పఠనీయం

ఈతరం కవులకు దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచనకవిత
పేజీలు:24, వెల:రూ.125/-
ప్రతులకు:విశాలాంధ్ర బుక్ హౌజ్,
నవచేతన బుక్ హౌజ్,
నవోదయ బుక్‌హౌస్ బ్రాంచీలు..
*
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిగారి సంపాదకత్వంలో ఈ తరం కవుల కోసం.. ‘వచనకవిత’ గ్రంథాన్ని వెలువరించారు.
సాహిత్యంతోపాటు, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందించిన సాహితీ విమర్శకులు, కవి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిగారు నేటి కవులు పాత విలువలను తిరస్కరిస్తున్న నేపథ్యంలో.. పాత విశ్వాసాలను ప్రశ్నిస్తున్న తరుణంలో.. ‘వచన కవిత’ ప్రాధాన్యతను సంతరించుకుంది. వచన కవితకు కుందుర్తి ప్రజాస్వామీకరణను ప్రసాదిస్తే.. శ్రీశ్రీ భావజాల బలాన్ని సమకూర్చారు. తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న వచనకవిత ఆవిర్భావ, వికాస, పరిణామశీలతను దృష్టియందుంచుకుని నవతరం, ఈ తరం కవులకు దిక్సూచిగా ఉండేలా రాచపాళెంగారు ఈ గ్రంథాన్ని సమకూర్చడం విశేషం!
ప్రగతిశీలభావాలతో..ప్రజల భాషలో.. సామాజిక దృష్టికోణంతో రాసిన కవితలకు చోటు కల్పిస్తూ.. ఈ తరం కోసం ఈ గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చారు. సాహిత్య ఉద్యమంలో సమర్థంగా కృషిచేసిన కవులు.. చేస్తున్న ఈ తరం కవులతో కూడిన ఈ సంకలనంలో రాచపాళెంగారు వచనకవితా ప్రస్థానాన్ని.. సాహిత్యం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను.. సమగ్రంగా చర్చించారు. ఈ గ్రంథానికి రాచపాళెంగారు రాసిన పీఠిక వచన కవితా తీరుతెన్నులను..వచన కవిత యొక్క పరిణామక్రమాన్ని తెలియజెప్పేలా కొలువుదీరింది.
కవి సమాజంతో చేసే సృజనాత్మక సంభాషణ కవిత్వమనీ.. కవి పాఠకుని చేరడానికి ఉపయోగించే బల్లకట్టు కవిత్వమని రాచపాళెంగారు తేల్చి చెప్పారు. కవి సామాజిక స్థితిగతుల మీద ప్రకటించే తీర్పే కవిత్వమని భావించే రాచపాళెంగారు.. ఆ గ్రంథం ప్రారంభంలోనే కవిత్వం ఓ సామాజిక ఆచరణగా పేర్కొన్నారు. ప్రపంచ భాషలన్నింటా కవిత్వం స్థలకాలబద్ధమైన మానవ జాతి మనుగడనూ, మానవజాతి సృష్టిస్తున్న చరిత్రను ప్రతిబింబిస్తూ వస్తున్నదని రాచపాళెంగారు ప్రస్తావించిన తీరు ప్రశంసనీయం! వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన తెలుగు సాహిత్యంలో కవిత్వం మూడు రకాల ఛందస్సులలో వచ్చిందనీ.. పద్యం, గేయం, వచన కవితగా వెలుగొందుతుందని తెలిపిన రాచపాళెంగారు పద్యం కవుల వెయ్యేళ్ళ సేద్యంగా పేరుపడిందని పేర్కొన్నారు. గేయం ఆధునిక తెలుగు కవిత్వం తొలినాళ్ళలో ప్రవేశించిందనీ, తర్వాత వచన కవిత వచ్చిందని తమ పీఠికలో విడమరిచి చెప్పారు.
పద్యంలో అక్షర గణాలుంటే.. గేయంలో మాత్రాగణాలుంటాయనీ.. వచన కవితలో భావగణాలుంటాయని విడమరిచి తెలియజేసిన రాచపాళెంగారు.. వచన కవిత తెలుగులో పుట్టిన తర్వాత ఆధునిక కవిత్వంలో విప్లవమే వచ్చిందని ప్రకటించారు. ఈ గ్రంథం నేటి తరం కవులకు పాఠకులకు గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా వచన కవిత తెలుగు సమాజంలో ఎంతటి క్రియాశీల, సామాజిక పాత్ర నిర్వహిస్తుందో తెలియజేస్తుంది.
