మెయన్ ఫీచర్

‘సాఫ్ట్‌వేర్’ విప్లవకారుడు పాల్ ఎలెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, వితరణశీలి పాల్ ఎలెన్ (65) కన్నుమూశారు. ప్రపంచాన్ని ఒకటికి రెండుసార్లు మార్చిన బిల్‌గేట్స్- పాల్ ఎలెన్ ద్వయంలో ఒకరు ఒరిగిపోయారు. పి.సి.లను ప్రపంచానికి పరిచయం చేసి కంప్యూటర్ విప్లవాన్ని సృష్టించిన గొప్ప సాంకేతిక దిగ్గజం ఇటీవల కేన్సర్ వ్యాధితో మరణించారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా ప్రపంచాన్ని అతి తక్కువ సమయంలో కుదిపేసిన కార్యదక్షుడు పాల్ ఎలెన్.
పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో విప్లవం తీసుకొస్తామని నక్సలైట్లు బయల్దేరిన సమయంలో అటు అమెరికాలో సీయాటిల్ నగరంలో బిల్‌గేట్స్- పాల్ ఎలెన్‌లు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా వారు ‘మైక్రోసాఫ్ట్’ సంస్థను నెలకొల్పారు. నక్సలైట్లు 1980లో పీపుల్స్‌వార్ గ్రూపును ప్రారంభించగా అప్పటికే మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌తో వారు ప్రపంచాన్ని మార్చారు. అనంతరం అనేక ‘ప్రోగ్రామ్స్’ ద్వారా మొత్తం మానవాళికి పి.సి.(పర్సనల్ కంప్యూటర్) లను అందించి గొప్ప ముందడుగు వేశారు. ఇదికదా విప్లవ సారాంశం. ప్రపంచ ప్రజల జీవనాన్ని మార్చేదే విప్లవం అయితే నక్సలైట్లు- మావోయిస్టులకన్నా ఎంతో సాంద్రతతో జ్ఞానశక్తితో ఆల్గరిథమ్ కత్తితో, కంప్యూటర్ సాయంతో మహా విప్లవాన్ని తీసుకొచ్చారు. అశేష ప్రజానీకాన్ని కదిలించిన ఈ పెనువిప్లవం మావోయిస్టుల- నక్సలైట్లకు ఆనకపోవడం విడ్డూరం. ఎంతసేపు నెత్తురు, తుపాకి, మందుపాతర, హత్యలు, దాడులతో సతమతమయ్యే అమానవీయ మావోయిస్టులకు మానవ మేధకు మేతవేసి, రోజువారీ జీవితాన్ని ఎంతో సరళతరంచేసి గొప్ప ఆవిష్కరణలకు మూలకారకుడిగా నిలిచిన పాల్ ఎలెన్-బిల్‌గేట్స్ మేధో విప్లవం... విప్లవంగా కనిపించకపోవడం వారి డొల్లతనానికి నిదర్శనం.
సాంకేతిక నైపుణ్యం- కత్తికన్నా పదునైనది ఆ తెలివిడితో పాల్ తన ప్రజ్ఞనంతా ధారపోసి ప్రపంచానికి ప్రోగ్రామింగ్ నేర్పి కుబేరుడయ్యాడు. తన మేధోశ్రమతో సమకూరిన అపార సంపదను ఆయన అనేక దానధర్మాలకు ఇచ్చాడు. 2010 సంవత్సరంలో తన సంపదలోని సగభాగం ‘గివింగ్ ఫ్లెడ్జ్’ వేదికకు అందజేశారు. ఆ రకంగా ఆయన సంపద సృష్టించి పంచే నినాదానికి ఊపిరిపోశారు. 21వ శతాబ్దంలో సంపద సృష్టించడం అత్యంత కీలకమైన అంశం. ఆ పని అందరు చేయలేరు, పాల్ ఎలెన్ లాంటి కొందరు మాత్రమే చేయగలరు. ఒకప్పుడు ఆయన ప్రపంచంలో గొప్ప ధనవంతుడిగా గుర్తింపు పొందాడు. బిల్‌గేట్స్‌కన్నా సంపన్నుడిగా ఓ వెలుగు వెలిగాడు.
బిల్‌గేట్స్- పాల్ ఎలెన్ ఇద్దరు బాల్య మిత్రులు. సియాటిల్ నగరంలో కలిసి చదువుకున్నారు. ఆ రోజుల్లోనే (1970) కంప్యూటర్ ప్రోగ్రామర్లుగా పనిచేశారు. బిల్‌గేట్స్‌కన్నా పాల్ రెండు సంవత్సరాలు పెద్ద. మెరుపులాంటి ఆలోచనకు పాల్ పెట్టింది పేరు. తొలి పిసికి ప్రోగ్రామింగ్ చేయడంలో పాల్ ముందున్నాడు. పాల్ లేకపోతే పి.సి. లేదంటే అతిశయోక్తికాదని బిల్‌గేట్స్ అన్నారంటే పాల్ ఎలెన్ చొరవ, సాంకేతిక పరిజ్ఞానం ఎంత విస్తారమైనదో ఇట్టే అర్థమవుతోంది. అలాంటి మైక్రోసాఫ్ట్ సంస్థకు మన తెలుగువాడు సత్య నాదెళ్ళ ఇప్పుడు సిఈఓగా పనిచేయడం గొప్ప విషయం. అతి గొప్ప పరిణామం.
