా తంటాలు పడాల్సి వస్తోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

బీడీ కార్మికుల ధర్నా
కంఠేశ్వర్, డిసెంబర్ 19: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని లేబర్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు మాట్లాడుతూ, బీడీ కార్మికులు, నెలసరి ఉద్యోగులకు, బట్టి చాటన్ తదితర కార్మికులకు వేతనాల పెంపు కోరుతూ ప్రభుత్వం చర్చలు జరిపి, కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలోని 31జిల్లాల్లో బీడీ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు, ముఖ్యంగా బీడీ కార్మికుల మూల వేతనం పెంచి ఇతర డిమాండ్లను పరిష్కరించాలని 2016 జూలై 7వ తేదీన నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. నోటీసులు ఇచ్చి ఆరు మాసాలు గడుస్తున్నా, సమస్యల పరిష్కారానికి అటు యాజమాన్యాలు గానీ, ఇటు ప్రభుత్వం గానీ చొరవ చూపకపోవడం దారుణమన్నారు. 2016 నవంబర్ 9వ తేదీన కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి, నవంబర్ మాసాంతంలో మరోసారి చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తట్టుకోలేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ పరిశ్రమలో అతి కీలకమైన బీడీ ప్యాకర్ల వేతనాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 41ప్రకారం బీ కార్మికుల వేతనాలు అందించాలన్నారు. అనంతరం డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు నూర్జహాన్‌తో పాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు.

స్కూల్ బస్సు, ఆర్టీసీ బస్సు ఢీ
15 మందికి గాయాలు
ఆర్మూర్, డిసెంబర్ 19: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం ఉదయం స్కూల్ బస్సు, ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. కాగా స్కూల్ బస్సులోని పలువురు విద్యార్థులకు, ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సుమారు 15 మందికి గాయాలైనట్లు స్థానికులు చెప్పారు. రెండు బస్సులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న స్కూల్ బస్సులో వెళ్తున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలు కాలేదని తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఎవరికి వారే ఇతర వాహనాల్లో వెళ్లిపోయారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
మద్నూర్, డిసెంబర్ 19: మద్నూర్ మండలం మెనూర్-మద్నూర్ గ్రామాల మధ్య పెట్రోల్ బంక్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, ఆ శాఖ అధికారి హుస్సేన్ అక్కడికి చేరుకుని మృతి చెందిన జింకను పరిశీలించారు. వెంటనే మండల పశువైద్యాధికారి వినిత్‌కుమార్‌కు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పశువైద్యాధికారి మృతి చెందిన జింకకు పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి హుస్సేన్ తెలిపారు.

డయల్ యువర్ సిపికి 15 ఫిర్యాదులు
ఇందూర్, డిసెంబర్ 19: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10నుండి 11గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ పోలీస్ కమిషనర్ కార్యక్రమానికి 15 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ కార్తికేయ తెలిపారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ సబ్‌డివిజన్ల పరిధి నుండి వివిధ సమస్యలపై పదిహేను మంది ఫోన్‌ల ద్వారా ఫిర్యాదులు చేశారని వెల్లడించారు. ఈ ఫిర్యాదులను నమోదు చేసుకుని వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కమిషనర్ తెలిపారు. అలాగే గత వారం డయల్ యువర్ సిపి ప్రోగ్రామ్‌లో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులతో కమిషనర్ ఫోన్‌లో మాట్లాడి, వారి ఫిర్యాదులపై సంబంధిత అధికారులు స్పందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఫోన్‌లో మందలించారు. డయల్ యువర్ సిపి కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ వెంకన్న పాల్గొన్నారు.

ప్రజావాణికి 62 ఫిర్యాదులు
వినాయక్‌నగర్, డిసెంబర్ 19: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణికి సోమవారం 62 ఫిర్యాదులు అందినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ ఫిర్యాదులను కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జెసి రవీందర్‌రెడ్డి, డిఆర్‌ఓ పద్మాకర్ తదితరులు స్వీకరించారు. ఇందులో కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్ని ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు పంపించారు. రింగురోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధిత రైతులకు గజం లెక్కన నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ, ప్రజాహితం కోసం రైతులు తమ విలువైన భూములను సమిదలుగా మార్చారని అన్నారు. అందువల్ల బాధిత రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో న్యూడెమోక్రసీ నాయకులు, బాధిత రైతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి పెద్దివెంకట్రాములు మాట్లాడుతూ, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, పోడు వ్యవసాయదారులకు అటవీ హక్కు చట్టంతో తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. భూ నిర్వాసితులకు 2013 చట్టాన్ని వర్తింపజేయాలని, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అదే విధంగా జిల్లాలోని ఆయా మండలాల నుండి తరలివచ్చిన బాధితులు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.