ఇందులో పొందుపరిచిన కవులకవితలే కాకుండా ఇంకా అనేక మంది కవితలున్నప్పటికీ.. ఆం.ప్ర. అరసం గుంటూరు జిల్లాల శాఖ తన పరిమితులలో ఈ సంకలనం తీసుకొచ్చిందని రాచపాళెంగారు స్పష్టం చేశారు. ఈగ్రంథంలో 87మంది కవుల రచనలకు చోటు కల్పించారు. వీరిలో దాదాపు అందరూ ప్రముఖులే కావడం విశేషం..
1932లో రాయబడిన ముద్దుకృష్ణగారి కవితలో రమణీయ భావాలు.. చక్కని భావుకత కానవస్తుంది. శ్రీశ్రీగారి ‘వ్యత్యాసం’ కవితలోని ‘మంచి గదిలోనే.. సంచరిస్తాయి మీ ఊహలు..’ అంటూ కొనసాగించిన పంక్తులు చక్కగా ఒదిగిపోయాయి! శ్రీరంగం నారాయణబాబుగారు 1937లో రాసిన ‘దేశమాత’ కవితలోని ముగింపు పంక్తులు అందరినీ ఆకట్టుకుంటాయి.
‘పద్మనాభం’ శీర్షికతో పురిపండా అప్పలస్వామిగారు 1976లో రాసిన కవితను అభ్యుదయ భావాలతో ఎత్తుకోవడం బాగుంది. ఇక్కడ అడుగుపెడితే ఎందుకో నావొళ్ళు కంపరమెత్తుతుంది. ఖద్దరు వదిలేసి కత్తిపట్టాలనిపిస్తుంది.. అహింస అబద్ధమనిపిస్తుందని అలనాటి కుంపిణీ దొంగల్ని, దేశద్రోహుల్ని తెగనరకాలనిపిస్తుందని పేర్కొన్నారు.
విద్వాన్ విశ్వంగారు 1939లో రాసిన కవితలో కలకంఠంతో ఎలిత రీతులతో జ్వలిత హృదయంతో పలు రకాలు పాడిన వీణ నేడు అంతూ పొంతూ లేని అంతర్భేదాలతో అధ్వాన్నమై అపస్వరాలు వినిపిస్తోందని వాపోయారు.
1948లో ఆరుద్ర రాసిన ‘ఆగస్టు 15’ కవితలో చివరి పంక్తులు చాలా సందేశాన్ని నర్మగర్భంగా మోసుకొచ్చాయి. ఆనాటి వాస్తవ చిత్రణకు అద్దంపట్టే విధంగా ఉన్నాయి. రెంటాల గోపాలకృష్ణగారు 1950లో రాసిన ‘శాంతి’ కవితలో ‘ప్రాకార ప్రాంగణం నుండి విస్తరాకులు విసిరేస్తే.. ఎంగిలి మెతుకులు చిక్కించుకోవడానికి కొట్లాడుకుంటున్నవి కొన్ని కుక్కలు..! డొక్కల పీక్కుపోయిన మనుషులు భైరవునితో పోట్లాడి టెంకలు చీకుతున్నారని వాపోయారు. దాశరధిగారు రాసిన ‘రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందిట’ కవితలో నిన్నా, ఇవాళ వేర్వేరు అన్నమాట వట్టి అబద్ధం.. ఆగామి మాత్రం వేరని ఆశించడం తప్పంటారా అని ప్రశ్నించారు. 1965లో నగ్నముని రాసిన ‘సుఖరోగి’ కవిత ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. వందేమాతరం శీర్షికతో 1965లో చెరబండరాజుగారు రాసిన కవితలో అమ్మా! భారతీ! నీ గమ్యం ఏమిటి తల్లీ? అని ప్రశ్నించారు. ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ‘లక్ష రూపాయల బహుమతి’ శీర్షికతో రాసిన కవిత ఆలోచనాత్మకంగా ఉంది.
ఇలా పైన పేర్కొన్న కవితలే కాక మరికొంతమంది అభ్యుదయ కవుల కవితలు ఇందులో చోటుచేసుకున్నాయి.. కొత్తతరం కవులకు.. మార్గదర్శకంగా ఉండే విధంగా గ్రంథాన్ని దిద్దడం అభినందనీయం. చాలామంది ప్రముఖుల కవితలు ఒకే చోట చదివే అవకాశం పాఠకులకు కల్పించడం స్వాగతించదగింది. ముఖ్యంగా ఈ గ్రంథంకు సంపాదకునిగా రాసిన ముందుమాటలోని అంశాలు అందిరికీ దిశా నిర్దేశం చేసేలా ఉన్నాయి.

-దాస్యం సేనాధిపతి