పాల్ తన సంపదలో ఎక్కువ భాగం పరిశోధనల కోసం ఖర్చుచేశారు. 2003 సంవత్సరంలో ఆయన ‘బ్రెయిన్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్’ను స్థాపించి దాదాపు ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. అనంతరం ఏఐ (ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్) సంస్థను స్థాపించారు. తాను పెళ్లిచేసుకోలేదు. సంపదను దాతృత్వ కార్యక్రమాలకు, కళలకు, క్రీడలకు ఖర్చుచేశారు.
స్టీవ్ జాబ్స్.. ఆధునిక తీర్థస్థలిగా పిలిచే సిలికాన్ వ్యాలీలో మరో ఐటి దిగ్గజం స్టీవ్‌జాబ్స్ కూడా కాన్సర్ వ్యాధితో అక్టోబర్ 2011లో మరణించాడు. ఆయన యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు కావడం కాకతాళీయం. ప్రపంచాన్ని మార్చేసిన మరో టెక్నాలజీ మాంత్రికుడాయన. ఐ ఫోన్‌తో ప్రపంచాన్ని యువతరం పిడికిట్లోకి తెచ్చిన గొప్ప స్వాప్నికుడు, కౌశలంగల సాంకేతిక నిపుణుడు. భారతదేశమన్నా, భారతీయ విలువలన్నా అధికంగా ఇష్టపడే స్టీవ్‌జాబ్స్ అకాల మరణం సైతం ఐటి రంగానికి ముఖ్యంగా కంప్యూటర్ రంగానికి వెలకట్టలేని నష్టం. కంప్యూటర్ రంగ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టి అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు. యాపిల్ ఉత్పత్తులను అందరికన్నా ముందుగా కొనేందుకు దుకాణాల ముందు పడిగాపులుకాసిన వారున్నారు. రాత్రిపూట జాగరణ చేసినవారూ ఉన్నారు. ఎంతో సంతోషంగా నిరీక్షించి ఆ ఉత్పత్తులను సొంతం చేసుకున్నవారున్నారు. స్మార్ట్ఫోన్‌కు నడకలునేర్పి స్మార్ట్‌గా పరుగులుదీసేలా ప్రపంచానికి పరిచయం చేసిన ఐ-్ఫన్ పరిచయకర్త స్టీవ్‌జాబ్స్. పాల్ ఎలెన్, స్టీవ్ జాబ్స్ 21వ శతాబ్దాన్ని మలుపుతిప్పిన గొప్ప విప్లవకారులు. విప్లవకారులంటే మార్క్స్-లెనిన్, మావోలనే చెప్పుకునే రోజులు పోయాయి. వర్తమాన కాలంలో మానవాళిపై చెరిగిపోని ముద్రవేసి ప్రపంచాన్ని అతితక్కువ సమయంలో సంపూర్ణంగా మార్చేసిన వారిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుల పేర్లు వినిపిస్తాయి. ఆ తరువాత గూగుల్ వ్యవస్థాపకుడి పేరు ముందుకొస్తుంది. మార్క్‌జుకర్ బర్గ్ సైతం సోషల్ మీడియాతో ప్రపంచాన్ని మరింత ప్రజాస్వారుూకరించారు. విప్లవీకరించారు. ప్రతి ఒక్కరికి సాధికారత ఆయుధం అందించారు. ఫ్రెంచి విప్లవం గొప్ప మార్పును తీసుకొచ్చిందని చరిత్ర పాఠాల్లో చదువుకుంటారు. వర్తమానంలో అంతకన్నా వేగంగా, బలంగా, ప్రతిభావంతంగా సోషల్ మీడియా మార్పును, విప్లవాన్ని తీసుకొచ్చింది. గొప్ప ప్రభావాన్ని చూపింది... చూపుతోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ రంగంలో చరిత్రను సృష్టిస్తే యాపిల్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో గొప్ప చరిత్రను సృష్టించింది. ఇవి రెండు పరస్పర పూర్వకాలు కావడం విశేషం. ఏ ఒక్కటి సరిగ్గా ఎదగకపోయినా ఫలితం అంత గొప్పగా ఉండేది కాదు.
