పఠనీయం

జీవితం ఒక విచిత్ర ప్రహేళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీ లోకనాథుని యాత్ర- గమ్యం’ (పద్యకావ్యం; )
రచన: ఒలివేటి వేంకట సుబ్రహ్మణ్యశర్మ;
పుటలు: 108; వెల: రూ.150/-;
ప్రచురణ: శ్రీ లోకనాథుని సాహిత్య ప్రచురణలు, H.No. 1-3 తట్టి అన్నారం, జి.ఎస్.ఐ.పోస్ట్, హైదరాబాద్- 500 068
==================================================================
జీవితం- ముఖ్యంగా సగటు మనిషికి- ఒక చిక్కుముడి. ఒక సంక్లిష్ట ప్రశ్న. ఒక పట్టాన పరిష్కారం గాని, సమాధానం గాని దొరకని ఒక విచిత్ర ప్రహేళిక (పజిల్). దానికి సరైన జవాబు జీవితంలో లేదు. ఎక్కడో ఒకచోట; జీవితపు బయటా లేదు; జీవితం అనే దానిగుండానే ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనా ధోరణి; ఉన్నత వ్యక్తిత్వం, ఉదాత్త అంతరంగం- ఇవి ఉంటే వాటి ఆలంబనతో జీవితాన్ని- అది అంటే ఏమిటో అర్థంకాకపోయినా- ఒక ఒడ్డుకు, ఒక సమతూక నిశ్చల భావస్థితికి చేర్చుకోవచ్చు, సాగించుకుంటూ పోవచ్చు- ఈ భావజాలంతో ఒలివేటి వేంకట సుబ్రహ్మణ్యశర్మగారు ‘శ్రీ లోకనాథుని యాత్ర- గమ్యం’అనే ఒక పద్య గ్రంథం రాశారు.
ఇందులో భగవత్ప్రార్థన, భగవతికి వినతి, తత్త్వదర్శనం, అంతరంగం, వ్యక్తిత్వం- ఇలాంటి ఒక పది శీర్షికలతో చాలా పద్యాలు రాశారు.
33వ పుటలో
‘‘వాడితి దేహమే రథపు వాహనమున్ గన వేడ్కలన్, భలే!
వాడిన పూవులా నలిగి వాసము కూలెడు వేళనే కదా
చూడక పోతినన్న పెనుశోకముగల్గెను అంతరంగమున్
వేడుక లన్నియున్ త్రుటిలో వీగెను గాలిలో మేడ లోయనన్
దేహమును రథముగ వాడుకొని ప్రపంచమునందలి వింతల నన్నిటిని చూసితిని కాని, వాడిన పూవులా నలిగి శరీరము కూలిపోవు సమయమున అంతరంగమును చూడలేక పోయితిని కదా అను శోకము కల్గుటచే అంతవరకు చూసిన వేడుకలన్నియు గాలిలో కట్టిన మేడలవలె కూలిపోయినవి’’అన్న భావనలోని భ్రమలతో జీవితాలను, మోజులను నింపుకుంటే విషాదమే మిగులుతుంది- తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరికను వ్యంగ్యంగా రూపకాలంకార ఛాయలతోను, ఉపమాలంకారంతోను లలిత పదవాక్యశైలిలో చెప్పిన విధానం బాగుంది.
48వ పుటలోని
‘‘వినయము కల నరుడు సరిగ విను నొరులనుడువులు, తా
వినిన హితము బలము వలన్ విలువగు ఫలములరయున్,
వినరితరుల పలుకులు అవి వెగటుగ తలచి నధముల్
వినికిడి మనిషికి వరమను ఎవరము నెఱుగన కదా!
వినయము కలవారు మాత్రమే ఓపికగా ఇతరులు చెప్పిన మంచి మాటలు విని సత్ఫలములు పొందగలరు. హితుల మాటలకు వినలేని అధములు వినికిడిశక్తి భగవంతుడిచ్చిన, వరము అని గుర్తెరుగరు.’’అంటూ ఉన్న పద్యము- భావము సుమతీ శతకకారుని ‘‘వినదగు నెవ్వరు చెప్పిన...’’అనే పద్యానికి భావపు కొనసాగింపు అన్నంత విలక్షణంగా ఉన్నాయి. వినికిడి దేవుడి వరం అనటం ఉదాత్తము, తాద్రూప్య రూపకాలంకార శోభితమూను.
63వ పుటలోని ‘్ధనము లేనివాడు తానగు అల్పుడు...’అంటూ సాగిన పద్యం అరిషడ్వర్గాలలోని కామ, లోభాలు అనే అంతశ్శత్రువులను గుర్తుచేసి పాఠకుని జాగృతపరచేదిగా బావుంది.
కవియొక్క భావ, తాత్పర్యాల గుఱించి భమిడిపాటి నాగేశ్వరశర్మగారు, కంటాల విశ్వనాథంగారు, వడిచెర్ల రవీంద్రగారు, శ్రీమతి బుద్ధవరపు లావణ్యగారు మొదలైన పెక్కురు కవితా సంస్కారులు ప్రతిస్పందిస్తూ, ప్రశంసిస్తూ రాసిన పద్యాలుగూడా ఇందులో ఉండటం విశేషం. ప్రతి స్పందన చూపిన అందరి పద్యాలూ బాగున్నాయి- వచనాలతో సహా.
కొన్నికొన్నిచోట్ల శబ్దదోషాలు, వ్యాకరణ దోషాలు, అక్కడక్కడ ఛందో దోషాలు ఉన్నాయి. కానీ ఇది జీవితతత్త్వ వివేచనతో చదువుకుంటూ పోవాల్సిన పుస్తకం గనుక ఇందులో అలాంటి దోషాలు పాఠకుడికి పట్టవు. కాబట్టి వాటి ప్రస్తావన, వేలుచూపుళ్ళు ఇక్కడ అనవసరం. మొత్తంమీద ఇది ఆలోచింపచేసే ఒక జీవిత తాత్త్విక రచన.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290