Others

చైతన్యమూర్తి జంగం శ్రీనివాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు కొంతమంది చిన్నతనం నుంచే చదువుతో పాటు సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రామకృష్ణపరమహంస, స్వామి వివేకానంద లాంటి వాళ్లు తమ జీవితాలను సమాజోద్ధరణకు అర్పించారు. స్వామి వివేకానంద లాంటి వాళ్లు మన దేశంలో పుడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ల కోవలో నడిచేవారిలో జంగం శ్రీనివాసులు ఒకరు. ప్రకాశం జిల్లా రాజు పాలెంలో 1944 జనవరి 1వ తేదీన జంగం లక్ష్మమ్మ, సుబ్బయ్యలకు జన్మించారు. వీరికి ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. వీరందరిలోకి చిన్నప్పటినుంచీ కూడా తన పక్కవాళ్లు చదువుకోవడానికోలేక ఆర్థిక ఇబ్బందో పడుతుంటే వీరి తండ్రిగారికి ఈ విషయం చెప్పి వారికి ఆర్థికసహాయం చేసేవారు. తరగతి పుస్తకాలల్లో ఉన్నవాటిని తాను ముందుగానే చదివి అర్థం చేసుకొని తన తరగతి గదిలో కాస్త చదువులో వెనుకబడిన పిల్లలకు తాను మాస్టారై పాఠాలు చెప్పేవాడు. ఇలా చిన్నప్పటినుంచి తానే కాక తన పక్కన వారు కూడా సంతోషంగా ఉండాలన్న తలంపు కలిగి ఉండేవారు శ్రీనివాసులు. వీరు సొంత గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తిచేసుకొని ఉలవపాడులో మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత హట్టిగోల్డ్ మైన్స్ , సింగరేణి గనులతో పాటుగా కర్ణాటక లోని గ్రానైట్ గనుల్లో ఉద్యోగం చేశారు. 2013 వరకు కూడా ఉద్యోగబాధ్యతలల్లోనే కొనసాగారు. హట్టిగోల్డ్ మైన్స్‌లో సీనియర్ మేనేజర్ స్థాయివరకు ఎదిగి పదవీ విరమణ చేశారు. ఉద్యోగం చేస్తూనే సాహిత్య, సాంస్కృతిక, క్రీడారంగాలల్లో చురుగ్గా పాల్గొనేవారు. నాటక మండలిని తన స్నేహితులతో కలసి స్థాపించి దాని ద్వారా నాటకాలు వేస్తూ నాటకం చూడడానికి వచ్చిన వారిచ్చిన డబ్బులను అనాథ ఆశ్రమాలకో లేక వృద్ధాశ్రమాలకో విరాళాలు ఇచ్చేవారు. తాను తన స్వంత డబ్బులను విరాళంగా ఇవ్వడమే కాక తనతోపాటు పనిచేసేవారి దగ్గర, తనకు తెలిసిన వారి దగ్గర నుంచి కూడా విరాళాలు సేకరించి ఆశ్రమాలకు అందించేవారు.
పదవీ విరమణ తర్వాత హైద్రాబాద్ (కూకట్‌పల్లి) లో నివాసం ఉంటూ సామాజిక సేవాకార్యక్రమాల్లో శ్రీనివాసులు భాగస్వాములవుతున్నారు. తనకు శ్రీకాంత్, శ్రీనాథ్, సుధారాణి అనే వారు తనసంతానం కాగా వారిని ఉన్నత చదువులు చదివించారు. ఇపుడు వారంతా ఉన్నతోద్యోగాలు చేస్తూ తండ్రి సేవాకార్యక్రమాల్లో వారు కూడా పాలుపంచుకుంటూ ఉంటారు. కూకట్‌పల్లి చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లో ఉన్న పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, తదితన స్టేషనరీ సామాగ్రి అందిస్తూ, లేక వారికి కావలసిన యూనీఫామ్స్‌ను అందిస్తూ తనవంతు కృషి చేస్తున్నారు. కూకట్ పల్లి లోని రాజేశ్వరీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్లు, పాలు అందిస్తూ కనీస అవసరాలను తీర్చడానికి తన శాయశక్తులా కృషి చేస్తుంటారు. అంధుల పాఠశాలల్లో విద్యార్ధులకు వౌలిక వసతులు కల్పించారు. విజయవాడ లోని కాపుసంఘం ద్వారా పేదవిద్యార్థులకు 20 వేల రూపాయలు అందించారు. జంగం శ్రీనివాసులు సొంత గ్రామమైన ఉలవపాడులో విద్యార్థులకు ప్లేట్లల్లాంటి సదుపాయాలను కూర్చారు. మైన్స్ ఎన్విర్నామెంట్ అండ్ మినిరల్ కంజర్వేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు. 1983 స్పోర్ట్స్ క్విజ్ పోగ్రామ్‌లో జడ్జిగా పాల్గొన్నారు. వివిధ టీ.వీ పోగ్రామ్స్ పాల్గొంటూ యువతకు ప్రేరణిస్తుంటారు. బెస్ట్ సిటిజన్ అవార్డును కూడా శ్రీనివాసులు అందుకున్నారు.
హరితహారం,స్వచ్ఛ్భారత్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుంటారు. కూకట్ పల్లి ల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు, హనుమాన్ ఆలయంలో కిలో వెండి స్వామివారికి సమర్పించారు.గోదానాన్ని చేసారు. వివిధ ఆలయాల్లో తనకు తోచిన రూపంలో సాయం అందిస్తుంటారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడాసుమారుగా 15 ఏళ్లపాటు నిరంతర సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం గమనార్హం. 2018 జనవరి 1న తన 75 సంవత్సరంలోకి అడుగుపెట్టిన జంగం శ్రీనివాసులు మరిన్ని సేవాకార్యక్రమాలను చేయాలని సంకల్పించుకుంటూ నేటి యువత సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ తాను పదుగురికి ఆదర్శంగా జీవించేలాగా తమ తమ జీవనపథాలను రూపొందించుకోవాలని చెప్పారు. తోటివారికి సాయం అందించేవారికి తానుకూడా తోడునీడగా ఉంటానని అనే జంగం శ్రీనివాసులు నేటి యువతకు స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు.

- పి.వి. రమణారావు