అలెన్ పాల్ కన్నా స్టీవ్ జాబ్స్ రెండేళ్లు చిన్నవాడు. బిల్‌గేట్స్- జీనియస్ స్టీవ్‌జాబ్స్ ఒకే సంవత్సరం (1955)లో పుట్టారు. పూర్తిగా సమకాలికులు. అయితే వేర్వేరు నగరాల్లో పుట్టిపెరిగారు. వీరు ‘గేమ్ ఛేంజర్స్’గా గుర్తింపు పొందారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో స్టీవ్‌జాబ్స్ తనదైన ‘ముద్ర’ వేశాడు. మరో విచిత్రమేమిటంటే అటు మైక్రోసాఫ్ట్, ఇటు యాపిల్ రెండు కూడా ఆయా పట్టణాల్లో కారు గారేజీల్లో పురుడుపోసుకున్నాయి. స్టీవ్‌జాబ్స్ బృందం ఆవిష్కరణలు అనన్యసామాన్యమైనవి. ‘మాస్’ రూపకల్పనతో మొత్తం ప్రపంచాన్ని మార్చేశాడు. రంగుల పిసిలతో ప్రజల్ని విశేషంగా ఆకర్షించాడు. నూతన కానె్సప్ట్‌తో ఉత్పత్తులను తీసుకురావడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా ఉండేది. ప్రపంచాన్ని మార్చిన మొనగాడుగా ఆయన నిలిచాడు. ప్రపంచ స్థాయి పత్రికలచేత కొనియాడబడ్డాడు. వీరిద్దరూ ఒకే నెల (అక్టోబర్)లో అస్తమించడం కాకతాళీయం.
కృత్రిమ మేథ.. ఇటీవల టోక్యో నగరంలో నిర్వహించిన ప్రపంచ రోబో సదస్సు ప్రదర్శనలో ఎన్నో రోబోలను ప్రదర్శించారు. వాటిలో ఒక రోబో అమ్మాయి కుర్చీలో కూర్చుని ఒక అబ్బాయిని ఇంటర్వ్యూచేసే తీరు అందరిని ఆకర్షించింది. ఆ ఆడ రోబో పేరు టొట్టొ. ఈ ఆండ్రాయిడ్ రోబోను పలువురు ప్రశంసించారు.
త్వరలో సోఫియా అనే హాంకాంగ్ రోబో విశాఖపట్టణానికి రాబోతోంది. అక్కడ జరిగే అంతర్జాతీయ సదస్సులో ఆ రోబో పాల్గొని ప్రసంగించనున్నది. గతంలో ముంబయ్, హైదరాబాద్‌లలో ఈ రోబో చేసిన ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. తెలుగు నేలపై ఇలా రోబోలు సందడి చేస్తుంటే ఇక చైనా, హాంకాంగ్, జపాన్‌లో వాటి సందడి ఇంతాఅంతా కాదు. ఇటీవల వరంగల్ ‘నిట్’లో జరిగిన ఉత్సవంలోనూ రోబోలను విద్యార్థులు ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. మానవునికి ప్రత్యామ్నాయంగా రోబో (మర మనిషి) రాబోతున్నది. ఇది ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్‌గా, కలగా అనిపించేది. ఇప్పుడు సంపూర్ణ సత్యం-వాస్తవం. అందరి కళ్ళముందు కనిపిస్తున్న నగ్న సత్యం. దీని వెనకాల కృత్రిమమేథ దాగి ఉంది. మనిషి మేథ కారణంగా ఈ ప్రపంచం పరిఢవిల్లుతోంది. అందులో భాగంగా కృత్రిమ మేథను తెరమీదకు తీసుకొచ్చారు. ఇప్పటికే చైనా, పాశ్చాత్య దేశాల్లో కృత్రిమ మేథ ఆధారంగా సమస్త పనులు కొనసాగుతున్నాయి. క్రమంగా ఆ ప్రక్రియ ప్రపంచవ్యాప్తమవుతుంది. దీన్ని అర్థంచేసుకుని తదనుగుణంగా స్పందించడంలో అర్థం-పరమార్థం దాగుంది తప్ప ఈ పరిణామాల్ని పట్టించుకోకుండా కాలంచెల్లిన సూత్రీకరణలను, సిద్ధాంతాల్ని పట్టుకుని వేలాడుతూ సాయుధ పోరాటం, కార్మిక- కర్షక శ్రేయోరాజ్యం, సోషలిజం- కమ్యూనిజం అంటూ కలలు కనడంలో ఏ మాత్రం ప్రాసంగికత లేదు. మనిషికి ప్రత్యామ్నాయంగా రోబోలు ఇబ్బడిముబ్బడిగా రంగంలోకి ప్రవేశించినవేళ శ్రమదోపిడీ. వర్గ దృక్పథం అన్న పారిభాషిక పదాల మాటున అనాగరిక వ్యవహారం కొనసాగించడం అరాచకమవుతుంది తప్ప మరొకటి కాదు. వర్తమాన సమాజానికి అనుగుణంగా ఆలోచనలుచేస్తూ, స్పందిస్తూ మెరుగైన జీవనం గడిపేందుకు అవసరమైన శ్రమచేయడంలో ఆధునిక జీవితం ఆధారపడిఉంది. దీన్ని విస్మరించి మావోయిస్టుల మాటలునమ్మితే అధోఃగతి పాలవడం ఖాయం. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ విప్లవకారులు తమ ప్రజ్ఞను పంచుతున్న సందర్భంలో ఆ దీన స్థితి అవసరంలేదు... రాదు.

-వుప్పల నరసింహం